శృతి స్మృతి
పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం
శంకరం లోక శంకరం.
సౌందర్యలహరి- 1
శివః శక్త్యా
యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న
ఖలు కుశలః స్పందితుమపి ,
అతస్త్వామారాధ్యాం
హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం
వా కథమకృత పుణ్యః ప్రభవతి .
అమ్మా , ఓ భగవతీ
సర్వ మంగళ సహితుడగు శివుడు జగన్నిర్మాణ శక్తి వగు నీతో గూడిననే కానీ జగములను
సృజించుటకు సమర్ధుడు కాడు. అట్లు నీతో కూడడేని ఆ దేవుడు తాను కదులుటకు సైతము
శక్తుడు కాడు. కావున హరిహర హిరణ్యగర్భులు లోనగు వారి చేతను కూడా పూజింప దగిన
నిన్ను గూర్చి నమస్కరించుటకు గాని, స్తుతించుటకు గాని పూర్వ జన్మమున పుణ్యము చేయని
వాడు ఎట్లు సమర్ధుడు అగును? కానేరడు.
శుభముల నొసగే ఆ
పరమ శివుడు అమ్మ లేకుండా ఒక్క పని కూడా చేయ లేడు, అమ్మ లేకుండా కనీసం స్పందించను
కూడా లేడు, కదలడం వేరు,స్పందన వేరు. అమ్మా నీవులేనిదే మా అయ్య ఏ పని చేయలేడు
గదమ్మా, ఏ పనీచేయ డానికి కూడా తోచదు ఆయనకు. అటువంటి శక్తి స్వరూపిణివి నీవు.
బ్రహ్మ,విష్ణు,రుద్రాదులు చేత నిత్యమూ పూజించ బడే నిన్ను పూజించాలన్నా,
నమస్కరించాలన్నా, నీ స్తోత్రము చదువాలన్నా మేము పూర్వ జన్మలో ఎంతో పుణ్యము చేసి
వుండాలి తల్లీ, లేక పోతే మా వల్ల అవుతుందా నిన్ను కొలవడం, ఎంత భాగ్యమో కదా తల్లీ
నిన్ను పొగడడం. ఏ నోము ఫలమో, ఏ వ్రత, యజ్ఞ, హోమ, జప, ధ్యాన ఫలితమో తల్లీ ఈ రోజు
నిన్ను తలుచుకొనే భాగ్యము మాకు కలిగినది. కరుణ జూపు తల్లీ, కరుణ జూపు.
శివ అంటే సర్వ
మంగళ కరుడు, శుభంకరుడు. సర్వ మంగళ అంటే
గౌరీ, కాబట్టి శివ అంటేనే గౌరితో కూడిని వాడు.
అయ్య లోనే అమ్మ
వున్నది అని మనకు అర్ధం అవుతుంది. శివ శబ్దం లోనే అమ్మ వున్నది.
శివ చక్రములు
నాలుగింటి తోను, శక్తి చక్రములు అయిదింటి తోను కలిసి శివ శక్త్యాత్మకమైన శ్రీ చక్రము శివాశివుల శరీరమై యున్నది.
సూచన:-
భార్యాభర్తలు ఎలా కలిసి మెలిసి ఉండాలో ఉండాలో ఈ శ్లోకం మనకు చెబుతుంది. ప్రకృతీ పురుషులు
ఆ పార్వతీ పరమేశ్వరులు. వారి అన్యోన్యత దాంపత్యం గురించి ఎంత చక్కగా భగవత్పాదులు
వివరించినారో కదా. ప్రతి కార్యంలో కూడా ధర్మపత్ని యొక్క చేయూత తప్పక వుండాలి అని
చెబుతుంది ఈ శ్లోకం.
సర్వం శ్రీ
ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరానంద నాథ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.