Tuesday, 12 March 2013

త్రుళ్ళి త్రుళ్ళి పడబోకవే మనసా !

త్రుళ్ళి త్రుళ్ళి పడబోకవే మనసా !

త్రుళ్ళి త్రుళ్ళి పడబోకవే మనసా !
నాది నాది అనుచూ విర్ర వీగకవే మనసా
నాది ఏమిటో తెలుస్కోవే మనసా !
 
సకలం తెలుసు అని తెలివి చూపకవే మనసా
తెలియంది ఎంతుందో తెలుసుకోవే  మనసా !
 
విద్య, జ్ఞానము నీ ఒక్కరి సొత్తు గాదే మనసా!
సకల జీవ రాశిది అని తెలుసుకొవే మనసా !
 
నాకే తెలుసు అని గర్వ పడబోకవే మనసా!
తెలిసినది రవ్వంత అని తెలివి తెచ్చుకోవే మనసా !
 
సాటి వారిని గుర్తెరగవే మనసా!
నీ కంటే వారు ఘనులు అని తెలుసుస్కోవే మనసా !
 
గురువులు, పెద్దలు, జ్ఞానులు ఎక్కడో లేరని తెలుస్కోవే మనసా !
 ఎదుటి వారిలోని జ్ఞానమును చూచి గౌరవించవే మనసా!
 
తూల మాడ బోకవే మనసా, అందరిలో రాముడున్నాడే మనసా!
దారులెన్నో మనసా, దారి చివర ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవే  మనసా!
 
హుంకరించకే మనసా, తెలియంది ఎంతో అని తలవంచవే మనసా!
పిచ్చోళ్ళు కాదే  చెంత చేరిన వాళ్ళు మనసా !
 
ఆర్తితో, ఆకలితో నీ పంచన చేరుతారే మనసా!
ఆదరించి ప్రేమ పంచవే మనసా!
 
ఇచ్చేవాడు గొప్ప కాదే మనసా,
ఖర్మ పుచ్చుకొనే వాడె గొప్ప అని తెలుస్కోవే మనసా!
 
ఇది అది  కావడానికి, అది ఇది  కావడానికి ఒక్క క్షణమే మనసా!
తిరగపడితే తిరకాసు లేకుండా పోతావే మనసా!
 
రోజులన్నీ మనవి కావే మనసా!
కాల మృత్యువు ఎదురు చూస్తున్నదే మనసా!
 
మహా మహులు బూడిదలో కలిసి పోయినారే  మనసా!
నువ్వెంతో, నీదేంతో తేలుసుకొవే మనసా!
 
జాలి, ప్రేమ పంచవే మనసా!
అదే నీతో వచ్చే మూల ఆస్తి అని గుర్తేరగవే మనసా!
 
అమ్మను తెలుసుకొవే మనసా ! అమ్మతనం తెలుస్కోవే మనసా!
బిడ్డ లందరూ అమ్మ వారుసులే అని తెలుస్కోవే మనసా!
 
నీది వేరు, నాది వేరు అనబోకవే మనసా 
అందరిదీ ఒకటే ఆ అది దైవం ఒకటే అని కళ్ళు తెరవవే మనసా!
 
నీ మతం వేరు, నా మతం వేరు అని అరవబోకవే మనసా!
అందరిదీ దైవ మతమేనే అదే ఆత్మ మతమేనే మనసా!
 
సాటివాడ్ని ఈసడించుకొకవే మనసా,
నిన్ను మోయడానికి ఆ నలుగురిలో వాడొక్కడే అని అనుకోవే మనసా!
 
గద్దె మీద కూర్చొని కళ్ళు నెత్తిన పెట్టుకోకవే  మనసా!
నాలుగు కాళ్ళల్లో ఒకటి కుంటి దైతే నీ గతి ఏమిటో తెలుసుకో మనసా !
 
నీ దేవుడు, నా దేవుడు అని రెండు లేవే మనసా!
వున్నది ఒక్కటేనే మనసా!
 
త్రుళ్ళి త్రుళ్ళి పడబోకవే మనసా !


--

మీ
శ్రీ భాస్కరానంద నాథ
 

Saturday, 9 March 2013

శ్రీవిద్య - గురువులు


మిత్రులకు నమస్కారములు

 
గురువు మంత్రమును మాత్రమే ఇవ్వగలడు, దారి చూప గలడు, కానీ ఆ దారిలో నడవవలసినది, సాధన చేయవలసినది మాత్రము శిష్యుడే. సాధన లేనిదే మంత్రము సిద్దించదు, అమ్మ అనుగ్రహించదు.

