Sunday, 3 March 2013

సాధన – తపస్సు


సాధన – తపస్సు

కర్మ రెండు విధములు. ఒకటి పాప కర్మ, రెండు పుణ్య కర్మ. పాపపు పనులు చేస్తే దానిని పాపపు కర్మ అని, పుణ్య మైన పనులు చేస్తే దానిని పుణ్య కర్మ అని అంటారు అని మన అందరికీ తెలుసు.

ఒకరికి ద్రోహం చేసినాము, ఒకరిని అనవసరముగా కొట్టినాము, తిట్టినాము, భాధ కలిగించినాము, ఏడిపించినాము, చంపినాము  అధర్మముగా నడుచు కొన్నాము, చేయ కూడని పనులు చేసినాము, అసత్యము చెప్పినాము,  అన్యాయము చేసినాము, వేద విరుద్ద పనులు చేసినాము, పెద్దలను, గురువులను అవమాన పరిచినాము, భాగవతోత్తములకు, సిద్ధ పురుషులకు ఇబ్బంది కలిగించినాము ...ఇలా   ... ఇవన్నీ పాపపు కర్మలు.

తీర్ధ యాత్రలు చేసినాము, దాన, ధర్మములు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, త్యాగాలు, చేసినాము. వేద, ఇతిహాస, పురాణాదులు, శ్రవణం, మననం చేసినాము, భజనలు చేసినాము. ధర్మ బద్దముగా, సత్యము చెబుతూ పరోపకార బుద్దితో, త్యాగ బుద్దితో నడుచుకోన్నాము ఇవన్నీ పుణ్య కర్మలు.

పాపం, పుణ్యం అనుభవిస్తే క్షయం అవుతుంది, తరిగి పోతుంది. రెంటినీ అనుభవించడానికి మరలా జన్మ ఎత్తాలి. ఇలా సాగిన తరువాత చివరకి మిగిలిన ఖర్మ అనుభవించ డానికి యమలోకం, స్వర్గ లోకం రెండూ వున్నాయి. జీవి అక్కడ తన ఖాతా పూర్తి చేసుకొంటాడు. ఎక్కడైనా జీవి తన ఖర్మను తానే ఎప్పటికైనా అనుభవించక తప్పదు. తన ఖర్మ తాను అనుభవించడానికే జన్మలు తీసుకొంటాడు. తను చేసిన పాప, పుణ్య ఖర్మలు జ్యోతిష చక్రములో గ్రహాల రూపములో నీ కుండలిని తయారు అవుతుంది. నీ జాతక చక్రం తయారు అవుతుంది. ఆ జాతక కుండలిని ప్రకారము జీవుడు మరలా జన్మిస్తాడు. నీవు చేసుకొన్న ఖర్మే నీ జాతక చక్ర రూపములో వస్తుంది. నిన్ను బాధిస్తుంది, సుఖ పెడుతుంది, యోగ మిస్తుంది, దుర్యోగ మిస్తుంది. భార్యా బిడ్డలను ఇస్తుంది, డబ్బును ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, దుఖాన్ని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, అవమానము ఇస్తుంది. అంతా నీ జాతక చక్ర ప్రభావమే, అంతా నీవు చేసుకొన్న ఖర్మ ప్రభావమే. నీవు చేసుకొన్న కర్మ ప్రభావమే గ్రహాలు ఎదుటి వ్యక్తుల ద్వారా వచ్చి నీకు కష్టాన్ని, సుఖాన్ని ఇస్తూ వుంటారు గోచార రీత్యా. ఇది నీ ప్రారబ్ద ఖర్మ, ఇది నీ సంచిత ఖర్మ. అనుభవించక తప్పదు.

ఇది నేను చేసుకొన్న ఖర్మే అని ప్రతి ఒక్కడూ ఒప్పుకోక తప్పదు. ఒక్కోరికి ఒక్కోసారి ఈ ఖర్మను అనుభవించక తప్పదు గ్రహ గతులు మారినప్పుడు. ఎవరు చేసుకొన్న ఖర్మ వాడు అనుభవించ కుండా తప్పదు ఎవరికైనా.

