Monday 31 December 2012

మంత్రము – మాతృకలు


01. మంత్రము – మాతృకలు

ఈ సృష్టి అంతా నాద బ్రహ్మమయం. సర్వము అక్షరాత్మకము, వైఖరి శబ్ద బ్రహ్మమయము.  శబ్దమే బ్రహ్మము. నాదమే బ్రహ్మము.   అక్షరములు అచ్చులు, హల్లులు పరమ శివుని చే అనుగ్రహింప బడినవి. ఒక్కో వర్ణము ఒక్కో దేవతను, తత్వమును సూచించును. కావున అక్షరములన్నియు మంత్రము లగుచున్నవి. అందుకే ఆ సర్వమంగళ మాతృకావర్ణ రూపిణి అయినది.                సర్వ వర్ణములలో మొట్ట మొదటి అక్షరము అయిన “అకారము” శివుడు, ప్రకాశము. అంత్యాక్షరమైన “హకారము”    శక్తి, విమర్శము.  వీని సామరస్యమే “అహం”. అచ్చులు శక్తి రూపములు. హల్లులు శివ రూపములు. ఓం కారము నుండి సకల వర్ణములు ఉత్పన్నము లైనవని వేదములు, పురాణములు ఘోషించు చున్నవి.  ఓం ధ్వని పరబ్రహ్మము. మూలాధారాది షట్చక్రముల తాకిడిచే వర్ణముల ఉత్పత్తి గల్గును అని తంత్రములు చెప్పుచున్నవి. ప్రతి శబ్దమునకు ఒక్కో అర్ధము కలదని, శక్తి, ఈశ్వర తత్వముల కలయక నుండి ధ్వని పుట్టు చున్నదని మంత్ర శాస్త్రములు చెప్పు చున్నవి.  అకారాది హకారాంతము వరకు గల ఏబది వర్ణములు మాతృకా వర్ణములు.

మననము చేయుట వలన రక్షించునది మంత్రము. అనగా దేవతాథిష్టిత వర్ణములు మననముచే ఆ దేవత మానసిక శక్తిని ప్రేరేపించును. పిదప సాధన చే ఆ దేవతను సాధించును. మంత్రము ఒకానొక దేవతా స్వరూపము. సాధనా శక్తిచే మంత్ర శక్తి ప్రస్పుట మగును. పరదేవత వర్ణమాలాధారిణి. వర్ణముల సంఖ్యను బట్టి మంత్ర నామము వేరగుచుండును.

అకారాది, క్షకారాంతములు అంటే అ నుంచి క్ష వరకు గల వర్ణములను మాతృకలు అని అందురు. అ .. క్ష  కలయకే అక్షరములు.  సనత్కుమార సంహితలో వర్ణములకు రంగులు చెప్ప బడినవి. అకారాదులు ధూమ్ర వర్ణములు, కకారాదులు సింధూర వర్ణములు, డకారము మొదలు ఫ కారము వరకు ...గౌర వర్ణములు,  వ కారము మొదలు అయిదు అరుణ వర్ణములు, ల కారాదులు బంగారు వన్నె గలవి, హ కార, క్ష కారములు ... మెరుపుతో సాటియైనవని చెప్ప బడినది. ఈ విధముగా దేవి అక్షర రూపిణి, మాతృకా వర్ణ రూపిణి అయి, శబ్ద బ్రహ్మ స్వరూపిణిగా, శబ్దాతీతగా పిలువ బడుచున్నది. ఈ మాతృకా వర్ణములే శ్రీ చక్ర స్వరూపములు.

 బీజాక్షరములతో కూడియున్నవాటిని మంత్రములు అని అందురు. బీజములనగా ఒక మొక్కను సృష్టి చేయగల శక్తి గల విత్తనము అని అర్ధము. బీజాక్షరమనగా ఒక మంత్ర శక్తిని ఆవిర్భవింపచేయగల అక్షరమే బీజాక్షరము. అటువంటి బీజాక్షర సంపుటియే మంత్రము.  మంత్రాధీనంతు దైవతం ... అన్న ఆర్యోక్తి ననుసరించి దేవతలు మంత్రముల చేత ప్రసన్నులౌతారు. ఈ మంత్రము లన్నీ వేదముల నుండి ఆగమములనుండి ఆవిర్బవించినవే. ఈ మంత్రములను గురు ముఖతః స్వీకరించి సాధన చేయు విధానమే “ఉపాసన” అని అందురు. ఉపాసనకు మంత్రము అత్యంత ప్రధానము. ఒక్కో మంత్రమునకు ఒక్కో సంఖ్య నిర్దేశించ బడినది. ఆ సంఖ్యను దీక్షగా నియమానుసారముగా అనుష్టించిన, మంత్రము సిద్దించును.  మంత్రానుష్టాన యోగ్యత సిద్దించ వలెనన కనీసము లక్ష పర్యాయములు జపము చేసి, తద్ధా౦శ తర్పణ, హోమాదులు జరిపించవలెను. ....

శ్రీచక్రమునందలి ద్వితీయ భూపురమునందు, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి,  వైష్ణవి, వారాహి, మాహేన్ద్రి, చాముండా, మహాలక్ష్మి. అనే అష్ట మాతృకలు కలవు.  ఈ అష్ట మాతృకలను ఉపాసించిన వానికి సకల విద్యలు వచ్చును అని వామకేశ్వర తంత్రము చెప్పు చున్నది.

సశేషం...

మీ

శ్రీ భాస్కరానంద నాథ / 01-01-2013.

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.



 

 

 

 

