Saturday, 9 August 2014
2013
- ▼ 2013 (37)
- ▼ July (20)
- గురు పరంపర
- స్వపరిచయం
- మహాకాళీ సాధన - 3
- Panchayathanam
- http://vanadurga-mahavidya.blogspot.in/
- శ్రీ మహాలక్ష్మి సాధన - 4
- Maha Kali-
- maha kali
- Bhaskarananda natha
- దశ మహా విద్యలు - శ్యామా కాళీ-3
- దశ మహా విద్యలు -2- మహా కాళీ
- శ్రీ మహాలక్ష్మి సాధన - 3
- దశ మహా విద్యలు
- స్మరణ భక్తీ.
- నవ విధ భక్తి
- ధర్మం ఎంత వరకు వుంటుంది ఈ భూమి మీద?
- శ్రీ మహాలక్ష్మి సాధన - 2
- శ్రీ మహాలక్ష్మి సాధన - 1
- విషయ సూచిక
- నవ విధ భక్తి
- ▼ July (20)
2012
Blog Archive
- ▼ 2012 (45)
- ▼ October (9)
- శ్రీదేవీ తత్వం – 10 - లలితా సహస్రనామములు.
- శ్రీదేవీ తత్వం – 9 - త్రిగుణ స్వరూపము.
- శ్రీ లలితా పూజ. - శ్రీదేవీ తత్వం - 8
- దేవీ నవరాత్రులు - శ్రీదేవి పూజ – నవరాత్రి పూజ
- షష్టీ దేవి ఉపాఖ్యానం (SHASHTEE DEVI)
- శ్రీదేవీ తత్వం - 3 (SRI DEVI TATWAM -3)
- గర్భాధానాది సంస్కారములు
- శ్రీదేవీ తత్వం - 2
- శ్రీదేవీ తత్వం - 1
- ▼ June (25)
- చండీ తత్త్వము (CHANDEE TATWAM)
- కలి స్థానములు - వాని సంతతి
- నిత్యపవిత్ర వస్తువులు
- వర్ణాశ్రమ ధర్మములు
- శివ కేశవుల అభేదము
- శ్రీ వనదుర్గా (మహావిద్యా) పంచశతీ
- బ్రాహ్మణత్వం
- స్వగతం – స్వపరిచయం
- మడి అంటే ఏమిటి?
- పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి,
- నైవేద్యము అంటే ఏమిటి?
- గురువు కోసం అన్వేషణ
- విన్నపము
- వ్యాసోక్త రుద్ర స్తుతి -
- సదాచారాలు ఏవేవి
- భరతభూమి వైశిష్ట్యం
- స్వగతం
- వేదాంతం
- శ్రీచక్రము-శ్రీవిద్య-5 (SRIVIDYA - SRI CHAKRAM)
- శ్రీవిద్య – శ్రీచక్రము-4
- శ్రీచక్రము –దేవతలు-3
- శ్రీమాత- శ్రీచక్రము -2
- శ్రీచక్రము-0
- తర్పణము - అమృతము
- శ్రీవిద్య - శ్రీ చక్రము-1
- ▼ October (9)
సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 31
సౌందర్యలహరి -
భాస్కర ప్రియ – 31
చతుఃషష్ట్యా తంత్రైః సకల మతిసంధాయ
భువనం
స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవపరతంత్రైః
పశుపతిః |
పున స్త్వన్నిర్బంధా దఖిల పురుషార్థైకఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితల
మవాతీతర దిదమ్ || 31 ||
అమ్మా, భగవతీ! పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది
తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు. సకలసిద్ధి ప్రదాయకమూ, ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి
మిన్నకున్నాడు. మళ్లా నీ అభీష్టం మేరకు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ
పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని శ్రీవిద్యా తంత్రాన్ని ఈ, లోకానికి ప్రసాదించాడు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
“భాస్కర ప్రియ” - (భాస్కరానందనాథ
భావము)
ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీవిద్యా తంత్రమును గురించి
మనకు తెలియజేస్తున్నారు.