అయితే ఇక్కడే మనము ఆలోచించ వలసినది ఒకటి వున్నది. మరి దీనికి విముక్తి లేదా? ఎప్పుడో ఏదో పాపం ఏదో జన్మలో చేసినాను. తెలియక చేసినానో, తెలిసి చేసినానో అది కూడా తెలియదు. ఇప్పుడు ఈ జన్మలో నాకు సంతానము లేదు, ఇక నా బ్రతుకు ఇంతేనా అని కొందఱు ప్రశ్నిస్తూ వుంటారు. ఈ జన్మలో పెళ్లి లేదు, ఈ జన్మలో లక్ష్మీ కటాక్షము లేదు, ఉన్నతి లేదు,  సద్గతి లేదు, ఇంతేనా నా బ్రతుకు, నాకు మోక్షము లేదా? దారి లేదా ? అని...

వున్నది. సద్గతి వున్నది. నీ పాప ఖర్మను తొలగించుకోడానికి ఉపాయము వున్నది. నీ జన్మ జన్మల పాప ఖర్మను ప్రక్షాళన చేసుకోవడానికి దారి వున్నది. అది మూడు రకములు.

౧. నీ పాప ఖర్మను ఎవరన్నా తీసుకొని వారు అనుభవిస్తే అది పోతుంది.

౨. నీ పాప ఖర్మను నీవే పూర్తిగా అనుభవిస్తే అది పోతుంది.

౩. సాధన చేత, తపస్సు చేత, జ్ఞానము చేత  నీ పాప ఖర్మ అగ్నిలో కాలి బూడిద అవుతుంది.

మొదటి రెండు మనము చేయలేము కాబట్టి, అది మన వలన కాదు కాబట్టి మూడవది చేస్తాము.

మనం సృష్టిని గమనిస్తే, ఏ పనీ ఏకాగ్రత లేకుండా సఫలము కాలేదు. ఈ నామ రూపాత్మక సృష్టికి మూల కారణమైన పర బ్రహ్మము కూడా సృష్టి అనేది తన కంటే భిన్నముగా చేయటానికి పూనుకోన్నప్పుడు, ఆ బ్రహ్మ పదార్ధము కూడా సాధన చేసిన పిమ్మటనే క్రియాశీలత వచ్చినది. సృష్టి ఆవిర్భవించినది.

సో కామయత బహుస్యాం ప్రజాయే యేతి,     
సా తపస్తత్వా   ఇమామ్  లోకాం అసృజత్,  
 స ఈక్షాం  చకార,                                                                                                                                                                                                                                                  
ధాతా యధాపూర్వమకల్పయత్.

అన్న నాలుగు వేద వాక్యముల ప్రకారము  బ్రహ్మ పదార్ధము తనని తాను ద్వైతముగా భావించుకొని, బ్రహ్మము ఒకటి, బ్రహ్మము యొక్క శక్తి పేర అదే మహా మాయ (ఆది శక్తి, మూల ప్రకృతి) గా రెండుగా తాను భావన చేసిన కారణము చేత సృష్టి చేయాలి అనే కోర్కె అతనిలో కలిగినది.
కలిగినంత మాత్రం చేత మహాత్కార్యములు మాటలతో ముడి పడవు. దాని వెనుక ఎంతో కృషి వుండాలి. అదే సాధన, తపస్సు.

"సాతపః తప్త్వా"....ఆ బ్రహ్మ ఎంతో తపస్సు చేసి, ఇమాం లోకాం అసృజత్.... ఈ లోకాలన్నీ సృష్టించ గలిగినాడు. తరువాత సాఫల్యముతో  స ఈక్షాం చకార,    తన్ను తాను చూచుకొని, తాను ఒక్కడినే ఉన్నానుకొని,   తాను శక్తిమంతుడని,   తాను ఒక్కడే ఎందుకు ఉండవలెను, తన లాంటి జీవులను కొన్నింటిని పుట్టిస్తే బాగుండునని అనుకొన్నాడు. అనుకోని   థాతా యధాపూర్వమకల్పయత్. .. అనుకున్నంత మాత్రాన సాధన పూర్తి కాలేదు. మళ్ళీ తపస్సు చేసి, పూర్వ మన్వంతరముల యందు ఏ రీతిగా తాను బ్రహ్మమయి, సృష్టిని చేసుకోన్నాడో ఆ రీతిన మరలా తిరిగి ఈ సృష్టిని కల్పించినాడు అని ఈ వేద వాక్యము యొక్క తాత్పర్యము.      

