Thursday, 11 September 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 33

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ 33

స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిద మాదౌ తవ మనోః
నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః |
భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః || 33 ||

ఓ నిత్యస్వరూపిణి! నీ మంత్రానికి ముందు కామరాజ బీజం, భువనేశ్వరీ బీజం, లక్ష్మీబీజం కలిపి నిరవధిక మహాభోగరసికులు సకల సిరులను వాంఛిస్తూ చింతామనులనే రత్నాలతో కూర్పబడిన అక్షమాలలను చేతుల్లో ధరించి, కామధేనువు యొక్క నేతి ధారలతో శివాగ్నిలో అనేక ఆహుతులర్పిస్తూ, హోమం చేస్తూ, నిన్ను సేవిస్తూన్నారు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు కామరాజ విద్యను  గురించి మనకు తెలియజేస్తున్నారు. మహా శక్తి వంతమైన మంత్రమును గురించి చెప్పు చున్నారు. బీజాక్షరములు గురువుల ద్వారా ఉపదేశము పొందవలెను. పరమాత్మతో ఆత్మ ఎలా అనుసంధానం కావలి అనే రహస్య యోగమును ఇక్కడ చెప్పుచున్నారు. ఈ యోగ ప్రక్రియను గురువుల ద్వారా పొందవలెను.

నీ పంచదశీ మంత్రానికి ముందు కామరాజ బీజం, భువనేశ్వరీ బీజం, లక్ష్మీబీజం కలిపి ఎవరు నిరవధికముగా జపిస్తారో వారు మహా భోగ రసికులు.
ఎవరు మహా భోగ రసికులు?
ఎడతెరగని, పరిమితి లేని అఖండమైన నిత్యమైన ఆనందానుభావము, నిరతిశయానందము పొందుతున్న పరమ యోగీశ్వరులు వారు మహా భోగ రసికులు.  అంతేగాని శరీర సంబంధము గలవారు కారు. అనుభవించునది భోగము అన్నారు. ఏమి అనుభవించుట? శరీరముతో అనుభవించునవి కావు. ఎందుకంటే శరీరము శాశ్వతము కాదు కాబట్టి ఆ సుఖములు తాత్కాలికములు. ఆత్మతో రమించునది అంటే ఆత్మ పరమాత్మతో రమించునది మహా భోగము అని అన్నారు. ఊర్ధ్వ ముఖమున అంటే సహస్రారమునందు కదలిక, చలనము ఏర్పడితే యోగము అన్నారు, అధో ముఖమున క్రింద భాగమున చలనము ఏర్పడితే భోగము అన్నారు. దీనినే మరో విధముగా ఊర్ధ్వ ముఖ స్కలనము, అధో ముఖ స్కలనము అంటారు. యోగులు భోగము లో కూడా యోగమునే చూతురు. జ్ఞానులైన యోగులు ప్రాపంచిక విషయముల కంటే కుండలినీ సాధన (యోగము) యందు,  ఊర్ధ్వ ముఖ చలనము నందు మిక్కిలి ఆశక్తిగా యుందురు.
భోగము అంటే అధిక సుఖము, అధిక ధనము  అనుభవించు  దానిని భోగము అందురు. మరి ఏది అధిక సుఖము? ఏది అధిక ధనము?
నిరంతర సుఖము, నిరంతర ధనము ను అంటే తరగని ధన,సుఖములను మహా భోగములు అని సమన్వయం చేసుకో వచ్చును.
అష్ట భోగములు అంటే గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము.
వీటిల్లో గృహము, శయ్య, వస్త్రము అనేవి శరీరాన్ని సూచిస్తే, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము మనస్సును సూచిస్తాయి. అంటే శరీరముతో అనుభవించేవి కొన్ని, మనస్సుతో అనుభవించేవి కొన్ని. చివరికి అన్నీ మనసుతోనే అనుభవిస్తాము. ప్రతి భోగాన్ని మనస్సు అనుభవిస్తుంది.  ఆ మనసుతో అనుభవించేవి శాశ్వతము అయితే అది యోగము, లేక పోతే భోగము. భోగము రోగాన్ని తెచ్చి పెడుతుంది. యోగము నిరతిశయానందమును తెచ్చి పెడుతుంది. భోగము వలన శరీరము అలసి పోతుంది. యోగము వలన ఆత్మ బలాన్ని, శక్తిని పొందుతుంది.
కాబట్టి నిరతిశయానందమును, బ్రహ్మానందమును  అనుభవించు వారిని మహాభోగ రసికులు అని అందురు.
దానిని సాధించుటకు మంత్రముతో అను సంధానము కావాలి, రమించాలి.  