 శ్రీవిద్య అనేది కడు దుర్లభమైన విద్య, మనకు కావాలంటే రాదు అది, అమ్మ సంపూర్ణ అనుగ్రహము వుండాలి. అప్పుడే వస్తుంది.
రాగ ద్వేషాలకు లోబడిగాని, ఆశకు లోబడి గాని, విత్తమునకు గాని, మొహావేశములకు లోబడిగాని, ప్రలోభాలకు లొంగి గాని ఈ విద్యను ఇవ్వకూడదు.
కేవలం ఎవరికైతే అమ్మ మీద సంపూర్ణ విశ్వాసము వుంటుందో, భక్తీ ప్రపత్తులు వుంటాయో వారికి మాత్రమే ఈ విద్యను ఇవ్వాలి. శ్రీవిద్య మంత్ర శాస్త్రము, కడు దుర్లభమైనది, ఇది దొరికినది అంటె జన్మ ధన్యమైనట్లే.
అన్ని మంత్రముల కంటే విశిష్టమైనది ఈ శ్రీవిద్య. సాక్షాత్తు ఆ పరమ శివుడు తన ప్రియ సఖియైన పార్వతికి ఈ విద్య ఇచ్చాడు.
 

ఇది ఆది విద్య, శుద్ధ విద్య, ఆత్మ, బ్రహ్మ విద్య, వేదాలలో అతి రహస్యముగా వుంచబడినది ఈ విద్య. మూర్ఖుడికి, శఠునికి, దుష్టునికి, విశ్వాసము లేని వానికి ఈ విద్యను ఉపదేశించ రాదని శివుని ఆజ్ఞ.
శ్రీమాత యందు భక్తి గల వానికి ఈ విద్యను చెప్ప వచ్చును. భక్తి లేని వానికి ఈ విద్యను ఎంత మాత్రమూ చెప్పరాదు.
గురువు భక్తుడైన శిష్యునకు రహస్యమైనను ఈ విద్యను చెప్ప వలెను.
భర్త కిష్టమైన దేవి యొక్క ఆరాధన చేయు గృహిణికి అనుకూల దాంపత్యము కలుగును. లోపాముద్ర అట్టి గృహిణి,ఆమె ఉపాసించిన విద్య ఇది. ఆమె శ్రీమాత భక్తురాలు, ఆమె వలెనే అగస్త్యునకు కూడా ఈ విద్య దొరికినది.
ఇటువంటి శ్రీవిద్యను మొట్ట మొదట ఉపాసించిన వాడు, అగ్రగణ్యుడు ఆ పరమ శివుడే.
శ్రీవిద్యా మంత్రముల ఉపాసనచే ఆ జగన్మాత తన భక్తులకు వశమగును, అయితే ఎన్నో క్లిష్టమైన పరీక్షలు ఉండును,

శ్రీవిద్యా ఉపాసకులను చూచిన వెంటనే ఎంతటి వారైనా వారి పాదముల మీద దండము వలే క్రింద పడి నమస్కరించవలెను. శ్రివిద్యోపాసకుడు సాక్షాత్తు దేవీ స్వరూపము. శ్రివిద్యో పాసకులు బహు విచిత్రముగా కనిపించును, అతి సామాన్యముగా కనిపించును, వారి శక్తులను ప్రదర్శించుటకు వారు ఇష్ట పడరు. వారిని గుర్తించుట కూడా చాలా కష్టము. శ్రివిద్యోపాసకుడు అవిచ్చన్నమైన గురు సాంప్రదాయము లోని వాడైవుండవలెను.

 
 
మంత్రములకు మూలము శ్రీ గురు సార్వభౌములు. మోక్షమునకు మూలము జ్ఞానము, దానికి మూలము మహేశ్వరుడు, అతనికి మూలము శివ పంచాక్షరి, దానికి మూలము గురు వాక్యము.
అటువంటి గురువుల మీద పూర్తి విశ్వాసము, నమ్మకము వుండాలి. గురువుల మీద అచంచలమైన భక్తి, విశ్వాసము లేక పోతే ఈ విద్య రాదు. శ్రీవిద్యలో మూలం గురువే. గురువు అనుగ్రహిస్తేనే ఆ పరదేవత అనుగ్రహిస్తుంది.
అలాంటి గురువు ఆగ్రహిస్తే, ఆ తల్లి కూడా ఆగ్రహిస్తుంది. గురువే సర్వస్వం, గురు వాఖ్యమే శిరోధార్యం అని అనుకోవాలి. అటువంటి గురువులను ఎన్నడూ అనుమానించరాదు, అవమానించరాదు.
 
గురువును మించిన వాడు లేడు అని ఎల్లప్పుడూ గట్టి నమ్మకంతో వుండాలి. నగురోరధికం నగురోరధికం నగురోరధికం  నగురోరధికం అని పదే పదే అనుకోవాలి. గురువులు ఏది చేసినా అది అమ్మ పెట్టె పరీక్ష అనుకోవాలి గాని, గురువును నిందించ రాదు. గురువులోని లోపములను వెతుక రాదు, తన గురువులను ఇతర గురువులతో పోల్చుకొరాదు. గురువు చెప్పినదే వేదం అని అనుకోవాలి, గురువు ఒక శక్తి, ఒక తత్వం అంతేగాని ఒక వ్యక్తి గాదు. గురుమండల రూపిణిగా ఆ తల్లి ప్రకాశిస్తూ వుంటుంది. గురు రూపములో ఆ పర దేవత తిరుగుతూ వుంటుంది. గురువు సాక్షాత్తు ఆ పర దేవతా స్వరూపము అని నిండుగా భావించి పూజించాలి. గురువులకు తలవంపు వచ్చే పనులు గాని, భాధ గలిగే పనులు గాని ఎప్పుడూ తలపెట్ట కూడదు. గురువులకు అనుగ్రహము కలిగి నప్పుడే ఒక్కో మంత్రము ఇచ్చెదరు, అంతే గాని గురువులను బలవంత పెట్టి, ప్రలోభపెట్టి మంత్రము లను పొందరాదు.
 

