Monday, 2 July 2012

వర్ణాశ్రమ ధర్మములు


వర్ణాశ్రమ ధర్మములు
భగవంతునిచే సృష్టించబడిన వర్ణములు నాలుగు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నామములు గలవి.
బ్రాహ్మణు డెప్పుడును అధ్యయనము, అధ్యాపనము, యజనము, దానము, ప్రతిగ్రహము (యోగ్య మైన
వస్తువులను దాన మిచ్చునపుడు పుచ్చుకొనుట) అన్నవి బ్రాహ్మణులకు జీవనోపాధికి
పనికి వచ్చును. అంతేకాదు. నిత్యాగ్ని హొత్రము, తపస్సు, శుచిత్వము, శాంతము
అనునవి బ్రాహ్మణునిలో ఉండవలెను. తామసాహంకారములు పనికి రావు.        

క్షత్రియనకు వేదాధ్యయనమును, యజ్ఞయాగాది కర్మములు చేయుట, అర్హులైన వారికి దానమిచ్చుట,
విహితములైన పనులు. రాజో చితములైన విద్యలు నేర్చి ధర్మరక్షణము ప్రజాపాలనము
చేయుట వీరి కర్తవ్యము.   
వైశ్యులు వేదాధ్యయనము చేసి, యజ్ఞములు దానములు మున్నగునవి చేయుచు, వర్తకము, వ్యవసాయము, పశు పోషణము గూడ చేయవలెను.
ఈ పై మూడు వర్ణములు వారికిని ఉపనయనాధి కారముకలదు.
శూద్రులు ఈ పై మూడు వర్ణముల వారు చేయు కార్యాములలో సహకరించుచు వారి శక్తి యుక్తులను అందించు చుండవలెను.  
ఆశ్రమములు
ఇంక ఆశ్రమములు:  ఇవి నాలుగు. బ్రహ్మచర్యము, గార్హ స్థ్యము, వాన ప్రస్థము, సన్యాసము.
బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థములు మూడును బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సమానములు.
సన్యాసము తప్పమిగిలినవి శూద్రులకు కూడ ఆచరణీయములే.

బ్రహ్మచర్యము:  
గురుకులవాసము చేసి యితర ఆలోచనలు మాని విద్యాభాసము చేయుట, నియమ నిష్ఠలతో నుండుటకు అలవాటు చేసికొనుట దీనియందు జరగవలెను.

గార్హస్థ్యము(గృహస్థాశ్రమము):  
విద్యాభ్యాసము పూర్తి యైన తరువాత తనకు తగిన కన్యను పెండ్లాడి గృహస్థుడు కావలెను. మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము అను పంచమహా యజ్ఞము
లాచరించుచు దేవ, పితృ, మనుష్య, భూతములకు సంతృప్తిగా పెట్టుచు, చదివిన వేద శాస్త్రములను (ఇతర విషయములను గూడ) తిరిగి వల్లె వేయుచుండ వలెను. ఇంటికి వచ్చిన అతిధి అభ్యాగతుల నాదరించుచు, బంధువులను సంతోష పరచు చుండవలెను. గోసేవ చేయవలెను. స్నాన సంధ్యావందనములు, అగ్నిహొత్రములు, పితృ తర్పణములు చేసి, నిత్యకర్మల నిట్లు జరుపుచుండెను. నైమిత్తికములను (తల్లి దండ్రులకు
శ్రాద్దములు పెట్టుట మొ||) శ్రద్దా భక్తులతో ఆచరించవలెను. పుత్ర పుత్రికలను విద్యాభ్యాసములు వివాహాదులు  జరి పంచవలెను. గృహస్థాశ్రమమునకు ఫలము సంతానమే గదా! దాని వలన వంశ వృద్దియగును.     
 వానప్రస్థము:
ఇంటి బాధ్యత లన్నియు కొడుకులను ఒప్పగించి, తాను సంసారములో సారములేదని
గ్రహించి, భగ వద్ద్యానము చేసికొనుచు లౌకికమైన యితర చింతలు మాని ప్రశాంతముగా
నుండుటయే యీ యాశ్రమములో  చెయవలసిన పని. పూర్వ మరణ్యములకు బోయెడివారు.
ఇప్పుడది లేదు.
సన్న్యాసము:
వాన ప్రస్థము తర్వాత సన్న్యాసాశ్రమము. ఇంద్రియ నిగ్రహముగలిగి ప్రాపంచిక
భోగములయందు విరక్తుడై కేవలము ఆత్మ స్వరూపడైన భగవంతునిలో జేరుటకు సాధన
చేయుటయే సన్న్యాసి కర్తవ్యము. భిక్షాటనము చేయుచు, ఏ యింటిలోను ఒక్కదినము
కన్న ఎక్కువ ఉండరాదు. సన్న్యాసికి విషయ భోకములండు ఆసక్తి కలిగినచో ఒక
అతనికి అధొగతియే. భిక్షాటనము అహంకార నాశనమునకు హేతువు. అహంకారముగల
సన్న్యాసి బ్రహ్మపదమును చేరలేడు.   

మీ
భాస్కరానంద నాధ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.