Saturday, 9 August 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 31

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 31

చతుఃషష్ట్యా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవపరతంత్రైః పశుపతిః |
పున స్త్వన్నిర్బంధా దఖిల పురుషార్థైకఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితల  మవాతీతర దిదమ్ || 31 ||

అమ్మా, భగవతీ! పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు. సకలసిద్ధి ప్రదాయకమూ, ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి మిన్నకున్నాడు. మళ్లా నీ అభీష్టం మేరకు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని శ్రీవిద్యా తంత్రాన్ని ఈ, లోకానికి ప్రసాదించాడు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

“భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీవిద్యా తంత్రమును గురించి మనకు తెలియజేస్తున్నారు.
పశువులను, ప్రాణులను పరిపాలించు ఆ పశుపతి పూర్వము ఈ సమస్త ప్రపంచమును మోహపెట్ట తలంచి చతుష్షష్ఠి (64) తంత్రములను సృష్టించి ఇచ్చాడు. పశువులైన ఈ మానవులు ఆ కామ్యక మైన తంత్రముల యందు మోజుతో వాటి మత్తులో పడి పరమ పురుషార్ధమైన మోక్షమును మరిచి మొహములో తమను తాము మరిచి వాటి వలన కలిగిన సిద్దులతో ఆడుకొంటూ మూడులై పరమార్ధము తెలుసుకోలేక, జీవన్ముక్తులు కాలేక కొట్టుకు లాడుతున్నారు ఈ భ్రమణ చక్రములో పడి.

బిడ్డలకు తల్లియైన ఆ మహా తల్లి ఓర్వలేక ఒకరోజు ఆ పరమ శివుని దగ్గరకు వెళ్లి అడిగినది.
“ స్వామీ, బిడ్డలు పాడై పోతున్నారు, అజ్ఞానంలో కూరుకు పోతున్నారు మీరు ఇచ్చిన మాయా తంత్రముల చేత, కావున ఎల్ల కోరికలు ఈడేరే తంత్రము, ధర్మార్ధ కామ మోక్షములు ఇచ్చే మహా తంత్రమును, జ్ఞానమును నొసగే విద్యను  ఒక్కటి ఇవ్వండి చాలు నా బిడ్డలకు” అని.

“పార్వతీ, సకల తంత్రములకు మూలమైన, మిన్నయైన, ధర్మాది చతుర్విధ పురుషార్ధములను ప్రసాదించే సర్వ స్వతంత్రమైన శ్రీవిద్యాతంత్రము నీ పేరు మీదుగా ఇస్తున్నాను.” అని అనుగ్రహించినాడు.
ఈ విధముగా మహాదేవునిచే నిర్మితములైన చతుష్షష్ఠి (64) తంత్రములు మహా పండితులను సైతము మోహ పరుచు చున్నవి. ఐహిక సుఖములను కలిగించే ఈ తంత్రములు వైదిక మార్గ దూరములైనవి. ఆయా జాతులను బట్టి, వర్ణములను బట్టి వీటిని అనుసరించ వలెను అని పెద్దలు చెప్పుదురు. ఇవి అందరికీ అనుష్టించడానికి యోగ్యములు కావని, ప్రపంచాన్ని వంచిస్తాయని  శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో చెప్పు చున్నారు.

శుభాగమతంత్ర పంచక మందు వైదిక మార్గము ననుసరించి ఈ శ్రీవిద్యా తంత్రము యొక్క అనుష్టాన కలాపము వశిష్ట సనక, శుక, సనందన, సనత్కుమారుల చే తెలుప బడినది. ఈ శ్రీవిద్య మనకు గౌడపాదాచార్యుల నుంచి గోవింద పాదాచార్యులకు, వారి నుంచి శ్రీ శంకర భగవత్పాదులకు, వారినుంచి మన గురువుల వరకు సాంప్రదాయ శిష్య కోటి పరంపర లో అనుగ్రహించ బడినది. ఇది బ్రహ్మ విద్య, మోక్ష విద్య. లౌకిక కోరికలు కోరకు కాదు. తరింప జేసే మహా విద్య ఇది. ఎన్నో కోట్ల జన్మల పుణ్యము, అమ్మ అనుగ్రహము వుంటే గాని శ్రీవిద్య రాదు, వచ్చినా ఉండదు. నిలబెట్టుకోవడము చాలా చాలా కష్టము. అసలు బుద్ధి పుట్టదు, అర్ధం కాదు అమ్మ దయ లేక పోతే.  యోగులకు మాత్రమే శ్రీవిద్యోపాసన అర్హత కలుగును అని పెద్దలు అందురు. శ్రీవిద్యా తంత్రము అంటే పంచదశాక్షరీ మంత్రం అని శ్రీ లొల్ల లక్ష్మీధర పండితులు చెప్పారు.