Sunday 30 December 2012

ఆహ్వానము


ఆహ్వానము
సనాతన ధర్మమును నమ్మి, విశ్వసించి, ఆచరించే వాళ్ళు, పునర్జన్మ సిద్ధాంతమును నమ్మేవాళ్ళు, దేవుడు వున్నాడు అని నమ్మే వాళ్ళు, బొట్టు పెట్టుకొనే వాళ్ళు, వేదమును మన పురాణములను గాఢంగా నమ్మేవాళ్ళు, ఆది శంకరులు శ్రీ శంకర భగవత్పాదుల సిద్దాంతమును నమ్మేవారు, అద్వైత సిద్దాంతమును నమ్మి ఆచరించే వారు, పెద్దలను, గురువులను గౌరవించే వారు, మన హైందవ సంస్కృతికి గౌరవము ఇచ్చి, ఆచరించే వాళ్ళు, మన మాతృ భాష తెలుగును గౌరవించే వాళ్ళు, శంకర భగవత్పాదులు స్థాపించిన షణ్మతాచారము మీద నమ్మకము వుంచి, పంచాయతనమును నమ్మి కొలిచే వాళ్ళు, దేవుడి మీద నమ్మకము వున్న వాళ్ళు, మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రముల మీద నమ్మకము వున్న వాళ్ళు, వేద, శృతి, స్మృతి, పురాణ వాంగ్మయమును భక్తితో నమ్మి కొలిచే వాళ్ళు, ధర్మాచరణ కలిగిన వాళ్ళు, హైందవ సంస్కృతికి అద్దం పట్టే వాళ్ళు, ఆది దంపతులను, శ్రీ సీతారాములను, శ్రీలక్ష్మీ నారాయణులను,      శ్రీ వేంకటేశ్వరులను, ఇలవేల్పులుగా, ఇష్ట దైవముగా, కుల దైవముగా  కొలిచే వాళ్ళు, సత్యమును, ధర్మమును నమ్మి ఆచరించే వాళ్ళు,  ఆచారకాండ, జ్ఞానకాండ యందు నమ్మకము, భక్తీ, ఆసక్తి వున్న వాళ్ళు,   వాళ్ళు ఎవరైనా ఏ వర్ణము వారు అయినా ఈ సత్సంగమునకు ఆహ్వానితులే.  వారు నిర్బయముగా సభ్యులుగా ఈ blog లో చేర వచ్చును.
హైందవ సంస్కృతికి, సనాతన ధర్మమునకు, అద్దం పట్టే విషయములు, దైవిక సంబంధమైన, పూజ, జప, అనుష్టానము, ఆచార వ్యవహారములు, కర్మకాండ, మంత్రానుష్టానములు, తపస్సు, యజ్ఞము, యోగము, ధ్యానము, సమాధి, ... గృహస్థాశ్రమ ధర్మములు,  వైవాహిక ధర్మములు,మొదలగు విషయములను గురించి చర్చిస్తూ, ఒకరికి తెలిసిన విషయములను మరొకరికి తెలుపు కొంటూ,  ఆ పరమాత్మను, పరదేవతను చేరుకోవడమే ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. 
 మీ
శ్రీ భాస్కరానంద నాథ
శ్రీవిద్యోపాసకులు
bhaskaranandanatha@gmail.com

Saturday 29 December 2012

మంత్ర సాధన-రహస్యములు


Sri Bhaskarananda Natha
On 29 Dec 2012 16:53, "శ్రీ భాస్కరానంద నాథ" <bhaskaranandanatha@gmail.com> wrote:

మంత్ర సాధన-రహస్యములు


గురువులకు,పెద్దలకు,మిత్రులకు నమస్కారములు.
 
చాలామంది అంటూ వుంటారు "మంత్రాలు అంటే ఏమిటి? వాటి అర్ధము ఏమిటి? మంత్రాలు ఎందుకు? వాటి అర్ధం తెలియకుండా చదివితే ఉపయోగామేమిటి? అని. అసలు మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు చదవాలి? తెలుగులో తర్జుమా చేసుకొని చదువ కూడదా అని? మనకు మంత్రం శాస్త్రం అవసరమా? ఎన్ని రకాల మంత్రాలు వున్నాయి? సంస్కృత భాషలోనే మంత్ర శాస్త్రము ఎందుకు వున్నది?
 
మంత్రం అంటే ఏమిటి? వాటిలో రకాలు ఎలా సాధన చేయాలి? మంత్రానికి, స్తోత్రానికి గల భేదమేమి? ఎవరెవరు చదువ వచ్చును? మంత్ర సాధన ఎట్లా, పురశ్చరణ ఎలా? భూత సిద్ది, ఆసన సిద్ది, మంత్ర సిద్ది, దిగ్భందనము, మంత్ర న్యాసము, ముద్రలు, మంత్రోపదేశము, మంత్ర ముహూర్తము, గురు-శిష్యుల అర్హత, మంత్ర శాస్త్ర ప్రయోగము, మంత్ర సాధన, విధి విధానములు, మంత్రములలో రకములు.
 
అష్టాదశ పురాణములలో, ప్రపంచ సార సార-సంగ్రహం, మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి, శారదా తిలక తంత్రం, రుద్ర యామల తంత్రం, సనత్కుమార సంహిత, శివ జ్ఞాన తంత్రం, తంత్ర సార సర్వస్వం, శ్రీవిద్యా తంత్రం, శబ్ద కల్పద్రుమం, పురశ్చరణ దీపిక, మంత్రం దీపిక, నారద పాంచరాత్రము, అగస్త్య సంహిత, దశ మహా విద్యలు, జ్ఞానార్నవ తంత్రం, నారాయణ తంత్రం, యోగినీ హృదయం, పరుశురామ కల్పం, దత్తాత్రేయ కల్పం, హయగ్రీవ కల్పం, సుభగోదయం, కామకలా విలాసము, వరివశ్యా రహస్యం, లాంటి గొప్ప అపూర్వ గ్రంధముల నుంచి శాస్త్రముల నుంచి ఆ తల్లి దయతో నేను తెలుసుకోబడ్డ మంత్రం శాస్త్ర విషయములను ఇక్కడ మనము త్వరలో తెలుసుకోబోవుచున్నాము.
 
మంత్రం శాస్త్ర గ్రంధములలో ముందుగా చెప్పదగినవి  ౧. మంత్ర మహార్ణవము, రెండవది కల్ప వృక్షం వంటి గ్రంధం శంకరాచార్య ప్రణీతమైన "ప్రపంచ సార సార-సంగ్రహం. మూలమును శంకర భగవత్పాదులు రచించగా, దానికి  శ్రీ శ్రీ శ్రీ గీర్వాణే౦ద్ర సరస్వతి స్వామి వారు అద్బుతమైన వాఖ్య వ్రాసినారు. మూడవది శ్రీ పుణ్యానంద మునీంద్ర విరచిత శ్రీ కామకలా విలాసము. నాల్గువది శ్రీ శారదా తిలక తంత్రం. 
 
శ్రీ గౌడపాదులు, శ్రీ విద్యారణ్య స్వామీ మొదలగు మహా పురుషులు మనకు ఎన్నో మంత్ర తంత్ర రహస్యములను అందించి వున్నారు.. మహా విజ్ఞానమును మన ఋషులు ఇచ్చి వున్నారు. అందులోని ముఖ్య విషయములను, పెద్దల నుంచి తెలుసుకున్న మేర, మీతో పంచుకోవడానికి చేసే చిన్న ప్రయత్నమే ఇది.
శ్రద్ధతో ఆలకించేదరని ఆశిస్తూ,
 
త్వరలోనే.

మీ
 
శ్రీ భాస్కరానంద నాథ
 మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.

