Saturday, 5 January 2013

ప్రశ్నలు - సమాధానములు -౧

శుభం.
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానములు

౧ ప్రతిమంత్రానికి బీజం, శక్తి, కీలకం ఉంటాయని విన్నాను. ఈ మూడిటి స్వరూపం ఏమిటి? వీటిమధ్య భేదమేమిటి? ఏదేమిటో ఎలా తెలుస్తుంది? బీజశక్తికీలకాలు తెలియకపోవటం సాధకుని బాధిస్తుందా?
 
దీని గురించి ఇంతకు ముందే చెప్పడం జరిగినది. 
 కారణ బిందువు నుండి ౧) కార్య బిందువు, ౨) అందుండి నాదము ౩) అందుండి బీజము అను మూడు పుట్టు చున్నవి. ఈ మూడును పర, స్థూల, సూక్ష్మ పదముల చే చెప్పబడు చున్నవి. కాబట్టి బిందువు స్థూల, సూక్ష్మ, పరమని మూడు విధములుగా చెప్ప బడుచున్నవి. బిందువు గురించి తెలిస్తే బీజము గురించి తెల్సినట్లే.  బిందువే బీజమునకు  మూలము.. ఇవన్నీ అతి రహస్యములు గురు-శిష్య పర౦పర ద్వారా తెలుసుకోదగిన విషయములు. ఉపాసన, ఉపదేశం లేని వారికి ఈ బీజ శక్తి కీలకములు లేకుండా చేయడం ఉత్తమం. బీజ సహితముగా చేయడం వలన తొందరగా మంత్రము సిద్దించును. బీజ రహితముగా చేసినందువలన సాధకునికి ఎటువంటి ఇబ్బంది లేదు, వచ్చే ప్రమాదము లేదు. పట్టు తొందరగా కుదరదు అంతే. బీజ శక్తి కీలకములను ఉపదేశము ద్వారా, దీక్ష ద్వారా గురువులు తమ శిష్యులకు మంత్రమును ఇచ్చెదరు. అప్పుడే అది పరి పూర్ణము అగును. దాని శక్తి అమోఘము. అర్హత లేని వారికి ఇలా బీజ రహిత మంత్రములను ఇచ్చెదరు. ఇది గురువులు తమ శిష్యులను పరీక్షించి, వారి స్థాయిని బట్టి ఇచ్చెదరు. అందుకే సద్గురువులు కావలెను అని అందురు.

౨ ఉదాహరణకు తీసుకుంటే శ్రీరామరక్షాస్తోత్రానికి సీత శక్తి, హనుమంతుడు కీలకం అంటారు. బీజం చెప్పలేదు. అలాంటప్పుడు బీజమేమిటో ఎలా తెలిసేది? సాధనద్వారా మాత్రమే తెలిసే విషయాలా ఇవి?
 
అంతర్లీనంగా, అంతర్గతముగా రామ బీజము ఇందులో కలదు. ప్రకటితముగా చెప్పబడలేదు. కానీ ప్రాచీన హిందీ, సంస్కృత ప్రతులలో బీజము చెప్పబడివున్నది.
ఇది కూడా మంత్ర రహస్యమును కాపాడ దానికే పెద్దలు, గురువులు ఇలా చేస్తూ వుంటారు. గురు ముఖ:ముగా వచ్చినప్పడు మంత్రముగానీ, స్తోత్రము గానీ పూర్తి స్థాయిలో చెప్పబడుతుంది. లేదంటే అన్యుల చేతికి దొరికినప్పుడు చాలా ప్రమాదము సంభవించును. ఇవన్నీ formula లాంటివి. బ్రహ్మాస్త్రముల formula ఇతరులకు దొరకకూడదు. దాని వలన చాలా అనర్ధములు కలుగును. అందుచేత మన ఋషులు చాలా గుప్తముగా ఉంచినారు మంత్ర శాస్త్రమును.
తారక మంత్రము ఏక బీజాక్షరము. బీజాక్షరములలో ఏకము చాలా శక్తిమంతమైనది. దానిని తట్టుకోవడము చాలా కష్టము. అందు చేత దాని శక్తిని తగ్గించడానికి మరి రెండు మూడు బీజాక్షరములను సంపుటీకారణము చేసి మంత్రమును ఇచ్చెదరు.
రామ మంత్రమునకు బీజము రాం. అదే తారకము, వాల్మీకి, మారుతి జపించినది  ఈ బీజాక్షరమునే. మహా శక్తివంతమైనది ఈ రాం బీజము. అతి గుహ్యమైనది. ఉపదేశము లేకుండా బీజాక్షరములు చేయకూడదు. తట్టుకొనే శక్తి లేకపోతే ప్రమాదము. Mind un balance అవుతుంది. అంతర్లీనంగా శ్రీ రామ రక్షా స్తోత్రములో గలదు. సాధన చేత, ఉపాసన చేత, గురువుల అనుగ్రహము చేత దీనిని దర్శించ వలెను.
 
