ఆలయ నిర్మాణ పద్ధతి :-
భారత దేశమందలి ఆలయముల వలే
గాక శ్రీ కాళహస్తీశ్వర ఆలయ నిర్మాణములో నొక ప్రత్యేకత గలదు. ఇచ్చట వినాయకుడు, శ్రీ
కాళహస్తీశ్వరుడు, దక్షిణామూర్తి, అమ్మవార్లు ఒక్కొక్కరు ఒక్కో దిక్కునకు
వెలసియున్నారు. దీనిని బట్టి జీవులు తరింప బడుటకు మూల మగు ధర్మార్ధ కామ మోక్షములను
చతుర్విద పురుషార్ధ సూచనమే ఈ దేవాలయమని మనస్సునకు తోచు చున్నదని పెద్దల నమ్మిక.
మొదటి దిన ధర్మము, ఆత్మ ధర్మముగా ఉత్తరాభి ముఖమైన శ్రీ పాతాళ గణపతి ఉనికిలో
తెలియనగును. రెండవ అర్ధము ఆత్మ జ్ఞానోపదేశానార్ధముగా ఉమా దేవి స్వరూపమైన శ్రీ
జ్ఞాన ప్రసూనామ్భికా దేవి తూర్పు ముఖముగా నిలిచి ముముక్షువులకు భోధించు చుండును.
మూడవదయిన కామము దక్షిణ ముఖముగా నుండి మహా ద్వారమునకు ఎదురుగా సత్య శివ సుందర
దక్షిణామూర్తిగా, గురు స్వరూపములో జీవులకు ఇహ పర కార్యంబులు సిద్దించుట తధ్యమని
తెలుపు చున్నారు.
తుదిగా మోక్షాధికారి అయిన
పరమ శివుని స్వరూపమగు శ్రీ కాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖముగా నిలిచి అస్తమయ
సూర్యుని మూలమున జీవునకు మరణము తధ్యమని తెలుపుచూ, శివ సాయుజ్య ప్రాప్తికి ప్రయత్నం
జేయవలెను అని మనకు సూక్ష్మ సందేశము ఇచ్చు చున్నాడు. ధర్మార్ధ కామ మోక్షములకు ఒక ప్రతీకయే శ్రీ
కాళహస్తీశ్వరాలయము.
శ్రీకాళహస్తీశ్వర
మహత్యము:-
శ్రీ కాళహస్తీశ్వర స్వామి
స్వయంభువు. శ్రీ అనగా సాలె పురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు
జంతువులు శివ భక్తి వలన సాయుజ్యము పొంది శివునిలో కలిసి పోయినవి. అందువలన ఇచ్చట
స్వామి వారికి శ్రీ కాళహస్తీశ్వరుడనియు, ఈ పురమునకు శ్రీ కాళహస్తీ అనియు పేరు
వచ్చెను.
సాలె పురుగు – శివ
సాయుజ్యము:-
కృత యుగములో చెలది పురుగు
తన శరీరము నుంచి వచ్చు సన్నని దారముతో కొండపై నున్న శివునకు గుళ్ళు గోపురములు
ప్రాకారములు కట్టి శివుని పూజించు చుండెను. ఒకనాడు శివుడు పరీక్షించదలచి అక్కడ
మండుచున్న దీపము తగిలి సాలీడు రచించిన గుడి గోపురములు తగుల బడి పోవునట్లు చేసెను.
ఇది చూసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రత్యక్షమై దాని భక్తికి మెచ్చి
వరము కోరుకోమనేను. అప్పుడు సాలీడు తనకు మరల జన్మ లేకుండా చేయమని కోరుకొనగా, శివుడు
సమ్మతించి సాలీడును తనలో ఐక్యము చేసుకొనెను. ఈ విధముగా సాలీడు శివ సాయుజ్యము
నొందినది.
నాగు పాము – ఏనుగు
శివారాధన చేసి తరించుట:-
ఏనుగు పాముల కథ
త్రేతాయుగమున జరిగినది. ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి
దినమున శివ లింగమునకు పూజ చేసి పోవుచుండెను. త్రేతాయుగము ముగిసి, ద్వాపర యుగము
వచ్చినది. అప్పుడు ఒక ఏనుగు శివ లింగమునకు పూజ చేయ తలచి సువర్ణ ముఖి నదిలో స్నాన
మాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వ దళములు తెచ్చి, పాము
సమర్పించిన మణులను త్రోసి వేసి, తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములతో
నలంకరించి పూజించి వెడలి పోవు చుండెను. మరునాడు ఉదయం పాము వచ్చి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక దానికి బదులు
బిల్వములు, పుష్పములు గాంచి పాము మనస్సు చాలా బాధపడి, యధాప్రకారముగా వాటిని త్రోసి
వేసి, శివున్ని మణులతో పూజించెను. ఇలా కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు,
ఏనుగు ఉంచిన పూలను పాము శుభ్ర పరచి తమ ఇచ్చానుసారముగా పూజ చేసి శివున్ని ఆరాధించు
చుండెను. ఒక రోజు పాము విసుగు చెంది తన మణులను తొలగించిన ఆ ప్రాణి పై కోపము చెంది
కారణము తెలుసుకోన గోరి ప్రక్కనే యున్న పొదలో దాగి పొంచి ఉండెను. అంత వాడుక
ప్రకారము ఏనుగు పూజకు వచ్చి, తన పూజ మొదలు పెట్టెను. తొండముతో మణులను త్రోసి
వేయుచుండెను. అది గమనించిన పాము కోపముతో తన శత్రువైన ఏనుగు తొండములో దూరి
కుంభస్థలమున నిలిచి దానికి ఊపిరి ఆడకుండా చేసెను. ఈ బాధకు ఏనుగు తాళజాలక ఈశ్వర
ధ్యానముతో తొండముతో శివ లింగమును తాకి శిరస్సును గట్టిగా రాతికి మోది తుదకు
ప్రాణములను విడిచెను. ఆ శిలా ఘాతమునకు పాము గూడా చచ్చి బయట పడినది. పరమ శివుడు
వాటి భక్తికి మెచ్చి రెంటికీ మోక్షమును ప్రసాదించెను. ఇద్దరు తమ నిజ స్వరూపములతో
రుద్ర గణములుగా మారి స్వామి వారిలో ఐక్య మొందిరి.
ఈ స్మృతి చిహ్నముగా పాము
శిరోభాగమున, ఏనుగు సూచకముగా రెండు దంతములు, సాలె పురుగు అడుగు భాగమున తన
లింగాకృతిలో ఐక్య మొనరించుకొని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా నాటి నుంచి
దర్శనమిచ్చు చున్నాడు. ఆనాటి ఈ పుణ్య క్షేత్రము “శ్రీకాళహస్తీ” అని పేరు గాంచెను.
హర నమః పార్వతీ పతయే నమః
ఇంకా వుంది....... మీ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.