Tuesday, 9 October 2012

షష్టీ దేవి ఉపాఖ్యానం (SHASHTEE DEVI)

షష్టీ దేవి ఉపాఖ్యానం (SHASHTEE DEVI)

కష్ట సుఖాలు, కలిమి లేములు, సంతతి కలగడం, కలగక పోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా వుండడం, చిరంజీవిగా వుండడం ఇదంతా కర్మ ఫలాలను బట్టి వుంటుంది. అంతా కర్మాధీనం అని వేదం చెబుతుంది.

షష్టీ దేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఈ దేవి కధ చాలా మహిమ గలది. ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.

పేరు దేవ సేన. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్య మాత. ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ఇది. 

స్వాయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్ధక నామధేయుడు, సంసార సంబంధము బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ వుండగా బ్రహ్మ వచ్చి, సంసారం సక్రమముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజ ధర్మం, అని చెప్పగా, ప్రియ వ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహాముతో పుత్ర కామేష్టి చేసినారు. తత్ఫలితముగా రాజ పత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్నతల్లి కడుపు భాధ చెప్ప శక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయినది.

ప్రియవ్రతుడు లోలోపల క్రుంగి కొంతసేపటికి తేరుకొని, రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి “ అమ్మా ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు? అని సవినయముగా అడిగాడు.

“రాజా! నేను ప్రకృతి షష్టా౦శ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్టి దేవి అని నన్ను స్మరిస్తారు. .అని అన్నది. ప్రియవ్రతుడి ప్రార్ధనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ “వీని పేరు సువ్రతుడు, అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచ్చత్రంగా పాలిస్తాడు, నూరు యజ్ఞాలు చేస్తాడు. అని అన్నది.  వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ, నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ వుండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్దానమైనది. 

ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్టీ దేవి యొక్క కధ చెప్పి, తన భార్య తో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి, ప్రజల చేత కూడా షష్టీ దేవి యొక్క పూజలు చేయించినాడు.

పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,పుట్టిన శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్దినాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్న ప్రాశన సమయములో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయము కలిగి ఉండును.

ఆ ప్రియవ్రతుడు షష్టీ దేవిని ఈ విధముగా స్తుతించినాడు.

కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. బాల బాలికలు భయపడి ఏడుస్తూవున్నప్పుడు, పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని భాధలు పోయి, పిల్లలు సుఖముగా,సురక్షితముగా వుంటారు. షష్టీ దేవి అనుగ్రహము వలన అన్ని రకములైన బాల గ్రహ పీడలు తొలగి పోతాయి. ఇది షష్టీ దేవి కధ.
 
షష్టీ దేవి స్తోత్రము 
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ద్యై, శాంత్యై, నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టా౦శరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్టాతృ దేవ్యై చ షష్టీ దేవ్యై నమో నమః
కళ్యాణ దేవ్యై  కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం
ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిణ్యై షష్టీ దేవ్యై నమో నమః
శుద్ధసత్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్జితాయై షష్టీ దేవ్యై నమో నమః
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి!
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి!
ధర్మం దేహి యశోదేహి షష్టీ దేవీ నమో నమః ! 
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే !
కళ్యాణం చ జయం దేహి, విద్యా దేవి నమో నమః!
          *******
సంతానం లేని వారు, కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.
శుభమస్తు.
మీ  
భాస్కరానంద నాధ

 

 

 

 

శ్రీదేవీ తత్వం - 3 (SRI DEVI TATWAM -3)


శ్రీదేవీ తత్వం - 3  (SRI DEVI TATWAM -3)

మీరు శ్రద్దగా ఒకటికి రెండు సార్లు చదివితే గాని పట్టుకోలేరు ఈ మూల రహస్యాన్ని. కొంచెము మనసు పెట్టి చదవండి, లేక పోతే మనస్సుకు అందదు. 

0, 1, 2, 3, 4,..100, 500, …..1000000,………..….