౩ మంత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ స్తోత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ భేదముందా?
 
 దేనికి దానికి వేరుగా వుంటాయి. మంత్ర మంత్రమునకు ఇవి మారుతూ వుంటాయి. అలాగే స్తోత్రమునకు కూడా. అవి వేరు ఇవి వేరు.

౪ మంత్రాలలో కూడా మంత్రమనీ, మహామంత్రమనీ, మాలామంత్రమనీ ... ఈ భేదాలేమిటి?
 
అన్నింటినీ మంత్రములు అని అందురు. 24 అక్షరముల కంటే ఎక్కువ వున్న మంత్రములను, మరియు మోక్ష మంత్రములను ...మహా మంత్రములు అని అందురు.
మాలా మంత్రము అంటే కొన్ని వాఖ్యములు కోన సాగే మంత్రములను మాలా మంత్రములు అని అందురు. దండలాగా వుంటుంది. దీనికి ఉదాహరణలు నేను తరువాత చెబుతాను. ప్రత్యన్గిరా, చండీ, బగళ మంత్రములకు ఇలా మాలా మంత్రములు గలవు.
 
౫ మీరు చెప్పిన దుర్గాచండీమహామంత్రమంటే దుర్గాసప్తశతి అనా?
 
దుర్గా చండీ సప్తశతి యొక్క మూల మంత్రము చండీ మంత్రము అని అందురు. దీనినే కొంత సంపుటీకరణముతో, బేధముతో మహా చండీ కూడా గలదు.
చండీ మంత్ర ఉపదేశము లేనిదే చండీ సప్తశతి, (దుర్గా సప్తశతి) చేయకూడదు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి యొక్క త్రిశక్తి స్వరూపమే చండీ స్వరూపము.
 
౬ నాదబిందుకళలంటారు. అవేమిటి?
 
ఇది శ్రీవిద్యలో చెప్పబడుతుంది. ఇతరులకు చెప్పకూడదు. గురు ముఖ:త తెల్సుకోవలెను. కొన్ని విషయములను బహిరంగముగా చెప్పకూడదు. చాలా ప్రమాదము. సరిగా అర్ధము చేసుకోలేరు. భావన తప్పు వస్తుంది. ముందు నాదం అర్ధం చేసుకో. అవతల వాటి కళలు గురించి తెలుసుకొనేదవూ. ప్రకృతిని ఆరాధించడం తెలుసుకో. ప్రకృతిని అధ్యయనం చేయి.
 
మంత్ర శాస్త్రములో కొన్ని విషయములను ఎవరకి వారు సాధన ద్వారా తెలుసుకోవలెను. ఇతరులు చెబితే అర్ధము గాదు. మెలుకవులు గురువులు చెప్పుదురు.
దారి గురువులు చూపించేదారు, నడవ వలసినది మనము. మనము వెళ్లి తెలుసుకోవాలి.
 
మీ
శ్రీ భాస్కరానంద నాథ/09-01-2013

 
 

మంత్రము – పంచ భూతములు


మంత్రము –  పంచ భూతములు
ఒక్కో అక్షరములో, ఒక్కో బీజములో మహా విస్పోటనము కలిగించే శక్తి వున్నది. దేనికీ లేనటువంటి శక్తి శబ్దమునకు కలదు. సంగీతముతో రోగములను నయం చేయవచ్చును. మంచి మాటలతో కాలిన గాయములను మాన్పించ వచ్చును. మంత్రముతో ఎండిపోయిన చెట్టును బ్రతికించ వచ్చును. పోబోయే ప్రాణములను నిలబెట్ట వచ్చును. భూత ప్రేతాదులను పారద్రోల వచ్చును. ఒక్కటేల ప్రపంచాన్నే గడ గడ లాడించ వచ్చును. ఒక్కో అక్షరములో ఒక్కో శక్తి దాగి వున్నది. అది తెలుసుకోవడమే మన కర్తవ్యం. సప్త స్వరముల వలే వేద మంత్రములకు స్వరము గలదు. ఆ స్వరముతో తప్పులు లేకుండా మంత్ర ఉపాసన చేయ వలెను. మంత్రము బీజాక్షరములతో కూడినది.  బీజములో ప్రాణ శక్తి దాగి ఉండును. దానిని విస్పోటనం చేయడమే మంత్ర లక్ష్యం. ఆ మంత్రాన్ని పదే పదే స్మరించడంవలన శబ్దంలో నుంచి శక్తి ఉద్భవించును. అరణిని మధింప అగ్ని ఎట్లు జనించునో, అట్లు బీజాక్షరములతో గూడిన మంత్రమును పలు మార్లు జపించుట చేత శక్తి ఉద్భవించును. దేవత సాక్షాత్కారము అగును. మంత్ర సిద్ది కలుగును.