శ్రీ గౌడపాదాచార్య విరచిత సుభగోదయ స్తుతి యందు తంత్రముల గురించి శ్రీ గురువులు ఇలా వివరించినారు.

లోకంలో కామ్య వాదులు, మోక్ష వాదులు అని రెండు రకముల వారున్నారు. ఆచార వ్యవహారములను బట్టి వీరిని మూడు రకములుగా విభజించినారు.
౧. కౌలాచారులు,   ౨.  మిశ్రమాచారులు,   ౩. సమయాచారులు.

సగుణ బ్రహ్మను గురించి చెప్పే తంత్ర శాస్త్రములను ఆగమాలు అంటారు. వాటిని సమిష్టిగా మంత్ర శాస్త్రము అని అంటారు. ఆగమాలు మూడు రకములు.
౧. వైష్ణవ ఆగమాలు,   ౨. శైవ ఆగమాలు,    ౩. శక్తి ఆగమాలు.
సాత్విక ఆగమాలను తంత్రాలని, రాజసాలను యామళాలు అని,  తామసాలను డామరాలు అని అంటారు.
వైదికులు (వేదమును నమ్మిన వారు, ఆచరించే వారు) శుభాగమ పంచకము చెప్పిన సమయాచార మార్గాన్నే అనుసరించాలి అని శ్రీ శంకర భగవత్పాదులు నిర్ణయము చేసి వున్నారు. అదే మార్గము ననుసరించి శ్రీ గురుదేవుళ్ళు స్థాపించిన శంకరుల మఠములలో నేటికీ శ్రీ విద్యా తంత్రము ననుసరించి శ్రీచక్రార్చన జరుగు చున్నది.  
సూర్య కిరణముల చేత నీరు ఎలా ఆవిరి అగునో అలా పంచదశీ మహా మంత్రము చేత శ్రీవిద్యోపాసకుల యొక్క మోహము పైకి ఉబికి ఆవిరిగా మారి పోవును. శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు ప్రధాన విద్య షోడశాక్షరీ విద్య. ఈ విద్యకు శుద్ధ విద్య అని పేరు.  64 తంత్రములకు ఈశ్వరి ఆమె అందుకే సర్వ తంత్రేశీ అన్నారు.

చతుష్షష్ఠి కళామయి,  చతుష్షష్ఠుపచారాడ్యా  ...అని అమ్మ వారికి పేర్లు. చతుష్షష్ఠి ఉపచారములు, చతుష్షష్ఠి కళలు, చతుష్షష్ఠి తంత్రములు ఇలా 64 మీద చెప్పబడినవి.
గూడార్ధము:- 64 తంత్రములు జీవుడ్ని మాయా మొహితుడ్ని చేస్తే, శ్రీవిద్యా తంత్రము అనే అమ్మను  పట్టుకొన్న వాడికి జ్ఞానము లబిస్తుంది. అంటే పరమ శివుడు దర్శనమిస్తాడు.

శ్రీవిద్యా స్వరూపిణి అయిన ఆ  తల్లి పాద పద్మములకు  నమస్కరిస్తూ ....

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/09-08-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/

 


Monday, 4 August 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 30

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 30
స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభితః
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః
మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజనవిధిమ్ || 30 ||

ఓ ఆద్యంతాలులేని మాతా! నీ శరీరము  నుండి జనించిన కాంతులైన అణిమాది అష్టసిద్ధులచే పరివేష్టింప బడియున్న నీ దివ్యరూపాన్ని ఏ భక్తుడైతే పూర్తి తాదాత్మ్యంతో నువ్వే నేనని  ధ్యానిస్తాడో అతడు త్రినయనుడని పేరుగల సదాశివుడి నిండు ఐశ్వర్యాన్ని కూడా తృణీకరించగలడు. ఆ సాధకుడికి మహాప్రళయకాలంలో జ్వలించిన అగ్ని కూడా నీరాజనం గావించుతోంది.  అంటే శ్రీదేవితో తాదాత్మ్యం  పొందిన సాధకుడు శ్రీదేవియే.  ఆమెకు ప్రళయాగ్ని నీరాజనాలర్పిస్తుంది.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

“భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క ఉపాసన ఎలా చేయాలి? దాని యొక్క ఫలితము మనకు ఉపదేశిస్తున్నారు.
స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభితః
అమ్మ శరీరము నుండి పుట్టినటు వంటి అణిమాది అష్ట సిద్ధులు అమ్మ చుట్టూ చేరి నిత్యమూ అమ్మను కొలుస్తూ వుంటారు.
శ్లో:   బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ,
      మన్వశ్రదళ సంయుత షోడశారమ్,
      వృత్తత్రి భూపురయుతం పరితశ్చతుర్ద్వాః,
      శ్రీచక్రమేత దుదితం పరదేవతాయాః
బిందువు, త్రికోణము, అష్ట కోణము, దశ దళ యుగ్మము, చతుర్దశ దళము, అష్ట దళము, షోడశ దళము, త్రివలయుము, భూపురము అను వానితో  గూడి, నాలుగు ద్వారములు గలదై ఆ పర దేవతయే శ్రీచక్ర స్వరూపమై  వెలసియున్నది.
శ్రీచక్రము లో భూపుర త్రయము గలదు. మూడు రేఖలు, నాలుగు ద్వారములతో కూడినది. దీనినే త్రైలోక్య మోహన చక్రం అని అందురు. అందుకే అమ్మ వారిని త్రైలోక్య మోహన చక్ర స్వామిన్యై నమః అని అందురు.

౧. ప్రధమ భూపురము నందు అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్చా,   
    ప్రాప్తి, సర్వకామ అనబడే అణిమాది అష్ట సిద్ధులు కలవు.
౨. ద్వితీయ భూపురము నందు బ్రాహ్మి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేన్ద్రి, చాముండా, 
     మహాలక్ష్మి అనే అష్ట మాతృకలు గలరు.
౩. తృతీయ భూపురము నందు సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్శిణి, సర్వ వశంకరి, సర్వోన్మాదిని, 
    సర్వ మహాంకుశ, సర్వ ఖేచరి, సర్వ బీజ, సర్వ యోని, సర్వ త్రిఖండ, అనే దశ ముద్రలు గలవు.

అమ్మ శరీరమే శ్రీచక్రము. అమ్మే శ్రీచక్రము. అమ్మ పాదములు భూపుర త్రయము. అమ్మ శరీరము నుండి, కాదు అమ్మ పాదముల గోళ్ళ కాంతి నుండి అణిమాది అష్ట సిద్ధులు అనబడే దేవతలు ఉద్భవించినారు.

ఎటువంటి పాదములు అవి ? “పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా” ...అన్నారు వ్యాసుల వారు.
ఆ తల్లి పాదముల యొక్క కాంతిచే పద్మములు  తిరస్కరించ బడినవి. అంటే ఆ తల్లి పాదములను పట్టుకోన్నవాడు పద్మములను  కూడా అంటే లక్ష్మీ దేవిని కూడా తిరస్కరిస్తాడు అని అర్ధము చెప్పుకోవాలి. అంటే నిధిని లెక్క చేయడు. అంతటి జ్ఞానము లభిస్తుంది ఆమె పాదములను పట్టుకొన్నవాడికి. శ్రీవిద్యోపాసకుడు లౌకిక సుఖములను లక్ష్య పెట్టడు అని అర్ధము. అమ్మ పాదములను పట్టుకోన్నవాడు అమ్మ జ్ఞానము చే కాంతి చే లక్ష్మీ దేవిని కూడా ఇహ పర సుఖములను కూడా తిరస్కరించును.