ఇలా మనము ఎన్ని అంకెలు వ్రాసుకొంటూ పోయినా, ఆ అన్ని అంకెలు కూడా ఆ సున్నా లో నుంచి వచ్చినవే అని తెలుసుకొనవలెను. అది సున్నా అని మనము అంటాము, నిజానికి అది సున్న(zero) కాదు,  అది శూన్యము గాదు. అది పూర్ణము, అనంతము (Infinite).  అందులో నుంచే అన్ని సంఖ్యలు వచ్చినవి. అలాగే తెలుపు రంగులో నుంచే అన్ని రంగులు వచ్చినవి అని కూడా తెలుసుకోవలెను. మరి ఆ తెలుపు, ఏమిటి? ఆ తెలుపు శుద్ధ తత్వం, అదే పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆ మహా శివుడ్ని

శుద్ధ స్పటిక సంకాశం, సచ్చిదానంద రూపం అని అంటారు. ఎలా తెలుపు లో నుంచి అన్ని రంగులు వెలసినవో, ఎలా పూర్ణము లో నుంచి అంకెలు వచ్చినవో అలాగే మొత్తం సృష్టి అంతా ఆ పరమశివుణ్ణి నుంచే వచ్చినవి. ఆ పూర్ణ బింబము మహా మాయతో కూడి వున్నది. ఆ మహా గర్బము నుంచే మన మందరమూ పుట్టినాము. అందుకే ఆమె ఆద్య కుటుంభిని అయినది.

అలా పూర్ణము లో నుంచి అంకెలు రావడానికి, తెలుపులో నుంచి మిగతా రంగులు రావడానికి కారణం పరబ్రహ్మ మహిషి అయిన ఆ జగన్మాతే కారణము. రంగులు అంటేనే సృష్టి, మాయ. రంగులు లేకపోతే సృష్టి లేదు. మహా ప్రళయంలో సృష్టి అంతా ఒక దానిలోకి ఒకటి వెనక్కి వెళ్లి పోతుంది (Retrieve). అప్పుడు అన్ని రంగులు కలసి, (అన్ని జీవరాసులు, ప్రాణి కోటి కలసి) ఒకే ఒక రంగు తెలుపు మహా మాయ అవుతుంది, ఆ మహా మాయ కూడా ఆ పరబ్రహ్మంలో కలిసి పోయి మహా బింబం ఏర్పడి శుద్ధ తత్వం (కర్పూర గౌరం), మహా తెలుపు, మహా గౌరం ఏర్పడుతుంది.  అదే ఆ పరమ శివ శంకరుని తత్వం. ఇదే నిర్గుణ తత్వం.

 
కర్పూర గౌరం కరుణావతారం,సంసార తారం భుజగేంద్ర హారం
సదా వసంతం హృదయార వింద౦, భవం భవానీ సహితం నమామి. 
ఆ తల్లి “శంకరార్దాంగ సౌందర్య శరీరాయై నమః.”.  విడరాని బంధము వాల్లిద్దరిది.

అదే కామ కామేశ్వరీ తత్వం. వాళ్ళే మనకు అసలు సిసలు అయిన జననీ జనకులు. తక్కిన వాళ్ళు అందరూ ఆ తరువాతనే. ఆ శక్తిలో నుంచి పుట్టుకు వచ్చిన వాళ్ళే.

మూల ప్రకృతి యొక్క లక్షణములు:-

“ప్ర” యన ప్రకృష్ట వాచకము, కృతి శబ్దము సృష్టి వాచకము. కనుక విశ్వమును నిర్మించుట యందు శ్రేష్టురాలయగు దేవతను మహా ప్రకృతి అని అందురు. ప్ర శబ్దము సత్వగుణమును,

“కృ” శబ్దము రజోగుణము, “తి” శబ్దము తమోగుణమును తెలుపును. చిన్మయ బ్రహ్మము త్రిగుణముల మాయతో కూడి సృష్టి కార్యము సాగించునపుడు దానిని ప్రకృతి అని, శక్తి యుక్తమని అందురు.  