మంత్ర శాస్త్రమును, మంత్రములను గుహ్యముగా వుంచవలెను అని పెద్దలు పదే పదే చెప్పడానికి  కారణం ఎవ్వరికీ చెప్పకూడదని కాదు, ఎవ్వరినీ భయపెట్టాలని కాదు. ఈ శాస్త్రము పడ కూడని వాళ్ళ చేతులలో పడ కూడదు అని. అన్ని వర్ణములు వారు వారి వారి అర్హతను బట్టి, స్థాయిని బట్టి  ఈ శాస్త్రాన్ని, విద్యనూ బడయ వచ్చును. సర్వ జనులకు మంత్ర శాస్త్రము అనుకూలమైనది. జగద్గురువులు ఆది శంకరాచార్యులు పరిష్కరించి ఇచ్చిన తంత్ర, మంత్ర యంత్ర, శాస్త్రమును, వేద సమ్మతమైన  ఆచారమును దక్షిణాచారమని, తద్విరుద్దమైనది వామాచారమని రెండు రకములు.

వామాచారం అనాగరికులకు చెందినది. ఆ పద్దతులు, ఆచారములు మనకు నిషేధించబడినవి. వాటి జోలికి మనము ఎంత మాత్రమూ పోగూడదు. కావున వాటిల్ని మనము ఇక్కడ స్పృశించుట లేదు. వేదానుసారముగా, వేదములలో, పురాణములలో  చెప్పబడిన మంత్రములనే, పద్ధతులనే మనము ఇక్కడ తెలుసుకోనేదము.

పరమ శివుడు జగత్తు నందు గల ప్రాణుల కామ్య సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను. కామేశ్వరి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర, తంత్రము నందు కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును నోసంగబడినది. ఈ శ్రీవిద్యా తంత్రమును, మంత్రములను మునుపు ఎందరో మునులు, ఋషులు ఆచరించినారు. వారిలో అగ్రగణ్యులు విష్ణువు, శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు, పరుశురాముడు ఇలా ఎందరో శ్రీదేవీ ఉపాసకులు గలరు. పంచదశీ మహా మంత్రమునకు సాక్షాత్తు దక్షిణామూర్తి ఋషి, ద్రష్ట.          చండీ మహా మంత్రమునకు శ్రీ మహావిష్ణువు ఋషి, మంత్ర ద్రష్ట. మంత్ర ద్రష్ట అనగా ఆ మంత్రాన్ని దర్శించిన వాడు, మొట్ట మొదటగా ఆ మంత్రాన్ని ఉపాసన చేసి, దర్శించి, ఈ లోకానికి తెచ్చిన వాడు అని అర్ధము.

శ్రీ గౌడపాదాచార్యులు, శ్రీ గోవింద పాదాచార్యులు, శ్రీ విద్యారణ్య మహా స్వాములు, శ్రీ రామకృష్ణ పరమ హంస, శ్రీ గణపతి ముని..... ఇలా ఎందరో మహానుభావులు, జగద్గురువులు, ఋషులు ఆనాటి నుంచి ఈనాటి  వరకు శ్రీవిద్యా తంత్రములను అనుష్టించుచూ శ్రీవిద్యామంత్రములను వ్యాప్తి చేయుచూ వస్తున్న వారు. నేటికీ జగద్గురువులు స్థాపించిన నాలుగు పీఠములలో ఇదే సాంప్రదాయము కొనసాగుతూనే వున్నది. మన కంచి పీఠము లో కూడా జగద్గురువులు శ్రీవిద్యా తంత్రానుసారము శ్రీవిద్యామంత్రములు, శ్రీచక్ర పూజ, శ్రీ చంద్ర మౌళీశ్వర పూజ నిత్యమూ అనాదిగా జరుగుతూనే వున్నది. ఆనాటి నుంచీ ఈ శ్రీవిద్యామంత్రములు, తంత్రములు పీఠముల ద్వారా, పీఠాథిపతుల ద్వారా, గురువుల ద్వారా లోకమునకు అందజేయ బడుతూ శ్రీవిద్యా దీక్షాగా, శ్రీవిద్యోపాసనగా అలరారుచున్నది. 

