శ్రీకాళహస్తి – దక్షిణ కైలాసం - 1
"భూమౌ దక్షిణ కైలాసే ప్రవేశాన్ముక్త ఏవ" ... అను ప్రమాణం గలిగి ప్రాణులకు ముక్తిని కరతలామలకముగా నొనర్చి, దక్షిణ కైలాసముగా, దక్షిణ కాశిగా వెలిగిన ఈ పుణ్య క్షేత్రము యొక్క మహిమ ఎంతనియు వర్ణింపవచ్చును. కృతయుగాది నాల్గు యుగములయందును వరుసగా ఈ క్షేత్రము నందు వాయలింగముగా, బంగారు, వెండి, తామ్ర, శిలా మూర్తి రూపమున భక్తులకు దర్శనము ఇచ్చుచు, ఆ పరమ శివుడు జీవులను కృతార్ధులను జేయుచున్నాడని స్థల పురాణము తెలుపుచున్నది.
బ్రహ్మ,విష్ణు, ఇంద్రుడు, వాయువు మున్నగు దేవతలు, వశిష్ట, అగస్త్య, భరద్వాజ. రోమశాది మహర్షులు సాలెపురుగు.పాము, ఏనుగు మొదలగు జంతువులు కూడా ఇచ్చోట తరింప గలిగినవి. మరియు కన్నప్ప, నత్కీరుడు, వేశ్య కన్యకల వలె ఎందఱో భక్త వరులు ఇచ్చట శివైక్యము నందిరి. జాతి మత వర్గ వివక్షతల కతీతమై ఈ క్షేత్రము శివ క్షేత్రములలో తలమానికమైనది. శ్రీ ధూర్జటి మహాకవి శివున్ని మెప్పించి శ్రీకాళహస్తీశ్వర మహాత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం ఇచ్చోటనే రచించినారు. ఎందఱో మహానుభావులు ఇచ్చట నివసించి, స్వామిని మనసుతో, తనువుతో సేవించి తరించినారు. సర్వ జీవులకు మోక్షమివ్వ గల క్షేత్రము శ్రీకాళహస్తి. పిలిస్తే పలికే దైవం, భక్త సులభుడు, భక్త వత్సలుడు, కరుణామూర్తి, భోలా శంకరుడు ఈ మహా దేవుడు. ఎన్నో ప్రమాణములతో మోక్షమోసగే మోక్ష పురిగా, దక్షిణ కైలాసముగా, దక్షిణ కాశిగా వెలుగొందినది శ్రీకాళహస్తి.
ఇక మాయమ్మ కరుణామూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి:
పార్వతిదేవికి పరమశివుడు పంచాక్షరీ మంత్రమునులను భోధించి నిశ్చల చిత్తముతో జపింప వలయుననేను. జపము సేయునప్పుడు ఆమెకు మంద బుద్ధి ఆవరించి నియమము విస్మరించెను. అపుడు శివుడు కోపించి ఆమెను భూమిపై మానవ స్త్రీగా అవుతావని శపించెను. అపుడామే శాప విమోచనకై శివుని ప్రార్ధింపగా భూలోకమున కైలాసగిరి ప్రాంతమున ఈశ్వరుని లింగమును పూజించుమని ఆనతిచ్చేను. పార్వతీ దేవి నారదుని సాయముతో భూమికి వచ్చి ఘోర తపంబాచారించెను. శివుడు ప్రత్యక్షమయ్యెను. ఆమె తన అర్ధాంగమును అర్ధనారీశ్వరతత్వమున నిలుపుకోనెను. అప్పటి నుండి ఆమె జ్ఞాన ప్రసూనామ్భిక అను పేరుతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సాన్నిధ్యమున వెలసినది. ప్రణవ పంచాక్షరీ జప సిద్ధిని పొంది జ్ఞాన ప్రదీప్తిని భక్త జన లోకమునకు ప్రసాదించుటచే ఆమెకు జ్ఞాన ప్రసూనాంబయను పేరు సార్ధక నామమై విరాజిల్లుతున్నది. అందుకే ఇచ్చట జ్ఞాన సిద్ది, పంచాక్షరీ జప సిద్ది త్వరగా కలుగును అని పెద్దలు చెప్పుదురు.
