Sunday, 10 April 2016

ఆచార్య దీక్ష....

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః

వందే గురుపద ద్వంద్వం ఆవాఙ్మానస గోచరం,
రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహః....( గురుగీత)

భారతీయ సాంప్రదాయ సార్వభౌములు, అద్వైత సంప్రదాయ ప్రవర్తకులు, ఆచార్యులు శ్రీ విద్యాశంకర భగత్పూజ్యపాదులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు,  శంకర భగవత్పాదులు చతురామ్నాయ పీఠములను స్థాపించిరి....అందు దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరి పీఠమును సురేశ్వరాచార్యుని అధిపతిగా నియమించిరి ...

ఈ పీఠ పరంపరలోని వారే శ్రీ విద్యారణ్యులు. వీరు విజయనగర సామ్రాజ్య స్థాపనతో బాటు శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠమును ప్రవర్తిల్ల చేసియున్నారు. అట్టి విరూపాక్ష పీఠ పరంపరలో 42 వ పీఠాధిపతులు, భాస్కరానంద నాథునికి పరమేష్ఠి గురువులయిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి వారు...స్వామి వారు బ్రహ్మ విద్య యందును, మంత్ర శాస్త్రమందేగాక  జ్యోతిర్విద్యాది బహు శాస్త్ర పారంగతులు, సర్వ శ్రౌత, స్మార్త, కర్మాంగ విషయ నిష్ణాతులు ....దేశంలో తమ కాలమందు బహుళ ప్రచారంలో వున్న వామాచార పద్ధతిని పతన హేతువని, దూష్యమని, అగ్రాహ్యమని, సహేతుకంగా ఖండించి, దక్షిణాచారమే ఉత్తమ మార్గమని విమర్శనా సహితంగా ఉపదేశించి యున్నారు. అంతవరకూ తాంత్రిక మార్గాచరణలో వున్న శ్రీచక్రోపాసనను సంస్కరించి వైదికమైన దక్షిణాచార రీతిగా శ్రీయాగ సూత్రమను చక్రార్చనా పద్ధతిని, లలితా రహస్యనామ వ్యాఖ్యను ప్రచురించి యున్నారు ....

అనేక మంది శిష్యులకు తదుపాసనా విశిష్టమైన బ్రహ్మ విద్యను అనుగ్రహించి, బ్రహ్మ విద్యా జిజ్ఞాసువులకు ఉపాసన యందు కలుగు పెక్కు సందేహములను పరిహరింప తలచి బ్రహ్మకళ యను తమ నిర్ణయ గ్రంధమును అనుగ్రహించినారు...తద్వారా సర్వోపనిషద్వాక్య సమన్వయంతో, అద్వైత సిద్ధాంతాన్ని రూఢి పరచి, ఉపనిషత్తులు బోధించిన ఉపాస్య బ్రహ్మ విద్యకు ప్రతీకయైన శ్రీచక్ర - శ్రీవిద్యా రహస్యములను సూత్రీకరించి, సంప్రదాయ బద్ధమైన శ్రీచక్రోపాసనా క్రమాన్ని " బ్రహ్మకళ" అను గ్రంధమును అనుగ్రహించినారు శ్రీగురువులు ..

శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు జగద్గురువులు శ్రీకల్యాణానంద భారతీ పూజ్యపాదులు ఈ భాస్కరానంద నాథులకు పరమేష్ఠి గురువులు....వారి యొక్క తపఃశక్తి సమ్మేళిత మేధాశక్తి తో బహుగ్రంధ పరిశోధన జరిపి శ్రీచక్ర విధి విధానంలోను, శ్రీవిద్యోపాసనలోను ఒక విశిష్ట మైన సాంప్రదాయము ను ఏర్పాటు చేసి యున్నారు..వారికి గల శిష్యగణంలో లబ్ధ ప్రతిష్ఠులైన వేదాంతులు, నైష్ఠికులు, లౌకికులు, న్యాయవాదులు మొదలైన వారెందరో కలరు. వారి శిష్య, ప్రశిష్యులలో ప్రముఖులు శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారి పితృపాదులు శ్రీ లక్ష్మీనారాయణ గారు, మా గురువుగారి తండ్రిగారు శ్రీ ప్రత్యగానంద భారతీ మహా స్వామి గారు, మరియు కుర్తాళం పీఠాధిపతులు అయిన శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారు, ప్రసాదరాయ కులపతి గారు, శ్రీ యాబలూరి లోకనాథ శర్మ గారు, వారి తండ్రి గారైన బ్రహ్మశ్రీ యాబలూరి ఆదినారాయణ శర్మగారు, యద్ధనపూడి అయ్యన్న పంతులు గారు, శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారు ....ఇంకా ఎందరో ప్రముఖ శిష్యులు గలరు....వారిలో నేను మూడవ తరమునకు చెందిన వాడ్ని...

శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారు, జగద్గురువులు శ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి విరచించిన బ్రహ్మకళ కు సవిస్తరంగా వ్యాఖ్య " శ్రీచక్ర దర్శనము" అను గ్రంథమును రచించిరి....అందు తమ పరాపర గురువులు అనుగ్రహించిన ఉపాసనా రహస్యములను, పద్ధతులను ఎన్నంటినో వారు గ్రంధస్థం చేసి, మనకు కృపతో అనుగ్రహించిరి....

జగద్గురువులు శ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి వారు అనుగ్రహించిన ఉపాసనా క్రమమంలో, శ్రీవిద్యోపాసనా దీక్షలో చిట్టచివరిదైన విద్య " ఆచార్య దీక్ష"....

ఈ దీక్షను అస్మద్గురువరేణ్యులు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారు, తమ శిష్యులలో జ్యేష్ఠ శిష్యులైన నాకు ( భాస్కరానంద నాథ) శ్రీ దుర్మిఖి నామ సంవత్సర ఉగాది నాడు అనగా 08-04-2016 దినమున బెంగుళూరు లో " ఆచార్య దీక్ష" ను అనుగ్రహించడమైనది...

శ్రీచక్ర దర్శనము అను ఈ ఉపాసనా గ్రంథమును నాకు బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారు, బ్రహ్మశ్రీ వడ్లమూడి వేంకటేెశ్వర రావు గారు 18-02-1999 లో విజయవాడలో వారి ఇంట్లో బహుకరించినారు.....అందలి విషయములను, రహస్యములను పెద్దల నుంచి తెలుసుకొన్ననూ, మా గురువులు ఉపదేశించే వరకు అంటే నేటి వరకూ వేచి వున్నాను.....

సూచన:- పుస్తకములను చూసి మంత్రములను ఉపాసన చేయకూడదు, గురువుల అనుగ్రహం కలిగేంతవరకూ వారిని ఏ మంత్రములనూ అడగకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు ....

ఆచార్య దీక్ష:-

దీనినే పురుషోత్తమ విద్య అని, భువనేశ్వరి విద్య యని, ఆచార్య దీక్ష అని అందురు.
ప్రణవమునకు మహామాయ బీజమును, కమలా బీజమును కలిపిన ఈ త్ర్యక్షరీ మంత్రము ఉత్పత్తి అగును.......హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ ....అను పురుష సూక్త వాక్యము ప్రకారము ప్రణవమునకు మాయా బీజము మరియు కమలా బీజమును కలిపిన మంత్రోద్ధారణ కలుగును....ఈ రెండు బీజములు ప్రణవమునకు పత్నీ స్థానములు అని పెద్దలు చెప్పుదురు....
ఈ స్థితి వలననే పంచదశి కన్నా షోడశి మంత్రము విశిష్టమని, అట్టి షోడశీ మంత్రమే బ్రహ్మ విద్య యని, గృహస్థులకు ఉపాసనా వరిష్ఠమని మహా గురువులు నిర్ధారించియున్నారు......దీని విశిష్టత ను దర్షించిన శ్రీపాదులు, సర్వసంగ పరిత్యాగులకు, యతీశ్వరులకు ప్రణవోపాసన అని, వానప్రస్థులకు ఈ త్ర్యక్షరీ విద్య బ్రహ్మ జ్ఞాన కారకమని ఉపదేశించియున్నారు......
ఈ మహా మంత్రమునకు ఋషి సదాశివుడు, కామేశ్వరి దేవత...ధ్యాన శ్లోకం పురుష సూక్తం, శ్రీ సూక్తం...

శ్రీ విద్య దీక్షా పరంపరలో బాల, నవాక్షరి, పంచదశి, షోడశి, మహా షోడశి, మహా పాదుకలు, పూర్ణ దీక్ష, మహా విద్య.....దాని తదుపరి ఆచార్య దీక్ష.....

కావున శ్రీ గురువులు శ్రీ విద్యా షోడశి యందు పూర్ణ దీక్షితులయి, తదనుష్ఠాన వృద్ధులయిన తమ ముఖ్య శిష్యులకు ఈ త్ర్యక్షరీ విద్యా దీక్షను అనుగ్రహించినారు...దీనిని ఆచార్య దీక్షగా శ్రీపాదులాదేశించితిరి.......తద్వారా ఆచార్య దీక్షా సంప్రదాయమును ప్రవర్తింపజేసిరి.......ఈ విద్యను శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులు, ఆచార్య దీక్షాధికార యోగ్యులయిన తమ తమ గురువుల నుండి దీక్షనభ్యసించి తరింతురు గాక.
మోహమునకు గురియై పుస్తకములను చూసి మంత్రములను ఉపాసించ కూడదు....మీ గురువులు చెప్పేంతవరకు వేచి యుండి అనుష్టించవలయును.....

ఇట్టి ఆచార్య దీక్షను నాకు అనుగ్రహించిన అస్మద్గురువులకు పాదాభివందనం చేస్తూ....

......ఆచార్య భాస్కరానంద నాథ/ 10-04-2016, శ్రీకాళహస్తి ....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.