Sunday, 27 April 2014

సౌందర్యలహరి- 7

సౌందర్యలహరి- 7
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభ స్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్ర వదనా |
ధనుర్బాణాన్‌ పాశం సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా || 7||


గణగణమని మ్రోగుచున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే స్తనముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురములను మట్టుపెట్టిన శివుని అహంకార స్వరూపి యగు భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

 (భాస్కరానంద భావము)
శ్రీ గురువులు క్రిందటి శ్లోకములో అమ్మను మనకు హిమ గిరి తనయ అని పరిచయం చేసినారు, అమ్మ పేరు చెప్పినారు, ఇప్పుడు ఇక అమ్మ ఎలా వుంటుందో అమ్మ ను గురించి వర్ణన చేస్తున్నారు.
అమ్మ సౌందర్యం అయ్యకే ఎరుక. వర్ణించడానికి ఇక ఎవరి తరము కాదు. అసలు కూడదు,  అది మర్యాద కాదు, అమ్మ సౌందర్యాన్ని కొడుకు వర్ణించ కూడదు, అమ్మ తనాన్ని తనయుడు వర్ణించ వచ్చును.
అమ్మ ఎలాగున్నా అమ్మ అమ్మే. అమ్మ ప్రేమానురాగాలు కావాలి గానీ అమ్మ అందం తో పని లేదు కొడుక్కి.
మనము పామరులము,  మన నేత్రములతో చూడలేము కాబట్టి,  మనం పట్టుకోవడానికి వీలుగా  వారు దిగి వచ్చి అమ్మ యొక్క సౌందర్యాన్ని మన కోసం వర్ణిస్తున్నారు. అమ్మ తనాన్ని వర్ణించాలంటే అమ్మ రూపు రేఖలను కాస్త వర్ణించాలి గదా,

అమ్మ ఎలా వుంటుందో అమ్మ రూపురేఖలను వర్ణిస్తూ అమ్మను మన ముందుకు తీసుకొని వస్తున్నారు.  స్త్రీలలో ఉత్తమ జాతియైన పద్మినీ జాతి స్త్రీల యొక్క సాముద్రిక లక్షణములు ఇలాగే వుంటాయి.  ముజగ్గములకు మూల తల్లియైన లోక మాత ఆమె. జగద్గురువులు వారు దర్శించి మనకు దర్శింప చేస్తున్నారు ఈ శ్లోకములో. అమ్మ తనాన్ని ప్రస్ఫుటంగా తెలియ జేస్తున్నారు ఇక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ ఇక్కడ మనకు పచ్చి బాలింతరాలు  లాగ కనిపిస్తున్నది. పాలతో సమృద్దిగా వున్న గోమాత దగ్గరకు లేగ దూడ వెళ్లినట్లుగా మన శంకరులు కనిపిస్తున్నారు. గోమాత యొక్క పొదుగును చూచి, తన్ని, పాలు త్రాగిన లేగ దూడ గా ఆది శంకరులు కనిపిస్తున్నారు.

అమ్మ గోమాత. గోమాత లో పర దేవత వున్నది అని పెద్దలు అంటారు. లోకాన్ని తన  క్షీర సంపదతో గోమాత ఎలాగైతే పాలు ఇచ్చి రక్షిస్తున్నదో, అలాగే లోక మాత తన క్షీర సంపదతో ఈ సృష్టిని పోషిస్తున్నది అందుకే ఆమె ఆబ్రహ్మకీటజనని అయ్యినది.

కరికలభ కుంభ స్తననతా:-  గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే స్తనముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలది. ఇదే విషయాన్ని మనము లలితా సహస్రనామం లో చూడ వచ్చును.
స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా...అని.
స్తనముల భారముచే ముందుకు వంగినది, సన్నని నడుము గలది అని అన్నారు శంకరులుఅన్నారు. సన్నని నడుము గల స్త్రీ సంతానవతి పెక్కు పిల్లలకు తల్లి అగును అని సాముద్రికము. ఆమె శ్రీమాత గంపెడు సంతానము గలది. సృష్టిలోని పశు పక్ష్యాదులు అన్నీ ఆమె సంతానమే కదా, కాబట్టి సమృద్ధిగల  క్షీర సంపదతో, పాల బరువుతో కరికలభ కుంభ స్తనన అయ్యినది. సర్వ జగత్తుకు తన స్తన్యాన్ని ఇచ్చి పోషించ వలసిన జగన్మాతకు స్తన భారం అధికంగా వుండడం సహజం, అది శుభప్రదం. స్తనములు మాతృకా చిహ్నములు, అవి ఎప్పుడూ సమృద్దిగా వుండాలి అప్పుడే లోకములు  సుభిక్షముగా ఉండును.

క్వణత్కాఞ్చీదామా:-   గణగణమని మ్రోగుచున్న చిరుగంటలతో కూడిన మొలనూలు, పట్టు దారము కలది.
రత్న కింకిణికారమ్యరశనాదామ భూషితా .... చిరు గంటలచే మ్రోగుచున్న, మెరియుచున్న బంగారు మొల నూలు కట్టుకొని వున్నది అమ్మ వారు, చిన్న వడ్డాణం లాంటిది అనుకోండి. సన్నని నడుము కాబట్టి సువర్ణ వస్త్రము జారిపోకుండా బంగారు ఆభరణము ధరించినది.  కాదు కాదు  నడుము గట్టితనం కోసం సువర్ణ వస్త్రాన్ని మూడు సార్లు మూడు మడతలుగా కట్టుకొన్నది. కాదు కాదు మూడు వేదములను, మూడు కాలములను  మూడు రేఖలుగా (వళిత్రయ) ధరించినది అని. అమ్మవారు త్రయాక్షరి కాబట్టి మూడు బీజాక్షరములను మూడు రేఖలుగా ధరించినది.  త్రిపుర సుందరి కాబట్టి మూడు లోకములకు చిహ్నములుగా మూడు వరుసల మొల నూలు ధరించినది.

