Tuesday, 26 April 2016

పవిత్రత - సాధన

నాకు రేపు ఎం జరగబోతున్నదో తెలిసిపోతున్నది ....నేను మొహం చూసి వాడి జాతకం చెప్పేస్తాను....నేను నా నోటి వెంబడి ఏది అంటే అది జరిగిపోతున్నది....నాకు అదృశ్య శక్తులు వున్నాయి....నాకు చాలా గొప్ప కలలు వస్తున్నాయి....నేను విభూది ఇస్తే జ్వరం తగ్గిపోతున్నది.......

ఇలా చాలా మంది నాతో అంటూ వుంటారు......ఏమిటి ఇది అంతా.....90% ఇలాంటి వాళ్లందరినీ అడిగాను....మీ గురువు ఎవరు అని....మాకు గురువులు ఎవ్వరూ లేరండీ....మాకు కలలో కనిపించి ఎవరో బాబా చెప్పారండీ మంత్రం....అది చేస్తున్నాను నాకు ఇలా శక్తి వచ్చేసింది.....
ఓకావిడ అడిగింది నన్ను....ఏమండీ నాకు అమ్మవారు కనిపించి చండీ సప్తశతి చదవమన్నది ...ఎలా చేయాలండీ అని....
అమ్మా ఆమెనే అడుగు ఎలా చేయాలో....నేను చెప్పలేను...అని తప్పించుకొన్నా...
కొందరు మాకు ఆ గుడికి వెళితే ఓ సన్యాసి మాకు శ్రీచక్రం ఇచ్చారండీ....ఎలా పూజ చేయాలి?
నాకు తెలియదమ్మా వారినే అడుగు....అని చెప్పా....

అసలు ఇదంతా ఏమిటి నిజమా? భ్రమా? చిత్త చాంచల్యమా?

అదుపు తప్పిన సాధన ఇది.....సాధనలో తాత్కాలిక అతీంద్రియ శక్తులు రావడం సహజం.., నిజం....వాటిల్ని తట్టుకొనే శక్తి అందరికీ వుండదు....సరైన గురువు లేకపోతే ఎలా నియత్రించాలో తెలియక శక్తులు దుర్వినియోగం అవుతాయి. Mental imbalance అవుతుంది....తమకు ఏదో శక్తి వున్నదని పిచ్చిలో పడి భ్రష్టులు అయిపోతారు. నీలో ఏ శక్తి లేదు, అదంతా ఒట్టి భ్రమ అని చెప్పినా వారు నమ్మరు...అదే భ్రమలో తిరుగుతూ వుంటారు, నిజం తెలుసుకోలేరు ఎప్పటికీ....ఇదో పిచ్చి....ఏదో మానవాతీత శక్తులు తనకు వున్నాయి అని గాఢంగా నమ్ముతూ వుంటారు, నమ్మబలికిస్తూ వుంటారు....సాధనలో జరిగే అతి సాధారణ స్థితి ఇది....దీనిని దాటాలి....ఇక్కడే చాలా మంది ఆగి పిచ్చిలో పడిపోతూ వుంటారు....తనకు ఏ గొప్ప స్థితి రాలేదని, అది మాయ అని ముందుకు జరగాలి, సాధన జరగాలి.....తనకు తాత్కాలికంగా వచ్చిన శక్తులను గురించి పట్టించుకోకూడదు ...భ్రమలో, మాయలో పడకూడదు. దీనివలన ఎంతో మానసికమైన ఓత్తిడికి గురి అవుతున్నారు ఎందరో.

గురువు...గురి లేకుండా తమకు తాము ఏదో గొప్ప దైవాంశ సంభూతులని అతి నమ్మకం....పిచ్చి.....అదే నిన్ను ఈ పరిస్థితులలోకి చేరుస్తున్నది ....ఎక్కువగా ఆడవాళ్లు ఇలా తయారౌతున్నారు....పిచ్చి భ్రమలలోకి వెళ్లి చేతులారా బంగారం లాంటి సంసారాన్ని నాశనం చేసుకొంటున్నారు....అదే trans లో ఊహలలో వుండిపోతున్నారు.....మరి వారు చెప్పే మాటలు అబద్దమా కాదు.....నిజం.
ఇంట్లో మొగుడికి అన్నం వండి పెట్టలేవు, పిల్లవాడికి కావలసినవి చూడవు....ఎక్కడో ఎవరో బాబా....ఆ ప్యాలస్ లో ఒళ్లు మరచి భజనలు....మొగుడ్ని ప్రేమించలేవు....ఎవడో ముక్కు మొహం తెలియని వాణ్ణి నమ్మి నీ జీతం రాళ్లు అప్పనంగా ఇచ్చేస్తావు.