శివాగ్ని అంటే శివా అంటే శక్తి అంటే త్రికోణము, దానియందు సంస్కరింప బడిన అగ్ని. త్రికోణ బైన్ధవ స్థానమున స్వాదిష్టాన అగ్ని ని తెచ్చి పై మంత్ర బీజాక్షరముల తో రగల్చ వలెను. కామరాజ కూటము అయిన ఈ మహామంత్రము మహాభోగ సాధనము. దీనినే అంతర్యాగము అని కూడా అందురు.
శ్లో|| మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |
      మహాబుద్ధి ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ ||......
 అని బ్రహ్మాండ పురాణము లోని లలితా సహస్ర నామం యందు చెప్పబడి వున్నది.
ఇది మంత్ర శాస్త్రము నకు, యోగ ప్రక్రియకు  సంబంధించినది. మహాయాగానుసారము చేయు యోగులకు ఈ అభ్యాసము గురించి బాగుగా తెలుయును. ఇంత కంటే వ్యాఖ్యానము చేయుట తగదు ఇచ్చట.
ఈ శ్లోకము లోని ముఖ్య విషయములు ౧. మహా భోగ రసికులు, ౨. శివాగ్ని. వీటి గురించి పరిశీలించి, పరిశోధన చేయండి. రహస్యం దొరుకుతుంది.
ఈ పరిజ్ఞానమును ప్రసాదించిన ఆ మహా తల్లి పాద పద్మములకు నమస్కరిస్తూ,

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/11-09-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/


Sunday, 17 August 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 32

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 32

శివః శక్తిః కామః క్షితిరథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః |
అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||

ఓ జననీ! శివుడు, శక్తి, కాముడు, క్షితి; రవి, శీతకిరణుడు, స్మరుడు, హంసుడు, శుక్రుడు; పరా (శక్తి), మన్మథుడు, హరి అనే వారి సంకేతాలైన వర్ణాలు, ముడు హృల్లేఖలు, చివరలో చేరగా ఆ వర్ణాలు ఓ మాతా! నీ నామరూపమవుతున్నాయి.  నీ మంత్ర మవుతున్నాయి. ఇదే పంచదశీ మంత్రం లేక పంచదశాక్షరీ మంత్ర మవుతోందని తెలియనగుము.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు పంచదశీ మహా మంత్రమును గురించి మనకు తెలియజేస్తున్నారు.


వర్ణమాల లోని అక్షరములు అన్నీ మంత్రములే. అన్నీ బీజాక్షరములే. ఒక్కో అక్షరానికి ఒక్కో శబ్దము. ఒక్కో శబ్దానికి ఒక్కో శక్తి. కాబట్టి శబ్దానికి, ధ్వనికి దివ్యమైన శక్తి వున్నది. ఆ శబ్దాన్ని పదే పదే మననం చేయడం మంత్రం. ఆ మంత్రాన్ని పదే పదే స్మరించడమే ఉపాసన.  భగవంతుడికి దగ్గరగా వుండటమే ఉపాసన. అంటే ప్రతి క్షణము గాలి పీల్చినప్పుడు, వదలి నప్పుడు కూడా పలుకడం. సందు లేకుండగా ధారగా పలుకడం. కన్ను మూసినా రామ, కన్ను తెరచినా రామ అని అనడం ఉపాసన.

అరణిని మధింప అగ్ని ఎట్లు జనించునో, అట్లు బీజాక్షరములతో గూడిన మంత్రమును పలుమార్లు జపించుట చేత శక్తి ఉద్బవిస్తుంది, ఆ మంత్ర దేవత సాక్షాత్కారము కలుగుతుంది. అది ఉపాసన.