గురు శిష్యుల బంధము ఒక తండ్రి కొడుకుల బంధములా ప్రేమానురాగాలతో వుండాలిగాని మరే విధముగానూ వుండకూడదు. రోజుకో గురువును మార్చుకొనే విధముగా వుండకూడదు. మంత్ర దీక్ష ఒకే ఒక్క గురువుల వద్దనే తీసుకొనవలెను, ఎన్నో కోట్ల జన్మలు ఎత్తినా దొరకని ఈ విద్యను అతి జాగ్రత్తగా కాపాడు కోవలెను. తపస్సు వలెనే జ్ఞానము సిద్దించును.  అంతటి పార్వతియే శివున్ని చేరడానికి ఎన్నో కష్టాలు, అవాంతరాలు ఎదుర్కొన్నది. 

గురువుల మీద నమ్మకము, శ్రద్ధ లేక పోతే ఈ విద్య ఎంత మాత్రము రాదు. 

 
శ్రీవిద్య ఇతర అన్ని విద్యలు లాంటిది  కాదు. శ్రీవిద్యా గురువులు మరమోత్క్రుష్టమైన గురువులు. 
తాత్కాలిక కోరికల కోసం, సుఖాల కోసం ఈ విద్య పనికి రాదు. ఇది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. అమ్మ ఉపాసన అన్నింట్లోకన్నా చాలా విలువైనది, గొప్పది. అవసరమైతే అమ్మ కోసం, గురువుల కోసం మన ప్రాణాలైనా సరే లెక్క పెట్ట కూడదు. గురు శిష్యులిద్దరికీ స్వార్ధము అసలు పనికి రాదు. మోహము పనికిరాదు. పూర్తి విశ్వాసముతో చివరి కంటూ గురువులను వదలి పెట్టను, అమ్మను వదలి పెట్టను అని ధృడ సంకల్పముతో వుండాలి.
 
గురువులో సాక్షాత్తు ఆ పరదేవతను చూడడం, కొలవడం చేత కాక పోతే ఈ శ్రీవిద్య రాదు. మరో దృష్టితో గురువులను చూచి అవమానిస్తే ఆ తల్లి యొక్క ఆగ్రహమునకు గురి కావలసి వస్తుంది. పొరబాటున కూడా ఇలా చేయకూడదు. అలాగే గురువులు కూడా తన శిష్యులను తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూచుకోవలెను. ఒక్కోసారి గురువులు తన బిడ్డలకు చెప్పని విద్యను కూడా తన శిష్యులకు చెప్పెదరు.
 

శ్రీవిద్య చాలా కఠినమైనది, ఎన్నో జన్మల ఉపాసన బలం వుంటే గాని ఈ జన్మలో రాదు, శ్రీవిద్య తీసుకొన్న తరువాత రక రకాల పరీక్షలు వచ్చును, మాయ పలు విధములుగా వచ్చును. చాలా తెలివితో అమ్మ మీద భక్తితో, గురువుల మీద నమ్మకంతో ఎదుర్కోన వలెను. మాయకు లోబడినావా ఈ విద్య నిలబడదు. శ్రీవిద్య ఆషామాషి కాదు. చాలా జాగ్రత్తగా భక్తిగా చేసుకోవలెను. పరమోత్కృష్టమైన ఈ విద్యను చివరి వరకు కాపాడుకోవడం చాలా కష్టమైనది. ఎంతో పట్టుదల, మొండి ధైర్యం వుంటే గాని చివరి వరకు ఎక్కలేము అన్ని మెట్లు. ప్రతి మెట్టుకు పరీక్షలు వుండును, అమ్మ పెట్టె పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే మరో మంత్రము వచ్చును. మాయకు తల వోగ్గినావా, క్రింద పడి పతనమై పోతావు. ఎక్కడ పొరబాటు జరిగినా మతి బ్రంశం జరుగును. అమ్మను అమ్మలాగే చూడాలి. స్త్రీలను అమ్మ స్వరూపములుగా చూడాలి. పూజించాలి. అమ్మ మనసు గెలుచుకోన్నావా ఇక నిన్ను వదలి పెట్టదు. గజ్జెలు కట్టుకొని నీ ఇంట్లో నీ పాపయై తిరుగుతూ వుంటుంది, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వుంటుంది. ఒక్కొరికి ఒక్కోవిధముగా పరీక్షలు వుండును. నీ భక్తిని అమ్మ పరీక్షించును. నిలబడ్డావా నీ జన్మ ధన్యమై పోయినది. లేదా క్రింది మెట్టుకు జారిపోతావు. అమ్మ కాళ్ళు పట్టుకొంటే అన్నింటినీ జయించే శక్తి అమ్మే ఇస్తుంది. అమ్మ కాళ్ళు, గురువు కాళ్ళు ఒక్కటే అని నమ్ముకొని గట్టిగా పట్టుకొన్న వాడికి సాధించ లేనిది ఏమీ లేదు ఈ సృష్టిలో.