సృష్టికి పూర్వము వున్న స్థితిని “ప్ర”  అని, సృష్టికి తరువాత దానిని “కృతి” అని అందురు. కనుక ఈ సృష్టికి పూర్వమందున్న దేదీప్యమానమగు చైతన్య మహాదేవియే మూల ప్రకృతి అని అందురు. ఆ నిరంజనమగు సత్యజ్ఞానానంతమగు పరమాత్మ సృష్టి జరుగునప్పుడు తన యోగ మాయతో రెండు రూపములు దాల్చును. అతని కుడి భాగము పురుషుడనియు, ఎడమ భాగము ప్రకృతి యని అందురు. అగ్నిలో వున్న దహన శక్తి వలె ఆత్మ లోపల, పరమాత్మ లోపల ఈ ప్రకృతి శక్తి గలదు. అందుకే యోగీంద్రులకు, జ్ఞానులకు స్త్రీ, పురుష భేదము కనిపించదు. ఈ విశ్వమున ప్రకృతి పురుషాత్మకము గాని వస్తువు లేదు.

శరణార్ధుల దీనార్తులు తొలగించి వారిని బ్రోచుటయే పనిగా గలది, తేజోరూపిణి, అగ్ని వర్ణ తపమున వేల్గొందునది, కృష్ణుని హృదయాదిష్టాతృదేవి దుర్గా దేవి సర్వ శక్తి స్వరూపిణి, పరమేశ్వరుని పరాశక్తి. అష్ట సిద్దులకీశ్వరి అయిన ఈ మహాదేవి సకల జీవుల యొక్క బుద్ది, భ్రమ ఓర్పు నిద్ర ఆకలి దప్పులు నీడలు ఏమరపాటు దయ తలంపు జాతి శాంతి కాంతి చైతన్యము తుష్టి పుష్టి లక్ష్మి ధైర్యము మాయ మున్నగువన్నియు ఈ మహా శక్తివియే.

ఈ దుర్గా దేవియే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్వరూప శక్తి. 

చండీ నవాక్షరీ మహా మంత్రమునకు ఋషి,  ద్రష్ట  శ్రీమహా విష్ణువే. 

ఈ మూల ప్రకృతి యైదు శక్తి మూర్తులుగా నావిర్భవించెను. ౧) దుర్గా దేవి, ౨) శ్రీ మహా లక్ష్మీ

౩) సరస్వతీ దేవి ౪) సావిత్రి దేవి ౫) రాధా దేవి. 

కర్పూర గౌరం కరుణావతారం, సంసార తారం భుజగేంద్ర హారం
సదా వసంతం హృదయార వింద౦, భవం భవానీ సహితం నమామి.
భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి.
మీ 

భాస్కరానంద నాధ/ 9-10-2012

Monday, 8 October 2012

గర్భాధానాది సంస్కారములు


గర్భాధానాది సంస్కారములు  

గర్భాధానాది సంస్కారములను గురించి గౌతమముని చాలా చక్కగా వివరించి వున్నారు.

గర్భధాన, పుంసవన, అనవలోభన, సీమంతోన్నయన, జాతక కర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయనం చత్వారి వేదవ్రతాని స్నానం.  ఇలా 64 సంస్కారములు గలవు.

సంస్కారమనగా దోషములను  పోగొట్టి, వున్న మంచి గుణమును అధికము చేయుట అని అర్ధము, దాని కొరకే ఈ సంస్కారములు చేయుదురు.

పిల్లలకు వారి తల్లిదండ్రుల దోషములు 12 సం.ల వరకు వెంటాడును అని జ్యోతిష శాస్త్రము చెప్పు చున్నది. గర్భాదానము మొదలుకొని చూడాకర్మ(చౌలకర్మ) వరకున్న సంస్కారములు తండ్రి యొక్క బీజము వలన, తల్లి గర్భము వలన సంక్రమించిన దోషములను పోగొట్టును.

ఈ చూడాంత సంస్కారముల వలన బీజ గర్భ సముద్భవమైన పాపము వీటిచే తొలగి పోవును అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.

విప్రులు,క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అను నాలుగు వర్ణములలో మొదటి ముగ్గురికీ ద్విజులు అని పేరు, ద్విజులకు గర్భాధానాది సంస్కారములను సమంత్రకముగా చేయవలెను అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.