శ్రీవిద్యలో మంత్ర రాజము అని చెప్పబడేది పంచదశీ మహా మంత్రము. దీనిలో ఏ దేవతా పేరు వుండదు.
కేవలం బీజాక్షరములే వుంటాయి. అలాగే శ్రీచక్రము లో ఏ దేవత పేరు గాని, మంత్రము గాని వుండదు.
కేవలము రేఖా నిర్మితమైనది. పరాశక్తికి మంత్ర రూపము పంచదశి అయితే యంత్ర రూపము శ్రీచక్రము.
పంచదశీ మహా మంత్రము మాయను పోగొట్టి పర బ్రహ్మమును ప్రకాశింప జేయును. పూర్వ కాలములో ఈ పంచదశి మహా మంత్రమును విష్ణువు, శివుడు, బ్రహ్మ, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమార స్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బల రాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు
మొదలగు వారు ఉపాసించిదేవీ ఉపాసకులు అయినారు. ఈ మంత్రమును దర్శించి ఈ లోకమునకు తెచ్చినవాడు మన్మధుడు. ఈ మంత్రమునకు మూల పురుషుడు ఋషి .. దక్షిణామూర్తి.
పంచదశి మహా మంత్రము మూడు భాగములుగా వుంటుంది. ఇది పదిహేను బీజాక్షరములు గల మహా మంత్రము. ఈ మంత్రమునకు అధిదేవత లలితా త్రిపుర సుందరి.
మొదటది ప్రధమ ఖండము. దీనిని వాగ్భవ కూటము అని అందురు. రెండవది కామరాజ ఖండము,
మూడవది శక్తి ఖండము, ప్రతి ఖండము తరువాత ప్రాణ శక్తి అయిన హ్రీం కార బీజము వుంటుంది.
మూడు హ్రీం కారములను  వరుసగా బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అని అందురు.
మొదటి ఖండము ఋగ్వేదాత్మకము అని, రెండవ ఖండము యజుర్వేదాత్మకము అని, మూడవ దాన్ని సామ వేదాత్మకము అని అందురు.
అజ్ఞానము పోగొట్టి, బుద్ధిని వికసింప జేసి, బ్రహ్మ జ్ఞానమును కలుగ జేసే మహా మంత్రము ఇది.
గాయత్రి మంత్రము బ్రాహ్మణుల కోసం ఏర్పడగా పంచదశీ మహా మంత్రము అన్ని వర్ణముల వారి కోసం ఏర్పడినది పెద్దలు అంటారు. గాయత్రీ మంత్రమునకు పంచదశీ మహా మంత్రమునకు భేదము లేదు. రెండింటి సారాంశము ఒక్కటే. గాయత్రీ మంత్రము యొక్క అర్ధము పంచదశీ మహా మంత్రము లోని ప్రతి కూటమిలోనూ చెప్ప బడినది. అందుచేత పంచదశీ మహా మంత్రమును ఒక సారి జపిస్తే గాయత్రి మంత్రాన్ని మూడు సార్లు చేసిన ఫలితం వస్తుంది. పంచదశీ మహా మంత్రమును గాయత్రీ మంత్రముతో సంపుటీకరణం చేసి జపం చేస్తే కోటి రెట్లు ఫలమని చెప్పబడినది. పరదేవత యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసే మహామంత్రము పంచదశీ. అందుకే ఇది మోక్ష విద్యగా చెప్పబడినది.
ఈ మహా మంత్రము వాగ్భవ, కామరాజ, శక్తి కూటములుగా, మూడు కూటములుగా విభజించ బడినది. మొదటిది జ్ఞానాత్మకము, రెండవది కామ్య సిద్ధి, మూడవది మోక్ష ప్రదము. ఈ మంత్ర జపం చేస్తే సాధకుడికి జరగని పని అంటూ లేదు. కైవల్య ప్రాప్తి కూడా జరుగుతుంది అని శాస్త్ర వచనము. ఈ విద్య లోకములో 12 విద్యలుగా ప్రసిద్ధికెక్కి ఉపాసింప బడినది.
౧. మనువిద్యా, చంద్రవిద్యా, కుబేర విద్యా, లోపాముద్ర విద్యా, మన్మధ విద్యా, అగస్త్య విద్యా, నందికేశ్వర విద్యా, సూర్య విద్యా, ఇంద్ర విద్యా, విష్ణు విద్యా, శంకర విద్యా, దుర్వాస విద్యా.