ఒకసారి మా ఇంట్లో ఒక బిల్వ మొక్క  అతి కష్టం మీద సంపాదించినది బ్రతికినది. ఉన్నట్లుండి అది కొన్ని రోజుల తర్వాత ఎండిపోయినది. నాకు చాలా బాధ వేసినది. ఏమీ పాలు పోక 11రోజులు రుద్రం చదివి ఆ వదిలిన నీళ్ళు ఆ చెట్టు మొదల్లో పోసినాను, విచిత్రం సరిగ్గా 12వ రోజు అది చిగురించినది. ఒక చిన్ని ఆకు వేసినది. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో ఆ చెట్టు బ్రతికినది. ఇప్పటికి అది చాలా పెద్ద చెట్టు అయినది. ఒక చెట్టును బ్రతికించిన వాళ్ళము ఒక మనిషిని బ్రతికించ లేమా? ప్రకృతిని నీవు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. మొక్కే గదా అని దానిని నీవు పీకేస్తే, అది కూడా ఒక రోజు నిన్ను పీకేస్తుంది. పంచ భూతములను మనము గౌరవించాలి, కాపాడాలి, పూజించాలి. పంచ భూతములకు పంచ బీజాక్షరములు గలవు. వాటితో పూజించి స్వాధీనము చేసుకోవచ్చును. పంచ భూతములకు సంకేతములు ఇవి.  పృధ్వీ (ల౦), ఆకాశము(హ౦), వాయు(య౦), అగ్ని(ర౦), జలము(వ౦). వీటినే పంచోపచార పూజలు అని అందురు. పంచ భూతములకు పంచ పూజలు.

ల౦ ... పృధ్వీ    తత్త్వాత్మికాయైనమః  ............ గంధం ...  సమర్పయామి.
హం ... ఆకాశ   తత్త్వాత్మికాయైనమః ..............పుష్పం ... సమర్పయామి.
య౦ ... వాయు తత్త్వాత్మికాయైనమః ............ ధూపం ... సమర్పయామి.
ర౦ ....  వహ్ని  తత్త్వాత్మికాయైనమః .............  దీపం  ... సమర్పయామి.
వ౦ ....  అమృత   తత్త్వాత్మికాయైనమః ........... అమృత నైవేద్యం ... సమర్పయామి.
స౦ ....  సర్వ    తత్త్వాత్మికాయైనమః .............  సర్వోపచార పూజా౦ ... సమర్పయామి.

ల౦... బీజ ఉపాసనతో మూలాధార చక్రములోని కుండలిని ప్రేరేపించ వచ్చును. కుండలిని ఉత్కీలనం జరుగును.            మూలాధారము నందలి గుహ్య రోగము లన్నింటిని దూరం చేయ వచ్చును.
హం ... బీజ ఉపాసనతో  సహస్రారం లోని కపాల భేదనము గావించ వచ్చును. శిరస్సునకు, గొంతునకు సంబంధించిన వ్యాదులన్నీ నయం చేసుకోవచ్చును.
య౦... బీజ ఉపాసనతో ఉపిరి తిత్తుల రోగమును, హృద్రోగమును నయం చేయ వచ్చును. ప్రాణాయామ నియంత్రణ పొందవచ్చును.
ర౦.... బీజ ఉపాసనతో దావాగ్ని రగిలించ వచ్చును, జఠరాగ్ని కలిగించ వచ్చును. జీర్ణకోశ వ్యాధులను నయం చేయవచ్చును.        బ్రహ్మా తేజస్సును, మంచి రంగును, కళను బడయ వచ్చును. మలినమును శుద్ధి చేయవచ్చును.
వ౦.... బీజ ఉపాసనతో శరీరమును అమృత తుల్యం చేసుకోవచ్చును. విష జ్వరములను, విషమును హరించ వచ్చును.               శరీర రుగ్మతలను అన్నింటినీ పారద్రోల వచ్చును. సంతాన సమస్యలను అధిగమించ వచ్చును.
స౦.... బీజ ఉపాసనతో మనస్సును శుద్ధి చేసుకొని, మనో లయం గావించుకో వచ్చను.                                                   పవిత్ర ఆత్మగా మార్చుకొని భగవంతున్ని చేరవచ్చును.
ఈ పంచ బీజ ఉపాసనతో శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకొని పరమాత్ముని నామమును, మంత్రమును జపించ వలెను.    భగవంతుని నామముతో పాప కర్మరాశిని  దగ్ధం చేయవచ్చును.
మంత్ర, తంత్ర యంత్ర శాస్త్రమును నొసంగిన మహా పురుషులకు, గురువులకు, జగద్గురువులకు, జ్ఞానులకు, యోగులకు, మునులకు, ఋషులకు, సమస్త గురు రాజ మండలమునకు, గురు మండల స్వరూపిణికి పాదాభి వందనము చేస్తూ,
సశేషం ...... సర్వం ఉమామహేశ్వరార్పణ మస్తు. అందరూ బాగుండాలి అనే తలంపుతో, మీ

శ్రీ భాస్కరానంద నాథ / 05-01-2013.