Friday 14 December 2012

నాశికా త్రయంబకం

నాశికా త్రయంబకం
 
శ్రీ రమణమహర్షిని భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోకానికి పరిచయము చేసిన మహా వ్యక్తీ , శ్రీ విద్యోపాసకుడు కావ్యకంఠ శ్రీ వాశిష్ట గణపతి ముని. సాక్షాత్తు వీరు గణపతి అంశలో పుట్టిన వారు. వీరి తండ్రి గారు నరశింహ శాస్త్రి గొప్ప మంత్ర, తంత్ర, జ్యోతిష, విశారదులు. శ్రీ విద్యా దీక్షను పొంది బ్రహ్మ నిష్టయై గ్రామాధికారిగా పనిచేయు చున్న వారు.
తన భార్య ఏడవ మాసమున గర్బముతో ఉండెను. సత్ సంతానము కొరకై వీరు కాలినడకన కాశీ వెళ్లి డుంఠి గణపతి ఆలయములో దీక్ష బూని కార్తీక మాసము నుండి జపము జేయసాగెను. పగళ్ళు ఉపవాస నియమము పాఠిస్తూ రాత్రుళ్ళు పాలను మాత్రమె ఆహారముగా సేవిస్తూ గడుపు చుండెను. ఇలా శ్రద్ధతో చేయుచున్న శాస్త్రి గారికి కార్తీక బహుళ అష్టమి నాడు
దైవ ప్రసాద సూచకమగు ఒక దర్శనము గలిగెను.
ఒక బాల శిశువు గణపతి విగ్రహము నుండి వెడలి తన కడకు ప్రాకుతూ వచ్చి తన తోడ పైకి ఎక్కి అంతర్ధాన మయ్యెను. కళ్ళు తెరిచి చూచిన శాస్త్రికి ఎవ్వరూ అక్కడ గన్పించ లేదు. ఆ తరువాత ఇంటికి వచ్చిన తరువాత తనకు కొడుకు కలిగిన వార్త విని సంతోషించి జాతక చక్రము వ్రాయ దలచి పుట్టిన తేదీని అడుగగా
ఏనాడు తనకు గణపతి దర్శనమిచ్చినాడో అదే తిది కార్తీక బహుళ అష్టమి, అదే సమయమునకు ఇక్కడ నరసమాంబ గణపతి మునిని ప్రసవించినది.
వీరి అసలు పేరు సూర్య గణపతి శాస్త్రి. వీరి గోత్రము కౌండిన్యస గోత్రము . కౌండిన్యస వంశములోని పిదప వాడైన వాసిష్ట పేరు మీదుగా " వాసిష్ట గణపతి శాస్త్రి " అని పిలువ సాగిరి. వీరికి ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి. వీరు వారిని " నాయినా" అని పేరిడి పిలువ సాగిరి.
వీరు తండ్రి లాగే జ్యోతిష, మంత్ర, తంత్ర, శాస్త్రములలో దిట్ట. తండ్రి లాగే గొప్ప శ్రీ విద్యోపాసకులు. మహా గొప్ప సంస్కృత పండితుడు. ఆర్నెల్లు ఉద్యోగము, మరి ఆర్నెల్లు సద్యోగము అంటే ఉపాసన. అలాగే ఆర్నెల్లు సంసారము, ఆర్నెల్లు తప్పస్సు. ఇలా కొనసాగినది వారి జీవనము.
ఇలా తన తపో యాత్ర లో బాగంగా ఒక సారి బొంబాయి కి సమీపము లోని నాసిక్ పుణ్య క్షేత్రమునకు వెళ్ళెను.
నాసిక్ అంటే ముక్కు అని అర్ధము. సీతారామ లక్ష్మణులు అరణ్యమున పంచవటి చేరి యుండగా లక్ష్మణుని చే కోయబడిన శూర్పణఖ యొక్క నాసిక ఈ స్థలము నందు పడిన కారణముచేత దీనికి నాసిక అని పేరు గల్గెను. అది ఇప్పుడు "నాశిక్" అని పిలువ బడు చున్నది. దీనిపై లక్ష్మణుని ఆగ్రహము ఇప్పటికీ కలుగుచుచూ అప్పుడప్పుడు ద్వంసమునకు కారణమగు చుండుచున్నది అని పెద్దలు చెప్పుదురు.
అందుకు నిదర్శనముగా ఈ సంఘటన కూడా జరిగినది.
ఇచ్చట వూరి వెలుపల ఒక లక్ష్మణ ఆలయము వున్నది. తన తప్పస్సు కొరకు ఒకనాడు ఈ లక్ష్మణాలయము నాకు వెళ్ళెను. అతడు ద్వారము దాటగానే అక్కడి పూజారి యొకడు వెనుక నుండి హఠాత్తుగా గణపతి పై బడి గలియ బడి, జుట్టు పట్టుకొని నిర్దయతో హింసించి నాలుగు పిడి గుద్దులు గ్రుద్దేను. అంతటితో వూరుకోనక కీడ్చుకొంటూ గ్రామాధికారి దగ్గరకు లాక్కొని వెళ్ళెను. ఆ దేవాలయములో అంతకు మునుపే ఎవరో వచ్చి పూజా సామాగ్రిని దొంగిలించి ఉన్నందు వలన ఆ పూజారి గణపతే ఆ దొంగ అని తలచి, అనుమానించి ఇతనిని చావా బాది గ్రామాధికారికి అప్పజేప్పెను. గ్రామాధికారి తగిన విచారణ చేసి ఆ దొంగ ఇతను కాదని, ఇతను మహా విద్వాంసుడు అని తెలిసి ఆ పూజారిని చీవాట్లు పెట్టి పంపెను.
దీనికి పూర్వమే వాశిష్టునికి దేహ వేదనతో బాటు జరిగిన పరాభవము సహింప లేక అంతర్వేదనకు గురియై, పూజారి మూర్ఖత్వమును సహింపజాలక, క్రోధాగ్ని రూపమున భగ్గుమని వాశిష్టుని కంఠము నుండి శాప వాక్కు వదల బడెను.
ఈ నాశిక్ పట్టణము మిక్కిలి ద్వంసము అగు గాక ... అని శాపము ఇచ్చెను. ఒక్క పూజారి చేసిన పాపము మొత్తము ఆ ఊరినే నాశనము చేసినది. సత్పురుషలను, శ్రివిద్యోపాసకులను హింసించినా, కష్ట పెట్టినా, వారిని వ్యగ్రతకు గురి చేసినా అది మొత్తము కులమునకు, పట్టణమునకు నష్టము జెకూర్చును.
వారి శాపము అమోఘమై ప్రక్క రోజే పూజారి ఇంట మారీ అను విష జ్వరము ఆరంభమై, వాయు వేగముతో పురమంతయు వ్యాపించి పూజారి, అతని వంశము వారు, ఆ వూరి ప్రజలు సగం మంది చనిపోయిరి. ఆ తరువాత పెద్ద తుఫాను వచ్చి పెద్ద పెద్ద చెట్లు, గోపురములు కూలి, నగర మంతయూ స్మశాన మయ్యెను.
ఈ విధముగా ఒక శ్రీవిద్యోపాసకుని ఆగ్రహమునకు గురియై నాసిక్ పట్టణము సర్వ నాశనము అయినది.
కావున శ్రీ విద్యోపాసకులతో పరాచికములు ఆడ కూడదని, వారి వాక్కులో సకల వాగ్దేవతలు, మంత్రినీ దేవతలు ఉంటారని భావించి మనము జాగ్రత్తగా మసలుకోవలెను. కోటి జన్మల పూర్వ పుణ్యము వుంటే గాని ఈ శ్రీ విద్య రాదు.
అటువంటి పుణ్య పురుషులను మనము తగు విధముగా గౌరవించవలెను. వారి పట్ల అపరాధము తెల్సి జేసినా, తెలియక జేసినా తప్పు తప్పే. శిక్ష పడక తప్పదు. వారిని ఎవ్వరూ తప్పించ లేరు. ఆ పరమ శివుడైనా గురువు ఆగ్రహమును తప్పించ లేరు, ఇది నిజము అని మనకు ఎన్నో పురాణ ఇతిహాసములు చెప్పు చున్నవి. ఎన్నో తార్కాణములు కూడా గలవు. అయినా మన నైజము మారదు.
శుభం
మీ
భాస్కరానందనాథ