గర్భాదానమును ఋతుకాలమున చేయవలెను. పుంసవనమును గర్భము స్పందించుట మొదలు పెట్టక పూర్వము చేయవలెను. గర్భము యొక్క ఆరవ నెలలో కానీ, ఎనిమిదవ నెలలో కానీ సీమంతోన్నయనము చేయవలెను. జన్మమైన వెంటనే జాతక కర్మ చేయవలెను.

పుట్టిన తరువాత పదకొండవ రోజున నామకరణము చేయవలెను. నాలుగవ మాసమున ప్రసవ గృహము నుండి శిశువును బయటికి కొనిపోవలెను. శిశువునకు ఆరవ మాసము వచ్చినప్పుడు అన్నప్రాశన చేయవలెను.

రజోదర్శనమైన దినము మొదలుకొని పదహారు దినములు స్త్రీలకు ఋతు కాలము అని అర్ధము. స్త్రీలకు ఋతు కాలము స్వాభావికము అవి పదునారు రాత్రులుండును అని మనువు చెప్పెను. మొదటి నాలుగు రాత్రులు సత్ పురుషులు గర్హించిరి. అట్లే పదకొండవ రాత్రి, పదమూడవ రాత్రియును వదలి పెట్టవలెను. తక్కిన పది రాత్రులు ప్రశస్తములు. సరి దినముల యందు దాంపత్యము నెరిపిన యెడల పురుష శిశువులు, బేసి దినముల యందు నెరిపినచో స్త్రీ శిశువులు జన్మింతురు. ఇట్లు ఋతుకాలమున గర్భాదానము అయిన తరువాత గర్భ స్పందనకు పూర్వము పుంసవనము చేయవలెను. స్పందనము మామూలుగా రెండవ లేదా మూడవ మాసమున ఆరంభము కావచ్చును.

సీమంతోన్నయనము అనునది క్షేత్ర సంస్కారమగుట వలన ప్రతి గర్భధారణ సమయము నందును చేయవలసిన అవసరము లేదని కొందరు, కాదు అది గర్భ సంస్కారము, కావున ప్రతి గర్భము నందు జరగవలశినదే అని కొందరు అందురు.

ఇక జాతక కర్మను ప్రసవమైన వెంటనే చేయవలెనని యాజ్ఞవల్క్యుడు చెప్పెను. ప్రసవమైన వెంటనే, పుత్రుడు కలిగినట్టు విన్న వెంటనే తండ్రి తన పై వస్త్రాలను మార్చుకోకుండా సచేల స్నానము చేయవలెను.

పుత్రుడు పుట్టగానే దేవతలు, పితృ దేవతలు ఇంటికి వచ్చెదరు. అందువలన ఆ దినమున బంగారమును కానీ, భూమిని కానీ, గోవును కానీ, దానము చేయవలెను. బంధువులకు హిరణ్య దానములు, వస్త్రములు పెట్ట వలెను.

ఆ తరువాత సంస్కారము నామకరణము. ఇది మరలా ఇంకో సారి తెలుసుకొంటాము.

మీ

భాస్కరానంద నాధ
8-10-2012

శ్రీదేవీ తత్వం - 2

శ్రీదేవీ తత్వం - 2

స్వగురువేనమః ! పరమ గురువేనమః !పరమేష్టి గురువేనమః !

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే,
శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. 

సత్వ, రజో,తమో గుణములైన గుణ త్రయమునకు మాయ అనబడును. అట్టి మాయ ఉపాధిగా గల భగవతి శ్రీదేవియే పరబ్రహ్మ తత్త్వము. అట్టి పర బ్రహ్మము నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గౌరీ లక్ష్మీ సరస్వతులు ఉత్పత్తి నొందిరి. శ్రీదేవియే త్రిమూర్తులకును ఈ దేవీ త్రయము నిచ్చెను. రాముడు, శ్రీకృష్ణుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు  నుంచి ముక్కోటి దేవతల వరకు సప్త ఋషులు వరకు, మహా మునులు, ఋషులు, యోగులు, సిద్దులు, బాబాలు, గురువులు, బ్రహ్మ నుంచి మన పిల్లలవరకు ఈ సృష్టిలోని సమస్త ప్రాణి కోటి ఆ మహా గర్భము నుంచి వచ్చినవే. సమస్త ప్రాణి కోటి ఆ సనాతనులైన మహా దంపతుల నుంచి ఉద్భవించినవే.