 
 
 
 

Wednesday, 2 January 2013

02. మంత్రము – మంత్ర శాస్త్రము

02. మంత్రము – మంత్ర శాస్త్రము

మంత్రము సృష్టికి పునాది కావాలి. వినాశనమునకు కారణము కాగూడదు. మంత్రముతో పుష్పములను పూయిన్చ వచ్చును,మంత్రములతో ప్రాణములను నిలబెట్ట వచ్చును, ప్రాణములను పోయవచ్చును. అవసరమైతే ప్రాణములను తీయవచ్చును. రాళ్ల నుంచి సంగీతము పలికించ వచ్చును. వర్షము కురిపించ వచ్చును. దావాగ్నిని రగిలించ వచ్చును. సభను దిగ్భంధనము చేయ వచ్చును, అగ్నిని మంచుగా చేయ వచ్చును, వాదించేవాడ్ని మూగ వాణ్ణి చేయ వచ్చును, మూగ వాణ్ణి పలికిన్చనూ వచ్చును. క్షితిపతిని భయపెట్ట వచ్చును,  క్రోధిని శాంత పరచ వచ్చును, దుర్జనున్ని సుజనునిగా మార్చ వచ్చును. ఒక్కటేల ప్రపంచాన్నే గడ గడ లాడించ వచ్చును.  మంత్రములతో మనకు మనమే  మేలు చేసుకోవచ్చును, ఇతరులకు కీడు తలపెట్ట వచ్చును. మంత్రములతో సృష్టి చేయ వచ్చును, సృష్టి వినాశనము చేయవచ్చును. మంత్రము ఒక బ్రహ్మాస్త్రము. ఒక ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబు. మంత్రము ఒక అమృతము, ఒక కామధేనువు. కాళ్ళు లేనివారికి, కళ్ళు లేని వారికీ మంత్రముతో నయం చేయవచ్చు. మంత్రముతో మనశ్శాంతి పొందవచ్చును, మనశ్శాంతి లేకుండా చేయ వచ్చును.దుష్టులను, దుర్మార్గులను, శత్రువులను అంతమొందించ వచ్చును. మంత్రములతో కావలసిన వారిని సమ్మొహ పరిచి వశీకరణం చేసుకోవచ్చును. అవసరము లేని వారిని విద్వేషణ మంత్రములతో విడ గొట్టనూ వచ్చును. మంత్రములతో జ్ఞానమును, మోక్షమును పొందవచ్చును.మంత్రములతో ఒకడ్ని పిచ్చి వాడ్ని చేయవచ్చును. ఒక కుటుంబాన్ని నిలబెట్ట వచ్చును, ఒక సంసారమును కూలద్రోయవచ్చును. మంత్రముతో మేలు చేయ వచ్చును, కీడు తల పెట్ట వచ్చును. మంత్రము ఒక కత్తి లాంటిది, మామిడి పండు కోసుకోవచ్చును, లేదా ఒకరి పీక కూడా కోయవచ్చును.

ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. శ్రద్ధతో చేస్తే అన్ని మంత్రములును ఫలించును, అన్ని ఆటంకములను తొలగించు కోవచ్చును.

వేదము, ఆమ్నాయములు, తంత్రములు, మనకు రెండూ ఇచ్చినవి. దానితో బాటు బుద్దిని కూడా ఆ పరమ శివుడు ఇచ్చినాడు. ఏది మంచిదో మనల్నే తెలుసుకొని ఆచరించమని చెప్పినాడు.చెడిపోవాలో, బాగు పడాలో నిర్ణయము తీసుకొనే అధికారమును మనకే వదలి వేసినాడు.

