సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 34
శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్ |
అతః శేషః శేషీత్యయముభయసాధారణతయా
స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః || ౩౪ ||
ఓ భగవతీ! నీవు శంభుడికి రవిచంద్రులు స్తనయుగంగాగల శరీర మవుతున్నావు. అమ్మా! నీ శరీరాన్ని దోషరహితమైన నవ ప్యూహాత్మకమైన ( కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళా, జీవ తొమ్మిది ప్యూహాలు కలిగి ఉంటాడు కాబట్టి శంభుడికి నవాత్మ అని ఇంకో పేరు) ఆనందభైరవుడిగా తలుచుతాను. ఇందువల్ల ఈ శేష (సంబంధిత వస్తువు) శేషీ (మూల వస్తువు) భావ సంబంధం , సమసంబంధం కలిగి ఆనందభైరవ, ఆనందభైరవీ, రూప చిచ్ఛక్తులయిన మీ ఇరువురకు (శివశక్తులకు) సరిసమానంగా వుంది అని తలంతును. ఇరువురూ అవినాభావ సంబంధం కలిగి సమాన ప్రతిపత్తి కలవారని భావము.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
“భాస్కర ప్రియ” - (భాస్కరానందనాథ భావము)
ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు పార్వతీ పరమేశ్వరుల గురించి మనకు తెలియజేస్తున్నారు. వారు ఒకరికొకరు శరీరమని, వారిది అర్ధనారీశ్వర తత్వమని, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత వున్నదని, శేష శేషీ సంబంధము వున్నదని, వారి ఉభయ సంబంధముల గురించి మనకు చక్కగా తెలియజేస్తున్నారు ఇక్కడ.
శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం
శరీరం త్వం శంభోః...... అమ్మా నీవు ఆ శంకరునికి శరీరం అగుచున్నావు తల్లీ. శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః అని లలితా అష్టోత్తరం శతనామావళి లో అమ్మకు పేరు. అలాగే శ్రీ కంఠార్ధ శరీరిణై నమః అని లలితా సహస్ర నామంలో అమ్మకు మరో పేరు కలదు. దీనిని బట్టి ఈశ్వరుని యొక్క శరీరం అమ్మ అని తెలుస్తున్నది. ప్రకాశ శివ శక్తి సమ్మేళన రూపమే బ్రహ్మాండ పిండాండ రూపములని, అదియే అర్ధ నారీశ్వర రూపమని, తత్వమని, అదియే శ్రీచక్ర స్వరూపమని తెలియనగును. శ్రీ అంటే విషము అని అర్ధము, విషమును కంఠమున కలిగిన వాడు శ్రీ కంఠుడు, శివుడు. అతనికి అర్ధ శరీరముగా గలది. అందుకే అమ్మకు, అయ్యకు తాదాత్మ్యము. అమ్మకు అయ్యకు భేదము లేదని, కావున సృష్టి ఆదిలో ఒకటిగా వున్న ఆత్మ రెండుగా అయినది, అదే భార్యా భర్త లయినరి అని బృహదారణ్యకము నందు తెలుప బడినది. అంటే ఆ మహా చైతన్యము అయిన పరమ శివుడు ఆత్మ అయితే, విశ్వస్వరూపిణి అయిన ఆ జగన్మాత ఆ శివుని ఆత్మకు శరీరము అయినది. ఇదియే వాక్కు, అర్ధము అని, వాక్కులోనే అర్ధము వున్నదని వారే మన తల్లిదండ్రి అని మహాకవి కాళిదాసు ఇలా అన్నారు.
వాగర్ధా వివ సంపృక్తౌ, వాగర్దః ప్రతి పత్తయే, జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ ||
ఇదే విషయాన్ని శ్రీ గణపతి మునులు తమ ఉమా సహస్రం లో అత్భుతంగా వర్ణించినారు...
ఆరాధయసీశం తం చిన్మయకాయమ్, ఆనన్దమయాంఙ్గీ త్వం దేవి కిలేయమ్. ...౨౨
దివ్యం తవ కాయం దివ్యే తవ వస్త్రే, దివ్యాని తవామ్బా స్వర్ణాభరణాని ....(ఉమా సహస్రం-౨౩)
దేవి తన ఆనందమయమైన దేహమును పరమేశ్వరునికి ఇచ్చి, జ్ఞానమయ దేహము గల ఆ పరమేశ్వరుని ఆరాధించు చున్నది. అమ్మ శరీరము, వస్త్రములు, స్వర్ణాభరణములు ...అన్నీ దివ్యములే, అప్రాకృతములే. అమ్మ దేహము అలౌకికమైనది, తేజోమయమైనది అది పరమేశ్వరునికి అంకితమైనది.