గురువులు ఎప్పుడూ ఉత్తమ శిష్యుని కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వుంటారు, ఎందుకని తను నేర్చు కొన్న విద్యను ఉత్తమ శిష్యుని చేతిలో నిస్వార్ధముగా పెట్టడానికి. ఇది జ్ఞాన గంగ అంతముగా సాగిపోవాలి. మన దాకా వచ్చిన ఈ విద్యనూ అర్హులైన వారికందరికీ పంచాలని ఆత్రుతతో ఎదురు చూస్తూ వుంటారు,

ఎవ్వరూ ముందుకు రావడం లేదే అని ఎంతో మదన పడి పోతూ వుంటారు, మామూలు విద్యలు ఎవరైనా చెబుతారు, కానీ బ్రహ్మ జ్ఞానము ఇచ్చే ఈ బ్రహ్మ విద్యను మాత్రం ఎవ్వరూ నేర్పించలేరు, ఎవరికీ ఎవరు గురువులో ముందుగానే నిర్ణయించ బడి వుంటుంది. తన శిష్యుల కోసం రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఎదురుచూస్తూ వుంటారు.

మంచి గురువులు దొరకడం చాలా దుర్లభము, దొరికినా వారికి మన మీద కరుణ కలుగడం చాలా చాలా కష్టం. ఎంతో సాధన అవసరము.

ఏ పువ్వులలో మకరందము వుంటుందో, దాని మీద మాత్రమె తుమ్మెద వాలుతుంది, గ్రోలుతుంది.

మకరందమే భక్తీ, తుమ్మెద గురువులు, భగవంతుడు.

గురువులే స్వయముగా దక్షిణామూర్తి. మీ గురువులు మీకు సామాన్యమైన వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ వారి వెనుక గురుపరంపర, గురుశక్తి, గురు తత్వం వున్నది అని మరువరాదు. ఆ గురు శక్తి మిమ్ములను కాపాడుతుంది.

జాతక చక్రములో ఒక్క గురువు చూస్తేనే అన్ని దోషములు తొలగినప్పుడు, ఇక స్వయముగా మీ గురువులు మీ ఇంటికి వచ్చి, మిమ్ములను అనుగ్రహిస్తే ఎంత మేలు జరుగుతుందో ఒక్క సారి ఆలోచించండి. గురు పాదములు పట్టుకోండి మీ జన్మ తరిస్తుంది. గురువులను మించినది ఏదీ లేదు ఈ లోకంలో.               మీ పాపములను ఒక్క గురు దేవుళ్ళు మాత్రమే తొలగించ గలరు, భగవంతుడు కూడా తోలిగించలేడు.

గురువు మంత్రమును మాత్రమే ఇవ్వగలడు, దారి చూప గలడు, కానీ ఆ దారిలో నడవవలసినది, సాధన చేయవలసినది మాత్రము శిష్యుడే. సాధన లేనిదే మంత్రము సిద్దించదు, అమ్మ అనుగ్రహించదు. 

శిష్యునకు ఉండవలసినవి ముఖ్యమైన లక్షణములు .. ఓర్పు, ఓపిక, నమ్మకము, పట్టుదల, ధృతి, త్యాగము, అచంచల మైన భక్తీ విశ్వాసములు.  

 
 
శ్రీవిద్య, శ్రీచక్రము, శ్రీమాత ఒకసారి వస్తే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఉద్దరింప బడుతాయి. మీ వంశము తరిస్తుంది. 
అటువంటి మహా గురువులందరికీ నమస్కరిస్తూ,
 
 
శ్రీమాత్రే నమః

మీ





 

Sunday, 3 March 2013

సాధన – తపస్సు


సాధన – తపస్సు

కర్మ రెండు విధములు. ఒకటి పాప కర్మ, రెండు పుణ్య కర్మ. పాపపు పనులు చేస్తే దానిని పాపపు కర్మ అని, పుణ్య మైన పనులు చేస్తే దానిని పుణ్య కర్మ అని అంటారు అని మన అందరికీ తెలుసు.

ఒకరికి ద్రోహం చేసినాము, ఒకరిని అనవసరముగా కొట్టినాము, తిట్టినాము, భాధ కలిగించినాము, ఏడిపించినాము, చంపినాము  అధర్మముగా నడుచు కొన్నాము, చేయ కూడని పనులు చేసినాము, అసత్యము చెప్పినాము,  అన్యాయము చేసినాము, వేద విరుద్ద పనులు చేసినాము, పెద్దలను, గురువులను అవమాన పరిచినాము, భాగవతోత్తములకు, సిద్ధ పురుషులకు ఇబ్బంది కలిగించినాము ...ఇలా   ... ఇవన్నీ పాపపు కర్మలు.