సృష్టి చేయలేనప్పుడు సృష్టి వినాశనము చేయుటకు అర్హత లేదు మనకు. ఒకరికి ప్రాణములను పోయలేనప్పుడు, ఒకరి ప్రాణములు తీసే అర్హత లేదు. ఒకర్ని బ్రతికించలేనప్పుడు, ఒకర్ని చంపే అధికారము కూడా లేదు. భగవంతుడు చేసిన సృష్టికి, దాని వినాశనమునకు మనము కారణము అయినామా! ఆ పరమ శివుడు వీరభద్రుడు అవుతాడు. ఆ మహాకాళి భద్రకాళి అయి నిన్ను నీ కుటుంబాన్ని సర్వ నాశనము చేస్తుంది. దీనికి మనకు ఎన్నో తార్కాణములు పురాణములలో కనిపిస్తాయి. ఎందఱో రాక్షసులు ఈ విధముగానే దెబ్బతిన్నారు. అందరూ ఆ పరమాత్ముని బిడ్డలే అని మనము ఓర్పుతో, సహనముతో సర్దుకొని పోవాలి. ఎవడి ఖర్మ వాడు అనుభవిస్తాడులే అని ఆ పర్మాత్మునికే వదలి వేయాలి. నీ కోపము ఇంకొకడికి ఖేదము కాకూడదు. ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చిననూ మంత్రములతో ఇతరులకు కీడు తల పెట్టకూడదు. ప్రాణ హాని తలపెట్టగూడదు. ప్రేమను పంచు, త్యాగము చేయి. పెద్దలు చెప్పిన మాటలను, ధర్మమును పట్టుకొని వేద సమ్మతముగా మన నిత్య కర్మలను చేస్తాము.

మంత్ర శాస్త్రమును మానవాళి అభ్యున్నతి కొరకు వాడుకొందాము. పదిమందికి మంచి చేయడానికి వాడుకొందాము. మనము బ్రతుకుతూ మనతో బాటు సమస్త సృష్టిని బ్రతికిస్తాము. బ్రతుకు బ్రతికించు అన్న నినాదము ద్వారా మన కోప తాపములను, స్వార్ధమును బాగుగా నియిన్త్రించుకొని మంత్ర శాస్త్రమును మానవాళి మనుగడకు ఉపయోగిస్తాము. మంత్ర శాస్త్రముతో పది మందికి మేలు చేస్తాము అని ప్రతిన బూని, కంకణం కట్టుకొంటాము. స్వార్ద ప్రయోజనములకు ఇది ఎంత మాత్రము తగదు, వలదు. మనకు, మన కుటుంబ మేలుకొరకు దీనిని వాడు కొందాము. ప్రకృతి మాత ఆగ్రహానికి గురి కాకుండా ప్రకృతిని పుష్పింప చేస్తాము. మన జీవితములలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి దీనిని ఉపయోగిస్తాము. మన కోర్కెలను న్యాయ బద్దముగా, ధర్మ బద్ధముగా నెరవేర్చుకోవడానికి ఆ పరమ శివుడు నొసంగిన ఈ మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రమును పెద్దలు నిర్దేశించిన మార్గములో ఉన్నతిని పొందుటకు, బాగుగా ఉపయోగించు కొంటాము, తద్వారా మన జన్మను సార్ధకత చేసుకొంటాము.

పిల్లల చదువుకో, ఆరోగ్యమునకో, ధర్మ బద్దమైన ధనమునకో, పెళ్ళికో, సంతానము కొరకో, ఉద్యోగము కోసమో, అభివృద్ధికో, జాతకము లోని దోషములను నివారించుటకో, పెద్దల ఆరోగ్యము కోసమో, విద్య కోసమో, జ్ఞానము కోసమో, మోక్షము కోసమో, ఉన్నతమైన బ్రతుకు కోసమో, ఉన్నతమైన జన్మ కోసమో ఇలా కామ్య మైన కోరికలను తీర్చుకోవడానికి కొరకు మంత్ర శాస్త్రమును ఉపయోగించు కొంటాము. దీనిలో ఎలాంటి తప్పు లేదు. అందుకోసమే ఈ శాస్త్రము వచ్చినది.

మంత్ర శాస్త్రమును గురువు ద్వారానే నేర్చుకోవలెను. గురు ముఖతః ఈ విద్యను స్వీకరించ వలెను. మంత్రములు పుస్తకములో వున్నవి గదా అని ఆచరించ కూడదు. ఉపాసన చేయకూడదు.దానివలన చాలా అనర్ధములు జరుగును. మీకు వచ్చిన కష్టమును గురువులతో చెప్పుకొంటే,వారు అలోచించి తగిన మంత్రమును, మార్గమును తెలుపుదురు. గురువు ఆజ్ఞ లేనిదే ఏ మంత్రమును ఉపాసన చేయకూడదు. మంత్రములకు మహా శక్తి గలదు. తప్పు జరిగినదా చివరికి ఎవ్వరూ మిగులరు. మంత్రములను మోక్ష సాధన కొరకే ఉపయోగించ వలెను. విద్వంసమునకు వాడకూడదు. గృహస్థాశ్రమ ధర్మములలో వచ్చే ఓడుదుడులకు మాత్రమె దీనిని ఉపయోగించు కొనవలెను. మంత్ర, తంత్రములు ఆత్మ శ్రేయస్సుకు, పరోపకారానికీ, దు:ఖ నివృత్తికి ఉపయోగించాలి గానీ, మారణ కాండలకు ఇది ఉపయోగించరాదు. దుష్కర్మలకు, పగ ప్రతీకారములకు వినియోగించిన దాని ఫలితం కూడా కర్మ రూపేణా సంక్రమిస్తుంది. అది కూడా అనుభవించక తప్పదు ఏనాటికైనా. ఐహిక శ్రేయస్సుకు సత్కర్మ, జప సాధనలే రాజ మార్గములు. అదే ఉత్తమోత్తము.

