గురువు అంటే గురి. గురి లేనిదే గురుత్వం లేదు.
మనకు ఎవరిమీద గురి వుంటుందో వారినే గురువుగా స్వీకరించవలెను.
అక్కడే మనకు భక్తీ, గౌరవము కలుగుతుంది, విద్య వస్తుంది. లేక పోతే చాలా విపత్కర పరిస్థితులకు అది దారి తీస్తుంది.
అది ఎలాగంటే " మనస్సు ఒకచోట మనువు ఒకచోట"... అన్నట్లుగా అలా జరిగితే అది వివాహము, సంసారము అని అనిపించుకోదు. అలాగే ఇది కూడా.
ఎక్కడైతే మనకు ప్రశాంతత కలుగుతుందో, ఎవరిని చూస్తే మనకు భక్తీ భావము కలుగుతుందో, ఎవరి మీద నమ్మకము కలుగుతుందో, ఎక్కడ గురి కుదురుతుందో వారినే గురువుగా స్వీకరించాలి.
అప్పుడే మనము ఆధ్యాత్మకముగా ముందుకు వెళ్ళగలము.
గురువు శిష్యుణ్ణి పరీక్షించాలి, అలాగే శిష్యుడు కూడా తన గురువు ఎలాంటి వాడు అనేది కూడా తెలుసుకోవాలి, ఒకరినొకరు తెలుసుకోకుండా దీక్ష తీసుకొంటే చాలా ఇబ్బందులు వస్తాయి.
గురువు తన శిష్యుణ్ణి అనేక రకాలుగా పరీక్ష చేస్తారు. కొంతమంది ఆ మొదటి రెండు, మూడు పరీక్షలలోనే ఫెయిల్ అయి వెనుకకు తిరుగుతారు.
గురువు తనకు విద్య చెప్పలేదే అని అసంతృప్తితో ఉండకూడదు, చెప్పలేదు అని మనసులో కూడా అనుకోకూడదు. అది వారి ఇష్టం.
"గురువు గారు మీకు నా మీద ఇంకా ఎందుకు దయ రాలేదు, ఏమి పాపం నేను చేసినాను, నా మీద మీ కరుణ చూపండి, జ్ఞానము భిక్ష పెట్టండి, నా జీవితము రోజు రోజుకు తరిగి పోతున్నది, దయ చూపండి గురువరేణ్య, దయ చూపండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాలి."
గురువులను ఎలా అడగాలో నేర్చుకోవాలి. అంతే గానీ chating లోనో, e-mails లోనో అడుగ కూడదు.
మనకు ఎవరి మీద గురి ఉన్నదో వారి దగ్గరకు వెళ్ళాలి, వారిని ప్రాధేయ పూర్వకముగా అడుగాలి,
మనకు ఎవరి మీద గురి ఉన్నదో వారి దగ్గరకు వెళ్ళాలి, వారిని ప్రాధేయ పూర్వకముగా అడుగాలి,
" ఓ .. మహాభాగా, నన్ను, నా ఆత్మను ఉద్దరించండి అని కన్నీళ్ళతో వేడుకోవాలి. వారి కాళ్ళు పట్టుకోవాలి, పదే పదే తిరగాలి, ఆవేదన చెందాలి. గురువు గారి మనస్సు కరిగి పోయేలా మీ (మన) ప్రవర్తన వుండాలి. పది సంవత్సరములు అయినా సరే వదలకుండా తిరగాలి.
ఇది మామూలు లౌకిక విద్యలు కాదు అడుగ గానే చెప్పడానికి, ఏదో కొంత ధనము తీసుకొని.
మీకు విద్య ధారపోస్తే , తత్ఫలితముగా గురువు ల యొక్క తపః శక్తి నశిస్తుంది. ఎలా అంటే వారి పుణ్యము మీకు వస్తుంది, మీ పాపము వారికి వెళుతుంది. మీ పాప కర్మ వారు అనుభవించాలి మీకు మంత్ర దీక్ష ఇచ్చినందులకు. ఎందుకు ఇలా చేయాలో ఆలోచిన్చినారా ? గురువులు కరుణా స్వరూపులు, ప్రేమ స్వరూపులు, మనల్ని ఉద్దరించడానికే వారు వచ్చినారు. మరలా వారు ఎక్కువగా సాధన చేసుకోవాలి. స్వార్ధము లేకుండా వారు మీకు విద్యను ఇస్తారు. మీకు మంత్రోపదేశము చేయడము అంటే వారి యొక్క తపః శక్తిని ధారపోసినట్లే, ఇక ఆ క్షణము నుంచి మీరు చేసే ఎ చిన్న తప్పు అయినా దానిలోని సగము పాపము మీ గురువులకు చుట్టు కొంటుంది. మనము వారికీ మేలు చేయక పోయినా కీడు తల పెట్ట కూడదు కదా ? మన పాపము వారికి తగులకూడదు కదా? అదే మీరు గురువులకు ఇచ్చే గురు దక్షిణ. వారు చెప్పినట్లు నడుచుకోవడమే గురు దక్షిణ.