తీర్ధ యాత్రలు చేసినాము, దాన, ధర్మములు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, త్యాగాలు, చేసినాము. వేద, ఇతిహాస, పురాణాదులు, శ్రవణం, మననం చేసినాము, భజనలు చేసినాము. ధర్మ బద్దముగా, సత్యము చెబుతూ పరోపకార బుద్దితో, త్యాగ బుద్దితో నడుచుకోన్నాము ఇవన్నీ పుణ్య కర్మలు.

పాపం, పుణ్యం అనుభవిస్తే క్షయం అవుతుంది, తరిగి పోతుంది. రెంటినీ అనుభవించడానికి మరలా జన్మ ఎత్తాలి. ఇలా సాగిన తరువాత చివరకి మిగిలిన ఖర్మ అనుభవించ డానికి యమలోకం, స్వర్గ లోకం రెండూ వున్నాయి. జీవి అక్కడ తన ఖాతా పూర్తి చేసుకొంటాడు. ఎక్కడైనా జీవి తన ఖర్మను తానే ఎప్పటికైనా అనుభవించక తప్పదు. తన ఖర్మ తాను అనుభవించడానికే జన్మలు తీసుకొంటాడు. తను చేసిన పాప, పుణ్య ఖర్మలు జ్యోతిష చక్రములో గ్రహాల రూపములో నీ కుండలిని తయారు అవుతుంది. నీ జాతక చక్రం తయారు అవుతుంది. ఆ జాతక కుండలిని ప్రకారము జీవుడు మరలా జన్మిస్తాడు. నీవు చేసుకొన్న ఖర్మే నీ జాతక చక్ర రూపములో వస్తుంది. నిన్ను బాధిస్తుంది, సుఖ పెడుతుంది, యోగ మిస్తుంది, దుర్యోగ మిస్తుంది. భార్యా బిడ్డలను ఇస్తుంది, డబ్బును ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, దుఖాన్ని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, అవమానము ఇస్తుంది. అంతా నీ జాతక చక్ర ప్రభావమే, అంతా నీవు చేసుకొన్న ఖర్మ ప్రభావమే. నీవు చేసుకొన్న కర్మ ప్రభావమే గ్రహాలు ఎదుటి వ్యక్తుల ద్వారా వచ్చి నీకు కష్టాన్ని, సుఖాన్ని ఇస్తూ వుంటారు గోచార రీత్యా. ఇది నీ ప్రారబ్ద ఖర్మ, ఇది నీ సంచిత ఖర్మ. అనుభవించక తప్పదు.

ఇది నేను చేసుకొన్న ఖర్మే అని ప్రతి ఒక్కడూ ఒప్పుకోక తప్పదు. ఒక్కోరికి ఒక్కోసారి ఈ ఖర్మను అనుభవించక తప్పదు గ్రహ గతులు మారినప్పుడు. ఎవరు చేసుకొన్న ఖర్మ వాడు అనుభవించ కుండా తప్పదు ఎవరికైనా.

అయితే ఇక్కడే మనము ఆలోచించ వలసినది ఒకటి వున్నది. మరి దీనికి విముక్తి లేదా? ఎప్పుడో ఏదో పాపం ఏదో జన్మలో చేసినాను. తెలియక చేసినానో, తెలిసి చేసినానో అది కూడా తెలియదు. ఇప్పుడు ఈ జన్మలో నాకు సంతానము లేదు, ఇక నా బ్రతుకు ఇంతేనా అని కొందఱు ప్రశ్నిస్తూ వుంటారు. ఈ జన్మలో పెళ్లి లేదు, ఈ జన్మలో లక్ష్మీ కటాక్షము లేదు, ఉన్నతి లేదు,  సద్గతి లేదు, ఇంతేనా నా బ్రతుకు, నాకు మోక్షము లేదా? దారి లేదా ? అని...

వున్నది. సద్గతి వున్నది. నీ పాప ఖర్మను తొలగించుకోడానికి ఉపాయము వున్నది. నీ జన్మ జన్మల పాప ఖర్మను ప్రక్షాళన చేసుకోవడానికి దారి వున్నది. అది మూడు రకములు.

౧. నీ పాప ఖర్మను ఎవరన్నా తీసుకొని వారు అనుభవిస్తే అది పోతుంది.

౨. నీ పాప ఖర్మను నీవే పూర్తిగా అనుభవిస్తే అది పోతుంది.

౩. సాధన చేత, తపస్సు చేత, జ్ఞానము చేత  నీ పాప ఖర్మ అగ్నిలో కాలి బూడిద అవుతుంది.

మొదటి రెండు మనము చేయలేము కాబట్టి, అది మన వలన కాదు కాబట్టి మూడవది చేస్తాము.

మనం సృష్టిని గమనిస్తే, ఏ పనీ ఏకాగ్రత లేకుండా సఫలము కాలేదు. ఈ నామ రూపాత్మక సృష్టికి మూల కారణమైన పర బ్రహ్మము కూడా సృష్టి అనేది తన కంటే భిన్నముగా చేయటానికి పూనుకోన్నప్పుడు, ఆ బ్రహ్మ పదార్ధము కూడా సాధన చేసిన పిమ్మటనే క్రియాశీలత వచ్చినది. సృష్టి ఆవిర్భవించినది.