మంత్రము, తంత్రము, యంత్రము ఈ మూడింటిని త్రిపుటి అని అందురు. దైవం మంత్రాధీనం, మంత్రం యంత్రాథిష్టితం. ఆ యంత్రం తంత్ర సమ్మిత౦. ఈ మూడూ మార్గాలు కలిసి నడిచే ప్రస్తానమే ఆచార కాండ. మంత్రం దర్శన మూలం, బీజాక్షర సంయుతం. బీజాక్షరం దైవ ప్రాణం. మనకు ఎందరు దేవతలు వున్నారో అన్ని మంత్రములు వున్నవి. ఎన్ని సిద్దులు ఉన్నాయో అన్ని మంత్రములు గలవు. మనకు ఎన్ని కోరికలు వున్నాయో వాటిని పొందడానికి కూడా అన్నే మంత్రములు గలవు. మంత్ర మూల మిదం జగత్ అని అన్నారు పెద్దలు.మంత్రం వలన దైవదర్శనం, యంత్రం వలన దైవ శక్తి, తంత్రం వలన దైవ సాన్నిద్యం కలుగుతాయి. మంత్ర, యంత్ర, తంత్రాలు భౌతిక భాధలను, ఈతి భాధలను తొలిగించటానికి మరియు కలిగించటానికీ ఉపయోగ పడుతాయి. సాధించటం తెలియక పోతే ఆచించిన ఫలితాలు అందక పోవచ్చును. అందుకే మంత్ర శాస్త్రమునకు రెండు వైపులా పదునైన కత్తులు గలవు అని పెద్దలంటారు. వినియోగంలో చాలా మెలుకవలు ప్రదర్శించాలి. వేద సమ్మతమైన మార్గముల ద్వారా మనము అన్ని ఇబ్బందులను అధిగమించి ఈ మంత్ర శాస్త్రముతో భుక్తిని, ముక్తిని పొందవచ్చును. భోగమునకు,మోక్షమునకు కారణభూతమైనదీ మంత్ర శాస్త్రము.

పంచాక్షరీ మంత్రమును ఒక నిముషమునకు వంద సార్లు జపము చేయవచ్చును. ఒక గంటకు ఆరు వేలు అగును. 84 గంటలు జపము చేసినచో 5 లక్షల 4 వేలు జపమగును. ఈ విధముగా ఒక సంవత్సరము సాధన చేసినచో, వాక్ సిద్ది కలుగును. వశీకరణ, ఆకర్షణ శక్తులు కలుగును.సంచిత పాప కర్మ అంతయూ దగ్ద మగును.

కాలం ఎంతో విలువైనది,వృద్ధా చేయకండి, మీ శక్తి సామర్ధ్యముల ననుసరించి ఏ మంత్రమో, నామముతోనో సాధన ప్రారంభించి ముక్తికి చేరువ అవుతాము అందరము.

ఉపాసన ఎలా చేయాలి? మంత్ర శాస్త్రములోని రకములు, మంత్రాక్షరముల శక్తి ... ఇవన్నీ మరో టపాలో తెలుసుకొంటాము..... సశేషం ...... సర్వం ఉమామాహేశ్వరార్పణ మస్తు.

అందరూ బాగుండాలి అనే తలంపుతో,

మీ

శ్రీ భాస్కరానంద నాథ / 02-01-2013.

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యా పూర్ణ దీక్షాపరులు.



 
 

ఆహ్వానము

అందరికీ నమస్కారములు.