ఈ మహా మంత్రమే బాల మంత్రముతో సంపుటీకరణం చేసి సౌభాగ్య విద్య గా ఇచ్చెదరు. గోపాల మంత్రముతో కలిపితే గోపాల సుందరీ మంత్రము అవుతుంది. గణపతి మంత్రముతో కలిపి విద్యాగణపతి, రామ మంత్రముతో కలిపి శ్రీవిద్యారామము గా ఇచ్చెదరు. శ్రీవిద్యారామంగా ఈ మహా మంత్రమును, శ్రీరామ పంచాయతనమును  ఉపాసించే వాళ్ళు ఎంతో మంది లోకంలో కలరు. వారి భక్తి అనన్య సామాన్యమైనది.  ఇలా పలు విధములుగా సంపుటీకరణం చేసి పంచదశీ మహా మంత్రమును ఉపాసించడం శిష్టాచారముగా కలదు.
ఈ మంత్రము ఉపదేశము లేని వాళ్ళు ఈ శ్లోకమును గాని, లేక లలితా త్రిశతిని గాని చదువ వచ్చును.
శ్రీ భాస్కరరాయల చే విరచితమైన “వరివస్యా రహస్యము” నందు ఆ జగన్మాతను ఉపాసించే మంత్రార్ధముల యొక్క రహస్యము, పంచదశీ మహా మంత్రము యొక్క వివరణ, ఉపాసనా రహస్యములను స్పష్టముగా చెప్పబడినవి.

సర్వ మంత్ర స్వరూపిణియైన శ్రీమాతను తొలుత ఏ భక్తుడు లలితా సహస్ర నామము తో భక్తితో గోలుచునో, అతనికి అచిరకాలంలోనే దేవి తానే గురు రూపిణియై భక్తుని కడకు వచ్చి మంత్రోపదేశము చేసిపోవును.(రుద్రయామళం).
శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పాద శిష్యులైన శ్రీ శంకర భగత్పాదులు విరచించిన పంచదశీ వ్యాఖ్యయైన “బ్రహ్మ విద్యా విలాసము” లో పంచ దశీ మహా మంత్ర వివరణ చెప్పబడినది. 

శ్రీ పుణ్యానంద మునీంద్ర విరచిత “కామకలావిలాసము” అను అద్వైత సిద్దాంత గ్రంధము నందు శ్రీవిద్యా పంచదశీ గురించి ఎంతో అత్భుతముగా వివరించ బడియున్నది.

ఉపాసన అనునది ఒక వ్యక్తిని లౌకిక ప్రపంచము నుండి పారలౌకిక భూమికలకు తీసుకొనిపోవు ఒక చక్కని మార్గము. ఈ మార్గము ఒక సద్గురువు మాత్రమే చూప గలరు. ఒక వ్యక్తికి సద్గురువు లభించుట, సరి అయిన ఉపాసన అందుకొనుట అనేది వారి వారి పూర్వ జన్మ సుకృతము. ఉపాసన యందు గురు భక్తి చాలా ముఖ్యము అని పెద్దలు చెబుతూ వుంటారు.

బ్రహ్మ తత్త్వము కంటికి కనబడనిది. దానికి భౌతిక ఆకారము లేనిది. ఆ పర బ్రహ్మము స్త్రీ కాదు, పురుషుడు కాదు. అట్టి బ్రహ్మ తత్త్వమును మాతృ రూపముగా ధ్యానించి కొలుచుటయే శ్రీవిద్య అని అందురు.
శ్రీవిద్యను గురించి తెలుసుకోవాలంటే శ్రీవిద్యోపాసకులు, వేదవేదాంగ పారంగతుడు, సకల విద్యా ప్రవీణుడు, అనేక మంత్ర, తంత్ర గ్రంధకర్త అయిన  శ్రీ భాస్కరరాయలు రచించిన సేతుబంధము, వరివస్యా రహస్యము, సౌభాగ్య భాస్కరము.  శ్రీవిద్యా రత్నాకరము,యోగినీ హృదయము, డా|| పినపాటి వీరభద్ర మహాదేవ రచించిన శ్రీ విద్యా నిత్యాహ్నికము, శ్రీ పుణ్యానంద మునీంద్ర విరచితమైన “కామకలా విలాసము” పరిశీలించ వలయును.
శ్లో|| తత్తద్వర్ణార్ధేయం తత్తద్వర్ణ స్వరూపేయమ్
      ఇతి తు శ్రీవిద్యయా నామార్ధః శబ్ద రూపార్ధః  (వరివస్యా రహస్యం)
శ్రీవిద్య మంత్రములోని ప్రతి అక్షరము ఆమె స్వరూపము. ప్రతి అక్షరము ఆమెనే నిర్దేశించును. ఆమెయే ప్రతి అక్షర స్వరూపము. మంత్రాక్షరము దాని శబ్దము, రూపము దాని అర్ధము, దాని శక్తి అన్నీ ఆమెయే. ఇదియే శ్రీవిద్య యొక్క నామార్ధ శబ్దార్ధ రూపార్ధము.