నఖదీధితి సంఛన్న నమజ్జన తమో గుణా ..... అమ్మ పాదముల గోళ్ళ నుండి వచ్చే చంద్ర కాంతుల చేత బ్రహ్మాది దేవతల యొక్క తమో గుణము నశించు చున్నది. శ్రీ దేవి ఉపాసకుల యొక్క అజ్ఞానము పూర్తిగా నశించు చున్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నీ పాదములను పట్టుకొని వుంటారు కాబట్టి. నీకు నమస్కరించడం వలన, నీ పాద పూజ చేయడం వలన,  నీ గోళ్ళ కాంతి చేత వాళ్ళు జ్ఞానమును పొందు చున్నారు అమ్మా. అందుకు శ్రీవిద్య బ్రహ్మ విద్య అయినది, మోక్ష విద్య అయినది. నిన్ను ఉపాసించే వాళ్లకు అణిమాది అష్ట సిద్ధులు ఒక లెక్కా . గడ్డి పరకతో సమానము అవి.
అసలు అణిమాది అష్ట సిద్ధులు ఏమిటమ్మా సదా శివుడు ఇచ్చే ఐశ్వర్యమునే తృణీకరిస్తారు వాళ్ళు.       
 శ్రీవిద్యోపాసకులు దేనినీ లెక్క జేయరు. అన్ని ఐశ్వర్యములను బూదిగా భావిస్తారు. అందుకే మహా ప్రళయములో జనించిన అగ్ని వాళ్లకు నీరాజనం పలుకుతుంది.  ఎందుకంటే నీవే వాళ్ళు. వాళ్ళే నీవు. శ్రీవిద్యోపాసకులు అంటే సాక్షాత్తు ఆ పరదేవతా స్వరూపమే. అమ్మకు శ్రీవిద్యోపాసకులకు అభేదము. ఊపిరియే శ్రీవిద్యోపాసనగా బ్రతుకుతారు కాబట్టి,  వాళ్లు మహా శక్తి సంపన్నులు. వాళ్లకు మరలా అజ్ఞానము అనేది ఉండదు. అందుకే చివరి జన్మ అయిన వాళ్ళకే శ్రీవిద్య లభించును. “చరమే జన్మని యధా శ్రీవిద్యోపాసకో భవేత్ ....అని లలితా సహస్రనామం ఉత్తర పీఠిక చెప్పు చున్నది.

ఎక్కడ మహా మోహము అనే దొంగ ఎత్తుకొని పోవునో అని భయముతో, మునులు తమ మనస్సు అనే రత్నమును అమ్మ పాదాల చెంత ఉంచుతారంట.
ఎక్కడ ప్రణయ కలహము కలుగునో అని భయపడి శివుడు అమ్మ వారి పాదముల యందు తన శిరము నుంచినాడంట. అప్పుడు అమ్మ వారి పాదములందలి సంధ్యారుణ కాంతిని శివుని జటా జూటము నందున్న చంద్రుడు గ్రహించి ఎర్రగా అయ్యెను. అటువంటి ఎరుపు నాలోని మోహ గుణమును తొలగించు గాక ...అని
మూక పంచశతీ లో మూక కవి అన్నారు.

అటువంటి మహా తల్లి పాద పద్మములకు  నమస్కరిస్తూ ....

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/04-08-2014 @ శ్రీకాళహస్తి







Wednesday, 23 July 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 29

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 29

కిరీటం వైరించం పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే || 29 ||

మాతా! బ్రహ్మ విష్ణువు ఇంద్రులు నీకు ప్రణమిల్లుతున్నప్పుడు, నీ భవనాన్ని ప్రవేశించిన సదాశివుణ్ణి ఎదురేగి తోడుకొనిరావటానికి నువ్వు అతిశీఘ్రముగా లేచి వెళ్లేటప్పుడు నీ పరిజనులైన స్త్రీలు, 'అమ్మా! నీ ముందు బ్రహ్మదేవుడి కిరీటం ఉంది. దానికి దూరంగా నడువు; ఓ తల్లీ! ఇది కైటభాసురుణ్ణి సంహరించిన విష్ణువు కిరీటం, తొట్రుపడబోకు; అమ్మా! ఇది ఇంద్రుడి కిరీటం, జాగ్రత్తగా రమ్ము' అనే మాటలు సర్వోత్కర్షతో రాజిల్లుతున్నవి.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

“భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క పతి భక్తి గురించి   మనకు తెలియ జేస్తున్నారు. భర్తను ఎలా అనుగమించాలి అనేది అమ్మ జగన్మాత మనకు చూపిస్తున్నది. పతీవ్రతలు ఎలా భర్తను గౌరవించినారో శ్రీ కామాక్షి ఆచరించి చూపుతున్నది. ఆ మర్యాదే మర్యాద.

