Sunday, 22 July 2012

శ్రీ ప్రత్యంగిరా దేవి



శ్రీ ప్రత్యంగిరా దేవి
ఈ దేవి సింహ ముఖముతో సింహ వాహినియై అతి భయంకరముగా, క్రోధ భయంకర మూర్తియై వుంటుంది. ప్రత్యంగిరా విద్య అనేది త్రిప్పి కొట్టే విద్య. పర ప్రయోగములను త్రిప్పి కొట్టుట కొరకు, శత్రువుల మీద ప్రయోగములు చేయుట కొరకు, భూత, ప్రేత ఇతర అన్ని దుష్ట శక్తులను, మరియు కొన్ని రోగములను పార ద్రోలుటకు దీనిని ప్రయోగించేదరు.  దుష్ట గ్రహ, పిశాచ, రోగ భాధా నివారణ కోరకు ప్రత్యంగిరా హోమము చేయ బడును. సాధనలో గాని, ఉపాసన లోగాని, హోమము లోగానీ చాలా జాగ్రత్తలు తీసుకోన వలెను.సాధన చేసే వాడు తీవ్ర శక్తి గల వాడై వుంటాడు. మరి ఉపాసకుని గురించి చెప్పక్కర లేదు.  సామాన్యులు దీని జోలికి వెల్ల కుండా వుండటము చాలా మంచిది.
ప్రత్యంగిరా సాధన అతి ప్రాచీనమైనది. ఈ దేవత అధర్వణ వేదములో చాలా శక్తి వంతముగా మనకు కనిపిస్తుంది. పిప్పలాద శాఖీయమైన అధర్వ సంహితలో మరియు శౌనక సంహితలో ఈ ప్రత్యంగిరా ఋక్కులు గలవు.           ఏ శత్రువు ఎంతటి ప్రయోగము చేసినా దానిని నివారించటమే గాక తిరిగి వెళ్లి పంపిన వానినే చంపి వేసే లక్షణం ఈ విద్యలో కలదు. తప్పుగా, స్వార్ధముగా అమాయకుల పై ప్రయోగము చేస్తే, ప్రయోగము చేసిన వాడ్నే ఇది మ్రింగి వేయును. ఎవరైతే ప్రయోగము చేసినారో వాళ్ళ కుటుంబమును అంతటిని ఇది సర్వ నాశనము చేయును. నెత్తురు కళ్ళ చూడును. కాబట్టి నా సలహా పిచ్చిగా దీని జోలికి ఎవ్వరూ వెల్ల వద్దు. కొన్ని ప్రతేక సందర్భములో మాత్రమే దీని ప్రయోగము చేయ వలెను. మహావిద్య (వనదుర్గ) పారాయణ చేసే వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఇతరులు ఎంత మాత్రము కాదు. ఈమెను పూజించడానికి కూడా ఎంతో అర్హత కావాలి. ఇతర దేవతలను పూజించినట్లు గాదు ఈ దేవత పూజ. దీనికి గాను ప్రత్యేకమైన కల్పము కూడా వున్నది. ఏమాత్రము అశౌచము వున్నా ఈమె తన దగ్గరకు రానీయదు. అసలు ఈ దేవాలయములోనికి నేరుగా ఎవ్వరినీ చూడనివ్వరు. దూరముగా కిటికీలో నుంచి చూడ నిస్తారు. ఆమె ఉగ్ర స్వరూపమును చూచి తట్టుకో లేరని.
పర మంత్ర, పర యంత్ర, పర తంత్ర, పర కృత్యాది, సర్వ దుష్ట గ్రహ సర్వామయ నివృత్తి కొరకు, ప్రతికూల౦ నివృత్తి కొరకు ప్రత్యంగిరా ఋక్పారాయణము, జపము, హోమము చేయుట శాస్త్ర వచనము. ఇందులో హోమ ద్రవ్యములుగా కారపు దినుసులు వాడటము ప్రత్యేకత. కొన్ని చోట్ల మిరప కాయలు, మిరియాలు, ఉల్లిపాయలు వేయడము నేను చూచినాను.
భాగవతంలో కాశీ రాజు శ్రీకృష్ణుని మీద అభిచారిక హోమము చేయించి, కృత్యను ప్రయోగిస్తాడు. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు అభిచారిక హోమము చేయించి, పాండవుల మీదకు మంత్ర ప్రయోగముతో కృత్యను పంపుతాడు. ఇలా చాలా చోట్ల ఈ ప్రయోగములు వున్నవి. ఇంతకు ముందు ఇది ఎక్కువగా తమిళనాడులో వున్నది. ఈ దేవి యొక్క దేవాలయాలు, పూజలు, యజ్ఞాలు ద్రవిడ దేశములో వున్నవి. ఇప్పడు మన దేశము (ఆంధ్ర) లో కూడా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఈర్ష్యా ద్వేషములతో, అసూయలతో ఒకరి కొకరు ఈ మంత్రముతో ప్రయోగించుకొంటే ఏమౌతుంది? మారణాయుధాలు అందరి చేతిలో పడితే ఏ విధ్వంసమునకు దారి తీయునో ఈ సృష్టి, ఈ ప్రకృతి ఏ మగునో ఓసారి ఆలోచించండి.
ఆత్మ రక్షా మంత్రములుగా దీనిని ఉపాసించ వచ్చును. ప్రత్యంగిరా సాధనలో దీనికి ప్రత్యేక యంత్రము, మంత్రము, తంత్రము విడిగా వున్నవి. శ్రీ ప్రత్యంగిరా కవచము కూడా వున్నది. ఉపాసకులు దీనిని రోజూ పఠించ వచ్చును.  ఆత్మశక్తి కొరకు, ఆత్మ రక్షణార్ధం ప్రత్యంగిరా ఋక్పారాయణము చేయుట సాధకులకు మంచిది.
సుదర్శనాస్త్ర మంత్ర సంపుటిత మైన ప్రత్యంగిరా మరియు నారాయణీ ప్రత్యంగిరా విశేష ప్రభావము గలవి.
విశ్వ శాంతి కొరకు వీటిని ఉపయోగిస్తాము. ఆపదలో వున్న వారిని రక్షించే నిమిత్తమై వీటిని ఉపయోగిస్తాము.
స్వార్ధానికి, ధనమునకు  ఎంత మాత్రమూ ఈ విద్యనూ ఉపయోగించము అని ప్రమాణము చేసుకొందాము.
సర్వే జనాత్ సుఖినోభవంతు.
ఓం శాంతి:  శాంతి:  శాంతి:
 మీ

భాస్కరానంద నాధ

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు

22/07/2012


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.