Sunday 27 April 2014

సౌందర్యలహరి- 7

సౌందర్యలహరి- 7
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభ స్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్ర వదనా |
ధనుర్బాణాన్‌ పాశం సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా || 7||


గణగణమని మ్రోగుచున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే స్తనముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురములను మట్టుపెట్టిన శివుని అహంకార స్వరూపి యగు భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

 (భాస్కరానంద భావము)
శ్రీ గురువులు క్రిందటి శ్లోకములో అమ్మను మనకు హిమ గిరి తనయ అని పరిచయం చేసినారు, అమ్మ పేరు చెప్పినారు, ఇప్పుడు ఇక అమ్మ ఎలా వుంటుందో అమ్మ ను గురించి వర్ణన చేస్తున్నారు.
అమ్మ సౌందర్యం అయ్యకే ఎరుక. వర్ణించడానికి ఇక ఎవరి తరము కాదు. అసలు కూడదు,  అది మర్యాద కాదు, అమ్మ సౌందర్యాన్ని కొడుకు వర్ణించ కూడదు, అమ్మ తనాన్ని తనయుడు వర్ణించ వచ్చును.
అమ్మ ఎలాగున్నా అమ్మ అమ్మే. అమ్మ ప్రేమానురాగాలు కావాలి గానీ అమ్మ అందం తో పని లేదు కొడుక్కి.
మనము పామరులము,  మన నేత్రములతో చూడలేము కాబట్టి,  మనం పట్టుకోవడానికి వీలుగా  వారు దిగి వచ్చి అమ్మ యొక్క సౌందర్యాన్ని మన కోసం వర్ణిస్తున్నారు. అమ్మ తనాన్ని వర్ణించాలంటే అమ్మ రూపు రేఖలను కాస్త వర్ణించాలి గదా,

అమ్మ ఎలా వుంటుందో అమ్మ రూపురేఖలను వర్ణిస్తూ అమ్మను మన ముందుకు తీసుకొని వస్తున్నారు.  స్త్రీలలో ఉత్తమ జాతియైన పద్మినీ జాతి స్త్రీల యొక్క సాముద్రిక లక్షణములు ఇలాగే వుంటాయి.  ముజగ్గములకు మూల తల్లియైన లోక మాత ఆమె. జగద్గురువులు వారు దర్శించి మనకు దర్శింప చేస్తున్నారు ఈ శ్లోకములో. అమ్మ తనాన్ని ప్రస్ఫుటంగా తెలియ జేస్తున్నారు ఇక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ ఇక్కడ మనకు పచ్చి బాలింతరాలు  లాగ కనిపిస్తున్నది. పాలతో సమృద్దిగా వున్న గోమాత దగ్గరకు లేగ దూడ వెళ్లినట్లుగా మన శంకరులు కనిపిస్తున్నారు. గోమాత యొక్క పొదుగును చూచి, తన్ని, పాలు త్రాగిన లేగ దూడ గా ఆది శంకరులు కనిపిస్తున్నారు.

అమ్మ గోమాత. గోమాత లో పర దేవత వున్నది అని పెద్దలు అంటారు. లోకాన్ని తన  క్షీర సంపదతో గోమాత ఎలాగైతే పాలు ఇచ్చి రక్షిస్తున్నదో, అలాగే లోక మాత తన క్షీర సంపదతో ఈ సృష్టిని పోషిస్తున్నది అందుకే ఆమె ఆబ్రహ్మకీటజనని అయ్యినది.

కరికలభ కుంభ స్తననతా:-  గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే స్తనముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలది. ఇదే విషయాన్ని మనము లలితా సహస్రనామం లో చూడ వచ్చును.
స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా...అని.
స్తనముల భారముచే ముందుకు వంగినది, సన్నని నడుము గలది అని అన్నారు శంకరులుఅన్నారు. సన్నని నడుము గల స్త్రీ సంతానవతి పెక్కు పిల్లలకు తల్లి అగును అని సాముద్రికము. ఆమె శ్రీమాత గంపెడు సంతానము గలది. సృష్టిలోని పశు పక్ష్యాదులు అన్నీ ఆమె సంతానమే కదా, కాబట్టి సమృద్ధిగల  క్షీర సంపదతో, పాల బరువుతో కరికలభ కుంభ స్తనన అయ్యినది. సర్వ జగత్తుకు తన స్తన్యాన్ని ఇచ్చి పోషించ వలసిన జగన్మాతకు స్తన భారం అధికంగా వుండడం సహజం, అది శుభప్రదం. స్తనములు మాతృకా చిహ్నములు, అవి ఎప్పుడూ సమృద్దిగా వుండాలి అప్పుడే లోకములు  సుభిక్షముగా ఉండును.