అనసూయ, అరుంధతులు పార్వతీదేవికి పతివ్రతా ధర్మాలను బోధించే సందర్భంలో చెప్పిన పద్యం:

పతివచనము శ్రుతివచనము
పతిపదములు పరమపదము పతియే గురుడౌ
పతినగవే పరమ సుఖము
పతినడచిన బాట నడువు పర్వత పుత్రీ!

మానవ మాత్రులే కాదు ! పార్వతీ పరమేశ్వరులకైనా ప్రణయ కలహాలు సర్వ సామాన్యం! ఎంతటి ఆది దంపతులకైనా సరసం, విరసంగా మారే అంశాలూ ఉంటాయి.

ఒక్కొక్క అవతారంలో ఆ జగజ్జనని, శ్వేత - గౌరాది వర్ణాలలో కనిపించి నప్పటికీ - అధికభాగం అవతారాలలో ఆమె 'శ్యామ' గానే ప్రభవించిందని పౌరాణికుల వాక్కు. ఆ అభిప్రాయం కలగడానికీ కారణం ఉంది. ఆట పట్టించడానికే అవునుగాక! పరమేశ్వరుడంతటి వాడే, అమ్మవారిని 'కాళీ' అనీ; 'తమసా' అనీ; 'శ్యామా' అనీ; 'కజ్జలా' అనీ పిలవడం ఎన్నోసార్లు ఆవిడ గమనించింది.

ఒకసారి రోషం కొద్ధీ, "మీకు నలుపు అయిష్టమైతే ఆ విషయం స్పష్టంగా చెప్పొచ్చు కదా! ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి పిల్చి మరీ వినోదించడం దేనికీ? భర్తకు అయిష్టమైన పనేదీ, ఏ సతీచేయదో - ఆమె పతివ్రత అనిపించు కుంటుందని నాకు తెలుసు! మీకింత అయిష్టమైన నలుపు రంగుతో నేనెందుకు ఉండాలి!? ఇప్పుడే ఈ రంగుపోగొట్టుకుని, మిలమిల మెరిసే మేలిమి బంగారు రంగు ప్రసాదించమని తపస్సు చేసి వస్తాను" అని వెళ్లబోయింది.

"ఈ మాత్రం రంగు మార్చడానికి తపస్సు వరకూ ఎందుకు శ్యామా!? అయినా సర్వదేవుళ్లూ - దేవతలూ అంతా నాకోసం తపిస్తూ వుంటే, నీతపస్సు ఎవరికి? నాకు నిజంగానే నీ రంగు మార్చుకోవాలనిపిస్తే అదెంతపని నాకు? ఏదో ఊరకే సరసానికి అన్నాను" అని నవ్వేశాడు శివుడు చిద్విలాసంగా.

భర్త అలా అన్నపట్టికీ - ఏ మూలనో చిన్న సందేహం ఉండిపోయింది అమ్మవారికి. ఎప్పటికైనా బ్రహ్మచేత వరం పొంది, తన శ్యామ వర్ణాన్ని పోగొట్టుకోదలచిందామె. అలా ఆ తల్లి తన నలుపు వర్ణాన్ని తోలిగించుకొని గౌర వర్ణముతో తన పతి సన్నిధికి చేరుకొన్నది గౌరీ మాతగా. అప్పటి నుంచి ఆమె “సిందూరారుణ విగ్రహాం” అయినది. భర్త ఆనందమే తన ఆనందం గా నడిచిన మహా పతివ్రత ఆమె.
అందుకే అన్నారు పోతనామాత్యులు ఇలా ....

మ్రింగెడు వాడు విభుండని, మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ, మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

మా అమ్మ తన మంగళ సూత్రాన్ని ఎంత నమ్మినదో కదా. ఎవరు కట్టిన మంగళ సూత్రము అది? ఆ పరమ శివుడు కట్టిన మంగళ సూత్రము. అటువంటి మహాతల్లి, సర్వ లోకములకు తల్లి. మహా పతివ్రత. అందుకే ఆమెకు గౌరీ పూజ చేయిస్తారు పెళ్లి కూతురు చేత. అమ్మా ఈమె ఎవరో కాదు మహా గౌరి, నమస్కరించు తల్లీ అని. అటువంటి జగన్మాతను నమ్ముకొంటే, పూజిస్తే ఐదవ తనమునకు ఎటువంటి అమంగళము ఉండదు.