స్వగురువుకు, దేవికి, శ్రీచక్రమునకు, శ్రివిద్యకు అభేదము అని వరివస్యా రహస్యము చెప్పుచున్నది.
శ్లో||   ఏ తత్రియా భిన్నం స్వగురుస్త దభేద భావనా దార్ధ్యాత్ |
        తేన గణేశాది మయస్తద్దయ యాచస్వయం తధారూపః ||

శృతి ||
“పరోక్షంచా పరోక్షేతి విద్యా ద్వేథా విచారజా,
 తత్రా పరోక్ష విద్యాప్తౌ విచారోzయం సమాప్యత”....ఇతి
విచారణవలన పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము కలుగు చున్నది. అందు అపరోక్ష జ్ఞానము సిద్ధించుటయే ఈ విచారణకు సమాప్తి అని ఈ శృతి వాక్యము. ఆ జ్ఞాన ద్వయము మహావాక్యాధీనముగా నున్నది. ఆ మహా వాక్య ప్రాప్తి అనేక జన్మ పుణ్యపుంజ పరిపాకము చే ఈశ్వరానుగ్రహము వలన పుణ్య పురుషులకు శ్రీవిద్యా పూర్ణ దీక్ష లభించు చున్నది. అందు అంతర్భూతమయిన మహావాక్య ప్రాప్తి కలుగు చున్నది. వీరలకు ఉపనయన సంస్కారము చేతను, గాయత్రీ ప్రాప్తి వలనను ద్విజత్వ సిద్ధి కలుగును. శ్రీవిద్యా పూర్ణదీక్షాంత యోగ్యత వలన తృతీయ జన్మ సిద్దించును అని, ఇదియే వీరికి చరమ జన్మ అనియు తెలియనగును.

ఈ మహావాక్య ప్రాప్తి రెండు విధములుగా జరుగు చున్నది. ఒకటి శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందును, రెండవది తురీయాశ్రమము నందును లభించు చున్నది.  ఈ విచారణకు శిఖి (బ్రహ్మచారి, గృహస్తులు), ముండీ (సన్న్యాసులు), జటీ (వానప్రస్థులు), ఈ నాలుగు ఆశ్రమములు వారును (బ్రాహ్మణులు) అధికారులు.
కావున మహా వాక్య ప్రాప్తి నొందిన శ్రీవిద్యా పూర్ణ దీక్షాపరులు కాషాయ వస్త్రము ధరించిన సన్న్యాసలుతో సమానమని శాస్త్రము చెప్పు చున్నది. (శ్రీ కామకలా విలాసము). అందుచే శ్రీవిద్యా పూర్ణ దీక్షాపరులు సాక్షాత్తు దేవీ స్వరూపులుగా శిష్టాచారులచే గౌరవించబడుచున్నారు. శ్రీవిద్యోపాసకులకు శ్రీదేవికి అభేదము.
అందుచేత పాదుకాంత శ్రీవిద్యా పూర్ణదీక్షాపరులు  వారి గురువులకు తప్పించి మరొకరికి నమస్కారములు చేయకూడదు.
శ్లో || సాక్షాద్విద్వై వేషా న తతో భిన్నా జగన్మాతా |
       అస్యాః స్వాభిన్నత్వం శ్రీవిద్యాయాం రహస్యార్ధః ||

అతి మధుర చాపహస్తా మపరిమితామోద బాణ సౌభాగ్యాం |
అరుణా మతిశయ కరుణా మభినవ కుళ సుందరీం వందే ||

అటువంటి మహా తల్లి పాదములకు నమస్కరిస్తూ,
శ్రీ కృష్ణాష్టమి శుభ సందర్భమున ఆ శ్రీకృష్ణ పర బ్రహ్మమునకు చేజేతులెత్తి నమస్కరిస్తూ,

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/17-08-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/

  

Saturday, 9 August 2014

2014

▼  2014 (25)

2013