రాజ శ్యామల-రాజ మాతంగి

రాజా శ్యామల / రాజ మాతంగి
అయ్యా ఈమె దశ విద్యలలో ఒక దేవత. విష్ణువు కు పది అవతారములు ఉన్నట్లే ఆ పర దేవతకు కూడా పది విద్యలు, పది దేవతలు కలరు. ఒక్కో దేవతను ఒక్కో రూపములో, ఒక్కో మంత్రముతో ఆరాధిస్తారు. ఈ రాజ శ్యామల శ్యామల వర్ణముతో కూడి వుంటుంది. ఈమె త్రిపుర సుందరికి మంత్రిణి. ఈమెనే మరకత శ్యామల అని సంస్కృతమునందు, పచ్చైయమ్మన్ అని తమిళము నందు పిలిచెదరు.
లలితా స్తోత్రము నందు " మంత్రిన్యంబా విరచిత నిషంగ వధ తోషితా" అని ఈమె అనుగ్రహ తత్వమును వర్ణింప బడినందున వాశిష్ట గణపతి ముని ఈమెను ఉపాశించి ఈమె అనుగ్రహమును పొందెను.
కొందఱు దశావతారములను శక్తి పరముగా అన్వయించి శ్రీరాముడు లలితాదేవి యని, శ్రీ కృష్ణుడు శ్యామల అని భావించి కీర్తించినారు. ఈమెనే రాజ మాతంగి అని అందురు. మతంగ మహర్షి కడిమి చెట్ల మధ్య, అడవిలో ధ్యానం చేస్తుండగా ఈ దేవత సాక్షాత్కరించింది. నూరు సంవత్సరాలు ఆ మహర్షి తపస్సు చేస్తే కాళీ దేవి శ్యామలయై సాక్షాత్కరించింది. కాళీ తీవ్ర రూపమైతే, శ్యామల కోమల రూపం. మాతంగికి మరో పేరు శ్యామల.
ఈమెను ఆరాధించే కాళిదాసు మహా కవి అయినాడు. ఎ వ్యక్తీ ఈమెను ఉపాసిస్తాడో అతను మహా కవి అవుతాడు, అతనికి సంగీత విద్య ప్రసాదింప బడుతుంది. రాజ మాతంగి, సంగీత మాతంగి, సాహిత్య మాతంగి అని మంత్ర భేదములతో ఈమెను ఉపాసిస్తారు.
మాతంగీ సాధన చేసిన సాధకులకు చిలుకలు దగ్గరకు రావటం, అరవటం అన్న అనుభవాలు కలుగుతాయి. ఈ విద్య అత్యంత పురాణ కాలము నుండి వస్తున్నది. వశీకరణము, ఐశ్వర్యము, రాజాశ్రయం కోరు వారు ఈమెను ఆరాధిస్తూ వుంటారు.
మాతా మరకత శ్యామా మాతంగీ మధు శ్యాలినీ,
కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబ వన వాసినీ.
అటువంటి తల్లికి నమస్కరిస్తూ

మీ
భాస్కరానందనాథ
14-12-2012

 

Friday 7 December 2012

కర్మానుష్టాన ఆవశ్యకత

కర్మానుష్టాన ఆవశ్యకత
మనస్సును రజస్తమో గుణములు ఆవరించి, విషయములందు ఆసక్తిని కలుగ జేయును. ఆ ఆశక్తియే "కామ" మనబడును. ఈ గాలమునకు చిక్కిన జీవి ఆకారణముగా జంతువులేట్లు వ్యధ శాల యందు హింసింప బడునో అట్లే నానా విధ చిత్ర హింస లకు గురి అగుచున్నాడు  అని శ్రీ సురేశ్వరాచార్యులు చెప్పు చున్నారు.
 
ఈ సంసార సాగరము వలే అపరిచ్చినమై దుఖః ప్రదమై మహా భయంకరమై బ్రహ్మ మొదలు చీమ వరకు గల అనేకానేక జీవుల చే కూడి యున్నది.
అవిద్యా సంపర్కము చేత జీవుడు ఒకప్పుడు మనుష్య జన్మ మొదలు దేవతా జన్మల వరకును, మరియోకప్పుడు మనుష్య జన్మ మొదలు చీమ వరకును గల జన్మల ఎత్తుతూ పైకి క్రిందకు తిరుగుచు ఆ యా జన్మల యందు ఒక నియమ ప్రకారము సంభవించు సుఖమును, దుఖమును అనుభవించు చుండును.
 
మరి ఈ జన్మలకు కారణమేమిటి?  అదే కామము, కోరిక. కోరిక వుంటే జన్మ వస్తుంది. దేని మీద బలముగా కోరిక వుంటే దానిని అనుభవించుటకు మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. కోరికలు లేక పోతే జన్మలు వుండవు. మరి ఈ కామము పోవాలంటే ఏమి చేయాలి?  ఈ కామమునకు మూలమైన అవిద్యను నశింప చేసుకొనవలెను.  దాని కార్య రూపమగు కామ్య ప్రదములగు కర్మల నొనరించిన కర్మ దాని ఫలము, దానిని అనుభవించుట కొరకై జన్మ, జన్మించినందున మరణము లభించును.
 
ఈ క్రమముగా జీవి చక్రములో తిరుగుతూనే ఉండును. దీనికి అంతము ఉండదు. ఒక్క మహా ప్రళయములో తప్పించి.
దీనిని బట్టి జన్మ రాహిత్యము కావాలంటే, పొందాలంటే కర్మ రాహిత్యము గావించ వలెను. కామ రాహిత్యము గావించ వలెను.
 
దీనినే శ్రీ వ్యాసులు మహా భరతమున ఇలా అన్నారు.
 
కామ బంధనమే వేదం నాన్యదస్తీహ బంధనం
కామ బంధన ముక్తో  హి నేహ భూయోzభిజాయతే
 
కామమే సంసారమునకు కారణము అయ్యినది, అది నశించిన వెంటనే మోక్ష ప్రాప్తి కలుగును అని భావము.
 