సృష్టికి మూల కారణమైన బ్రహ్మయే మహత్కార్య సాధనకు అంత సాధన చేయవలసి వస్తే ఇక సామాన్య మానవులం, మనం లౌకిక కార్యమునకు గానీ, అలౌకిక కార్యమునకు గానీ లేక మన పాప ఖర్మ తొలిగించుకోవడానికి గానీ ఎంత కృషి అవసరము ఎంత సాధన అవసరము, ఎంత తపస్సు అవసరమో ఒక్క సారి ఆలోచించండి.

ఆ కృషి కోన సాగించ వలెనంటే, ఆ కార్యము నందు, సంకల్పము నందు  భక్తీ, శ్రద్ధ రెండూ వుండవలె. ఆ పని తప్ప మరొకటి మన మనస్సుకు గోచరించకుండా అందే మనస్సు లగ్నము అయి ఉండవలెను. ఆ రీతిగా వుంటే తప్ప, సాధన చేస్తే తప్ప అది తపస్సుగా మారదు. తపస్సు అయితే తప్ప మన కర్మలు నశించవు.

మనస్సు లగ్నముతో చేసే ఏ పుణ్య కార్యమైనా అది తపస్సుగా మారును. తపస్సు నుండి అగ్ని జనించును, ఆ అగ్ని యందు నీ పాప ఖర్మలు అన్నీ నశించును. తదేకముగా ఒక పాట వినుట, ఒక ప్రవచనం వినుట, ఒక పురాణం చదువుట, ఒక దృశ్య కావ్యము చూచుట, ఒక మంత్రోపాసన చేయుట,  ఒక మంచి మాట చెప్పుట, ఒకే దాని మీద దృష్టి నిల్పి ధ్యానము చేయుట ఇవి అన్నీ తపస్సులే.

మంత్రోపదేశము పొంది దానిని పుర్చరణ చేయుట సాధన,  పుర్చరణ తరువాత దానిని మననం చేయుటయే ఉపాసన.
ఉపాసనయే  తపస్సు.  దీర్ఘ కాలము తపస్సు చేయుట సమాధి. సమాధి దీర్ఘ కాలము అయితే నిర్వికల్ప సమాధి. అది దీర్ఘమయితే మహా నిర్వికల్ప సమాధి.
సత్యము చెప్పుట ఒక వ్రతముగా ఆచరించుట తపస్సు. ఏదైనా ఒక మంచి పనిని ఏకాగ్రతతో, మనస్సు లగ్నం చేసి ఆచరించుట తపస్సు.

మనస్సుతో ఏకాగ్రతగా చేసే పనిని అంటారు లగ్నం.
భగవంతునికి చేసే పూజాదికములు ఏకాగ్రతగా కొన్ని క్షణములు,
నిమిషములు చేస్తే అది లగ్నం.
ఆ లగ్నం కొన్ని గంటలు చేస్తే అది తపస్సు.
ఆ తపస్సు కొన్ని రోజులు నిరంతరముగా చేస్తే సమాధి .
ఆ సమాధి కొన్ని నెలలు, సంవత్సరములు చేస్తే అది నిర్వికల్ప సమాధి.     
 తపస్సు వలన అన్ని కర్మలు నశించును.   శుభం కలుగును.    

ఎందరో మహా పురుషులు, యోగులు, గురువులు అందరికీ వందనములు.
జ్ఞాన బిక్ష పెట్టె వారు అందరూ గురువులే. వారి అందరికీ నా నమస్కారములు

తెలియజేసుకొంటూ,                                            

స్వస్తి

మీ
శ్రీ భాస్కరానంద నాథ
4-3-2012, @ 1.26 AM


 




 









 


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.