ఆత్మకు దేహము ఎంత ముఖ్యమో, శరీరమునకు వెన్నెముక, దానికి మహాశక్తి కుండలినీ కారణమగు చున్నది. అలా ఆ పరమ శివునికి అమ్మ సూర్య చంద్రులను వక్షోజముగా గల దేహము అగు చున్నది. సూర్య చంద్రులు వలన సృష్టి పోషింప బడుచున్నది. పోషకత్వానికి అమ్మ శరీరం ప్రతి రూపం.
అమ్మా, పరమేశ్వరుడు కేవలం సాక్షి మాత్రుడే, సృష్టి, స్థితి, లయములు నీవే గావించు చున్నావు. కాబట్టి నీవే శరీరము అగు చున్నావు ఆ శంభునికి.
సాక్షీ కేవల మీశః కర్తుం భర్తు ముతాహో, హర్తుం వాzఖిల మమ్భ, త్వం సాక్షాత్ ధృత దీక్షా....
(ఉమా సహస్రం , 6-22)
శ్రు || యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్టితః
తస్య ప్రకృతి లీనస్య యః పర స్స మహేశ్వరః
ఓం అనే ప్రణవము వైఖిరీ రూపము, పరమేశ్వరుడు, ప్రకృతి రూపమైన (అమ్మ) పరానాదమందు లీన మగుచున్నది. కాబట్టి ఆది శంకరులు “శరీరం త్వం శంభోః......అని అన్నారు.
నీవేమో నవ చక్రాత్మకము, ఆయననేమో నవ వ్యూహాత్మకము. శివుడు నవాత్మకుడు, శక్తి నవాత్మిక .
ఆనంద భైరవుడైన, మహా భైరవుడైన శివున్ని కౌలులు నవాత్మడు అని అంటారు. ఆయన నవ వ్యూహాత్మకుడు కావడం వల్ల నవాత్ముడయ్యాడు.
శివ నవ వ్యూహాలు :- ౧. కాల వ్యూహము ౨. కుల వ్యూహము, ౩. నామ వ్యూహము, ౪. జ్ఞాన వ్యూహము, ౫.చిత్త వ్యూహము, ౬. నాద వ్యూహము, ౭. బిందు వ్యూహము, ౮ కళా వ్యూహము, ౯. జీవ వ్యూహము.
నవ చక్రాత్మకము లు అయిన శక్తి నవాత్మకలు ...౧. వామా, ౨. జ్యేష్టా ,౩ రౌద్రా, ౪. అంబిక అనే నలుగురు అధోముఖ శివ చక్రములు చతుర్యోని స్వరూపులై వుంటారు. అలాగే ౧. ఇచ్చా, ౨. క్రియా, ౩. జ్ఞాన, ౪ శాంతా ౫ పర అనే శక్తులు ఐదు శ్రీ చక్రములోని ఊర్ధ్వ ముఖ మైన శక్తి చక్రములుగా మొత్తం తొమ్మిది మంది నవ వ్యూహాత్మికలు. కాబట్టి భవతి కూడా నవాత్మిక అని తెలుసుకోవాలి.
ఈ విధముగా శేష శేషీ భావములతో శివుడు శక్తి ఆనంద భైరవుడు, మహా భైరవి అనే శివ శక్తులకు అవినాభావ సంబంధముతో తాదాత్మ్యము సిద్దించి నప్పుడు నవాత్మకత్వము ఇద్దరికీ సమానమే.
పార్వతీ పరమేశ్వరులు ఒకరికొకరు శరీరం అవుతున్నారు. శివుడు శరీరం అయితే దేవి అతనికి ఆత్మ, దేవి శరీరం అయితే శివుడు ఆమెకు ఆత్మ అవుతాడు. కాబట్టి శేష శేషీ సంబంధము ఉభయ సాధారణము. ఇద్దరూ జీవికాజీవులై వుంటారు.
అంటే అమ్మకు ప్రాణం అయ్య, అయ్యకు ప్రాణం అమ్మ అని తెలియ చెప్పుచున్నారు శంకరులు. ఒకరు లేనిదే ఇంకొకరు బ్రతక లేరు, అమ్మ అయ్య ల యొక్క అన్యోన్య దాంపత్యము గురించి, వారి వ్యూహాత్మిక శక్తులను గురించి చెప్పి ఇద్దరూ సమానమే అని చెప్పు చున్నారు. విడదీయరాని వారి అనుబందాన్ని గురించి మనకు చెబుతున్నారు.
ఈ పరిజ్ఞానమును ప్రసాదించిన ఆ మహా తల్లి పాద పద్మములకు నమస్కరిస్తూ,
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/02-02-2015 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.