కనుక కామము పోవలెనన దానికి మూల స్వరూప మగు అవిద్యను పోగొట్టుకోవలెను. అవిద్య తో గూడిన కర్మలు ఆచరించిన యెడల మోక్షము ఎలా వస్తుంది ? మరి అవిద్యను పోగొట్టు కోవలేనన ఏమి చేయాలి?
 
వేదాంత విచారణ చేయాలి. దానినే ముఖ్య సాధనముగా చేసుకోవలెను. మరి ఈ కర్మానుష్టానము దేనికి అంటే సంసారాభివృద్దికి, మరో ఉత్తమ జన్మకు.
 
దీనినే శంకర భగవత్పాదులు ఏమన్నారంటే
 
సంసార వర్ధకం కర్మ తన్ని వృత్యైన  కల్పతే,
ఆపి కొట్య జ కల్పానాం కర్మణా ముక్తి రిష్యతే
కోటి బ్రహ్మ కల్పములు కర్మాచారణము గావించిననూ, సంసారాభివృద్ధి మాత్రమె జరుగును గానీ ముక్తి ఎప్పటికీ లభించదు అని భావము.
 
మరి పూజ, జపము, తపము అనే కర్మాచరణములు దండగేనా వాటి వలన లాభము లేదా ?
 
ఎందుకు లేదు పై వాటి వలన నీకు ఉత్తమోత్తమైన జన్మ వచ్చును, ఆ జన్మలో నీ బుద్ధి ప్రచోదనము అయి, ఇది కాదు, ఇది కాదు అని అంటూ  వేదాంత విచారణ వైపు నీ పయనము గావిస్తువు. జ్ఞానము అంకురించును. అప్పటి దాకా నీ కర్మాచరణ ధర్మ బద్దముగా ఉండవలెను.
 

మీ

భాస్కరానందనాధ

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.

శ్రీకాళహస్తి., చిత్తూరు (ఆ.ప్ర);

http://srilalithaparabhattarika.blogspot.in/

http://vanadurga-mahavidya.blogspot.in/

 

 
 
 

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం -2


ఆదిత్య హృదయం పరఃబ్రహ్మ హృదయం -2

సకల జగత్తును నిలబెడుతున్నది సూర్యభగవానుడు. సూర్యుణ్ణి ఒక గ్రహంగా కాక,దేవునిగా ఆరాధించడం మన సంప్రదాయం. సూర్యోపాసన అనేది అనాదిగా మన ఆచార వ్యవహారాల్లో భాగం.పొద్దుపొడవకపోతే ముద్ద మింగని వారు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. ఆరోగ్యాన్నీ,ఐశ్వర్యాన్నీ ఇచ్చే సూర్యుణ్ణి కొలవని వారు ఎవరూ ఉండరు. సూర్యుడు నమస్కార ప్రియుడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేసినంత మాత్రాన పొంగిపోయి మన కోర్కెలను తీర్చే వర ప్రదాత సూర్యభగవానుడు.

మనుషులకే కాదు, సకల జీవరాశికి ప్రాణదాత. ఆకాశం మబ్బు పట్టి సూర్యోదయం కాకపోతే, పశుపక్ష్యాదులు కూడా తమ దైనందిన కార్యకలాపాలకు కదలవు. సూర్యునికి మాఘమాసం అత్యంత ప్రీతికరమైనది.మాఘ శుద్ధ సప్తమినాడు రథసప్తమి పేరిట తెలుగునాట పండుగను జరుపుకుంటారు. నదీనదాల్లో జిల్లేడు ఆకులను శిరస్సు మీద పెట్టుకుని స్నానమాచరించి సూర్యునికి అంజలి ఘటిస్తారు. పిడకల పొయ్యిపై పొంగలిని తయారు చేసి చిక్కుడు ఆకులలో ఉంచి సూర్యునికి నివేదన చేస్తారు. చిక్కుడు కాయలతో రథాల మాదిరిగా తయా రుచేసి చిక్కుడు ఆకుల్లో ఉన్న పొంగలిని సూర్యునికి నైవేద్యం సమర్పిస్తారు. బ్రహ్మచారులు సూర్యారాధనతో పాటు గాయత్రి జపాన్ని చేసినట్టయితే, వారికి విద్యాబుద్ధులు చక్కగా అలవడతాయి.

సూర్యోదయం కాకముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్య నమస్కారం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.సూర్యోదయం అయిన తరువాత దంతధావనం చేయకూడదన్నది పెద్దలు ప్రవేశపెట్టిన సంప్రదాయం.అలాగే, స్త్రీలకు సౌభాగ్యం, ఐశ్వర్యం, సౌందర్యాలను ప్రదానం చేసే దేవుడు సూర్యుడు.  సూర్యుణ్ణి శ్రీమన్నారాయణునిగా కొలుస్తారు. అందుకే, సూర్యనారాయణునిగా కూడా ఆదిత్యుడు ప్రసిద్ధుడు. సూర్యుణ్ణి భక్తితో ఆరాధిస్తే సకల దేవతలనూ కొల్చినట్టే. ఉత్తరాయణ పుణ్యవేళ సూర్యారాధన ఎంతో పుణ్యం., అలాగే,సూర్య రశ్ని సోకకపోతే చర్మ వ్యాధులు ప్రబలుతాయి. సూర్యారాధన వల్ల సకాలంలో వర్షాలు పడతాయి. పంటలు పండుతాయి

ప్రజల అభీష్టం నెరవేరుతుంది. ఇతర దేవతల కన్నా సూర్యుడు భక్త సులభుడు. ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిష్టగా ప్రతిరోజూ పఠిస్తారో వారికి ఎటువంటి రుగ్మతలు కలగవు. శ్రీరామచంద్రునికి మేలు చేకూర్చినది కూడా ఆదిత్య హృదయమే. త్రేతాయుగం నుంచి పౌరాణిక కాలం నుంచి ప్రస్తుత కాలం వరకూ ప్రత్యక్ష సాక్షిగా సకలజగత్తుకూ మార్గదర్శకునిగా,దిక్సూచిగా సూర్యభగవానుడు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం. సూర్యోపాసన అనేది మనిషిలో వివేకాన్ని తట్టి లేపుతుంది. మనిషికి చురుకు తనాన్ని, తేజస్సును ఇస్తుంది. మనిషిని రుజుమార్గంలో నడుపుతుంది. అన్నింటికీ మించి మనిషికి బలాన్ని ఇస్తుంది. మనిషికి ప్రాణాధారం సూర్యోపాసన.