సో కామయత బహుస్యాం ప్రజాయే యేతి,     
సా తపస్తత్వా   ఇమామ్  లోకాం అసృజత్,  
 స ఈక్షాం  చకార,                                                                                                                                                                                                                                                  
ధాతా యధాపూర్వమకల్పయత్.

అన్న నాలుగు వేద వాక్యముల ప్రకారము  బ్రహ్మ పదార్ధము తనని తాను ద్వైతముగా భావించుకొని, బ్రహ్మము ఒకటి, బ్రహ్మము యొక్క శక్తి పేర అదే మహా మాయ (ఆది శక్తి, మూల ప్రకృతి) గా రెండుగా తాను భావన చేసిన కారణము చేత సృష్టి చేయాలి అనే కోర్కె అతనిలో కలిగినది.
కలిగినంత మాత్రం చేత మహాత్కార్యములు మాటలతో ముడి పడవు. దాని వెనుక ఎంతో కృషి వుండాలి. అదే సాధన, తపస్సు.

"సాతపః తప్త్వా"....ఆ బ్రహ్మ ఎంతో తపస్సు చేసి, ఇమాం లోకాం అసృజత్.... ఈ లోకాలన్నీ సృష్టించ గలిగినాడు. తరువాత సాఫల్యముతో  స ఈక్షాం చకార,    తన్ను తాను చూచుకొని, తాను ఒక్కడినే ఉన్నానుకొని,   తాను శక్తిమంతుడని,   తాను ఒక్కడే ఎందుకు ఉండవలెను, తన లాంటి జీవులను కొన్నింటిని పుట్టిస్తే బాగుండునని అనుకొన్నాడు. అనుకోని   థాతా యధాపూర్వమకల్పయత్. .. అనుకున్నంత మాత్రాన సాధన పూర్తి కాలేదు. మళ్ళీ తపస్సు చేసి, పూర్వ మన్వంతరముల యందు ఏ రీతిగా తాను బ్రహ్మమయి, సృష్టిని చేసుకోన్నాడో ఆ రీతిన మరలా తిరిగి ఈ సృష్టిని కల్పించినాడు అని ఈ వేద వాక్యము యొక్క తాత్పర్యము.      

సృష్టికి మూల కారణమైన బ్రహ్మయే మహత్కార్య సాధనకు అంత సాధన చేయవలసి వస్తే ఇక సామాన్య మానవులం, మనం లౌకిక కార్యమునకు గానీ, అలౌకిక కార్యమునకు గానీ లేక మన పాప ఖర్మ తొలిగించుకోవడానికి గానీ ఎంత కృషి అవసరము ఎంత సాధన అవసరము, ఎంత తపస్సు అవసరమో ఒక్క సారి ఆలోచించండి.

ఆ కృషి కోన సాగించ వలెనంటే, ఆ కార్యము నందు, సంకల్పము నందు  భక్తీ, శ్రద్ధ రెండూ వుండవలె. ఆ పని తప్ప మరొకటి మన మనస్సుకు గోచరించకుండా అందే మనస్సు లగ్నము అయి ఉండవలెను. ఆ రీతిగా వుంటే తప్ప, సాధన చేస్తే తప్ప అది తపస్సుగా మారదు. తపస్సు అయితే తప్ప మన కర్మలు నశించవు.

మనస్సు లగ్నముతో చేసే ఏ పుణ్య కార్యమైనా అది తపస్సుగా మారును. తపస్సు నుండి అగ్ని జనించును, ఆ అగ్ని యందు నీ పాప ఖర్మలు అన్నీ నశించును. తదేకముగా ఒక పాట వినుట, ఒక ప్రవచనం వినుట, ఒక పురాణం చదువుట, ఒక దృశ్య కావ్యము చూచుట, ఒక మంత్రోపాసన చేయుట,  ఒక మంచి మాట చెప్పుట, ఒకే దాని మీద దృష్టి నిల్పి ధ్యానము చేయుట ఇవి అన్నీ తపస్సులే.

మంత్రోపదేశము పొంది దానిని పుర్చరణ చేయుట సాధన,  పుర్చరణ తరువాత దానిని మననం చేయుటయే ఉపాసన.
ఉపాసనయే  తపస్సు.  దీర్ఘ కాలము తపస్సు చేయుట సమాధి. సమాధి దీర్ఘ కాలము అయితే నిర్వికల్ప సమాధి. అది దీర్ఘమయితే మహా నిర్వికల్ప సమాధి.
సత్యము చెప్పుట ఒక వ్రతముగా ఆచరించుట తపస్సు. ఏదైనా ఒక మంచి పనిని ఏకాగ్రతతో, మనస్సు లగ్నం చేసి ఆచరించుట తపస్సు.