ఈ సమస్త చరా చర సృష్టికి మూలము ఆ ఆది దంపతులే కారణము. అన్ని యుగాలకు ముందు వున్న మూల దంపతులు వారే. ఆ పరబ్రహ్మం సృష్టి రచనకు మొదలిడదానికి కారణం ఆ మూల ప్రకృతియే. నా తల్లి ఆ జగన్మాతయే. మా అమ్మ ఎంత గొప్పదో చెప్పుకోవడము నా ధర్మము.  

దీనిలో అతిశయోక్తి ఏమీలేదు, అబద్దములు అస్సలు లేవు, శ్రీ దేవీ భాగవతములో చెప్పిన రహస్యములనే నే చెప్పు చుంటిని. వేదములు ఏ తల్లిని గురించి, తండ్రిని గురించి చెప్పినాయో ఆ ఆది దంపతులను గురించి చెబుతున్నాను. ఉపాసన చేసి, అంతర్ముకః ధ్యానముతో ఆ తల్లి ఇచ్చిన జ్ఞానముతో ఈ విషయములు మీకు చెప్పు చుంటిని. ఇవి అసత్యములు కావు, ఆ తల్లి పలికించిన మాటలు ఇవి.

 ఏ దేముడైన, దేవతయైన ఆ తల్లి బిడ్డలే, ఏ గురువైనా, మునియైనా, యోగియైనా ఆ తల్లి పాదములకు నమస్కరించవలసినదే. ఆ తల్లి తరువాతే ఈ సమస్త సృష్టి, బ్రహ్మాండములు, ప్రపంచములు. విష్ణు శక్తి, బ్రహ్మ శక్తి, రుద్రుని శక్తి, మహేశ్వరుని శక్తి అన్నీ ఆమె. ఆమెయే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి.

 

మీ  

భాస్కరానంద నాధ/ 8-10-2012

శ్రీదేవీ తత్వం - 1

శ్రీదేవీ తత్వం -1


శ్రీ గురుభ్యోనమః

ఓం చైతన్య రూపాం తామాద్యాంచ ధీమహి బుద్ధింయానః ప్రచోదయాత్.

చైతన్య రూపయై, ఆద్యయై, విద్యా స్వరూపిణియైన ఏ దేవి మా బుద్ధిని ప్రేరేపించు చున్నదో ఆ దేవిని ధ్యానించేదను. అట్టి భగవతి యగు దేవి యొక్క ఉపాసన గురించి కొందఱు భ్రాంత చిత్తులు మాయ రూపమైన భగవతి యొక్క ఉపాసన తగదు అని అందురు. మాయ మిధ్య, అసత్యము అని అందురు. అట్టి మిధ్యా స్వరూపిణి మోక్షము ఇవ్వజాలదు అని అందురు.

కానీ వారన్నట్లు మాయ అన భ్రాంతి స్వరూపిణి కాదు, మాయ యన శక్తి. సర్వ జగములను సృష్టి, స్థితి, లయములను గావించునది. అట్టి శక్తిని ఉపాసించిన వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారనియు,మోక్షమును బొందుచున్నారనియు నృసింహతాపిన్యుపనిషత్తు తెలియజెప్పుచున్నది.

మాయావా ఏషా నారసింహీ, సర్వ మిదం సృజతి, సర్వమిదం రక్షతి, తస్మాన్మాయా మేతాం శక్తిం, విద్యా ద్యఏతాం మయా శక్తిం, వేద సమృత్యుం జయతి సపాప్మానం, తరతి సోzమృతత్వంచ గచ్ఛతి, మహతీం శ్రియమశ్నుతే.