సంధ్యా వందనం అని అంటున్నాము గానీ గాయత్రీ వందనం అని ఎందుకు అనట్లేదు. సూర్యమండలము లోని గాయత్రి మాతకు ఉపాసన చేస్తున్నాము. సూర్యోపాసనతో బాటు గాయత్రిని చేస్తున్నాము. సూర్యోపాసన లేకుండా గాయత్రి లేదు. సూర్య భగవానుడే పర బ్రహ్మము, ఆ పర బ్రహ్మమే గాయత్రి మాత. సమస్త గ్రహ దోష నివారణార్ధం ఆదిత్య హృదయం చదవాలి.

 మీ
భాస్కరానందనాథ

 

 

Tuesday 4 December 2012

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం
తతో యుద్ధ పరి శ్రాన్త౦ సమరే చింత యాస్తితం .....అని వాల్మీకి పలికినాడు.
ఆదిత్య హృదయానికి వేదిక రామ రావణ యుద్ధ ఘట్టము. రావణుడు మహా శక్తి, బల, మంత్ర,సంపన్నుడు. కేవలం స్త్రీలోలత్వమనే దుర్గుణము వీటన్నిటినీ మాయలా కప్పివేసి పెడదారి పట్టించింది, మరి రాముడో? రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి మూర్తి రాముడు. ఇంతటి యోధులు యుద్ధంలో ఒకరికొకరు ఎదురుగా నిలిచి పోరు సల్పితే? . ఇక్కడ యుద్ధం ధర్మం అధర్మం మధ్య. ఈ పరిస్థితి మనకు ప్రతిరోజూ మన మనసులో, కుటుంబంలో, సమాజంలో ఎదురవుతూనే ఉంటుంది. మరి అటువంటి క్లిష్టమైన సమయంలో మనం ఏ విధంగా స్పందిస్తాము? చింత, క్రోధము లేదా పరాక్రమము మొదలైన మార్పులను మనం బాహ్యంగా ప్రదర్శిస్తాము. అదే మానవ స్పందనను రాముడు ఒక రోజు యుద్ధము ముగిసిన పిమ్మట ప్రదర్శిస్తాడు. కొంత అలసట, ప్రత్యర్ధిని ఎలా ఓడించాలన్న చింత రామునిలో చూసి అగస్త్యుడు ఈ ఆదిత్య హృదయాన్ని రామున్ని అడ్డం పెట్టుకొని ఈ మానవాళికి చెప్పినాడు. అగస్త్యుడు విద్యామండల రుషి కావున బ్రహ్మ రూపమైన ఆదిత్యని స్తోత్రమును మనకు శ్రీరాముని ద్వారా అందించినాడు. బ్రహ్మ దేవుని అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్న రావణుడి వైభవానికి అడ్డుకట్ట వెయ్యాలంటే భగవనుదనుగ్రహం రామునికి తప్పక ఉండాలి అని భావించి అగస్త్య మహర్షి ఈ మహా మంత్రాన్ని ఉపదేశి౦చినాడు.
రామ రావణ యుద్ధం చూసేందుకు దేవతలంతా వచ్చి ఆకాశంలో బారులు తీరి ఉన్నారు.భగవానుడైన అగస్త్య మహర్షి కూడా వాళ్ళతో కలసి వచ్చి విను వీధి నుంచి చూస్తూ వున్నాడు. రాముడు యుద్ధం చేసి బాగా అలసి పోయి వుండటం చూశాడు. రాముడు రావణునితో ఏ విధముగా యుద్ధం చేయాలో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ... “ ఓ రామా!యుద్ధాల్లో సమస్తమైన శత్రువుల్ని జయించేందుకు ఒక రహస్యమైన స్తోత్రము ఉన్నది.దాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ స్తోత్రాన్ని జపించు, నీవు యుద్దంలో సమస్త శత్రువుల్ని జయించ గలవు. అని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించినారు. ఆ ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడు మూడు సార్లు పఠించగా సూర్య భగవానుడు సంతోషించి రావణ వధ త్వరలో జరుగునని దీవించినాడు. దాంతో శ్రీరాముని ఉత్సాహం రెట్టింపై రావణునితో విజృంభించి యుద్ధం చేశాడు. రామ రావణ యుద్దాన్ని చూసేందుకు దేవతలు, ఋషులు ఆకాశంలో బారులు తీరి శ్రీరామ జయమును కోరుకొంటూ మంగళా శాసనములు పలికినారు.
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేనిత్యమక్షయం పరమం శివం
విషోంతరాదిత్యే హిరణ్మయః...అన్నది శృతి వాక్యం.
పుణ్య మిచ్చే మంత్రమని చెబుతూ, పరలోక ఫలాన్ని ఎత్తి చూపారు. అలాగే “జయావహం” అంటూ ఇహలోక ఫలాన్ని కూడా చూపుతూ ఈ మంత్రం అక్షయ మైనదని చాటి చెప్పారు.
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం.
ఇక్కడ భువనేశ్వరం అని అనడంలో అర్ధం పర బ్రహ్మ౦ అని మనం అర్ధం చేసుకోవాలి. దేవతలు,రాక్షసుల చే పూజింపబడుచుచూ, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ పర బ్రహ్మ౦ అయిన భువనేశ్వరుని పూజించుము. ఎందుకంటే పర బ్రహ్మమే సూర్య,అగ్ని స్వరూపములు అని శృతి చెప్పుచున్నది.
యాభి రాదిత్యస్తపతి రశ్మిభిః తాభి పర్జన్యో వర్షతి (శృతి)
తన కిరణములతో భూమిపై నుండే నీటిని తపింప జేస్తున్నాడో, అదే కిరణములతో మేఘముల ద్వారా వర్షింప జేసి ప్రాణులన్నీ౦టినీ రక్షిస్తున్నాడు.
తన కిరణప్రసారముల చేత లోకాలన్నింటికి వెలుగు ప్రసాదిస్తున్నాడు.
తస్య భాసా సర్వ మిదం విభాతి భాస్కరః ... అని ఉపనిషద్వాక్యం.
ముక్కోటి దేవతలు ఉన్నా జీవకోటికి ఆయనే పరమాత్మ, ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష నారాయణ స్వరూపం. ఐశ్వర్య విద్యాప్రదాత అయిన ఆ పర తత్వమే ప్రత్యక్ష నారాయణడుగా లోకాలని పోషిస్తూవున్నాడు.
ఇదే విషయాన్ని శృతి ఏమని చెప్పినదంటే
నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి,
త్వమేవ ప్రత్యక్షం రుద్రోzసి, త్వమేవ ప్రత్యక్షం ఋగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్ష మథర్వాసి, త్వమేవ సర్వం ఛందోzసి.
కార్య సాధనకు, శత్రుంజయమునకు, సర్వ రోగ నివారణకు కొన్ని యుగాలుగా పఠించబడుతున్న మహిమాన్విత స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ స్తోత్రం వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో 107 వ సర్గలో అగస్త్యుని నోట రామునికి చెప్పబడింది. రామావతారంలో ఆయన మానవునిగా జన్మ ఎత్తి, ఆ జీవితాన్ని గడుపుతూ, అందులో ఉండే బాధలను అనుభవిస్తూ, అధిగమిస్తూ, ధర్మ పరిపాలన చేస్తూ -వీటిలో భాగంగో ఎందరో మహర్షుల ద్వారా ఉపదేశములు, ఆశేర్వాదములు, సమస్యా పరిష్కరణలు పొందాడు. తానెప్పుడూ దైవ స్వరూపమని చెప్పలేదు, ఆ మహిమలు ప్రదర్శించ లేదు. అందుకనే, రామాయణంలోని ప్రతి అంశము మనకు ఒక దిశానిర్దేశము చేసే సందేశము కలిగి యుంటాయి.
ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. శ్రీ సూర్య భగవానుడు. దైవం కనిపించలేదని ఎవరైనా ఎందుకు బాధపడాలి ?
వేలాదిసంవత్సరములనుంచి వెలుగులు విరజిమ్ముతూ జీవులకు ప్రాణాధారమైన సూర్యభగవానుడు దేవుడే కదా..
శ్రీ లలితా మహాత్రిపురసుందరీ దేవి అమ్మవారు సూర్యమండలమధ్యస్థ అని పెద్దలు చెబుతున్నారు.
ద్వాదశాదిత్యులకుమిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యోనమఃఅని ప్రణామాలు చేస్తుంటాము
యేవ సూర్య జ్యోతిషా బాధసే తమో, జగచ్చ విశ్వముదియర్షి భానునా, తెనాస్మద్విశ్వామనిరామనాహుతి, మపామీవామప దుస్వప్నం సువ (ఋగ్వేదం)
ఓ సూర్య భగవానుడా నీవు నీ తేజస్సుతో ఏవిధంగా అంధకారాన్ని బంధిస్తున్నావో, ఏవిధంగా జగత్తుకు నీ దీప్తి వలన తేజస్సును ఇస్తున్నావో, అదేవిధంగా మా రోగాలను సర్వనాశనం చేసి, చెడుస్వప్నాలను మాకు దూరం చేయగలవు”. పై మంత్రం ద్వారా సూర్యకాంతి సర్వరోగనివారిణి అని మనకు తెలుస్తోంది. పన్నెండు రూపాలలో గోచరించే సూర్యుడు రకరకాల వ్యాధులను నయం చేస్తాడని ప్రతీతి. అందుకే ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ అని అన్నారు.అంటే, ఆరోగ్యం సూర్యుని యొక్క ఆధీనమని అర్థం. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, బలాన్ని ప్రసాదిస్తాడని సామవేదం చెబుతుండగా, జ్ఞానం కోసం సూర్యారాధనమని కృష్ణ యుజుర్వేదం పేర్కోంటోంది. సూర్యుడు ఆదిత్యరూపంలో వాత, పిత్త రోగాలను సూర్యరూపంలో కామెర్లరోగాన్ని, సవితృరూపంలో సర్వశస్త్రబాధలను, పూష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని కలుగజేస్తాడని చెప్పబడుతోంది.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు.
అటువంటి సూర్య భగవానునికి చేతులెత్తి నమస్కరిస్తూ
రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
మీ
భాస్కరానందనాథ
 