మనస్సుతో ఏకాగ్రతగా చేసే పనిని అంటారు లగ్నం.
భగవంతునికి చేసే పూజాదికములు ఏకాగ్రతగా కొన్ని క్షణములు,
నిమిషములు చేస్తే అది లగ్నం.
ఆ లగ్నం కొన్ని గంటలు చేస్తే అది తపస్సు.
ఆ తపస్సు కొన్ని రోజులు నిరంతరముగా చేస్తే సమాధి .
ఆ సమాధి కొన్ని నెలలు, సంవత్సరములు చేస్తే అది నిర్వికల్ప సమాధి.     
 తపస్సు వలన అన్ని కర్మలు నశించును.   శుభం కలుగును.    

ఎందరో మహా పురుషులు, యోగులు, గురువులు అందరికీ వందనములు.
జ్ఞాన బిక్ష పెట్టె వారు అందరూ గురువులే. వారి అందరికీ నా నమస్కారములు

తెలియజేసుకొంటూ,                                            

స్వస్తి

మీ
శ్రీ భాస్కరానంద నాథ
4-3-2012, @ 1.26 AM


 




 









 


Friday, 1 March 2013

గురియే గురువు.

గురువు అంటే గురి. గురి లేనిదే గురుత్వం లేదు.
మనకు ఎవరిమీద గురి వుంటుందో వారినే గురువుగా స్వీకరించవలెను.
అక్కడే మనకు భక్తీ, గౌరవము కలుగుతుంది, విద్య వస్తుంది. లేక పోతే చాలా విపత్కర పరిస్థితులకు అది దారి తీస్తుంది.
అది ఎలాగంటే " మనస్సు ఒకచోట మనువు ఒకచోట"... అన్నట్లుగా అలా జరిగితే అది వివాహము, సంసారము అని అనిపించుకోదు. అలాగే ఇది కూడా.
ఎక్కడైతే మనకు ప్రశాంతత కలుగుతుందో, ఎవరిని చూస్తే మనకు భక్తీ భావము కలుగుతుందో, ఎవరి మీద నమ్మకము కలుగుతుందో, ఎక్కడ గురి కుదురుతుందో వారినే గురువుగా స్వీకరించాలి.
అప్పుడే మనము ఆధ్యాత్మకముగా ముందుకు వెళ్ళగలము.

గురువు శిష్యుణ్ణి పరీక్షించాలి, అలాగే శిష్యుడు కూడా తన గురువు ఎలాంటి వాడు అనేది కూడా తెలుసుకోవాలి, ఒకరినొకరు తెలుసుకోకుండా దీక్ష తీసుకొంటే చాలా ఇబ్బందులు వస్తాయి.
గురువు తన శిష్యుణ్ణి అనేక రకాలుగా పరీక్ష చేస్తారు. కొంతమంది ఆ మొదటి రెండు, మూడు పరీక్షలలోనే ఫెయిల్ అయి వెనుకకు తిరుగుతారు.
గురువు తనకు విద్య చెప్పలేదే అని అసంతృప్తితో ఉండకూడదు, చెప్పలేదు అని మనసులో కూడా అనుకోకూడదు. అది వారి ఇష్టం.

"గురువు గారు మీకు నా మీద ఇంకా ఎందుకు దయ రాలేదు, ఏమి పాపం నేను చేసినాను, నా మీద మీ కరుణ చూపండి, జ్ఞానము భిక్ష పెట్టండి, నా జీవితము రోజు రోజుకు తరిగి పోతున్నది, దయ చూపండి గురువరేణ్య, దయ చూపండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాలి."
గురువులను ఎలా అడగాలో నేర్చుకోవాలి. అంతే గానీ chating లోనో, e-mails లోనో అడుగ కూడదు. 

మనకు ఎవరి మీద గురి ఉన్నదో వారి దగ్గరకు వెళ్ళాలి, వారిని ప్రాధేయ పూర్వకముగా అడుగాలి,
" ఓ .. మహాభాగా, నన్ను, నా ఆత్మను ఉద్దరించండి అని కన్నీళ్ళతో వేడుకోవాలి. వారి కాళ్ళు పట్టుకోవాలి, పదే పదే తిరగాలి, ఆవేదన చెందాలి.  గురువు గారి మనస్సు కరిగి పోయేలా మీ (మన) ప్రవర్తన వుండాలి. పది సంవత్సరములు అయినా సరే వదలకుండా తిరగాలి.
ఇది మామూలు లౌకిక విద్యలు కాదు అడుగ గానే చెప్పడానికి, ఏదో కొంత ధనము తీసుకొని.

