Monday, 13 February 2017

మంత్రము - శక్తి

మంత్ర శాస్త్రము - శక్తి

ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన పరమ నిష్ఠా గరిష్టుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక చమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజ చేస్తూ వుండేవారు.

ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ “లేవురా అయిపోయినాయి” అన్నది.

అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు.
ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది. తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్త కు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు ..నీకు ఎలా తెలుసు అని. తెలుసు లెండి గురువు గారు అన్నాడు. వదల లేదు శాస్త్రి గారు. అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది, నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు.

ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. ప్రక్క రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య రాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు.

విధి లేక పాలేరు ఆ మంత్రాన్ని (కర్ణ పిశాచి) మంత్రమును గురువు గారికి చెప్పినాడు. ప్రక్క రోజు గురువు గారు శ్రద్దగా ఆ మంత్రాన్ని పఠించినాడు. కర్ణ పిశాచి ఇంటి బయట నుంచి పలికినది. శాస్త్రి గారూ అని పిలిచినది. ఏమి కావాలి అని అడిగినది. గురువు గారు ఇంట్లో నుంచి ఎవరూ అని అడిగినాడు. నేను కర్ణ పిశాచిని (యక్షిణి) మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరములోని దేవతా మూర్తులను బయట పడెయ్యండి, నేను లోపలి వస్తాను అని అన్నది.

శాస్త్రి గారి గుండె గుభేలు మన్నది. అప్పుడు అర్ధమైనది. ఒరేయ్ మా ఇంట్లో పూజా మందిరములోని దేవతా మూర్తులు ఎంత శక్తి వంతమైనవో, వాటి వలనే గదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడు తున్నాయో గదా, ఇన్నాళ్ళు నాకు తెలియ లేదు, పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని, నీవూ వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్లి పొమ్మన్నాడు. తన పూజా మందిరములోకి వెళ్లి ఆ పరమ శివుని కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః” అని చెంపలు వేసుకొన్నాడు. మంత్ర విద్య వున్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా.

పూజా మందిరములో వున్న విగ్రహాలు పాతవైనా, అరిగి పోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో శక్తి దాగి వుంటుంది. వాటిల్ని పారేయకండి. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి. అవి చైతన్య మౌతాయి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి.

వారు ఎవరో కాదు ఆ శాస్త్రి గారు మా ముత్తాత కు తాతగారు........ఈ కధ మా బామ్మ గారు మాకు చిన్నప్పుడు చెబుతూవుండేది....శ్రీమాత్రేనమః ....

దీనిని పెరుతొలిగించేసి చాలా చోట్ల, whats app లలో, నెట్ లో,  కొన్ని పుస్తకాలలో అచ్చు వేసి వున్నారు....మా తాత గారింటికి కాశీ నుంచి జగద్గురువులు బ్రహ్మానందం సరస్వతీ స్వాములు, మరియు కంచి మహా స్వాములు తరుచుగా భిక్షకు వస్తువుండేవారు.....తరువాత మా నాన్నగారి హయాం లో జగద్గురువులు శ్రీ కుర్తాలం పీఠాధిపతులు శ్రీశివచిదానంద భారతీ స్వాముల వారు వస్తూ వుండేవారు....వారందిరితో మా బామ్మ ఈ విషయాలు చెబుతూ వుండేది మా చిన్నప్పుడు...
........భాస్కరానంద నాథ /26-06-2012 @ శ్రీకాళహస్తి

Sunday, 15 January 2017

శ్రధ్ధ


నిన్న నేను తర్పణములు వదులుకొని, మడితో కాకికి అన్నం, వడ పెట్టాను అపార్టుమెంటులో పైన.
ఈ కార్యక్రమం అంతా ఓ 35 ఏండ్ల అమ్మాయి చూస్తూ వున్నది....నా దగ్గరకు వచ్చి అడిగింది...
" అయ్యా, నమస్కారములు ...మా అమ్మా నాన్నలు చనిపోయినారు ....అన్నదమ్ములు లేరు...
పెళ్లి అయినది ....మా అమ్మా నాన్నలకు మేము ఏ కర్మ కాండ పెద్దగా చేయలేదు....నా భర్తకు ఇవన్నీ నమ్మకం లేవు....మా అమ్మా నాన్నలకు నేను ఏ విధముగా ఇవన్నీ చేయగలను....నా తల్లిదండ్రులకు నేను ఏమీ చేసుకోలేనా? నాకు పిల్లలు లేరు....ఏం చేయమంటారు స్వామీ".... అని

కళ్లల్లో నీళ్లు తిరిగినాయి నాకు....
అమ్మా అన్నం వండినావా? మీరు తిన్నారా అని అడిగాను....
లేదండీ ఇంకా తినలేదు....
వెళ్లి ఓ పళ్ళెం లో అన్నం పట్టుకా రా తల్లీ.....
వెళ్లి పది నిమిషాలలో ఆ అమ్మాయి అన్నం పట్టుకొని వచ్చింది....
అమ్మా అక్కడ పెట్టి, దక్షిణ దిక్కు తిరిగి, మీ అమ్మా నాన్నలను గట్టిగా పిలువు తల్లీ...అన్నాను...
మనసులో ప్రార్ధన చేసి....అమ్మా, నాన్నా అని మూడు సార్లు పిలిచింది.....వెంటనే కాకులు వచ్చినాయి....కానీ ఎంతసేపటికీ ముట్టవు......అరగంట అయింది....ఈ పిల్ల ఏమో ఏడుస్తుంది...
ఏమండీ ఎందుకు తినలేదు అని అడుగుతుంది నన్ను....
ఓ సారి నేను కళ్లు మూసుకొని ఆలోచించి....ఇలా చెప్పు అమ్మా అన్నాను....
" అమ్మా- నాన్నా నా తప్పులన్నీ క్షమించి, మన్నించి అన్నం తినండమ్మా "....అని...
అంతే మరుక్షణం లో కాకులు  అన్నీ వచ్చి తినిపోయినాయి....
ఈ అమ్మాయి బోరున ఏడ్చి నా కాళ్ల మీద పడింది....
అప్పుడు చెప్పింది.....నేను ప్రేమించి పెళ్లి చేసపకొన్నానండీ....మా వాళ్లు ఆ దిగులుతో మరణించారని.
ప్రతి రోజూ కాకులకు అన్నం పెట్టు తల్లీ అని దీవించి పంపాను.....
ఇదుగో ఆ అమ్మాయి ఫోను చేసింది ఇప్పుడే......రాత్రి కలలో వాళ్ల అమ్మా నాన్నలు కనిపించారంట....
పై సంక్రాతికి నీకు పిల్లలు తప్పక పుడతారమ్మా అని దీవించాను.....
మాట ఇచ్చాను....ఇక నిలబెట్టడం అమ్మ వంతు.....
భాస్కరానంద నాథ...15-01-2017