పద్మవ్యూహం లోకి వెళ్లడం ఎంత ముఖ్యమో రావడం అంత ముఖ్యం .

మన మనస్సు లోతులకు వెళ్లి శోధిస్తే కొన్ని కోరికలు బీజ రూపంలో బలంగా నక్కి వుంటాయి....అవి తీర్చుకోవడానికి మనిషి అవకాశం కోసం ఎదురు చూస్తూ వుంటాడు...

సరిగ్గా ఇదే సమయంలో ఎవరన్నా చెప్పే మాటలు చాలా బలంగా తాకుతాయి గుండెలను...నీవు కారణ జన్మురాలివమ్మా....నీ వలనే నీ భర్త బ్రతికి వున్నాడు....నీవు మహా శక్తిమంతురాలివి....నీ చేతిలో ఈ రేఖ వున్నది....నీ మొహం వెలిగిపోతున్నది....నీవు మహా యోగినివి.....అని అంటూ ఓ మంత్రమో లేక యంత్రమో ఇస్తాడు....ఇది జపించు రోజూ అంటాడు.....అతని అమాయకత్వాన్ని చూసి మనం వుత్త చేతులతో పోనీయకుండా ఏదో తృణమో, ఫణమో ఇచ్చి పంపుతాము ....

ఎవడో వాడు తెలియదు....రుద్రాక్ష అంటాడు, కోయవాళ్ల దగ్గర వుండే ఓ డూప్లికేట్ రుద్రాక్ష ఐదు పైసలు కూడా చేయనిది నీకు అంట గట్టుతాడు....బజారులో 50 రూపాయలకు కొనుక్కొని వచ్చిన రాగి యంత్రం శ్రీచక్రం అని నీకు ఇస్తాడు.....పాపం ఆడవాళ్లు అతి సులభంగా నమ్మేస్తారు....ఇది చేస్తే నీకు డబ్బు వస్తుంది లేదా మీ ఆయన కొంగు పట్టుకొని తిరుగుతాడు అని చెబుతాడు....

పాపం ఆడదానికి ఎంత సేపూ తన సంసారం, పిల్లలు బాగుండాలని తపన...అందరినీ నమ్మేస్తుంది ....సాధన మొదలు పెడుతుంది....

కొన్నాళ్లకు నిజంగానే ఆ శక్తి వస్తుంది.....ఇక తట్టుకోలేదు....ఆడది మహా కాళి అయి చిందులు త్రోక్కితే మగ వాడు మహా కాలుడు కావాలి, కాని ఈయనకు సాధన లేదు,  అందువలన కాలేడు....ఆమెను పట్టుకోలేడు....మరి ఎం చేయాలి?

సూర్యుణ్ణి ఆరాధించిన కుంతికి ఏమైనది....నాకు తెలియదు, నన్ను ఆరాధించినావు,  నేను వచ్చాను, నీకు వరం ఇచ్చినగాని నేను వెనుకకు మరలను....అన్నాడు ఇచ్చేసాడు....జీవితాంతం బాధపడినది.....మరి గురువులు ఇవ్వలేదా? గురువులే ఇచ్చారు, అవసరం అయినప్పుడు వాడుకోమన్నారు....వినకుండా....ఎలా వుంటుందో అని మంత్రం చదివింది సూర్యున్ని చూసి చదివినది.....దేవతలు ఇచ్చేశారు శక్తిని....ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు....ఎవరినీ అడిగి చేయలేదు....ఫలితం అనుభవించినది.

ఆడవాళ్లు గాని, మగ వాళ్లు గాని ఏదైనా సాధన చేసేటప్పుడు గురువుల పర్యవేక్షణ లో సాధన చేయవలయును.....లేనిచో వారి సాధన కొన్నాళ్లకు నిజంగా ఫలించును, ఆ మంత్ర శక్తి కూడా నీకు వస్తుంది.....ఇక్కడ నీవు పొరబాటు చేస్తావు....ఆ శక్తికి తట్టుకోలేవు, మతి చలిస్తుంది, నీకై నీవు కంట్రోలు చేసుకోలేకపోతే వచ్చే విపరీత అనర్ధాలు....అణిమాది అష్ట
సిద్దులు కూడా నీకు సాధనలో వస్తాయి తప్పకుండా కానీ ప్రయోజనం ఏమిటి? ఎలా ఉపయోగించాలో తెలియక, ఆ మత్తులో పడి పిచ్చి వాగుడు వాగుతూ వుంటావు...