క్వణత్కాఞ్చీదామా:-   గణగణమని మ్రోగుచున్న చిరుగంటలతో కూడిన మొలనూలు, పట్టు దారము కలది.
రత్న కింకిణికారమ్యరశనాదామ భూషితా .... చిరు గంటలచే మ్రోగుచున్న, మెరియుచున్న బంగారు మొల నూలు కట్టుకొని వున్నది అమ్మ వారు, చిన్న వడ్డాణం లాంటిది అనుకోండి. సన్నని నడుము కాబట్టి సువర్ణ వస్త్రము జారిపోకుండా బంగారు ఆభరణము ధరించినది.  కాదు కాదు  నడుము గట్టితనం కోసం సువర్ణ వస్త్రాన్ని మూడు సార్లు మూడు మడతలుగా కట్టుకొన్నది. కాదు కాదు మూడు వేదములను, మూడు కాలములను  మూడు రేఖలుగా (వళిత్రయ) ధరించినది అని. అమ్మవారు త్రయాక్షరి కాబట్టి మూడు బీజాక్షరములను మూడు రేఖలుగా ధరించినది.  త్రిపుర సుందరి కాబట్టి మూడు లోకములకు చిహ్నములుగా మూడు వరుసల మొల నూలు ధరించినది.

దామము అంటే త్రాడు అని చెప్పు కోవచ్చును.   ద్యతి పశుదౌష్ట్య మితి దామ .....అని అమరకోశము.
పశువులను కట్టు త్రాడు. దీని చేత కట్టు బడు వాడు. దేని చేత? భక్తిచేత.  అందుకే శ్రీకృష్ణుడు దామోదరుడు అయినాడు.
పరిణత శరచ్చంద్ర వదనా:-   శరచ్చంద్ర నిభానన.....అని మనకు లలితా సహస్ర నామం లో కనిపిస్తుంది. శరదృతువు నందలి పున్నమి చంద్రుని వంటి ముఖము గలది. పరిణత అంటే సంపూర్ణ కళలు కలిగిన అని అర్ధము వస్తుంది ఇక్కడ.  వికసించిన, విప్పారిన మోము గలది. సంపూర్ణమైన (64) కళలతో ముఖము బాగా విప్పారి వున్నది, కాబట్టి అమ్మ ఒక బాలింత లాగ కనిపిస్తున్నది. ఆమె శ్రీమాత, సృష్టి కర్త్రీ.  అమ్మ ఎప్పుడూ పిల్లలను కంటూ వుంటుంది కాబట్టి ఆమె ఎప్పుడూ బాలింత లాగే వుంటుంది. పరిణత అంటే పచ్యతే క్రమేణ పక్వం. పక్వా బుద్ధిః,  వేరొక అవస్థను పొందునది. కాల వశమున పరిపాకము పొందునది. పరిపూర్ణురాలు అయినటు వంటిది అని అర్ధము. స్త్రీ మాతృత్వం తో పరి పూర్ణత పొందుతుంది.

మనోరూపేక్షుకోదండా, పంచ తన్మాత్ర సాయకా, రాగ స్వరూపపాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ....అని లలితా సహస్ర నామంలో చెప్పిన విధముగా అమ్మ నాలుగు చేతులతో నాలుగు ఆయుధములను ధరించి వున్నది. ఆమె ధనుస్సును, బాణాల్ని, పాశాన్ని, అంకుశాన్ని ధరించి వున్నది. జీవుల మనస్సు ఆమెకు ధనుస్సు. పంచ తన్మాత్రలు పంచ బాణములు. రాగము ఆమె పాశము, క్రోధము ఆమె అంకుశము. దుష్టుల యొక్క  కామ క్రోధాదుల విషయములో అమ్మ క్రోధ రూపమైన అంకుశము కలిగి వుంటుంది. అది కూడా మనకు రక్షయే గదా.

పురమథితు రాహో పురుషికా:-

మగవాడి అహంకారము ఆడదాని సౌందర్యము. ఆడదాని అహంకారము మగ వాడి హోదా.
భర్త కలెక్టరు అయితే భార్య కూడా కలెక్టరే. ఆయిన హోదాను చూసి భార్య యొక్క గొప్పతనము, గడసరి తనము వుంటుంది. 
ఆమె పరబ్రహ్మ పట్టమహిషి. శ్రీమహారాజ్ఞి. మహారాజు యొక్క ఇల్లాలు కాబట్టి  అహో పురుషికా అయినది.