అటువంటి మహాతల్లి శ్రీమహారాజ్ఞి అయ్యి ఒక రోజు సభలో కొలువు తీరి వున్నది. బ్రహ్మాది దేవతలు వచ్చి అమ్మకు సేవ చేయడానికి తలలు వంచి నమస్కరిస్తూ అమ్మ పాదాలకు పూజ చేస్తూ వున్నారు. ఇంతలో అక్కడకు శివుడు వచ్చాడు. భర్త వచ్చినాడు అని అమ్మ గభాలున లేచి  భర్తకు స్వాగతం చెప్పడానికి గభ గభా ఎదురు వెళ్లినది. ఆ తొట్రుపాటులో అమ్మ ఎక్కడ తట్టుకొని క్రింద పడుతుందో అని చెలికత్తెలు అమ్మను హెచ్చరిస్తూ “ అమ్మా అమ్మా జాగ్రత్త జాగ్రత్త, నెమ్మది నెమ్మది ఇక్కడ బ్రహ్మ కిరీటము వున్నది. అక్కడ విష్ణువు కిరీటము వున్నది, అదిగో ఇంద్రుడి కిరీటము కాస్త చూచి నడువు తల్లీ అని చెబుతున్నారట.
ఆహా ఏమి దర్శించినారు శంకరులు.

కిరీటం వైరించం పరిహర
వైరించం అంటే బ్రహ్మ గారి కిరీటం. విరించి అంటే బ్రహ్మ. పరిహర అంటే దూరముగా చేయుము. తొలగించు అని.
పురః కైటభ భిదః కఠోరే కోటీరే స్ఖలసి
కైటభాసురిని చంపినవాడు కైటభభిదుడు అంటే విష్ణువు. విష్ణువు కిరీటము రత్నముల చేత, వజ్రముల చేత తాపడం చేయబడి వాడిగా, గరుకుగా ఉంటుదట. అమ్మా ఎక్కడ నీ కాళ్ళు తగిలి నీకు గ్రుచ్చుకొంటాయో జాగ్రత్త. జారి పడతావేమో జాగ్రత్త. స్ఖలసి అంటే జారిపడునది.
జహి జంభారి మకుటమ్
జంభారి అంటే జంభుడు అనే రాక్షసుని చంపిన వాడు ఇంద్రుడు. జహి అంటే విడిచి పెట్టు అని అర్ధము. మకుటం కిరీటం. ఇంద్రుని కిరీటం వున్నదమ్మా అక్కడ, కాస్త తప్పించుకొని నడువు. చూచి నడువు.

ఆ తల్లి హరి బ్రహ్మేంద్ర సేవిత అందువలన దేవతలు అందరూ వచ్చి ఆమెకు తలలు వంచి నమస్కరిస్తున్నారు. ప్రణమ్రేష్వేతేషు.

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె
ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!

అటువంటి మహా తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ....
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/23-07-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/

http://vanadurga-mahavidya.blogspot.in/

Saturday, 5 July 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 28

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 28

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః |
కరాళం యత్‍క్ష్వేళం కబలితవతః కాలకలనా
న శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 28 ||

తల్లీ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలి ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శంభుడికి (శివుడికి) మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్నతాటంకాల (రత్నాల కమ్మల) ప్రభావమే కదా! (నీ తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము).

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

“భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క తాటంక మహిమ గురించి   మనకు తెలియ జేస్తున్నారు.
తాటి + ఆకు = తాటాకు. తాళి, తాటంకములు ఇవన్నీ తాటి ఆకు లో నుంచి వచ్చిన పదములు. తాటంకములు అంటే చెవి కమ్మలు.  ఇవి మంగళ సూచకములు. పూర్వపు రోజులలో తాళి, తాటంకములు అన్నీ తాటి ఆకుతో చేసినవే. తాళ పత్రములు అంటే తాటి ఆకులు, వీటి మీదనే మన శాస్త్రములన్నీ మనకు అందించ బడినాయి. కాగితము లేని రోజులలో ఈ తాళ పత్రములనే వాడే వాళ్ళు. తాళ పత్ర గ్రంథములు అని వాటిని పిలిచేవారు. పూర్వపు రోజులలో మరియు ఇప్పటికీ భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవము ఈ తాటాకు పందిళ్ల క్రిందనే జరుగుతుంటాయి. విసన కర్రలు కూడా ఈ తాటాకు తోనే చేస్తారు. ముఖ్యముగా శ్రీ రామ నవమి నాడు ఈ విసన కర్రల వినియోగము చాలా ఎక్కువగా వుంటుంది. తాటాకు చేసిన విసనకర్రలను పేద బ్రాహ్మణునికి దానం ఇస్తే మహా పుణ్యము. వడ పప్పు, దక్షిణ తాంబూలములతో తాటాకు విసన కర్రలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం నేటికి ఆచారముగా వున్నది. తాటాకు తో చేసిన విసన కర్రలు చల్లని గాలిని ఇస్తాయి. చల్ల తనానికి, చలువ చేయడానికి తాటి చెట్టు ఉత్పతత్తులను విరివిగా వాడుతారు అనాదిగా. తాటాకు పందిళ్ళతో వచ్చే పెండ్లి కళ ఏ నక్షత్ర హోటలలో జరిగినా రాదు అంటే అతిశయోక్తి కాదు. 