ఆహ్వానము

సనాతన ధర్మమును నమ్మి,విశ్వసించి, ఆచరించే వాళ్ళు, పునర్జన్మ సిద్ధాంతమును నమ్మేవాళ్ళు, దేవుడు వున్నాడు అని నమ్మే వాళ్ళు, బొట్టు పెట్టుకొనే వాళ్ళు, వేదమును మన పురాణములను గాఢంగా నమ్మేవాళ్ళు, ఆది శంకరులు శ్రీ శంకర భగవత్పాదుల సిద్దాంతమును నమ్మేవారు, అద్వైత సిద్దాంతమును నమ్మి ఆచరించే వారు, పెద్దలను, గురువులను గౌరవించే వారు, మన హైందవ సంస్కృతికి గౌరవము ఇచ్చి, ఆచరించే వాళ్ళు, మన మాతృ భాష తెలుగును గౌరవించే వాళ్ళు, శంకర భగవత్పాదులు స్థాపించిన షణ్మతాచారము మీద నమ్మకము వుంచి, పంచాయతనమును నమ్మి కొలిచే వాళ్ళు, దేవుడి మీద నమ్మకము వున్న వాళ్ళు, మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రముల మీద నమ్మకము వున్న వాళ్ళు, వేద, శ్రుతి, స్మృతి  పురాణ వాంగ్మయమును భక్తితో నమ్మి కొలిచే వాళ్ళు, ధర్మాచరణ కలిగిన వాళ్ళు, హైందవ సంస్కృతికి అద్దం పట్టే వాళ్ళు, ఆది దంపతులను, శ్రీ సీతారాములను, శ్రీలక్ష్మీ నారాయణులను, శ్రీ వేంకటేశ్వరులను, ఇలవేల్పులుగా, ఇష్ట దైవముగా కొలిచే వాళ్ళు, సత్యమును,ధర్మమును నమ్మి ఆచరించే వాళ్ళు, ఆచారకాండ,జ్ఞానకాండ యందు నమ్మకము, భక్తీ, ఆసక్తి వున్న వాళ్ళు, శివ కేశవులకు అభేదము అని భావించే వాళ్ళు, వాళ్ళు ఎవరైనా ఈ BLOG కు ఆహ్వానితులే. పై వారు నిర్బయముగా సభ్యులుగా ఈ BLOG లో చేర వచ్చును.

నా పై గౌరవ భావము వున్న వాళ్ళు, మీకు ఇష్టమైతే, మీ Google + account లో నన్ను(భాస్కరానంద నాథ) చేర్చుకొని, ఈ మెయిల్ ID కి bhaskaranandanatha@gmail.com మీ సమ్మతిని తెలుపవలసినదిగా కోరడమైనది.

హైందవ సంస్కృతికి, సనాతన ధర్మమునకు, అద్దం పట్టే విషయములు, దైవిక సంబంధమైన, పూజ, అనుష్టానము, ఆచార వ్యవహారములు, కర్మకాండ, మంత్రానుష్టానములు, తపస్సు, యజ్ఞము, యోగము, ధ్యానము,సమాధి, ... గృహస్థాశ్రమ ధర్మములు, వైవాహిక ధర్మములు,మొదలగు విషయములను గురించి చర్చిస్తూ, ఒకరికి తెలిసిన విషయములను మరొకరికి తెలుపు కొంటూ, ఆ పరమాత్మను, పరదేవతను చేరుకోవడమే ఈ BLOG యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. http://vanadurga-mahavidya.blogspot.in/

విద్య గంగ లాంటిది, అది ఎప్పుడూ ప్రవహిస్తూనే వుండాలి. మనము మారుతూ, నలుగురిని మార్చడానికి ప్రయత్నము చేస్తాము, మన సంస్కృతిని కాపాడు కొందాము. ఆ పరదేవత కటాక్షముతో, మా గురు దేవుళ్ళ అనుగ్రహముతో నాకు తెలిసిన ఈ విద్యనూ మీ అందరికీ తెలుపాలి అనే కోరికతో చేస్తున్న చిన్న ప్రయత్నము ఇది. అంతేగాని పేరు కోసమో, గొప్ప కోసమో, గుర్తింపు కోసమో, ధనము కోసమో కాదని మనవి. నాకు అన్నీ వున్నాయి. అన్నీ ఆ మహా త్రిపుర సుందరి ఇచ్చినది. ఆ తల్లి దయవలన ఇప్పటి వరకూ ఎ లోటూ లేదు. అన్నీ ఉండాల్సిన దానికన్నా ఎక్కువే వున్నాయి. ఆ మహా తల్లి యొక్క గుర్తింపు పొందాలి గానీ ఇతరుల గుర్తింపు కాదు గదా?

రండి .....చేతులు కలపండి. మన పిల్లలను ధర్మ మార్గములోనికి నడిపిస్తాము. మా శ్రీ గురువుల ఆదేశానుసారం శ్రీవిద్యను వ్యాప్తి చేయాలి. అదే నా కోరిక.

మీ

శ్రీ భాస్కరానంద నాథ (కామరాజుగడ్డ రామచంద్రరావు)

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యా పూర్ణ దీక్షాపరులు.

http://vanadurga-mahavidya.blogspot.in/

http://srilalithaparabhattarika.blogspot.in/

 

bhaskaranandanatha@gmail.com,

krrao1960@gmail.com