ఉనికి:-
శ్రీకాళహస్తి పట్టణము చిత్తూరు జిల్లాలోఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనిది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి కేవలం 40 కి.మీ. దూరంలో, ఉత్తర వాహినియైన సువర్ణముఖి నది చెంతన వెలిసినది. ఈ క్షేత్రము చేరుటకు అన్ని వైపుల నుండి బస్సు, రైలు, విమాన సౌకర్యములు గలవు.
చారిత్ర్యాత్మిక ప్రాశస్త్యము:-
క్రీస్తు పూర్వము ఒకటి రెండు శతాబ్దములలో వ్రాయబడిన తమిళ గ్రంధములలో శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది. రెండు మూడవ శతాబ్దములలో అరవై ముగ్గురు నాయనార్లు శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరన్, సంబంధర్, మాణిక్యవాచగర్ అను వారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించిరి. మూడవ శతాబ్ధములో నత్కీర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని స్తోత్ర రూపమున కీర్తించినారు. జగద్గురు శ్రీ ఆది శంకరుల వారు ఈ క్షేత్రమును సందర్శించి అమ్మ వారి ఎదుట శ్రీచక్ర ప్రతిష్టాపన గావించి యున్నారు. వారే స్పటిక లింగమును నెలకొల్పినారు. పల్లవ, చోళ, విజయ నగర రాజులు కాలపు శిల్ప కళా నైపుణ్యమును ఇక్కడ చూడ వచ్చును. క్రీ.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు వారు పెద్ద గాలి గోపురమును నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు. ఈ గాలి గోపురము ఈ మధ్యన కూలిపోయినది.
పూజా విధానము:-
ఈ దేవాలయమును వైదిక ఆగమ విధానములలో పంచ కాల పూజలు జరుగును. ఉదయం నుండి మధ్యాహన్నము వరకు మూడు సార్లు అభిషేకములును, సాయంత్ర సమయ ప్రదోష కాలమున ఒక అభిషేకము స్వామి అమ్మ వార్లకు జరుగును. ఇచ్చటి గురుకులులు (పూజారులు) భరద్వాజముని వంశీయులైన భరద్వాజ గోత్రీకులు మాత్రమే పూజకు, అర్చనకు అర్హులు. వారు మాత్రమే స్వామి వారిని స్పృశించెదరు. ఇచ్చట శివరాత్రికి పది రోజులు బ్రహ్మోత్సవాలు ఏటా జరుగును. మరియు దశరా రోజులలో అమ్మవారి ఉత్సవాలు ప్రత్యేకము. ఇవిగాక ఏటా రెండు సార్లు, జనవరి నెలలో కనుమ పండుగ రోజున మరియు శివరాత్రి అయిన నాలుగవ రోజున గిరి ప్రదక్షిణము జరుగును.
దక్షిణ కైలాసము – దక్షిణ కాశి
ఈశ్వరుని ఆజ్ఞ చేత బ్రహ్మదేవుడు కైలాసమున గల శిఖరములలో ముఖ్యమైన శివానందైక నిలయమును, శిఖరమును శ్రీకాళహస్తి క్షేత్రములో స్థాపించి శివుని పూజించి ధన్యుడాయేను. దీనివలన శ్రీకాళహస్తిలో వెలసిన పర్వతమునకు దక్షిణ కైలాసము అని పేరు వచ్చెను.
శ్రీకాళహస్తీశ్వరాలయము నానుకొని సువర్ణముఖి నది ఉత్తర వాహినిగా ఆలయమునకు ఆనుకొని ప్రవహించు చున్నది. పశ్చిమ భాగమున తిరుమంజన గోపురమున ఎదురుగా నున్న నదీ స్నాన ఘట్టమునకు మణికర్ణికా ఘట్టము అని పేరు. కాశీ వలె ఇచ్చట ఉత్తర వాహిని నదియు, మణికర్ణికా స్నాన ఘట్టమును నుండుటచే దీనికి దక్షిణ కాశీయని పేరు గలిగినది. ఇక్కడ కూడా శివుడు జీవులకు తారక మంత్రోపదేశముగా గావించు చున్నాడని పెద్దల ఉవాచ.
....... ఇంకా వుంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో, మీ కందరికీ ఈ నూతన సంవత్సరములో శ్రీ జ్ఞానప్రసూనామ్భిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శన భాగ్యము కలగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ
మీ
శ్రీ భాస్కరానంద నాథ/శ్రీకాళహస్తి
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.