తాటాకు తో తయారు చేసిన వస్తువులు అన్నీ మంగళ ప్రదమైనవి అని పెద్దలు చెబుతారు. తాటి ముంజలు, తాటి తాండ్ర, తాటి బెల్లం, తాటి తేగలు, తాటి విసనకర్రలు, తాటి చాపలు, పందిళ్ళు, తాటి ఆకులు, తాటి దూలాలు, తాటి గొడుగులు, తాటి ఆకు చేద, తాటి దుంగలు, తాటి ఆకు తో చేసిన బొమ్మలు, సంగీత సాధన వస్తువులు, ... ఇలా ఎన్నో గృహోపకరణ వస్తువులు వాడుతూ వుండే వారు.  ఇలా తాటాకు తో చేసిన మంగళ సూత్రములు, చెవి కమ్మలు కూడా అలాగే వాడుతూ వుండేవారు. పైగా తాటాకు తో  చేసినవి చాలా మంగళప్రదమైనవి.  మంత్రించి ఈ తాటి ఆకును మెడలో దండగా, తాయిత్తుగా కూడా ధరించే వాళ్ళు.  చెవులలో ఈ తాటాకును దూర్చుకొని ఆభరణముగా కూడా వాడే వాళ్ళు.  అలా వచ్చినవి ఈ తాటంకములు. చెవి కమ్మలు. చెవికి పెట్టుకొనే ఆభరణములు.

తమిళనాడు లోని జంబుకేశ్వరం. ఒకప్పుడు జంబు మహర్షి ఇక్కడ తప మాచరించి శివున్ని పూజించి నందువలన ఈ ఈశ్వరుణ్ణి జంబుకేశ్వరుడు అని అందురు. ఇది ఆపోలింగము.  శివ లింగము వున్న భాగములో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది. జంబుకేశ్వరం లో అమ్మ వారు అఖిలాండేశ్వరి ఉగ్రకళతో చాలా భయంకరముగా ఉండేదని, తలుపులు తీయడానికి కూడా అర్చకులు భయపడుతూ వుండేవారు అని, కొంతమంది ఆమె ఉగ్రకళకు గురి అవుతూ వుండేవాళ్ళు అని పెద్దలు చెబుతూ వుండేవారు. ఇదే విషయాన్నీ వారు ఆచార్యులు వారు అక్కడకు వచ్చినప్పుడు విన్నవించుకొన్నారు. జగద్గురువులు అమ్మను ప్రార్ధించి అమ్మ యొక్క ఉగ్రకళను ఆవాహన చేసి శ్రీచక్ర రూపములో తాటంకములు చేయించి అమ్మ వారికి కర్ణాభరణములుగా అమ్మ వారికి సమర్పించినారు. అచ్చటనే వినాయకుడ్ని కూడా స్థాపించినారు అని పెద్దలు చెబుతూ వుంటారు. అప్పటి నుంచి అమ్మ ఉగ్ర రూపము పోయి సౌమ్యవతి అయినది అని కూడా చెబుతూ వుంటారు. ఇప్పటికీ అమ్మ వారి తాటంకములను తీయాలంటే మెరుగు కోసము  కంచి కామ కోటి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమమును వారి చేతుల మీదుగా నిర్వర్తించేదరు అని చెప్పెదరు. అంత గొప్ప శక్తి వంతమైనవి అమ్మ తాటంకములు. మాంగల్య బలము తక్కువగా   వున్న వాళ్ళు అక్కడకి వెళ్లి అమ్మ యొక్క తాటంకములను దర్శించి వస్తే  దోషము పోతుందని గట్టి నమ్మకము. నిజము కూడా. జాతక చక్రములో అష్టమ కుజుని వలన దోషము వున్నవాళ్ళు, మాంగల్యదోషము ఉన్న వాళ్ళు ఈ క్షేత్ర దర్శనము చేసుకొని అమ్మ తాటంకములను దర్శించి, పూజించుకొని వస్తే వారి మాంగల్యం నిలబడుతుందని పెద్దలు అందురు.