Saturday 13 October 2012

శ్రీదేవీ తత్వం – 10 - లలితా సహస్రనామములు.


శ్రీదేవీ తత్వం – 10  - లలితా సహస్రనామములు.

శ్రీవిద్యాం  జగతాం  ధాత్రీం  సర్గ స్థితి లయేశ్వరీమ్,
నమామి  లలితాం  నిత్యాం మహా త్రిపుర సుందరీమ్.
 

శ్రీవిద్య అనబడే బాలా, నవాక్షరి, పంచదశి, షోడశీ మంత్ర రూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నింటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యములను నిర్వర్తించేది, నిత్యా అనే కళా స్వరూపిణిగా విలసిల్లుతున్నది, త్రిపుర సుందరీ స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవికి నేను నమస్కరిస్తున్నాను.

బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు.

లలితా దేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న  తపోధనుడైన అగస్త్యుడిని చూచి

హయగ్రీవులు ఇలా అన్నారు.

లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా,  లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి, భక్తిప్రపత్తులతో అడుగుతున్నందువలన నీకు ఉపదేశము చేస్తున్నాను.

ఇవి శఠునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృ భక్తిలో పూర్ణ భక్తి గల వారికి, శ్రీవిద్య ఎరిగిన వారికి, శ్రీ దేవీ ఉపాసకులకు మాత్రమే యీ సహస్రనామములు చెప్పవలెను.

మంత్రములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీవిద్యలలో ఎలా కాదివిద్య ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమైనదో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీవిద్యోపాసకులలో పరమ శివుడు ఎలా గొప్ప వాడో, అలా సహస్రనామాలలో యీ లలితా సహస్రనామాలు బహు శ్రేష్టాలు.

ఈ నామాలు పఠి౦చటం చేత శ్రీ లలితా దేవి బహు ప్రీతి నొందును. శ్రీచక్ర రాజములో లలితా దేవిని బిల్వ దళాలతోగాని, పద్మాలతో గాని, తులసి పత్రములతో గాని, ఈ సహస్రానామాలతో ఎవడు పూజిస్తాడో అతడికి లలితా దేవి వెంటనే మేలు చేకూర్చును.

చక్రరాజమైన శ్రీచక్రమును పూజించి, పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి, తరువాత ప్రతి దినము యీ సహస్రానామాలతో కీర్తించ వలెను. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణం చేయాలి. ప్రతిదినము నిత్య కర్మల మాదిరి యీ లలితా సహస్రనామములు చేయవలెను.

శ్రీలలితా దేవి ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు యీ లలితా సహస్రనామములను స్తోత్రము చేసిరి.

సకల రోగాలను పోగొట్టి, సకల సంపదలను ఇచ్చే ఈ స్తోత్రమునకు సమానమైన స్త్రోత్రము ఇంతవరకు లేదు.

ఇది సమస్త అకాల మరణములను పోగొట్టి, అపమృత్యువుని దరి చేరనీయకుండా, సకల జ్వరాలను, రోగాలను శమింపజేసి, దీర్గాయుస్సును అందజేస్తుంది.

పుత్ర భాగ్యం లేనివారికి పుత్రులను ఇస్తుంది. ధర్మార్ధ కామ మోక్షా లనే నాలుగు పురుషార్ధములను చేకూరుస్తుంది.

లలితాదేవి పూజాతత్పరులు ప్రతిదినం ప్రయత్నపూర్వకముగా శ్రీవిద్యా జపము చేసి, శ్రీచక్రార్చన చేసి, ఈ నామములను చదువ వలెను.