దామము అంటే త్రాడు అని చెప్పు కోవచ్చును.   ద్యతి పశుదౌష్ట్య మితి దామ .....అని అమరకోశము.
పశువులను కట్టు త్రాడు. దీని చేత కట్టు బడు వాడు. దేని చేత? భక్తిచేత.  అందుకే శ్రీకృష్ణుడు దామోదరుడు అయినాడు.
పరిణత శరచ్చంద్ర వదనా:-   శరచ్చంద్ర నిభానన.....అని మనకు లలితా సహస్ర నామం లో కనిపిస్తుంది. శరదృతువు నందలి పున్నమి చంద్రుని వంటి ముఖము గలది. పరిణత అంటే సంపూర్ణ కళలు కలిగిన అని అర్ధము వస్తుంది ఇక్కడ.  వికసించిన, విప్పారిన మోము గలది. సంపూర్ణమైన (64) కళలతో ముఖము బాగా విప్పారి వున్నది, కాబట్టి అమ్మ ఒక బాలింత లాగ కనిపిస్తున్నది. ఆమె శ్రీమాత, సృష్టి కర్త్రీ.  అమ్మ ఎప్పుడూ పిల్లలను కంటూ వుంటుంది కాబట్టి ఆమె ఎప్పుడూ బాలింత లాగే వుంటుంది. పరిణత అంటే పచ్యతే క్రమేణ పక్వం. పక్వా బుద్ధిః,  వేరొక అవస్థను పొందునది. కాల వశమున పరిపాకము పొందునది. పరిపూర్ణురాలు అయినటు వంటిది అని అర్ధము. స్త్రీ మాతృత్వం తో పరి పూర్ణత పొందుతుంది.

మనోరూపేక్షుకోదండా, పంచ తన్మాత్ర సాయకా, రాగ స్వరూపపాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ....అని లలితా సహస్ర నామంలో చెప్పిన విధముగా అమ్మ నాలుగు చేతులతో నాలుగు ఆయుధములను ధరించి వున్నది. ఆమె ధనుస్సును, బాణాల్ని, పాశాన్ని, అంకుశాన్ని ధరించి వున్నది. జీవుల మనస్సు ఆమెకు ధనుస్సు. పంచ తన్మాత్రలు పంచ బాణములు. రాగము ఆమె పాశము, క్రోధము ఆమె అంకుశము. దుష్టుల యొక్క  కామ క్రోధాదుల విషయములో అమ్మ క్రోధ రూపమైన అంకుశము కలిగి వుంటుంది. అది కూడా మనకు రక్షయే గదా.

పురమథితు రాహో పురుషికా:-

మగవాడి అహంకారము ఆడదాని సౌందర్యము. ఆడదాని అహంకారము మగ వాడి హోదా.
భర్త కలెక్టరు అయితే భార్య కూడా కలెక్టరే. ఆయిన హోదాను చూసి భార్య యొక్క గొప్పతనము, గడసరి తనము వుంటుంది. 
ఆమె పరబ్రహ్మ పట్టమహిషి. శ్రీమహారాజ్ఞి. మహారాజు యొక్క ఇల్లాలు కాబట్టి  అహో పురుషికా అయినది.

పురమథనుడు పురములను మధించిన వాడు లేక త్రిపురాసురులను మర్దించిన వాడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, త్రిగుణాతీతుడు శివుడు. రుద్రయామళము లో  త్రిపురా బీజాక్షరములను (బాల మంత్రము)  మధించిన వాడు రుద్రుడు అని చెప్పబడి ఉన్నది. ఓం కార స్వరూపుడు (అ+ఉ+మ) శివుడు. అ, ఉ, మ, అనే మూడు అక్షరములతో ఏర్పడిన వాడు. శివుడు త్రిపురాంతకుడు, సమస్త లోకములకు తండ్రి,.
నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే,
సత్యా యాది కుటుంబినే ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే ...... శివానందలహరి

ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం, మోక్షదం తస్మై ఓం కారాయ నమో నమః.
అటువంటి మహా దేవుణ్ణి కట్టుకొని నీవు పెత్తనం చేలాయిస్తున్నావు గదమ్మా .. అహో పురుషికా ! ఎంత గడుసరిదానవమ్మా నీవు (స్త్రీ వాచకముగా చెప్పడం)
కాదు కాదు మా అమ్మను పెళ్ళాడి, త్రిపుర సుందరిని భార్యగా పొందిన ఆ మహా శివుని అహంకారము చూసి  అహో పురుషికా ...అని అన్నారు. (పురుష వాచకము గా చెప్పడం)

ఇక్కడ స్త్రీ వాచకముగా చెప్పడం సబబు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది అమ్మను గురించి వర్ణించిన సౌందర్య లహరి కాబట్టి. అమ్మను గురించి ఉద్దేశిస్తూ అహో పురుషికా ! ఎంత గడుసరిదానవమ్మా నీవు! అటు వంటి మహా త్రిపుర సుందరి నా హృదయ కమలము నందు వసించు గాక! శివుని అహంకార స్వరూపిణియగు ఆ మహాదేవి మా ఎదుట సుఖాసీనురాలై ప్రత్యక్షమగు గాక. అటువంటి తల్లికి నమస్కరిస్తూ......

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.

(సరస్వతీ రామచంద్ర రావు)/27-04-2014 @ శ్రీకాళహస్తి 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.