ఓ త్రాగుబోతు నిండా త్రాగి చిందులు త్రొక్కుతూ, బూతులు తిడుతూ భార్యను కొడుతూ వుంటాడు.....ఇంకోడు పూర్తిగా త్రాగి, మత్తును అనుభవిస్తూ గమమ్ముగా ఇంటికి వచ్చి నిదురపోతాడు....ఏం వాడికి తిట్టాలని వుండదా? వుంటుంది....కానీ వాడు ఎరుకలో వుంటాడు, సంస్కారం పదే పదే గుర్తు వస్తూ వుంటుంది.....

శారీరికంగా, మానసికంగా పవిత్రతను పెంచుకొంటూ, యమ, నియమములను సాధన చేస్తూ గురువు గారి పర్యవేక్షణలో మంత్ర సాధన చేస్తే ....సరైయిన మార్గములో తిన్నగా ఓడుదుడుకులు లేకుండా పురోగతి సాధించగలవు.....లేదా mis fire అవుతుంది నీ సాధన...దానిని నీవు నియంత్రించ లేవు...

మనలోని మాలిన్యాలు ధ్యాన  సమయాలలో, సాధనలో పైకి తప్పక వస్తాయి...మనల్ని దారి తప్పిస్తాయి...
మనం అలవాటు పడిన రుచులు మనల్ని అంత తేలికగా వదలిపెట్టవు ...ఎంతో నియంత్రణ కావాలి...ఇంద్రియాల మీద వున్న ఆకర్షణలు అంతో ఇంతో బీజ రూపంలో అణగారి వుంటాయి.
ఆత్మ సాక్షాత్కారం కానిదే అవి పూర్తిిగా దహింపబడవు....

పవిత్రమైన మనస్సుతో, గురువుల పరివేక్షణలో ఈ సాధనలు పరమ శాంతితో కొనసాగించాలి.
ప్రలోభాలకు లొంగకుండా, అత్యున్నతమైన సాక్షాత్కారం కలుగనంత వరకూ అతి జాగ్రత్తగా వుండవలయును...సంపూర్ణమైన జాగరూకతో వుండాలి....జాగరూకతతో వున్నవాడు ఎప్పటికప్పుడు తనను తాను పరిశీలించుకొంటూ సరి చేసుకొంటాడు.....లేదంటే పిచ్చి బ్రమలలో పడిపోతాడు....సాధన పవిత్రంగా, ఓ నిర్ధిష్ట పద్ధతిలో కొనసాగించాలి...
పాతిక వేలకు మోక్షం అంటే పరిగెత్తి వెళ్ళకండి మోసపోతారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, మీ వెనుక మీ కుటుంబం వున్నది, మీ భర్త, పిల్లలు బిక్కమొహం వేసుకొని మీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేమతో.......
దేవుడు ఎక్కడో లేడు మీ ఇంట్లోనే, మీలోనే కలడు, ఆయన్ను వెలికి తీయండి......

..........ఆచార్య భాస్కరానంద నాథ/25-04-2016..

Saturday, 16 April 2016

వనదుర్గా

వనదుర్గ - మహావిద్య...

పంచ శత సంఖ్యాక (500) వివిధ మహా మంత్రములు గల వనదుర్గా మహా విద్యా మంత్రము, విదులయందొక విశిష్ట స్థానము ఆక్రమించి యున్నది. దీనినే మహావిద్య అని అందురు...దీనియందు వనదుర్గా మహా విద్య మంత్రము, హృదయము, వారాహీ, వటుక, సర్వ మంగళ, చండీ, కార్తవీర్యార్జున, బ్రహ్మాస్త్ర రుద్ర, దేవతా, రాక్షస, శక్తి నామక దశ విధ దశ దిగ్భందనములు, శ్రీ వనదుర్గా మంత్ర రాజ మాలా మంత్ర పారాయణమునూ గలిగి తుదిన వనదుర్గా మంత్రవర్ణావళీ స్తోత్రము, కవచమును గలవు. ఈ పారాయణ మొనర్చు వారికి నిగ్రహానుగ్రహ దక్షత సిద్ధింపగలదు. పరమంత్ర యంత్ర తంత్రాభిచారములు ఈ పారాయణ మొనర్చు వారిని ఏమియూ చేయజాలవని పెద్దల అభిప్రాయము.
ఈ పారాయణకు శ్రీవిద్యలో పూర్ణదీక్షాధికారము గలవారు మాత్రమే అర్హులు....

అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకై ఉగ్ర తపము ఆచరించు సమయమున పరీక్షార్థమై పరమశివుడు కిరాతరూపమునను, అమ్మ పార్వతీదేవి శబరి రూపమునను తపోవనమున ప్రవేశించిరి. శబరి రూపము దాల్చిన పార్వతియే వనదుర్గగా ప్రాదుర్భావమయినది.

అట్టి వనదుర్గకు పాదాభివందనం చేస్తూ....ఆచార్య భాస్కరానంద నాథ./16-04-2016

Sunday, 10 April 2016

ఆచార్య దీక్ష....

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః

వందే గురుపద ద్వంద్వం ఆవాఙ్మానస గోచరం,
రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహః....( గురుగీత)

భారతీయ సాంప్రదాయ సార్వభౌములు, అద్వైత సంప్రదాయ ప్రవర్తకులు, ఆచార్యులు శ్రీ విద్యాశంకర భగత్పూజ్యపాదులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు,  శంకర భగవత్పాదులు చతురామ్నాయ పీఠములను స్థాపించిరి....అందు దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరి పీఠమును సురేశ్వరాచార్యుని అధిపతిగా నియమించిరి ...

ఈ పీఠ పరంపరలోని వారే శ్రీ విద్యారణ్యులు. వీరు విజయనగర సామ్రాజ్య స్థాపనతో బాటు శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠమును ప్రవర్తిల్ల చేసియున్నారు. అట్టి విరూపాక్ష పీఠ పరంపరలో 42 వ పీఠాధిపతులు, భాస్కరానంద నాథునికి పరమేష్ఠి గురువులయిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి వారు...స్వామి వారు బ్రహ్మ విద్య యందును, మంత్ర శాస్త్రమందేగాక  జ్యోతిర్విద్యాది బహు శాస్త్ర పారంగతులు, సర్వ శ్రౌత, స్మార్త, కర్మాంగ విషయ నిష్ణాతులు ....దేశంలో తమ కాలమందు బహుళ ప్రచారంలో వున్న వామాచార పద్ధతిని పతన హేతువని, దూష్యమని, అగ్రాహ్యమని, సహేతుకంగా ఖండించి, దక్షిణాచారమే ఉత్తమ మార్గమని విమర్శనా సహితంగా ఉపదేశించి యున్నారు. అంతవరకూ తాంత్రిక మార్గాచరణలో వున్న శ్రీచక్రోపాసనను సంస్కరించి వైదికమైన దక్షిణాచార రీతిగా శ్రీయాగ సూత్రమను చక్రార్చనా పద్ధతిని, లలితా రహస్యనామ వ్యాఖ్యను ప్రచురించి యున్నారు ....

అనేక మంది శిష్యులకు తదుపాసనా విశిష్టమైన బ్రహ్మ విద్యను అనుగ్రహించి, బ్రహ్మ విద్యా జిజ్ఞాసువులకు ఉపాసన యందు కలుగు పెక్కు సందేహములను పరిహరింప తలచి బ్రహ్మకళ యను తమ నిర్ణయ గ్రంధమును అనుగ్రహించినారు...తద్వారా సర్వోపనిషద్వాక్య సమన్వయంతో, అద్వైత సిద్ధాంతాన్ని రూఢి పరచి, ఉపనిషత్తులు బోధించిన ఉపాస్య బ్రహ్మ విద్యకు ప్రతీకయైన శ్రీచక్ర - శ్రీవిద్యా రహస్యములను సూత్రీకరించి, సంప్రదాయ బద్ధమైన శ్రీచక్రోపాసనా క్రమాన్ని " బ్రహ్మకళ" అను గ్రంధమును అనుగ్రహించినారు శ్రీగురువులు ..

శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు జగద్గురువులు శ్రీకల్యాణానంద భారతీ పూజ్యపాదులు ఈ భాస్కరానంద నాథులకు పరమేష్ఠి గురువులు....వారి యొక్క తపఃశక్తి సమ్మేళిత మేధాశక్తి తో బహుగ్రంధ పరిశోధన జరిపి శ్రీచక్ర విధి విధానంలోను, శ్రీవిద్యోపాసనలోను ఒక విశిష్ట మైన సాంప్రదాయము ను ఏర్పాటు చేసి యున్నారు..వారికి గల శిష్యగణంలో లబ్ధ ప్రతిష్ఠులైన వేదాంతులు, నైష్ఠికులు, లౌకికులు, న్యాయవాదులు మొదలైన వారెందరో కలరు. వారి శిష్య, ప్రశిష్యులలో ప్రముఖులు శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారి పితృపాదులు శ్రీ లక్ష్మీనారాయణ గారు, మా గురువుగారి తండ్రిగారు శ్రీ ప్రత్యగానంద భారతీ మహా స్వామి గారు, మరియు కుర్తాళం పీఠాధిపతులు అయిన శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారు, ప్రసాదరాయ కులపతి గారు, శ్రీ యాబలూరి లోకనాథ శర్మ గారు, వారి తండ్రి గారైన బ్రహ్మశ్రీ యాబలూరి ఆదినారాయణ శర్మగారు, యద్ధనపూడి అయ్యన్న పంతులు గారు, శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారు ....ఇంకా ఎందరో ప్రముఖ శిష్యులు గలరు....వారిలో నేను మూడవ తరమునకు చెందిన వాడ్ని...

శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారు, జగద్గురువులు శ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి విరచించిన బ్రహ్మకళ కు సవిస్తరంగా వ్యాఖ్య " శ్రీచక్ర దర్శనము" అను గ్రంథమును రచించిరి....అందు తమ పరాపర గురువులు అనుగ్రహించిన ఉపాసనా రహస్యములను, పద్ధతులను ఎన్నంటినో వారు గ్రంధస్థం చేసి, మనకు కృపతో అనుగ్రహించిరి....

జగద్గురువులు శ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి వారు అనుగ్రహించిన ఉపాసనా క్రమమంలో, శ్రీవిద్యోపాసనా దీక్షలో చిట్టచివరిదైన విద్య " ఆచార్య దీక్ష"....

ఈ దీక్షను అస్మద్గురువరేణ్యులు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారు, తమ శిష్యులలో జ్యేష్ఠ శిష్యులైన నాకు ( భాస్కరానంద నాథ) శ్రీ దుర్మిఖి నామ సంవత్సర ఉగాది నాడు అనగా 08-04-2016 దినమున బెంగుళూరు లో " ఆచార్య దీక్ష" ను అనుగ్రహించడమైనది...

శ్రీచక్ర దర్శనము అను ఈ ఉపాసనా గ్రంథమును నాకు బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారు, బ్రహ్మశ్రీ వడ్లమూడి వేంకటేెశ్వర రావు గారు 18-02-1999 లో విజయవాడలో వారి ఇంట్లో బహుకరించినారు.....అందలి విషయములను, రహస్యములను పెద్దల నుంచి తెలుసుకొన్ననూ, మా గురువులు ఉపదేశించే వరకు అంటే నేటి వరకూ వేచి వున్నాను.....

సూచన:- పుస్తకములను చూసి మంత్రములను ఉపాసన చేయకూడదు, గురువుల అనుగ్రహం కలిగేంతవరకూ వారిని ఏ మంత్రములనూ అడగకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు ....