గంగ మొదలైన నదులలో కోటి జన్మలు స్నాన మాచారిస్తే ఏ ఫలం కలుగుతుందో, కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ట చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కురుక్షేత్రములో సూర్య గ్రహణ సమయంలో కోటిమార్లు దానాలు చేస్తే ఏ ఫలం దక్కుతుందో, గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం దక్కుతుందో,

అంతటి పుణ్యానికి కోటి రెట్లు అధిక పుణ్యము యీ సహస్ర నామాలలో ఒక్కటి పఠి౦చినా కూడా లభిస్తుంది.

 

నిత్య కర్మలు చెయ్యకపోవటం చేత, నిషిద్ధ కర్మలు చెయ్యటం చేత కలిగే పాపాలు కూడా సమసిపోవటం నిశ్చయం. సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక్క సహస్రానామానికి వుండే శక్తి ఎలాంటిది అంటే, ఈ పద్నాలుగు లోకాలలోని వారంతా కలిసి చేసే మొత్తం పాపాలు కూడా యీ సహస్రనామ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏ మాత్రం కావు.

 

ప్రతి రోజు చేయక పోయినా పుణ్య దినములలో, తన భార్య, తన బిడ్డల జన్మ నక్షత్రము వచ్చే రోజులలో, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, శుక్రవారములలో ముఖ్యముగా పఠి౦చవలెను.

పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచోపచారముల చేత పూజ చేసి, సహస్ర నామములను పఠిస్తే సమస్త రోగములు పోయి, దీర్గాయుస్సు కలుగుతుంది. ఇది కామ్య ప్రయోగ విధి.

పిల్లలు లేని గొడ్రాలకి వెన్నను ఈ నామ పారాయణ చేత మంత్రించి యిస్తే గ్రహ పీడలు తొలగి పుత్రులు కలుగుతారు.

ఈ సహస్ర నామ పారాయణుని పై ఎవరైనా అభిచారాది దుష్ట ప్రయోగములు చేస్తే, ప్రత్యంగిరా దేవి ఆ ప్రయోగములను తిరుగ గొట్టి, ఆ ప్రయోక్తలను సంహరిస్తుంది.
 

 శ్రీదేవీ ఉపాసకులను, ఎవరైనా దూషించినా, నిందించినా, అనరాని మాటలు అనినా, అగౌరవపరచినా, అవమానపరచినా,  క్రూర దృష్టితో చూచినా, వాదించినా, వాడి ధనమును దోచినా, కృతఘ్నత చూపినా,
వాడ్ని క్షేత్రపాలకుడు అయిన శివుడు చంపుతాడు. నకులేశ్వరి వాడి నాలుకను తేగకోయును. 
వాక్ స్థంభనము చేయును.

ఎవడు భక్తితో ఈ నామములను ఆరు నెలలు చేస్తాడో, అతడి యింట లక్ష్మీ దేవి స్థిరముగా ఉండును.

ఎవరు శ్రీవిద్యను ఉపాసన చేస్తారో, ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో, ఎవరు యీ నామాలను కీర్తిస్తారో, వారికి దానం ప్రయత్న పూర్వకముగా ఇవ్వవలెను. దానం చెయ్యాలను కొనేవారు, పరీక్షించి శ్రీవిద్య తెలిసిన వారికే దానం చెయ్యవలెను.

లోక వాక్యాలకంటే విష్ణు సంకీర్తనం ముఖ్యం. అలాటి విష్ణు సహస్ర నామముల కంటే గొప్పది ఒక్క శివ నామము. శివ సహస్ర నామాలకన్నా దేవీ నామం ఒక్కటి ఎంతో మహిమ గలది.

 

దేవీ సహస్ర నామాలలో పది విధాలైన సహస్ర నామములు ప్రధానమైనవి. అవి గంగ, భవాని, గాయత్రీ, కాళి, లక్ష్మి, సరస్వతి, రాజ రాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. వీటిలో లలితా సహస్ర నామములు అతి శ్రేష్ఠమైనవి.

అందు చేత కలి దోష నివారణ నిమిత్తం వీటిని నిత్యం పారాయణ విధిగా చేయవలెను.

 

ఇతర దేవతా నామములను కోటి జన్మల యందు కీర్తించి వుంటేనే, ఈ జన్మలో శ్రీదేవీ పూజ యందు, పారాయణ యందు భక్తి శ్రద్దలు కలుగును. మానవునికి తన చివరి జన్మలోనే ఈ శ్రీవిద్య దొరుకును. అట్టి శ్రీవిద్యను కోరుకున్న మాత్రమున దొరకదు అమ్మ అనుగ్రహము లేనిదే. దొరికిన శ్రీవిద్యను నిలబెట్టుకోవడము కూడా చాలా కష్టము.

మంత్రములలో శ్రేష్టమైన యీ మంత్రరాజము, శ్రీచక్ర పూజ, నామ పారాయణ గొప్ప తపస్సంపన్నులకు మాత్రమే దొరుకును. యీ శ్రీవిద్యను అతి గోప్యముగా వుంచవలెను. పశువులతో సమానులైన వారికి, మూర్ఖులకు యీ ఉత్తమమైన స్తోత్రాన్ని ఉపదేశించరాదు. ఒక వేళ ఉపదేశించినా వాడి ఇంట ఆ దేవి నుండదు. అందుచేత అతనికి గొప్ప అనర్ధములు సంభవించును.

ఇటువంటి రహస్యమైన లలితా స్తోత్రములను శ్రీవిద్య ఎరుగని వాడికి భోధిస్తే, వాడి మీదకు యోగిని గణానికి కోపము వస్తుంది.  

ఇటువంటి మహత్తరమైన శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రములను గురు ముఖ:త ఉపదేశము పొంది చేయ వలెను. శ్రీవిద్య (బాల) ఉపదేశము లేని వారు అంగన్యాస, కరన్యాసములు చెప్పకుండా ధ్యాన శ్లోకములు చెప్పుకొని స్తోత్రము పారాయణముగా చేసుకోవచ్చును.

సకల సౌభాగ్యములను ఇచ్చే యీ నామ పారాయణము అందరూ యీ నవ రాత్రులలో చేసుకొని తరించేదరని ఆశిస్తూ,

 అమ్మ కృపతో, అమ్మ పలికించినంత మేర, అమ్మ ఆజ్ఞగా స్వీకరించి యీ పది సంపుటములను నాకు తెలిసినంత మేర అమ్మ గొప్పతనాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నము చేసినాను. దీనిలో తప్పులున్న, ఎవరి మనసునైనా నొప్పించినా,  పెద్దలు, పిల్లలు, తల్లులు, అందరూ నన్ను మన్నించి, ఆశ్వీరదించెదరని

నమస్కారములతో విన్నవించుకొంటూ

శ్రీ మాత్రేనమః  స్వస్తి. 
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ  సంస్థితా
నమస్తస్యై   నమస్తస్యై   నమో నమః

భాస్కరానందనాధ / 14-10-2012
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.
శ్రీకాళహస్తి., చిత్తూరు (ఆ.ప్ర);