పశువులను, ప్రాణులను పరిపాలించు ఆ పశుపతి పూర్వము ఈ సమస్త ప్రపంచమును మోహపెట్ట
తలంచి చతుష్షష్ఠి (64) తంత్రములను
సృష్టించి ఇచ్చాడు. పశువులైన ఈ మానవులు ఆ కామ్యక మైన తంత్రముల యందు మోజుతో వాటి
మత్తులో పడి పరమ పురుషార్ధమైన మోక్షమును మరిచి మొహములో తమను తాము మరిచి వాటి వలన
కలిగిన సిద్దులతో ఆడుకొంటూ మూడులై పరమార్ధము తెలుసుకోలేక, జీవన్ముక్తులు కాలేక
కొట్టుకు లాడుతున్నారు ఈ భ్రమణ చక్రములో పడి.
బిడ్డలకు తల్లియైన ఆ మహా తల్లి ఓర్వలేక ఒకరోజు ఆ పరమ శివుని దగ్గరకు వెళ్లి
అడిగినది.
“ స్వామీ, బిడ్డలు పాడై పోతున్నారు, అజ్ఞానంలో కూరుకు పోతున్నారు మీరు ఇచ్చిన మాయా తంత్రముల చేత, కావున ఎల్ల
కోరికలు ఈడేరే తంత్రము, ధర్మార్ధ కామ మోక్షములు ఇచ్చే మహా తంత్రమును, జ్ఞానమును
నొసగే విద్యను ఒక్కటి ఇవ్వండి చాలు నా
బిడ్డలకు” అని.
“పార్వతీ, సకల తంత్రములకు మూలమైన, మిన్నయైన, ధర్మాది చతుర్విధ పురుషార్ధములను
ప్రసాదించే సర్వ స్వతంత్రమైన శ్రీవిద్యాతంత్రము నీ పేరు మీదుగా ఇస్తున్నాను.” అని
అనుగ్రహించినాడు.
ఈ విధముగా మహాదేవునిచే నిర్మితములైన చతుష్షష్ఠి (64) తంత్రములు మహా పండితులను
సైతము మోహ పరుచు చున్నవి. ఐహిక సుఖములను కలిగించే ఈ తంత్రములు వైదిక మార్గ
దూరములైనవి. ఆయా జాతులను బట్టి, వర్ణములను బట్టి వీటిని అనుసరించ వలెను అని
పెద్దలు చెప్పుదురు. ఇవి అందరికీ అనుష్టించడానికి యోగ్యములు కావని, ప్రపంచాన్ని
వంచిస్తాయని శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో
చెప్పు చున్నారు.
శుభాగమతంత్ర పంచక మందు వైదిక మార్గము ననుసరించి ఈ శ్రీవిద్యా తంత్రము యొక్క అనుష్టాన
కలాపము వశిష్ట సనక, శుక, సనందన, సనత్కుమారుల చే తెలుప బడినది. ఈ శ్రీవిద్య మనకు
గౌడపాదాచార్యుల నుంచి గోవింద పాదాచార్యులకు, వారి నుంచి శ్రీ శంకర భగవత్పాదులకు,
వారినుంచి మన గురువుల వరకు సాంప్రదాయ శిష్య కోటి పరంపర లో అనుగ్రహించ బడినది. ఇది
బ్రహ్మ విద్య, మోక్ష విద్య. లౌకిక కోరికలు కోరకు కాదు. తరింప జేసే మహా విద్య ఇది.
ఎన్నో కోట్ల జన్మల పుణ్యము, అమ్మ అనుగ్రహము వుంటే గాని శ్రీవిద్య రాదు, వచ్చినా
ఉండదు. నిలబెట్టుకోవడము చాలా చాలా కష్టము. అసలు బుద్ధి పుట్టదు, అర్ధం కాదు అమ్మ
దయ లేక పోతే. యోగులకు మాత్రమే
శ్రీవిద్యోపాసన అర్హత కలుగును అని పెద్దలు అందురు. శ్రీవిద్యా తంత్రము అంటే
పంచదశాక్షరీ మంత్రం అని శ్రీ లొల్ల లక్ష్మీధర పండితులు చెప్పారు.