పురమథనుడు పురములను మధించిన వాడు లేక త్రిపురాసురులను మర్దించిన వాడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, త్రిగుణాతీతుడు శివుడు. రుద్రయామళము లో  త్రిపురా బీజాక్షరములను (బాల మంత్రము)  మధించిన వాడు రుద్రుడు అని చెప్పబడి ఉన్నది. ఓం కార స్వరూపుడు (అ+ఉ+మ) శివుడు. అ, ఉ, మ, అనే మూడు అక్షరములతో ఏర్పడిన వాడు. శివుడు త్రిపురాంతకుడు, సమస్త లోకములకు తండ్రి,.
నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే,
సత్యా యాది కుటుంబినే ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే ...... శివానందలహరి

ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం, మోక్షదం తస్మై ఓం కారాయ నమో నమః.
అటువంటి మహా దేవుణ్ణి కట్టుకొని నీవు పెత్తనం చేలాయిస్తున్నావు గదమ్మా .. అహో పురుషికా ! ఎంత గడుసరిదానవమ్మా నీవు (స్త్రీ వాచకముగా చెప్పడం)
కాదు కాదు మా అమ్మను పెళ్ళాడి, త్రిపుర సుందరిని భార్యగా పొందిన ఆ మహా శివుని అహంకారము చూసి  అహో పురుషికా ...అని అన్నారు. (పురుష వాచకము గా చెప్పడం)

ఇక్కడ స్త్రీ వాచకముగా చెప్పడం సబబు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది అమ్మను గురించి వర్ణించిన సౌందర్య లహరి కాబట్టి. అమ్మను గురించి ఉద్దేశిస్తూ అహో పురుషికా ! ఎంత గడుసరిదానవమ్మా నీవు! అటు వంటి మహా త్రిపుర సుందరి నా హృదయ కమలము నందు వసించు గాక! శివుని అహంకార స్వరూపిణియగు ఆ మహాదేవి మా ఎదుట సుఖాసీనురాలై ప్రత్యక్షమగు గాక. అటువంటి తల్లికి నమస్కరిస్తూ......

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.

(సరస్వతీ రామచంద్ర రావు)/27-04-2014 @ శ్రీకాళహస్తి 

సౌందర్యలహరి- 6

సౌందర్యలహరి- 6
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.


శ్లో|| ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసంత స్సామంతో మలయమరు దాయోధన రథః |
తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌
అపాజ్గాత్తే లబ్ధ్వా జగ దిద మనజ్గో విజయతే || 6


ఓ హిమగిరి కుమారీ! మన్మథుడి విల్లు పువ్వులతో రూపొందించబడినది; వింటినారి తుమ్మెదల శ్రేణి; పుష్ప నిర్మితమైన బాణాలూ ఐదు అతడి అమ్ముల పొది; కాలబద్ధుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు; అతడి యుద్ధరథం నిరంతరం చలించే రూపులేని మలయమారుతం; ఇలా పనికిరాని యుద్ధ పరికరాలు కలిగిన మన్మథుడు అంగ రహితుడు; బలిష్టమైన మేను లేని వాడు. అయిననూ, నిన్నారాధించి, నీ కడగంటి కటాక్షంతో ఈ జగత్తును తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు.

భాస్కరానంద భావము (భా.భా)
హిమ గిరి సుతే ....
హిమ గిరి తనయే, హైమవతీ అని మొదట సారి జగద్గురువులు ఈ శ్లోకములో అమ్మను నామ వాచకముతో పిలుస్తున్నాడు. మొదటి ఐదు శ్లోకములలో అమ్మను పర బ్రహ్మ స్వరూపముగా, మహా శక్తిగా అభివర్ణించిన,  భగవత్పాదులు ఇప్పుడు హిమ గిరి తనయే.. అని పిలుస్తున్నాడు. అమ్మ ఎవరో అమ్మ ఉనికి ఏమిటో మనకు చెబుతున్నాడు. హిమగిరి తనయే హేమలతే  అంబా ...పర్వత పుత్రీ పార్వతీ అని పిలుస్తున్నాడు.  సగుణ రూపం లో అమ్మను ఆరాధిస్తూ మనకు చూపిస్తున్నాడు.
హిమగిరి తనయే హేమలతే అంబా ఈశ్వరి శ్రీ లలితే మామవ...అనే ముత్తయ్య భాగవతార్ పాడిన          కీర్తన నాకు గుర్తు కు వస్తున్నది
హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే మామవ
రమా వాణి సంసేవిత సకలే రాజ రాజేశ్వరి రామ సహోదరి
పాశాంకుశేషు దండ ధరే అంబ పరాత్పరే నిజ భక్త పరే
అశాంబర హరికేశ విలాసే ఆనంద రూపే అమిత ప్రతాపే.

భగవంతుడు గొప్పా ? భక్తుడు గొప్పా అని ఆలోచిస్తే,  నాకు భక్తుడే గొప్ప అని అనిపిస్తున్నది ఎందుకో.

మన్మధుడు అంటే  మనస్సును మధించిన వాడు, లోకాలను జయించ డానికికి బయలు దేరినాడు అస్త్ర శస్త్రములతో రధము నెక్కి. ఆ రధము ఎలా ఉన్నదో, అస్త్ర శస్త్రములు ఎలా వున్నాయో జగద్గురువులు వర్ణిస్తున్నారు.