అమ్మ యొక్క తాటంకములు చాలా మహిమాన్వితమైనవి. కాలమును కూడా స్తంభింప జేయును. గురువు గారు అమ్మ యొక్క చెవి కమ్మలను గురించి అత్భుతముగా  చెప్పినారు ఈ శ్లోకములో.
సూర్య చంద్రులను ఆభరణములుగా, చెవి కమ్మలుగా అమ్మ ధరించి వున్నది చెప్పినారు గురువు గారు. ఇదే విషయాన్ని లలితా సహస్రనామం లో కూడా “తాటంక యుగళీభూతతపనోడుప మండలాయై నమః”...అని చెప్పి వున్నారు వ్యాసుల వారు. కాల గమనము ఎప్పుడూ సూర్య చంద్రుల గమనము పై ఆధారపడి వుంటుంది. అటువంటి సూర్య చంద్రులను అమ్మ తన చెవి కమ్మలుగా ధరించి వున్నది. కాబట్టి కాలమును నియంత్రించే శక్తి ఆ జగన్మాతకు వున్నది. తాటంకములు చెవి కమ్మలు సౌభాగ్య చిహ్నములు, వాటిని తొలిగించే శక్తి కాలానికి కూడా లేదు.

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం..........

సహజంగా అందరూ భయపడేది ఈ జరా అంటే మూసలి తనానికి, మృత్యువునకు భయపడుతుంటారు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు అందరూ అమృతాన్ని సేవించి కూడా చివర్లో, ప్రళయ కాలంలో మృత్యు వాత పడుతున్నారు. విపద్యంతే ...అంటే విపత్తులకు లోను అవుతున్నారు.
మరి ఈశ్వరుడు కాల కూట విషాన్ని భక్షించాడు. శివుడు కాలకూట విషాన్ని త్రాగినా కాల ధర్మము ప్రకారము మృత్యువు లేదు ఆయనకు. ఎందుకని? ఎందుకు ఆయనకు జర, మృత్యువు లేదు, ఆయనకు విపత్తులు రావడం లేదు? ఎలా తట్టుకొని వున్నారు? అంత్య కాలములో కూడా ఎలా బ్రతికి వున్నారు? అంటే దానికి శ్రీ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు......
అమ్మా, ఇదంతా నీ తాటంక మహిమ అని అన్నారు.

“న శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా”

దీని అంతటికి అసలు రహస్యం ఏమిటంటే నీ చెవి కమ్మల యొక్క గొప్పతనము అమ్మా. మంగల్యాన్ని నిలబెట్టే శక్తి నీ చెవి కమ్మలకు వున్నది అమ్మా అని శ్రీ శంకరులు చెబుతున్నారు.
ముత్తైదువ, ఐదవ అంటే అయిదు చిహ్నములు ౧, మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవి కమ్మలు. ఈ ఐదింటిని ఆడవారు ఎప్పుడూ ధరించి ఉండవలెను. ఈ ఐదు లేకుండా భర్తకు, మగ వారికీ ఎప్పుడూ కనిపించ కూడదు. అమంగళము అది.
అమ్మ తన యొక్క సౌభాగ్యముచే, మహా పాతివ్రత్య ప్రభావముచే తన భర్తను కాపాడుకొంటూ వస్తున్నది అని అర్ధము.


చెవి కమ్మలు, మంగళ సూత్రము, కుంకుమ బొట్టు, ముక్కు పుడక, మెట్టెలు  మొదలైన వాటిని స్త్రీలు సదా రక్షించు కొంటూ వుండాలి, వాటి మహిమ వలన వారి భర్తలకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణ లభిస్తుంది.
అటువంటి సర్వ మంగళకు నమస్కరిస్తూ..........

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/06-07-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/