ఆ శక్తిని భజించిన వాడు మృత్యువును జయంచి పాపమును తరించి మోక్షమును బొందును. గొప్ప సంపాద ననుభవించును. మరియు ఆ మాయ వైష్ణవి, శక్తి, విశ్వ బీజమని స్మృతులు ఘోషించినవి.

త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మేతత్.

ఈ సమస్త లోకములన్నియు మాయా శక్తి చే సమ్మోహితమగుచున్నవి. ఒకరేమిటి అందరూ కూడా. ఆ మాయా శక్తికి లోను కానివాడు ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ లేరు. రావణ బ్రహ్మ కూడా ఆ మాయా శక్తి కి లోనైన వాడె. దేవతలు, మనుజులు, ఆఖరాకి త్రిమూర్తులు అందరూ ఆ మాయకి లోబడిన వారె. మాయ బ్రహ్మ రూపిణీ, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.

శక్తి అనగా క్షుద్ర శక్తి గాదు. ఈమె పరా శక్తి, ఆది శక్తి, పర బ్రహ్మ మహిషి. ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి యైన జగన్మాత.

త్రిపురోపనిషత్తు, త్రిపురతాపిన్యుపనిషత్తు, దేవ్యుపనిషత్తు, బహ్వృచోపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతీ రహస్యోపనిషత్తు, సౌభాగ్యలక్ష్ముపనిషత్తు అను ఉపనిషత్తులు అన్నీ అమ్మ గురించి, శక్తి గురించి ఎంతగానో శ్లాఘించినవి.

ఆ పరా శక్తియే హిమవంతుని కుమార్తె పార్వతియై శివుని వరించి, పరమేశ్వరుని పట్టమహిషియై జగన్మాతయైనది.

బ్రహ్మవాదులు దేవి పరమ పదమును బ్రహ్మమనియే చెప్పిరి. హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమనియు, మోక్ష ప్రదమనియు జెప్పిరి.

మరియు దేవీ భాగవతము నందు

నిర్గుణా సగుణా చేత ద్విధా ప్రోక్తా మనీశిభి:

సగుణా రాగిభి: సేవ్యా నిర్గుణాతు విరాగిభి:

సగుణ యగు దేవిని కోర్కెలు గలవారును, నిర్గుణయగు దేవిని మోక్షమును గోరువారు ఉపాసింతురని దేవీ భాగవతము నందు చెప్ప బడినది.

బ్రహ్మాండ పురాణమున లలితోపాఖ్యానమున " చితిస్తత్పదలాక్ష్యార్దా చిదేకరస రూపిణీ" అని అన్నారు. జ్ఞాన స్వరూపిణి యగు ఆ దేవి తత్పదమునకు,  లక్ష్యార్ధ యని చెప్పబడినది.

ఈ విధముగా స్మృతులు,అష్టాదశ పురాణములు, ఉప పురాణములు దేవి పర బ్రహ్మ మని దేవీ తత్వమును గురించి చెప్ప బడినవి. శక్తి బ్రహ్మము కంటే వేరుగా యుండదు, అందువలన కేవలమగు బ్రహ్మోపాసనము అసంభవమగు చున్నది.

అలాగే కేవలము మాయోపాసనము అసంభవమగు చున్నది. ఎందుకంటే అంతటా వున్నది ఆ బ్రహ్మాధిష్టాన యుతయైన మాయ యొక్క ఉనికియే అని తెలియ వలెను.

కావున అమ్మే అయ్య, అయ్యే అమ్మ అని తెలియ వలెను. వారిని రెండుగా వేరుగా చూడరాదు. ఒకరిలో ఒకరు వున్నారు. అటువంటి అర్ధనారీశ్వర తత్వమైన అమ్మను గురించి రోజూ నాలుగు మాటలు మనము రోజూ తెలుసుకొంటాము. అమ్మ యొక్క ఉపాసన, పూజ, నవరాత్రి మహిమ గురించి రేపు విన్న వించుకొంటాను.

చక్కగా ఈ నవ రాత్రులు అందరూ అమ్మ పూజ చేసుకొని అమ్మ అనుగ్రహము పొందేదరని ఆశిస్తూ,

మీ

భాస్కరానంద నాధ

3-10-2012