ధనుస్సు గట్టిగా వుండాలి కాని అదేమో పుష్ప ధనుస్సు, పూలతో చేయబడినది, దానికి గట్టితనం లేదు, వంచడానికి వీలు లేదు, వింటి నారి చూస్తే తుమ్మెదల వరుస, లాగడానికి వీలు లేని అల్లె త్రాడు. బాణాలు అయిదు అవి తామర పువ్వు, అశోకము, మామిడి, నవ మల్లిక, నల్ల కలువ అనే పుష్ప బాణాలు, తగిలినా గట్టిగా గ్రుచ్చుకోవు, శరీరానికి గాయాలు కావు, కేవలం  అయిదు బాణాలతో లోకాన్ని జయించడం అసలు వీలుకాని పని.

పోనీ సహాయకుడు గట్టివాడా అంటే అతను వసంతుడు, వసంత కాలం లో తప్పించి అంటే సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే కనిపిస్తాడు, ఇతర కాలాలలో అందుబాటులో ఉండడు, సహాయము చేయలేడు, పోనీ ఎక్కిన రధము అన్నా గట్టిగా ఉందా అంటే అది మలయ మారుతము, మలయ పర్వతము దగ్గరే వుంటుంది, అక్కడి నుంచి బయటకు రాదు, పైగా అన్ని సమయాలలో వీయదు, అది ఎటు వీస్తే అటే పోవాలి గాని లక్ష్యం వైపు వెళ్ళదు. శత్రువు వైపు వెళ్ళదు కాబట్టి మలయ మారుతం రధముగా పనికి రాదు.

పోనీ శరీరం అన్నా గట్టిగా ఉందా అంటే అదీ లేదు, అనంగుడు అంగములు లేని వాడు, శరీరము లేని వాడు
కాళ్ళు, చేతులు లేని వాడు, మరి ఇన్ని అవలక్షణములు వున్నవాడు ఎలా లోకాలను జయించాడయ్యా అని అంటే,

 అమ్మ దయ వుంటే ఎంతటి దుర్భలుడయినా ఎటువంటి కార్యాన్ని అయినా సాధించ గలడు అని అర్ధము. ఇదంతా నీ కడగంటి చూపు గొప్పతనము కాక మరి ఇంకేమున్నది?

అమ్మ కరుణాకటాక్షము వలన మన్మధుడు ఈ లోకాలను అన్నింటిని జయిస్తున్నాడు. స్త్రీ పురుషులను కామ పరవశుల్ని చేస్తున్నాడు.
విజయమునకు కావలసిన సామగ్రి లేకున్ననూ అమ్మ అనుగ్రహము వుంటే విజయము తధ్యము అని చెప్పినారు గురు దేవుళ్ళు.
అమ్మ కృప దొరికితే ఎంతటి అల్పుడు అయినా ఎంతటి ఘన కార్యాన్ని అయినా సాధించ గలడు అని ఆది శంకరులు మనకు చెబుతున్నారు ఈ శ్లోకములో.
అపాంగాత్తే లబ్ధ్వా ... అపాంగము అంటే కడ కన్ను అని అర్ధము.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ



సౌందర్యలహరి- 5

సౌందర్యలహరి- 5
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.


శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్‌ |
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్‌ ||

అమ్మా ! ఓ జననీ నీకు నమస్కరించే నీ భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు. పూర్వం శ్రీ మహావిష్ణువు నిన్ను ఆరాధించి స్త్రీ రూపాన్నిధరించి,  త్రిపురాసురులను సైతం సంహరించిన జితేంద్రియు డైన శివున్ని కూడా కలత పెట్టాడు, క్షోభ పెట్ట గలిగాడు.
అలాగే మన్మధుడు కూడా నిన్ను కొలిచి తన సతి అయిన రతి దేవి కన్నులను, మనస్సును రంజింప చేయగల సౌందర్యాన్ని పొంది, ఆ రూపముతో మునీశ్వరుల మనస్సును సైతం మొహపెట్ట గలుగుచున్నాడు. ఇది అంతా నీ ప్రాసాద మహిమే కదా తల్లీ.

భాస్కరానంద భావము (భా.భా)

ఎవరైతే నీకు వినమ్రులై, వినయ విధేయతలతో నిన్ను నమస్కరిస్తూ ఉంటారో వారిని నీవు అనుగ్రహిస్తూ వుంటావు తల్లీ.
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా ....అని లలితా సహస్రనామం లో అమ్మకు ఒక నామం. అమ్మ చిరు నవ్వు యొక్క కాంతి ప్రవాహమునందు కామేశ్వరుని యొక్క మనస్సు ఓలలాడుతూ వుంటుంది.