శిష్యుడు అంటే గురు పాదములకు పాదుకలు లాగా మనము కావాలి. వారి చెప్పులు మాదిరి మన జీవితము కావాలి. అప్పుడే గురువుల పూర్తి అనుగ్రహము మన పైన కలుగుతుంది. అప్పడు నీకు విద్య చెప్పకపోయినా, నీమీద వాత్సల్యముతో నీ అంత్య దశలో, నీవు మూర్ఖుడువైనా, తెలివి లేని వాడివి అయినా
నీ జుట్టు పట్టుకొని పైకి లాగుతారు గురువులు, నీకు ఒక్క క్షణములో పూర్తి విద్యనూ ప్రసాదిస్తారు. జ్ఞాన,మోక్షములను అవలీలగా అనుగ్రహిస్తారు.
అదీ గురు అనుగ్రహము అంటే. అది తెలుసుకొని నడుచుకోవడం మన విధి. గురు పాదములు పట్టుకోండి. మీ గురువులు మీ ఎదుటనే వున్నారు. వారిని ఆశ్రయించండి. గురువులు అంటే అమ్మే. అమ్మ మనసు వెన్న. గురువులు ఎప్పుడూ మనకు దగ్గరగా వుండాలి, మన ఊరిలోని వారు అయ్యి వుండాలి.
అందుకని గురువులు ఎంతో దూరం ఆలోచించి శిష్యులను ఎంపిక చేసుకొంటారు. సద్భావన కలిగిన వాడినే శిష్యుడిగా స్వీకరిస్తారు. అది మనకు తెలియకుండా మనము వారిని నిందిస్తాము.
గురువులకు కూడా పై నుంచి ఆజ్ఞ రావాలి నీకు విద్య చెప్పాలంటే . ఎప్పడు వారి మనస్సు కరుగుతుందో, అప్పుడు వారు నీకు దీక్ష ఇస్తారు. అది అర్ధరాత్రి కావచ్చు, ఎ అడివిలోనో కావచ్చు.
అప్పటి దాకా నీవు ఓర్పుతో వేచి వుండాలి.
గురువులకు దూరములో వున్న శిష్యుడి పైనే ఎక్కువ ప్రేమ, ఆలోచన, దిగులు వుంటుంది దగ్గర వారికన్నా. అయ్యో మనము చాలా దూరములో ఉన్నాము, గురువులు మనల్ని పట్టించుకోవడము లేదే అని దిగులు పడనవసరము లేదు. గురువులు సర్వాంతర్యామి. వారికి అన్నీ తెలుస్తాయి.
గురువుల మనస్సు కరగాలి, వారికి మనపై జాలి, దయ, ప్రేమ కలగాలి , అప్పటి దాకా మనము వేచి వుండాలి. ఏ గురువులు అయినా ఇంతే. గురు తత్వము అంతే.
శిష్యుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అంటే " నాగమహాశయుని జీవిత చరిత్ర చదవాలి మనము.
వారు వారి గురువుల (శ్రీ రామకృష్ణుల వారి ) కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది.
దానిలో ఆవ గింజ అంత కూడా మనము సాధన చేయుట లేదు.
భగ భగ మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు, ఇది గుర్తు పెట్టుకొని మనము మసులుకోవాలి.
మనమే కోపముగా వుంటే మన దగ్గరకు ఎవరు వస్తారు, ఎవరు నీకు ఆశ్రయమిస్తారు. ఎవరు నిన్ను దగ్గరకు తీసుకొంటారు, ఎవరు విద్యను ఇస్తారు.
ఎవరు అనుగ్రహమిస్తారు. ఒక వేళ ఇచ్చినా అది సఫలము కాదు. శ్రీమాత అనుగ్రహము కలుగదు.
శాంతి, ప్రేమ, త్యాగము ... పరోపకారం ... వుంటే అందరూ నీ దగ్గరకు వస్తారు. ఇదే మనము నేర్చుకోవలసినది.
పట్టుదల వుంటే సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. గ్రహా గతులను కూడా మార్చవచ్చు.
చిరు నవ్వుతో మెలుగుదాము అందరమూ. ఆనందమును పంచుతాము.
ఓం శాంతి: శాంతి: శాంతి:
శ్రీ గురుభ్యోనమః
మీ
శ్రీ భాస్కరానంద నాథ/ 01-03-2013
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.