సౌందర్యలహరి -
భాస్కర ప్రియ – 31
చతుఃషష్ట్యా తంత్రైః సకల మతిసంధాయ
భువనం
స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవపరతంత్రైః
పశుపతిః |
పున స్త్వన్నిర్బంధా దఖిల పురుషార్థైకఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితల
మవాతీతర దిదమ్ || 31 ||
అమ్మా, భగవతీ! పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది
తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు. సకలసిద్ధి ప్రదాయకమూ, ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి
మిన్నకున్నాడు. మళ్లా నీ అభీష్టం మేరకు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ
పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని శ్రీవిద్యా తంత్రాన్ని ఈ, లోకానికి ప్రసాదించాడు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
“భాస్కర ప్రియ” - (భాస్కరానందనాథ
భావము)
ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీవిద్యా తంత్రమును గురించి
మనకు తెలియజేస్తున్నారు.
పశువులను, ప్రాణులను పరిపాలించు ఆ పశుపతి పూర్వము ఈ సమస్త ప్రపంచమును మోహపెట్ట
తలంచి చతుష్షష్ఠి (64) తంత్రములను
సృష్టించి ఇచ్చాడు. పశువులైన ఈ మానవులు ఆ కామ్యక మైన తంత్రముల యందు మోజుతో వాటి
మత్తులో పడి పరమ పురుషార్ధమైన మోక్షమును మరిచి మొహములో తమను తాము మరిచి వాటి వలన
కలిగిన సిద్దులతో ఆడుకొంటూ మూడులై పరమార్ధము తెలుసుకోలేక, జీవన్ముక్తులు కాలేక
కొట్టుకు లాడుతున్నారు ఈ భ్రమణ చక్రములో పడి.
బిడ్డలకు తల్లియైన ఆ మహా తల్లి ఓర్వలేక ఒకరోజు ఆ పరమ శివుని దగ్గరకు వెళ్లి
అడిగినది.
“ స్వామీ, బిడ్డలు పాడై పోతున్నారు, అజ్ఞానంలో కూరుకు పోతున్నారు మీరు ఇచ్చిన మాయా తంత్రముల చేత, కావున ఎల్ల
కోరికలు ఈడేరే తంత్రము, ధర్మార్ధ కామ మోక్షములు ఇచ్చే మహా తంత్రమును, జ్ఞానమును
నొసగే విద్యను ఒక్కటి ఇవ్వండి చాలు నా
బిడ్డలకు” అని.
“పార్వతీ, సకల తంత్రములకు మూలమైన, మిన్నయైన, ధర్మాది చతుర్విధ పురుషార్ధములను
ప్రసాదించే సర్వ స్వతంత్రమైన శ్రీవిద్యాతంత్రము నీ పేరు మీదుగా ఇస్తున్నాను.” అని
అనుగ్రహించినాడు.
ఈ విధముగా మహాదేవునిచే నిర్మితములైన చతుష్షష్ఠి (64) తంత్రములు మహా పండితులను
సైతము మోహ పరుచు చున్నవి. ఐహిక సుఖములను కలిగించే ఈ తంత్రములు వైదిక మార్గ
దూరములైనవి. ఆయా జాతులను బట్టి, వర్ణములను బట్టి వీటిని అనుసరించ వలెను అని
పెద్దలు చెప్పుదురు. ఇవి అందరికీ అనుష్టించడానికి యోగ్యములు కావని, ప్రపంచాన్ని
వంచిస్తాయని శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో
చెప్పు చున్నారు.
శుభాగమతంత్ర పంచక మందు వైదిక మార్గము ననుసరించి ఈ శ్రీవిద్యా తంత్రము యొక్క అనుష్టాన
కలాపము వశిష్ట సనక, శుక, సనందన, సనత్కుమారుల చే తెలుప బడినది. ఈ శ్రీవిద్య మనకు
గౌడపాదాచార్యుల నుంచి గోవింద పాదాచార్యులకు, వారి నుంచి శ్రీ శంకర భగవత్పాదులకు,
వారినుంచి మన గురువుల వరకు సాంప్రదాయ శిష్య కోటి పరంపర లో అనుగ్రహించ బడినది. ఇది
బ్రహ్మ విద్య, మోక్ష విద్య. లౌకిక కోరికలు కోరకు కాదు. తరింప జేసే మహా విద్య ఇది.