శ్రీ గౌడపాదాచార్య విరచిత సుభగోదయ
స్తుతి యందు తంత్రముల గురించి శ్రీ గురువులు ఇలా వివరించినారు.
లోకంలో కామ్య వాదులు, మోక్ష వాదులు అని రెండు రకముల వారున్నారు. ఆచార
వ్యవహారములను బట్టి వీరిని మూడు రకములుగా విభజించినారు.
౧. కౌలాచారులు, ౨. మిశ్రమాచారులు, ౩. సమయాచారులు.
సగుణ బ్రహ్మను గురించి చెప్పే తంత్ర శాస్త్రములను ఆగమాలు అంటారు. వాటిని
సమిష్టిగా మంత్ర శాస్త్రము అని అంటారు. ఆగమాలు మూడు రకములు.
౧. వైష్ణవ ఆగమాలు, ౨. శైవ
ఆగమాలు, ౩. శక్తి ఆగమాలు.
సాత్విక ఆగమాలను తంత్రాలని, రాజసాలను యామళాలు అని, తామసాలను డామరాలు అని అంటారు.
వైదికులు (వేదమును నమ్మిన వారు, ఆచరించే వారు) శుభాగమ పంచకము చెప్పిన సమయాచార
మార్గాన్నే అనుసరించాలి అని శ్రీ శంకర భగవత్పాదులు నిర్ణయము చేసి వున్నారు. అదే
మార్గము ననుసరించి శ్రీ గురుదేవుళ్ళు స్థాపించిన శంకరుల మఠములలో నేటికీ శ్రీ
విద్యా తంత్రము ననుసరించి శ్రీచక్రార్చన జరుగు చున్నది.
సూర్య కిరణముల చేత నీరు ఎలా ఆవిరి అగునో అలా పంచదశీ మహా మంత్రము చేత
శ్రీవిద్యోపాసకుల యొక్క మోహము పైకి ఉబికి ఆవిరిగా మారి పోవును. శ్రీవిద్యా పూర్ణ
దీక్ష యందు ప్రధాన విద్య షోడశాక్షరీ విద్య. ఈ విద్యకు శుద్ధ విద్య అని పేరు. 64 తంత్రములకు ఈశ్వరి ఆమె అందుకే సర్వ తంత్రేశీ అన్నారు.
చతుష్షష్ఠి కళామయి, చతుష్షష్ఠుపచారాడ్యా ...అని అమ్మ వారికి పేర్లు. చతుష్షష్ఠి
ఉపచారములు, చతుష్షష్ఠి కళలు, చతుష్షష్ఠి తంత్రములు ఇలా 64 మీద చెప్పబడినవి.
గూడార్ధము:- 64 తంత్రములు జీవుడ్ని మాయా మొహితుడ్ని చేస్తే, శ్రీవిద్యా
తంత్రము అనే అమ్మను పట్టుకొన్న వాడికి
జ్ఞానము లబిస్తుంది. అంటే పరమ శివుడు దర్శనమిస్తాడు.
శ్రీవిద్యా స్వరూపిణి అయిన ఆ తల్లి
పాద పద్మములకు నమస్కరిస్తూ ....