అమ్మ నవ్వుకు అయ్య దాసోహం అయినాడు అని. పూర్వం ఒకసారి శివుడు త్రిపురాసులను సంహరించి కైలాసానికి తిరిగి వస్తాడు. ఆ ప్రళయ భీకర ఉగ్ర రూపాన్ని చూచి దేవతలు అందరూ తల్లడిల్లి పోతారు. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఎవ్వరికీ సాద్యం కాలేదు. ఆ సమయంలో అమ్మ లోపలి నుండి బయటకు వచ్చి ద్వారానికి ఒక ప్రక్క ఓరగా నిలబడి అయ్య వారి మీద ఒక చిరు నవ్వు విసిరినది. అంతే మన ప్రళయ శంకరుడు కాస్త ప్రణయ శంకరుడు అయినాడు. అలా అమ్మ వారు తన చిరు నవ్వుతో అయ్యగారి మనసు దోచుకొన్నది.  అప్పటి నుంచి భార్య చిరునవ్వు భర్త కోపానికి సరైన మందు ...అని మన పెద్దలు అంటూ వుంటారు.
 శ్రీ మహావిష్ణువు ఒక సారి ఆ మహా లావణ్య శేవధి: ని  తపమాచరించి ఆమె సౌందర్యాన్ని తాను పొంది మోహినీ రూపంలో రాక్షసుల నుంచి అమృతాన్ని రక్షించి దేవతలకు పంచిపెడుతాడు, అదే మోహినీ రూపంతో ఆ పరమ శివున్ని కలత పెట్టి హరిహర సుతునకు కారణజన్ములు అవుతారు.
శ్రీ మహా విష్ణువు శ్రీదేవీ ఉపాసకుడు. పంచదశాక్షరీ  మంత్రాన్ని విష్ణువు, శివుడు, మన్మధుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు మొదలగు వారు ఉపాసన చేసినారు అని దేవీ తంత్రములు చెప్పు చున్నవి.
శ్రీ మహా విష్ణువు కామ కళా మహా మంత్ర బీజమగు ఈంబీజమును ఉపాసించి సాక్షాత్తు శ్రీ దేవీ యోక్క్ చతుషష్టి కళలను పొంది  ఆమె రూప లావణ్యములను  బడిసి మోహినీ రూపము దాల్చెను.

విష్ణు: శివః సుర జ్యేష్టో మనుశ్చంద్రో ధనాధిపః |లోపాముద్రా తథాగస్త్యః స్కందః కుసుమసాయక|
సురాధీశో రౌహిణేయో దత్తాత్రేయో మహా మునిః|దుర్వాసా ఇతి విఖ్యాతా ఏతే ముఖ్యా ఉపాసకాః ||

హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః.......అని లలితా సహస్రంలో చెప్ప బడినట్లుగా ఈశ్వరుని మూడవ నేత్రము చేత కాలి బూడిద అయిన మన్మథున్ని మరల బ్రతికింపుమని బ్రహ్మాది దేవతలు, రతీ దేవి ఆ పరాశక్తిని ప్రార్ధింపఁగా , భండాసుర వధానంతరము లలితాంబ చేత మరలా మన్మధుడు పునర్జీవుతుడు గావించ బడ్డాడు. (పూర్వము శరీరము కలవాడనియు, ఇప్పుడు శరీర రహితుడనియు అర్ధము.) అట్టి మన్మధ జీవనమునకు పరదేవత కటాక్షము సంజీవినీ మూలిక వంటిది అని భావము,
అంటే శ్రీ దేవీ ఉపాసన వలన అవిద్యా స్వరూపమైన తన పూర్వ రూపము హర నేత్రాగ్ని చేత భస్మము అయ్యి, బ్రహ్మ స్వరూపము, మోక్ష రూపము పొందినది అని కూడా అర్ధము. మన్మధునికి స్థూల రూపము పోయి, సూక్ష్మ రూపము వచ్చినది,
మరో విశేషమేమిటంటే ..పరమశివుడు కూడా శ్రీవిద్యోపాసకుడు, గురువు లేకుండా ఉపాసన జరుగదు కనుక త్రిపుర సుందరియే అతనికి గురువు. (యోగినీ హృదయం). అందువలన ఆమె శివునికి కూడా గురువు అగుచూ గురుమూర్తి అయ్యినది. గురుమూర్తి, దక్షిణామూర్తి రూపిణి అని లలితా సహస్రనామలలో కలవు. అనగా ఆ పరదేవతయే గురు స్వరూపములో వున్నది. ఆ పరమ శివునికి కూడా గురువై గురుమండల రూపిణీ అయ్యి వున్నది. హరి కోపించిన గురువు రక్షించును, గురువు కోపించిన రక్షించు వారు ఎవ్వరూ లేరు అన్నట్లుగా,
శివుడు కోపించినా గురు మండల రూపంలోని అమ్మ మన్మధున్ని రక్షించినది అని అర్ధం చెప్పుకోవచ్చును.
అనగా మాయ, ఆత్మ జ్ఞానమును క్రప్పి పుచ్చు చుండును, కావున జ్ఞానాగ్ని చేత దహింపబడి కాముడు అనబడే  జీవుడు, దానిని చుట్టి వున్న మాయ నుండి విముక్తిని పొంది స్వ స్వరూపమును పొందినాడు. శ్రీవిద్యా స్వరూప మైన దేవిని ఉపాసించుట వలన అవిద్య నశించి ఆత్మ రూపమును పొందుటయే మోక్షము అని దీని భావము. మన్మదుడుకి ఆ శక్తి ఆ తల్లి వలెనే లభించినది అని మనము చెప్పుకోవలయును.
ఇప్పుడు మన్మధుడు మనస్సు చేత జితేంద్రియులైన మునులను సహితమును అంతరంగమున మోహము కలిగించు చున్నాడు. అనగా శబ్దాది ఇంద్రియ విషయము లందు, వాంఛ లయందు, మనస్సు మోహ వశ మగు చున్నది అని భావము. మునీశ్వరులను సైతం మోహింప చేయగల సమర్ధుడు అయినాడు మన్మధుడు అంటే అది అంతా శ్రీమాత యొక్క అనుగ్రహమే. అమ్మ అనుగ్రహము చేత ఈ మాయా మోహమును దాట వేయ వచ్చును.
ప్రణత జన సౌభాగ్య జననీం ....దీని విశేష అర్ధం ఏమిటంటే శ్రీ దేవి ప్రణత జనులకు సౌభాగ్యాన్ని ఇస్తుంది, మరి ప్రణత జనులు అంటే ఎవరు? త్రికరణ శుద్దిగా నమస్కరించే వాళ్ళు అని. అలా త్రికరణ శుద్దిగా నమస్కరిస్తే ఆమె మనకు సౌభాగ్యమును ప్రసాదిస్తుంది. అంటే కొలిచెడి వారికి కొంగు బంగారమై సకల సౌభాగ్యములను తీర్చే తల్లి అని అర్ధము. మరి సౌభాగ్యము అంటే సౌందర్యము, సత్సాంతానము, సకల విద్యా ప్రాప్తి మొదలగు సంపదలు అన్నీ అమ్మ మనకు అనుగ్రహిస్తుంది.
జననీం అని అనడంలో అర్ధం మాతృత్వం. మాత అన్నా జననీ అన్నా ఒకటే అర్ధం, కానీ భగవత్పాదులు ఇక్కడ జననీం అని అనడంలో ఒక ఔచిత్యము వున్నది.
జననీం అంటే పుట్టుక, జన్మ, పునర్జన్మ అనే అర్ధాలు గోచరిస్తాయి.
జన్మకు కారణభూతురాలు అవుతున్నది అమ్మ. జననీ అంటే తల్లి, దయ అని రెండు అర్ధములు వస్తాయి. దయ గల తల్లి, కారుణ్యమూర్తి. మరి ఎక్కడ ఆ తల్లి జననీo అయ్యినది ఈ శ్లోకములో.
౧. విష్ణువు కామకళా బీజ మంత్రాన్ని ఉపాసించి అమ్మ రూపాన్ని పొంది మోహినీ రూపంలో హరున్ని కలవగా అయ్యప్ప స్వామి జనించినాడు. ఇక్కడ జననీం అయ్యినది అమ్మ.
౨. రుద్రాగ్నికి బూడిద అయిన మన్మథునికి  కరుణతో, దయతో పునర్జన్మ ప్రసాదించి రెండో మారు జననీం అయ్యినది.
హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః.. అయినది మా అమ్మ.
విష్ణువు అమ్మను ఉపాసించడం వలన స్త్రీ రూపం పొంది అమ్మతో సారూప్యం పొందినాడు, అందుకే శివుడు ఆ రూపాన్ని చూచి ఆమెను పార్వతిగా భావించి మొహాన్ని పొందినాడు అని పెద్దలు అంటారు.
రతి నయన లేహ్యేన:- రతీ దేవి కన్నులచే ఆస్వాదింప దగినది అని అర్ధము. లేహ్యము అంటే నాకి భుజింప దగిన పదార్ధము, అమృతము, నాక దగినది, నాలుకతో తినగలిగినది. నయన లేహ్యన అంటే కన్నులతో తినగలిగినది, నాలుకతో చప్పరించేది అంటే కన్నులతో జుర్రుకొనడం అనుకోవచ్చును. అంటే ఆమె మనో నేత్రమునకు మాత్రమే కనిపించ దగినది మన్మధ శరీరము అని అర్ధము.

విశేష వాఖ్య :- అమ్మ ను పూజించిన వాళ్ళకు మన్మధుడి బాధ వుండదు అని ఈ శ్లోక రహస్యం.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.

భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ

సౌందర్యలహరి- 4

సౌందర్యలహరి- 4
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |
భయాత్త్రాతుం దాతుం ఫలమపి చ  వాంఛాసమధికం   
శరణ్యే లోకానాం తవ హి చరణా వేవ నిపుణౌ ||  ౪


తా: భగవతీ! లోకమాతా! ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వరముద్రలను ధరించి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వరాభయముద్రలను ధరించ లేదు. కారణం, ఓ తల్లీ ! భక్తులను భయం నుంచి రక్షించడానికి వారు కోరిన దానికన్నా ఎక్కువ  ఫలాన్నిఒసగడానికి, నీ పాదములు ఎంతో నైపుణ్యము కలిగి వున్నాయి కదా.
భాస్కరానంద భావము (భా.భా)
సకల జగత్తుకు మూల కారణమైనటువంటి మూల ప్రకృతి, వేద వేద్య అయినటువంటి ఆ శ్రీమాత ఇతర దేవతల వలె అభయ, వరద ముద్రలను ధరించ లేదు. కారణం ఆమె అమ్మ. అమ్మతనం గొప్పది అన్నింటి కంటే. ఇటువంటి సాంప్రదాయాలకు, ముద్రలకు భిన్నమైనటు వంటిది అమ్మ తనం. వరము లేదు, అభయము లేదు. అమ్మా అని ఆర్తితో పాదాల పై పడ్డ  పసి బిడ్డను, నాయినా తండ్రీ అని అక్కున చేర్చుకోనేదే అమ్మ తనం. ఆ చల్లని ఒడిలో అన్నీ అభయాలే వరములే. మరి వేరే కావాలనా. అమ్మ ఒడిని మించినది ఏమున్నది మనకు. అందుకే ఏ ముద్ర దాల్చ లేదు, ఒక్క చిరు నవ్వు తప్ప.  ఆమె పాదాల పై పడి ఏడిస్తే చాలదా అమృత వర్షం కురిపించడానికి ఆ అమృతవర్షిని.
మరలా అడగాలా అది కావలి ఇది కావాలి అని. అడిగి మ్రోక్కించుకోవడం మా అమ్మకు చేత కాదు. అడగ కుండానే అన్నీ ఇచ్చేస్తుంది ఒక్క సారి అమ్మా అంటే చాలు కన్నీళ్ళతో.
శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికాయై నమః, హరి బ్రహ్మేంద్ర సేవితాయై నమః. అనుగ్రహదాయైనమః.
రాగము అనే పాశము, క్రోధము అనే అంకుశము, మనస్సు అనే ఇక్షు దండము, పంచ తన్మాత్రలు కలిగి చతుర్భాహు సమన్విత అయినటు వంటి ఆ భయాపహా కు  నమస్కారములు.
సామాన్యంగా దేవతల విగ్రహములను పరిశీలిస్తే కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో వరద ముద్ర వుంటుంది. అభయముద్ర అంటే చేతి వ్రేళ్ళు ఊర్ధ్వ ముఖంగాను, వరద ముద్ర అంటే చేతి వ్రేళ్ళు అధోముఖంగా ఉన్న హస్త ముద్ర.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.

భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ

సౌందర్యలహరి- 3

సౌందర్యలహరి- 3
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ |
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||


తా: అమ్మా! నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యద్వీప నగరం. ఆ నీ పాదలేశం మందబద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం; లేమిచేత కుంగిపోయే దరిద్రులకు, సకలసంపదలనిచ్చే చింతామణుల శ్రేణి. అంతేగాక జనన మరణ సంసారరూపమైన సాగరంలో మునిగి దరిగానక తపించే వారికి - విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామియొక్క కోర అవుతోంది. అంటే ఉద్ధరించేది; సంసార సాగరాన్ని తరింపజేసేది అని భావం.

భాస్కరానంద భావము (భా.భా.)