ఆచార్య దీక్ష:-

దీనినే పురుషోత్తమ విద్య అని, భువనేశ్వరి విద్య యని, ఆచార్య దీక్ష అని అందురు.
ప్రణవమునకు మహామాయ బీజమును, కమలా బీజమును కలిపిన ఈ త్ర్యక్షరీ మంత్రము ఉత్పత్తి అగును.......హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ ....అను పురుష సూక్త వాక్యము ప్రకారము ప్రణవమునకు మాయా బీజము మరియు కమలా బీజమును కలిపిన మంత్రోద్ధారణ కలుగును....ఈ రెండు బీజములు ప్రణవమునకు పత్నీ స్థానములు అని పెద్దలు చెప్పుదురు....
ఈ స్థితి వలననే పంచదశి కన్నా షోడశి మంత్రము విశిష్టమని, అట్టి షోడశీ మంత్రమే బ్రహ్మ విద్య యని, గృహస్థులకు ఉపాసనా వరిష్ఠమని మహా గురువులు నిర్ధారించియున్నారు......దీని విశిష్టత ను దర్షించిన శ్రీపాదులు, సర్వసంగ పరిత్యాగులకు, యతీశ్వరులకు ప్రణవోపాసన అని, వానప్రస్థులకు ఈ త్ర్యక్షరీ విద్య బ్రహ్మ జ్ఞాన కారకమని ఉపదేశించియున్నారు......
ఈ మహా మంత్రమునకు ఋషి సదాశివుడు, కామేశ్వరి దేవత...ధ్యాన శ్లోకం పురుష సూక్తం, శ్రీ సూక్తం...

శ్రీ విద్య దీక్షా పరంపరలో బాల, నవాక్షరి, పంచదశి, షోడశి, మహా షోడశి, మహా పాదుకలు, పూర్ణ దీక్ష, మహా విద్య.....దాని తదుపరి ఆచార్య దీక్ష.....

కావున శ్రీ గురువులు శ్రీ విద్యా షోడశి యందు పూర్ణ దీక్షితులయి, తదనుష్ఠాన వృద్ధులయిన తమ ముఖ్య శిష్యులకు ఈ త్ర్యక్షరీ విద్యా దీక్షను అనుగ్రహించినారు...దీనిని ఆచార్య దీక్షగా శ్రీపాదులాదేశించితిరి.......తద్వారా ఆచార్య దీక్షా సంప్రదాయమును ప్రవర్తింపజేసిరి.......ఈ విద్యను శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులు, ఆచార్య దీక్షాధికార యోగ్యులయిన తమ తమ గురువుల నుండి దీక్షనభ్యసించి తరింతురు గాక.
మోహమునకు గురియై పుస్తకములను చూసి మంత్రములను ఉపాసించ కూడదు....మీ గురువులు చెప్పేంతవరకు వేచి యుండి అనుష్టించవలయును.....

ఇట్టి ఆచార్య దీక్షను నాకు అనుగ్రహించిన అస్మద్గురువులకు పాదాభివందనం చేస్తూ....

......ఆచార్య భాస్కరానంద నాథ/ 10-04-2016, శ్రీకాళహస్తి ....

Saturday, 2 April 2016

ఆచార్య దీక్ష...భాస్కరానంద నాథ

భాస్కరానంద నాథుడు ఉగాది నాడు "ఆచార్యుడు" అగు శుభ ముహుర్తం వేళ, గురు పాద సన్నిధిలోన...బెంగుళూర్ లోన.....నా అదృష్టం ...మహా భాగ్యం...మహా ప్రసాదం....మంత్ర శాస్త్రములో, శ్రీవిద్యలో ఆచార్య దీక్షను, ఆచార్య బిరుదును మా గురువు గారు ప్రసాదిస్తున్నారు నాకు....

ఇది నేను 2000 సంవత్సరంలో, పూర్ణ దీక్ష ఇచ్చిన జ్ఞానంతో శ్రీశైలం లో తపస్సు చేసినప్పుడు అమ్మ వారు తన చనుబాలు ఇచ్చి నన్ను ఆశీర్వదించినది......ఆ తల్లిని నేను నా కనులారా గాంచినాను....ఆమె ఓళ్లోకి పోతూనే నే నెలల పాపను అయ్యాను, కానీ నాకు సృహ వున్నది నేను రామచంద్రరావును, భాస్కరానంద నాథను అని....నా తల్లి పాలు, జగన్మాత పాలు చక్కగా  తృప్తిగా తాగాను,సమాధి ముద్రలో ఎన్నో అత్భుత దృశ్యం ములను నాకు చూపించినది....మెదడులో ఆజ్ఞా చక్రమునందు ఎన్నో చిత్ర విచిత్ర జ్యోతులు రేఖలు కనపడినాయి, సృష్టి రహస్యాన్ని, మహా విలయాన్ని చూపించినది....నా అనుభూతుల సంకలనమే ఈ భావనాగమ్యా ....నన్ను నేను మరిచి పోయి మహా జ్ఞానముతో వ్రాశినది....నా కంటి ముందు కనిపించిన అత్బుతములను, అనుభూతులను అక్షర రూపములో పెట్టాను....అమ్మ నన్ను తన ప్రియ పుత్రుని గా స్వీకరించిన రోజు అది....నా జీవితం ధన్యమైన రోజు ఆ రోజు....
..ఈ రోజు మా గురువులు ఫోను చేసి నన్ను బెంగుళూరు రమ్మన్నారు.....ఆచార్య దీక్ష ఇవ్వడానికి......మహా ప్రసాదంగా భావించి ఉగాదికి బయలుదేరుతున్నాను...అందువలన ఈ రహస్యాన్ని 16 సంత్సరాల తరువాత ఈ శుభ సందర్భములో మీతో పంచుకొన్నాను.......ఆచార్య పట్టాభిషేక మహోత్సవ శుభ సందర్భమున....