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/09-08-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/
Monday, 4 August 2014
సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 30
సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 30
స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభితః
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః
మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజనవిధిమ్ || 30 ||
ఓ ఆద్యంతాలులేని మాతా! నీ శరీరము నుండి జనించిన కాంతులైన అణిమాది అష్టసిద్ధులచే
పరివేష్టింప బడియున్న నీ దివ్యరూపాన్ని ఏ భక్తుడైతే పూర్తి తాదాత్మ్యంతో నువ్వే
నేనని ధ్యానిస్తాడో అతడు త్రినయనుడని
పేరుగల సదాశివుడి నిండు ఐశ్వర్యాన్ని కూడా తృణీకరించగలడు. ఆ సాధకుడికి
మహాప్రళయకాలంలో జ్వలించిన అగ్ని కూడా నీరాజనం గావించుతోంది. అంటే శ్రీదేవితో తాదాత్మ్యం పొందిన సాధకుడు శ్రీదేవియే. ఆమెకు ప్రళయాగ్ని నీరాజనాలర్పిస్తుంది.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
“భాస్కర
ప్రియ” -
(భాస్కరానందనాథ భావము)
ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క
ఉపాసన ఎలా చేయాలి? దాని యొక్క ఫలితము మనకు ఉపదేశిస్తున్నారు.
స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి
రణిమాద్యాభిరభితః
అమ్మ శరీరము నుండి పుట్టినటు వంటి అణిమాది అష్ట సిద్ధులు అమ్మ చుట్టూ చేరి
నిత్యమూ అమ్మను కొలుస్తూ వుంటారు.
శ్లో: బిందు
త్రికోణ వసుకోణ దశారయుగ్మ,
మన్వశ్రదళ
సంయుత షోడశారమ్,
వృత్తత్రి
భూపురయుతం పరితశ్చతుర్ద్వాః,
శ్రీచక్రమేత
దుదితం పరదేవతాయాః
బిందువు, త్రికోణము, అష్ట కోణము, దశ దళ యుగ్మము, చతుర్దశ దళము, అష్ట దళము, షోడశ దళము, త్రివలయుము, భూపురము అను
వానితో గూడి, నాలుగు ద్వారములు గలదై ఆ పర దేవతయే శ్రీచక్ర స్వరూపమై వెలసియున్నది.
శ్రీచక్రము లో భూపుర త్రయము గలదు. మూడు రేఖలు, నాలుగు ద్వారములతో కూడినది.
దీనినే త్రైలోక్య మోహన చక్రం అని అందురు. అందుకే అమ్మ వారిని త్రైలోక్య మోహన చక్ర స్వామిన్యై
నమః అని అందురు.
౧. ప్రధమ భూపురము నందు అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య,
భుక్తి, ఇచ్చా,
ప్రాప్తి, సర్వకామ అనబడే అణిమాది
అష్ట సిద్ధులు కలవు.
౨. ద్వితీయ భూపురము నందు బ్రాహ్మి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి,
మాహేన్ద్రి, చాముండా,
మహాలక్ష్మి అనే అష్ట మాతృకలు
గలరు.
౩. తృతీయ భూపురము నందు సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్శిణి, సర్వ
వశంకరి, సర్వోన్మాదిని,
సర్వ మహాంకుశ, సర్వ ఖేచరి, సర్వ
బీజ, సర్వ యోని, సర్వ త్రిఖండ, అనే దశ ముద్రలు గలవు.
అమ్మ శరీరమే శ్రీచక్రము. అమ్మే శ్రీచక్రము. అమ్మ పాదములు భూపుర త్రయము. అమ్మ
శరీరము నుండి, కాదు అమ్మ పాదముల గోళ్ళ కాంతి నుండి అణిమాది అష్ట సిద్ధులు అనబడే
దేవతలు ఉద్భవించినారు.
ఎటువంటి పాదములు అవి ? “పద ద్వయ ప్రభాజాల
పరాకృత సరోరుహా” ...అన్నారు వ్యాసుల వారు.
ఆ తల్లి పాదముల యొక్క కాంతిచే పద్మములు తిరస్కరించ బడినవి. అంటే ఆ తల్లి పాదములను
పట్టుకోన్నవాడు పద్మములను కూడా అంటే
లక్ష్మీ దేవిని కూడా తిరస్కరిస్తాడు అని అర్ధము చెప్పుకోవాలి. అంటే నిధిని లెక్క
చేయడు. అంతటి జ్ఞానము లభిస్తుంది ఆమె పాదములను పట్టుకొన్నవాడికి.