మీకు విద్య ధారపోస్తే , తత్ఫలితముగా గురువు ల యొక్క తపః శక్తి నశిస్తుంది. ఎలా అంటే వారి పుణ్యము మీకు వస్తుంది, మీ పాపము వారికి వెళుతుంది. మీ పాప కర్మ వారు అనుభవించాలి మీకు మంత్ర దీక్ష ఇచ్చినందులకు. ఎందుకు ఇలా చేయాలో ఆలోచిన్చినారా ? గురువులు కరుణా స్వరూపులు, ప్రేమ స్వరూపులు, మనల్ని ఉద్దరించడానికే వారు వచ్చినారు.  మరలా వారు ఎక్కువగా సాధన చేసుకోవాలి. స్వార్ధము లేకుండా వారు మీకు విద్యను ఇస్తారు. మీకు మంత్రోపదేశము చేయడము అంటే వారి యొక్క తపః శక్తిని ధారపోసినట్లే, ఇక ఆ క్షణము నుంచి మీరు చేసే ఎ చిన్న తప్పు అయినా దానిలోని సగము పాపము మీ గురువులకు చుట్టు కొంటుంది. మనము వారికీ మేలు చేయక పోయినా కీడు తల పెట్ట కూడదు కదా ? మన పాపము వారికి తగులకూడదు కదా? అదే మీరు గురువులకు ఇచ్చే గురు దక్షిణ. వారు చెప్పినట్లు నడుచుకోవడమే గురు దక్షిణ.

శిష్యుడు అంటే గురు పాదములకు పాదుకలు లాగా మనము కావాలి. వారి చెప్పులు మాదిరి మన  జీవితము కావాలి. అప్పుడే గురువుల పూర్తి అనుగ్రహము మన  పైన కలుగుతుంది. అప్పడు నీకు విద్య చెప్పకపోయినా, నీమీద వాత్సల్యముతో నీ అంత్య దశలో, నీవు మూర్ఖుడువైనా, తెలివి లేని వాడివి అయినా  
నీ జుట్టు పట్టుకొని పైకి లాగుతారు గురువులు, నీకు ఒక్క క్షణములో పూర్తి విద్యనూ ప్రసాదిస్తారు. జ్ఞాన,మోక్షములను అవలీలగా అనుగ్రహిస్తారు.

అదీ గురు అనుగ్రహము అంటే. అది తెలుసుకొని నడుచుకోవడం మన విధి. గురు పాదములు పట్టుకోండి. మీ గురువులు మీ ఎదుటనే వున్నారు. వారిని ఆశ్రయించండి. గురువులు అంటే అమ్మే. అమ్మ మనసు వెన్న. గురువులు ఎప్పుడూ మనకు దగ్గరగా వుండాలి, మన ఊరిలోని వారు అయ్యి వుండాలి.

అందుకని గురువులు ఎంతో దూరం ఆలోచించి శిష్యులను ఎంపిక చేసుకొంటారు. సద్భావన కలిగిన వాడినే శిష్యుడిగా స్వీకరిస్తారు. అది మనకు తెలియకుండా మనము వారిని నిందిస్తాము.
గురువులకు కూడా పై నుంచి ఆజ్ఞ రావాలి నీకు విద్య చెప్పాలంటే . ఎప్పడు వారి మనస్సు కరుగుతుందో, అప్పుడు వారు నీకు దీక్ష ఇస్తారు. అది అర్ధరాత్రి కావచ్చు, ఎ అడివిలోనో కావచ్చు.
అప్పటి దాకా నీవు ఓర్పుతో వేచి వుండాలి.

గురువులకు దూరములో వున్న శిష్యుడి పైనే ఎక్కువ ప్రేమ, ఆలోచన, దిగులు వుంటుంది దగ్గర వారికన్నా. అయ్యో మనము చాలా దూరములో ఉన్నాము, గురువులు మనల్ని పట్టించుకోవడము లేదే అని దిగులు పడనవసరము లేదు. గురువులు సర్వాంతర్యామి. వారికి అన్నీ తెలుస్తాయి.
గురువుల మనస్సు కరగాలి, వారికి మనపై జాలి, దయ, ప్రేమ కలగాలి , అప్పటి దాకా మనము వేచి వుండాలి. ఏ గురువులు అయినా ఇంతే. గురు తత్వము అంతే.
శిష్యుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అంటే " నాగమహాశయుని జీవిత చరిత్ర చదవాలి మనము.

వారు వారి గురువుల (శ్రీ రామకృష్ణుల వారి ) కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది.
దానిలో ఆవ గింజ అంత కూడా మనము సాధన చేయుట లేదు.
భగ భగ మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు, ఇది గుర్తు పెట్టుకొని మనము మసులుకోవాలి.
మనమే కోపముగా వుంటే మన దగ్గరకు ఎవరు వస్తారు, ఎవరు నీకు ఆశ్రయమిస్తారు. ఎవరు నిన్ను దగ్గరకు తీసుకొంటారు, ఎవరు విద్యను ఇస్తారు.

ఎవరు అనుగ్రహమిస్తారు. ఒక వేళ ఇచ్చినా అది సఫలము కాదు. శ్రీమాత అనుగ్రహము కలుగదు.
శాంతి, ప్రేమ, త్యాగము ... పరోపకారం ... వుంటే అందరూ నీ దగ్గరకు వస్తారు. ఇదే మనము నేర్చుకోవలసినది.

పట్టుదల వుంటే సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. గ్రహా గతులను కూడా మార్చవచ్చు.
చిరు నవ్వుతో మెలుగుదాము అందరమూ. ఆనందమును పంచుతాము.

ఓం శాంతి: శాంతి: శాంతి:

శ్రీ గురుభ్యోనమః 

మీ
శ్రీ భాస్కరానంద నాథ/  01-03-2013