విద్యాzవిద్యా స్వరూపిన్యైనమః .. అని లలితా సహస్రనామంలో ఆతల్లి ని కోలుస్తున్నాము, రెండు రూపాలలో వుండేది ఆ తల్లియే అని అర్ధము. విద్య ఆమె, అవిద్య ఆమె. మాయ ఆమె, జ్ఞానము ఆమె, వెలుగు ఆమె, చీకటి ఆమె. ఆ తల్లియే మహా మాయ. విద్య అనగా పర బ్రహ్మ స్వరూప జ్ఞానము, అవిద్య అనగా భేద భ్రాంతి రూప జ్ఞానము, మాయ. అనగా సంసార బంధమునకు లోనగునటుల చేసెడి జ్ఞానము. త్వరుద్ధమైనది విద్య అంటే జంతువులమైన మనలను పశుపతి యైన ఆ పరమేశ్వరుని వైపు మరల్చునది జ్ఞానము, విద్య.
విద్య అనగా చరమ వృత్తి రూప జ్ఞానము, అవిద్య అనగా భేద భ్రాంతి రూప జ్ఞానము, స్వ అనగా పర బ్రహ్మాత్మక జ్ఞానము. ఈ త్రివిధ జ్ఞానమే రూపముగా గలది విద్యావిద్యా స్వరూపిణి అని అర్ధము.
విద్యా zవిద్యేతి దేవ్యా ద్వే రూపే జానీహి పార్ధివ , ఏకయా ముచ్యతే జంతు రస్యయా బద్ధ్యతే పునః ..దేవీభాగవతం.
నిజం తెలుసుకొనక పోవుట అవిద్య, భ్రాంతి చెందుట అవిద్య, స్వ స్వరూపము తెలుసుకోనకపోవుట అవిద్య, నీది, నాది అనుకొనుట అవిద్య, మమకారము, మోహము, అజ్ఞానము అవిద్య. బందము అనగా సంసారము.
తరతి శోకమ్ ఆత్మవిత్...ఆత్మ జ్ఞాని శోకమును పోగొట్టు కొనుచున్నాడు. అసలు ఆత్మ యందు శోకము లేదు, వున్నది మనస్సు లోనే. లేని పోని బంధనములను, మమకారములను కొని తెచ్చుకొని ఎడుచు చున్నాడు. జ్ఞాన పరిశీలనతో అవిద్యను పోగొట్టుకొని సుఖమును పొందవచ్చును.
అజ్ఞానమనే చీకటి తో ఆవరింప బడి, మాయ చేత క్రప్పబడిన మా లాంటి వాళ్లకు, నీ పాద పద్మము సూర్యోదయం జరిగే ప్రదేశము లాంటిది. తమో గుణము చేత నన్ను నేను తెల్సుకోలేక పోతున్నాను అమ్మా, నిన్ను పూజించడం వలన నా అజ్ఞాన చీకట్లు తొలగి జ్ఞానము కలుగుతుంది తల్లీ. ఆత్మ జ్ఞానము కలుగుతుంది తల్లీ. ఈ ఆత్మ జ్ఞానాన్ని మాయ అనే అవిద్య కప్పేస్తుంది. విద్య అంటే జ్ఞానం, జ్ఞానం వలన మోక్షం కలుగుతుంది. అజ్ఞానాన్ని పారద్రోలే దీపిక అమ్మ. అజ్ఞాన ధ్వాంత దీపికా అని లలితా సహస్ర నామం లో అమ్మకు పేరు.
అజ్ఞానులకు, జడులకు, మంద బుద్ధి గల వారలమైన మాకు చైతన్యము, ఆత్మ జ్ఞానము కలిగించే మకరందపు ధార అమ్మ. జ్ఞాన ధార. ఆత్మ జ్ఞానము కలిగించే పుష్ప గుచ్ఛము అమ్మ. జ్ఞాన దరిద్రులకు చింతామణి గని అమ్మ. గుణనిక అంటే గుణముల సమూహము, గుణముల గని అని అర్ధము, జ్ఞాన విహీనులకు అమ్మ కోర్కెలను తీర్చే గుణ నిధి అని అర్ధము.  వాంచితార్ధ ప్రదాయని అయిన అమ్మ మన బాధలను తీర్చి అజ్ఞానము తొలగించి జ్ఞాన వెలుగును ప్రసరింప జేయును. బుద్దిని మోహము ఆక్రమించినప్పుడు జీవుడు మనస్సునకు ఆధీనమగును. మోహము వలన బుద్దికి పుట్టిన వాడు మనస్సు. మనస్సు యొక్క భార్య కల్పన. మనస్సు వలన చపలకు పుట్టిన కొడుకులు పంచ జ్ఞానేంద్రియములు. శుద్ధ చైతన్యము త్రిపురా దేవి. త్రిపురా దేవి ఉపాసన వలన అవిద్య, అజ్ఞానము తొలగి ఈ సంసార సముద్రము నుండి బయట పడుతాము. సంసార సముద్రంలో మునిగి పోకుండా అమ్మ మనలను కాపాడుతుంది, అది ఎలాగా అంటే వరహా రూపంలో శ్రీ మహావిష్ణువు తన కోరలతో భూమిని పైకి ఎత్తి కాపాడినట్లు. అందకే ఆమె సంసార పంక నిర్మగ్న సముద్దరణ పండితా అయినది.
జ్ఞానము కోరిన వారికి జ్ఞానము, కోరికలతో సేవిస్తే కోరికలు తీరుతాయని, దరిద్రులకు దరిద్రము పోతుందని, మోక్షము కోరిన వారికీ మోక్షం లభిస్తుందని దీని అర్ధము.
అమ్మను పూజించడం వలన మన లోని అజ్ఞానపు  చీకట్లు తొలగి, మాయ,మోహము  బ్రాంతి పొరలు వీడిపోయి జ్ఞాన వెలుగులు ప్రసరించును. తద్వారా ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము తెలియును. ఈ సంసార చక్ర బంధము నుండి విముక్తి లభించును.
ఈ శ్లోక ఫలము :- సకల విద్యావేత్త, జ్ఞాని అగును.

గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ,
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.

భాస్కరానంద నాథ