శ్రీవిద్యోపాసకుడు లౌకిక సుఖములను లక్ష్య పెట్టడు అని అర్ధము. అమ్మ పాదములను
పట్టుకోన్నవాడు అమ్మ జ్ఞానము చే కాంతి చే లక్ష్మీ దేవిని కూడా ఇహ పర సుఖములను కూడా
తిరస్కరించును.
నఖదీధితి సంఛన్న నమజ్జన తమో గుణా
..... అమ్మ పాదముల గోళ్ళ నుండి వచ్చే చంద్ర కాంతుల చేత
బ్రహ్మాది దేవతల యొక్క తమో గుణము నశించు చున్నది. శ్రీ దేవి ఉపాసకుల యొక్క
అజ్ఞానము పూర్తిగా నశించు చున్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నీ పాదములను పట్టుకొని
వుంటారు కాబట్టి. నీకు నమస్కరించడం వలన, నీ పాద పూజ చేయడం వలన, నీ గోళ్ళ కాంతి చేత వాళ్ళు జ్ఞానమును పొందు
చున్నారు అమ్మా. అందుకు శ్రీవిద్య బ్రహ్మ విద్య అయినది, మోక్ష విద్య అయినది. నిన్ను
ఉపాసించే వాళ్లకు అణిమాది అష్ట సిద్ధులు ఒక లెక్కా . గడ్డి పరకతో సమానము అవి.
అసలు అణిమాది అష్ట సిద్ధులు ఏమిటమ్మా సదా శివుడు ఇచ్చే ఐశ్వర్యమునే
తృణీకరిస్తారు వాళ్ళు.
శ్రీవిద్యోపాసకులు దేనినీ లెక్క
జేయరు. అన్ని ఐశ్వర్యములను బూదిగా భావిస్తారు. అందుకే మహా ప్రళయములో జనించిన అగ్ని
వాళ్లకు నీరాజనం పలుకుతుంది. ఎందుకంటే
నీవే వాళ్ళు. వాళ్ళే నీవు. శ్రీవిద్యోపాసకులు అంటే సాక్షాత్తు ఆ పరదేవతా స్వరూపమే.
అమ్మకు శ్రీవిద్యోపాసకులకు అభేదము. ఊపిరియే శ్రీవిద్యోపాసనగా బ్రతుకుతారు కాబట్టి,
వాళ్లు మహా శక్తి సంపన్నులు. వాళ్లకు మరలా
అజ్ఞానము అనేది ఉండదు. అందుకే చివరి జన్మ అయిన వాళ్ళకే శ్రీవిద్య లభించును. “చరమే జన్మని యధా శ్రీవిద్యోపాసకో భవేత్ ....అని
లలితా సహస్రనామం ఉత్తర పీఠిక చెప్పు చున్నది.
ఎక్కడ మహా మోహము అనే దొంగ ఎత్తుకొని పోవునో అని భయముతో, మునులు తమ మనస్సు అనే
రత్నమును అమ్మ పాదాల చెంత ఉంచుతారంట.
ఎక్కడ ప్రణయ కలహము కలుగునో అని భయపడి శివుడు అమ్మ వారి పాదముల యందు తన శిరము
నుంచినాడంట. అప్పుడు అమ్మ వారి పాదములందలి సంధ్యారుణ కాంతిని శివుని జటా జూటము నందున్న
చంద్రుడు గ్రహించి ఎర్రగా అయ్యెను. అటువంటి ఎరుపు నాలోని మోహ గుణమును తొలగించు గాక
...అని
మూక పంచశతీ లో మూక కవి అన్నారు.
అటువంటి మహా తల్లి పాద పద్మములకు నమస్కరిస్తూ ....
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/04-08-2014 @ శ్రీకాళహస్తి