గర్భాధానాది
సంస్కారములు
గర్భాధానాది సంస్కారములను
గురించి గౌతమముని చాలా చక్కగా వివరించి వున్నారు.
గర్భధాన, పుంసవన,
అనవలోభన, సీమంతోన్నయన, జాతక కర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయనం చత్వారి
వేదవ్రతాని స్నానం. ఇలా 64 సంస్కారములు గలవు.
సంస్కారమనగా దోషములను
పోగొట్టి, వున్న మంచి గుణమును అధికము చేయుట
అని అర్ధము, దాని కొరకే ఈ సంస్కారములు చేయుదురు.
పిల్లలకు వారి
తల్లిదండ్రుల దోషములు 12 సం.ల వరకు వెంటాడును అని జ్యోతిష శాస్త్రము చెప్పు చున్నది.
గర్భాదానము మొదలుకొని చూడాకర్మ(చౌలకర్మ) వరకున్న సంస్కారములు తండ్రి యొక్క బీజము
వలన, తల్లి గర్భము వలన సంక్రమించిన దోషములను పోగొట్టును.
ఈ చూడాంత
సంస్కారముల వలన బీజ గర్భ సముద్భవమైన పాపము వీటిచే తొలగి పోవును అని యాజ్ఞవల్క్యుడు
చెప్పెను.
విప్రులు,క్షత్రియులు,
వైశ్యులు, శూద్రులు అను నాలుగు వర్ణములలో మొదటి ముగ్గురికీ ద్విజులు అని పేరు, ద్విజులకు
గర్భాధానాది సంస్కారములను సమంత్రకముగా చేయవలెను అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.
గర్భాదానమును
ఋతుకాలమున చేయవలెను. పుంసవనమును గర్భము స్పందించుట మొదలు పెట్టక పూర్వము చేయవలెను.
గర్భము యొక్క ఆరవ నెలలో కానీ, ఎనిమిదవ నెలలో కానీ సీమంతోన్నయనము చేయవలెను. జన్మమైన
వెంటనే జాతక కర్మ చేయవలెను.
పుట్టిన తరువాత
పదకొండవ రోజున నామకరణము చేయవలెను. నాలుగవ మాసమున ప్రసవ గృహము నుండి శిశువును
బయటికి కొనిపోవలెను. శిశువునకు ఆరవ మాసము వచ్చినప్పుడు అన్నప్రాశన చేయవలెను.
రజోదర్శనమైన దినము
మొదలుకొని పదహారు దినములు స్త్రీలకు ఋతు కాలము అని అర్ధము. స్త్రీలకు ఋతు కాలము
స్వాభావికము అవి పదునారు రాత్రులుండును అని మనువు చెప్పెను. మొదటి నాలుగు రాత్రులు
సత్ పురుషులు గర్హించిరి. అట్లే పదకొండవ రాత్రి, పదమూడవ రాత్రియును వదలి
పెట్టవలెను. తక్కిన పది రాత్రులు ప్రశస్తములు. సరి దినముల యందు దాంపత్యము నెరిపిన
యెడల పురుష శిశువులు, బేసి దినముల యందు నెరిపినచో స్త్రీ శిశువులు జన్మింతురు.
ఇట్లు ఋతుకాలమున గర్భాదానము అయిన తరువాత గర్భ స్పందనకు పూర్వము పుంసవనము చేయవలెను.
స్పందనము మామూలుగా రెండవ లేదా మూడవ మాసమున ఆరంభము కావచ్చును.
సీమంతోన్నయనము
అనునది క్షేత్ర సంస్కారమగుట వలన ప్రతి గర్భధారణ సమయము నందును చేయవలసిన అవసరము
లేదని కొందరు, కాదు అది గర్భ సంస్కారము, కావున ప్రతి గర్భము నందు జరగవలశినదే అని
కొందరు అందురు.
ఇక జాతక కర్మను
ప్రసవమైన వెంటనే చేయవలెనని యాజ్ఞవల్క్యుడు చెప్పెను. ప్రసవమైన వెంటనే, పుత్రుడు
కలిగినట్టు విన్న వెంటనే తండ్రి తన పై వస్త్రాలను మార్చుకోకుండా సచేల స్నానము
చేయవలెను.
పుత్రుడు
పుట్టగానే దేవతలు, పితృ దేవతలు ఇంటికి వచ్చెదరు. అందువలన ఆ దినమున బంగారమును కానీ,
భూమిని కానీ, గోవును కానీ, దానము చేయవలెను. బంధువులకు హిరణ్య దానములు, వస్త్రములు
పెట్ట వలెను.
ఆ తరువాత
సంస్కారము నామకరణము. ఇది మరలా ఇంకో సారి తెలుసుకొంటాము.
మీ
భాస్కరానంద నాధ
8-10-2012
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.