గురువుల అనుగ్రహం కలగడం అంటే సాక్షాత్తు ఆ జగన్మాత కృపాకటాక్షములు కలగడం....వారి శిష్యులలో మొట్టమొదటగా ఈ దీక్ష ఇవ్వడం, దానికి నన్ను ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతం, గురుదేవుల అపార అనుగ్రహం నా పైన ప్రసరించడం....నా జన్మ ధన్యమైనది.....వారి ప్రేమానురాగాలను చూరగొనడం నా అదృష్టం గా భావిస్తున్నాను.....

ఉదయం 5 గంలకు జపం మొదలు పెడితే సాయంత్రం 6 గంలదాక మహా షోడశీ మంత్రం చేశాను అలా 40 రోజులు....41 వరోజు పై దృశ్యములన్నీ కనిపించినాయు...శ్రీశైలంలో స్వామి వారి గుడిలో లోపల ప్రాంగణంలో మరో చిన్న గుడులు వుండేవి....వాటిల్లో ఓకటి అర్థనారీశ్వర స్వామి గుడి ...అక్కడ కూర్చోని జపం చేశాను....లోపలకి ఎవ్వరూ జనాలు రారు ప్రశాంతంగా వుంటుంది....నన్ను దీవించి పంపించినది అమ్మ....అందుకే మా వాళ్లు నన్ను దేవీ పుత్రుడని, ఏమాట అన్నా అట్లే జరిగిపోతుందని అంటువుంటారు....ఇది నిజం....నాకు ముందుగానే కొన్ని తెలుస్తూ వుంటాయి....ఎవరు చనిపోతారో ముందుగా తెలుస్తుంది....అలాగే నేను మనసు వికలంతో గట్టిగా బాధపడితే 6, 7 మంది చనిపోయినారు కూడా....అందుకే మాట జారకుండా తగు జాగ్రత్తలో వుంటాను....ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు.....ఈరోజు మా గురువులు పిలిచి ఉగాదినాడు నాకు నాకొక్కడికి " ఆచార్య దీక్ష" ఇస్తానని కబురు పంపినాడు.....మహా ప్రసాదంగా భావించి 8 వ తేదీ బెంగుళూరు బయలుదేరుతున్నాను....

One day,  UGADI DAY....ఇంతకు ముందు మీరు వెళ్లినారు కదా శ్రీనివాస్ గారింటికి, అక్కడకి మా గురువు గారు వేంచేసి యున్నారు....ఇంతకముందే ఫోను చేశారు....వారి శిష్యుల అందరిలో నన్ను గుర్తించి ప్రధమముగా " ఆచార్య" పదవిని దీక్షను నాకు ప్రసాదించు చున్నారు....ఇది నాకు మహా ప్రసాదము....

భాస్కరానంద నాథుడు ఉగాది నాడు "ఆచార్యుడు" అగు శుభ ముహుర్తం వేళ, గురు పాద సన్నిధిలోన...బెంగుళూర్ లోన.....నా అదృష్టం ...మహా భాగ్యం...మహా ప్రసాదం....మంత్ర శాస్త్రములో,  శ్రీ విద్యలో ఆచార్య దీక్షను, బిరుదును మా గురువు గారు ప్రసాదిస్తున్నారు....