ఎన్నో కోట్ల జన్మల పుణ్యము, అమ్మ అనుగ్రహము వుంటే గాని శ్రీవిద్య రాదు, వచ్చినా
ఉండదు. నిలబెట్టుకోవడము చాలా చాలా కష్టము. అసలు బుద్ధి పుట్టదు, అర్ధం కాదు అమ్మ
దయ లేక పోతే. యోగులకు మాత్రమే
శ్రీవిద్యోపాసన అర్హత కలుగును అని పెద్దలు అందురు. శ్రీవిద్యా తంత్రము అంటే
పంచదశాక్షరీ మంత్రం అని శ్రీ లొల్ల లక్ష్మీధర పండితులు చెప్పారు.
శ్రీ గౌడపాదాచార్య విరచిత సుభగోదయ
స్తుతి యందు తంత్రముల గురించి శ్రీ గురువులు ఇలా వివరించినారు.
లోకంలో కామ్య వాదులు, మోక్ష వాదులు అని రెండు రకముల వారున్నారు. ఆచార
వ్యవహారములను బట్టి వీరిని మూడు రకములుగా విభజించినారు.
౧. కౌలాచారులు, ౨. మిశ్రమాచారులు, ౩. సమయాచారులు.
సగుణ బ్రహ్మను గురించి చెప్పే తంత్ర శాస్త్రములను ఆగమాలు అంటారు. వాటిని
సమిష్టిగా మంత్ర శాస్త్రము అని అంటారు. ఆగమాలు మూడు రకములు.
౧. వైష్ణవ ఆగమాలు, ౨. శైవ
ఆగమాలు, ౩. శక్తి ఆగమాలు.
సాత్విక ఆగమాలను తంత్రాలని, రాజసాలను యామళాలు అని, తామసాలను డామరాలు అని అంటారు.
వైదికులు (వేదమును నమ్మిన వారు, ఆచరించే వారు) శుభాగమ పంచకము చెప్పిన సమయాచార
మార్గాన్నే అనుసరించాలి అని శ్రీ శంకర భగవత్పాదులు నిర్ణయము చేసి వున్నారు. అదే
మార్గము ననుసరించి శ్రీ గురుదేవుళ్ళు స్థాపించిన శంకరుల మఠములలో నేటికీ శ్రీ
విద్యా తంత్రము ననుసరించి శ్రీచక్రార్చన జరుగు చున్నది.
సూర్య కిరణముల చేత నీరు ఎలా ఆవిరి అగునో అలా పంచదశీ మహా మంత్రము చేత
శ్రీవిద్యోపాసకుల యొక్క మోహము పైకి ఉబికి ఆవిరిగా మారి పోవును. శ్రీవిద్యా పూర్ణ
దీక్ష యందు ప్రధాన విద్య షోడశాక్షరీ విద్య. ఈ విద్యకు శుద్ధ విద్య అని పేరు. 64 తంత్రములకు ఈశ్వరి ఆమె అందుకే సర్వ తంత్రేశీ అన్నారు.
చతుష్షష్ఠి కళామయి, చతుష్షష్ఠుపచారాడ్యా ...అని అమ్మ వారికి పేర్లు. చతుష్షష్ఠి
ఉపచారములు, చతుష్షష్ఠి కళలు, చతుష్షష్ఠి తంత్రములు ఇలా 64 మీద చెప్పబడినవి.
గూడార్ధము:- 64 తంత్రములు జీవుడ్ని మాయా మొహితుడ్ని చేస్తే, శ్రీవిద్యా
తంత్రము అనే అమ్మను పట్టుకొన్న వాడికి
జ్ఞానము లబిస్తుంది. అంటే పరమ శివుడు దర్శనమిస్తాడు.
శ్రీవిద్యా స్వరూపిణి అయిన ఆ తల్లి
పాద పద్మములకు నమస్కరిస్తూ ....
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/09-08-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.