శ్రీవిద్యలో ఓక్కో మహా మంత్రం, ఓక్కో శక్తి, ఓక్కో పరంపర....ఓక్కో గురువు ఇలా కొనసాగుతూ వుంటుంది....ఈ మంత్రములన్నీ మోక్ష సాధకమైన మంత్రములు....శ్రీవిద్య అనేది ఓక ప్రత్యేకమైన పరంపర అనాదిగా యుగముల కాలం నుంచి సాగుతూ వున్నది....అయితే గురు సాంప్రదాయ భేదములు కలవు.....నాలుగు ఆమ్నాయ మంత్రములన్నీ చెబుతూ వెళతారు....వైదికమైన సాంప్రదాయంలో, వైదిక కులంలో పుట్టిన వారి చేత అనుష్ఠింపబడుతూ, ఆచరింపబడుతూ అనాదిగా, గురు- శిష్య పరంపరంగా ఈ విద్య, ఈశ్వరుడు పార్వతికి చెప్పగా మొదలయై, ఆది శంకరాచార్యుల ద్వారా మన గురువుల వరకు వచ్చి, మన తరువాతి తరం వారికి శిష్యులకు ఉపదేశం ద్వారా ఈ జ్ఞాన గంగ చెప్పబడుచున్నది....
ఈ విద్య బాల, నవాక్షరి, పంచదశి, షోడశి, మహా షోడశి, మహా పాదుకలు....గా చెప్పబడుచున్నది....మహా పాదుకలు వరకు చెప్పబడిన విద్యను పూర్ణ దీక్ష అని చెప్పెదరు....మహా పాదుకలు సహిత పూర్ణ దీక్ష అని.... మహా పాదుకలు అంటే సన్యాసాశ్రమ దీక్షలో ఇవ్వబడే నాలుగు మహా వాక్యములు....నాలుగు వేదములనుంచి నాలుగు మహా వాక్యములు ఉపదేశించెదరు.....అందువలన ఇది పూర్ణ దీక్ష అయినది.....పూర్ణ దీక్ష అర్హత కలిగిన వారికి "వనదుర్గ మహా విద్య" అని 500 మంత్రములను ఉపదేశిస్తారు.....ఈ దీక్షలో అన్ని దేవతల మహా మంత్రములను ఉపదేశిస్తారు....
దీని తరువాత " ఆచార్య దీక్ష"...ఇవ్వబడుతుంది .....ఈ దీక్షలన్నీ గురు త్రయం ద్వారా చెప్పబడుచున్నవి.....అర్హత లేని వారికి ఈ విద్యలు చెప్పకూడదు .....పంచదశి అర్హత వున్న వారు మాత్రమే శ్రీచక్రార్చన చేయవలయును.....నవాక్షరి అర్హత వున్న వాళ్లు మాత్రమే చండీ సప్తశతి, దుర్గా సప్తశతి చేయవలయును.....ఆడవాళ్లకు షోడశి వరకే చెప్పెదరు, పూర్ణదీక్ష అర్హత లేదు.....ఇది క్లుప్తంగా .....ఆచార్య దీక్ష గురించి రేపు వ్రాస్తాను....సప్తకోటి మహా మంత్రములకు, నాలుగు ఆమ్నాయములకు అధిష్ఠాన దేవతయైన ఆ మహామాయను ఉపాసించడం అంటే మాటలా? ఆమెను ఉపాసించడం అంటే అన్ని దేవతలను ఉపాసించడమే.....సమస్త దేవతల బీజాక్షరములు ఇందులో అనుష్ఠింప బడుతాయి....ఇది లౌకిక విద్య కాదు, వ్యాపారమునకు ఉపయోగించకూడదు .....శ్రీచక్రమును— శ్రీవిద్యను బజారులో పెట్టి అమ్మకండి....శ్రద్ధగలవారు, పట్టుదల గలవారు, ఆసక్తి వున్నవారు ఉపాసనా మార్గములో గురువుల వద్ద నేర్చుకోండి....కొని ఇంట్లో పెట్టుకోవద్దు....వ్యాపారములాగ చేసే వాళ్లను నమ్మకండి, మోసపోవద్దు ....ఎవరు ఇచ్చినా ఏ యంత్రములను తీసుకోవద్దు.....యంత్రము వుంటే మంత్రము, తంత్రము  తెలిసి వుండాలి....మంత్రముతో రోజూ పూజాదికాలు చేస్తూ వుండాలి....అంటు తగలకూడదు ....పవిత్రత చాలా ముఖ్యం...

.....భాస్కరానంద నాథ/02-04-2016...