Friday, 9 May 2014

సౌందర్యలహరి- 9

సౌందర్యలహరి- 9
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.


శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
        స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి |
        మనోzపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం
        సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9

ఓ భగవతీ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీతత్త్వాన్ని, మణిపుర చక్రంలోవున్న ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్ధచక్రంలోని ఆకాశ తత్త్వాన్ని, కనుబొమల నడుమనుండే ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు.


భాస్కరానంద భావము:-
శ్రీ గురువులు ఈ శ్లోకము ద్వారా మనకు అమ్మ వారి యొక్క సూక్ష్మ ఆరాధన తెలియజేస్తున్నారు. పిండాండము లోని చక్ర సాధన, అంతర్యాగము ద్వారా అమ్మను ఎలా చేరు కోవాలి, కుండలిని సాధన ఎలా చేయాలి? యోగ సాధన ఎలా చేయాలి? యోగ మార్గములో ఎలా వెళ్ళాలి ? అని  షట్చక్ర సాధన, నిరూపణ  గురించి చెబుతున్నారు.  అమ్మ మన శరీరంలో ఎక్కడెక్కడ ఏయే రూపాలలో నివసిస్తుందో శక్తి ఏ మూలకంగా చైతన్యముగా చలిస్తుందో చెప్పియున్నారు. ఈ శ్లోకము యోగ రహస్య సాధనకు సంబందిచినది. పిండాండమును బ్రహ్మాండమును ఏ విధముగా సమన్వయము చేసుకోవాలో నేర్పినారు ఇచ్చట. ధ్యానము ఎలా చేయాలి? నాద బిందు యోగము మొదలగు సూక్ష్మ మైన విషయములను గుప్తముగా ఇక్కడ చెప్పియున్నారు . కుండలినీ సాధనాపరులకు ఇది అత్యంత శక్తిమంతమైన శ్లోకము. బ్రహ్మాండమునందు ఆవరించి వున్న సమిష్టి రూప కుండలినియే పిండాండమునందు వ్యష్టి రూపములో వున్నది, అదే శ్రీచక్ర రూపములో బాహ్యమున పూజలు అందుకొంటున్నది. శరీరమే ఒక  శ్రీచక్రము.  బాహ్యమున శ్రీచక్రారాధన చేసేవాళ్ళు, అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే సహస్రారము చేరి శివుని తో ఐక్యం చెందుదురు.
శక్తి శివుడు ఐక్యం కావడమే నాద బిందు కళ అని అందరు. కులపథం అంటే కుల మార్గము, కుండలినీ మార్గము అని. ఈ శ్లోకములో కుండలినీ శక్తి యొక్క  గమనమును  గురించి గురుదేవుళ్ళు చక్కగా వివరించియున్నారు.

నాద బిందు కళ :-
శరీరము, లేదా షట్చక్రములను నాదము  అందురు.  బిందువు అంటే శ్రీచక్రములోని మధ్యభాగమున, లేదా అగ్ర బాగమున  వున్న బిందువు, లేదా సహస్రారం లోని బిందువు అని.  షట్చక్రములను బిందువును అనుసంధానం చేయు ప్రక్రియను నాద బిందు కళ అని అందురు. ఇది యోగ విద్యా రహస్యము. యోగ మార్గము ద్వారా దీనిని సాధన చేయ వలెను. పంచదశీ మహా విద్యతో మూలాధారములోని కుండలినీ శక్తిని  ఉత్కీలనము గావించి  సుషుమ్న  నాడి ద్వారా మూడు గ్రంధులను  దాటి సహస్రారములోని బిందువుతో ఐక్యం చెందడం నాద బిందు కళ అందురు.    ఈ సమయములో సాధకుడు పంచ పుష్పములతో సాధన చేయ వలెను. అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమా గుణములే పంచ పుష్పములు. గురు అనుగ్రహము పూర్తిగా వున్న వారికీ మాత్రమే కుండలినీ చలనం కలుగును. మార్గము తెలియును.
భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితా
శక్తిః కుండలినీ నామ బిసతంతు నిభాzశుభా || ........... (వామకేశ్వర తంత్రం)
 మూలాధారాంబుజారూఢా ..... స్వాధిష్టానాంబుజగతా .... మణిపూరాబ్జ నిలయా....అనాహతాబ్జ నిలయా ....విశుద్ధ చక్ర నిలయా....ఆజ్ఞాచక్రాబ్జ నిలయా .....సహస్రదళ పద్మస్థా.......(లలితా సహస్ర నామం)

శ్లో: మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంధి విభేదినీ
    మణి పూరాంతరుదితా విష్ణు గ్రంధి విభేదినీ
    ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్ర గ్రంధి విభేదినీ,
    సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ
    తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా
   మహా శక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ...... .......(లలితా సహస్ర నామం)
మూలాధారాంబుజా రూడా  పంచవక్త్రాస్థి  సంస్థితా,
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా,
ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణీ


1.మూలాధార చక్రము :-
మూలాధార కమలము (గుద స్థానము) నాలుగు దళములతో, పృథివీ తత్వము రూపములో సర్వాధారభూతమైన చక్రము నందు కుండలనీ శక్తి రూపములో సర్పాకారములో తోకను నోటితో కరచీ పట్టుకొని నిద్రావస్థలో వుంటుంది. అందుకే ఆమెను కులాంగనా కులాంతస్థా కులయోగినీ ....అని అందురు.
ఈ సాధన వలన యోగులు గాలి లోకి లేవడం జరుగుతుంది. తీవ్ర వత్తిడితో సాధన చేయడం వలన గుద స్థానంలో అమిత మైన వేడి జనించును. అందుకని పెసరపప్పుతో చేసిన అన్నము పులగమును ఎక్కువగా తీసుకోనినచొ ఒళ్ళు చలువ చేయును. సాధనాపరులు పులగమును మాత్రమే తీసుకొంటూ సాధన చేయ వలెను.
2. మణిపూర చక్రము:-
మణి పూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా,
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా,
రక్త వర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీత మానసా,
సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ

ఇది జల తత్వము. నాభి స్థానము. పది దళములతో లాకిన్యంబా స్వరూపములో యోగినీ దేవత ఇచ్చట కలదు. మణుల కాంతితో వెదజల్లుతూ వుంటుంది కనుక దీనికి మణిపూరక చక్రము అని పేరు. గర్బసంచి వుండే స్థానము, చల్లని ప్రదేశము కావున కాస్త వేడి చేయడానికి బెల్లం తినాలి. ఈ సాధన చేసే వాళ్ళు విధిగా బెల్లం అన్నం తినాలి. దీనిని జయించిన వాళ్ళు నీటిపై తేలుట, నడుచుట శక్తులు కలిగి వుండుదురు.
పద్మము ఎప్పుడు నీటిలో ఉండును. బిసతంతు తనీయసి ....వెన్నెముక వెనుక భాగమున సుషుమ్నా నాడి తామర తూడు లాగ వుండి, దాని కొస నీటి అడుగు బాగాన జలతత్వం అయిన మణి పూర చక్రము దాటి మూలాధారము వరకు  విస్తరించి వుంటుంది.   కమలము యొక్క తల సహస్రారము లోను, తోక మూలాధారము లోను వుంటుంది. ఈ కమలమును పూర్ణగిరి పీఠము అని అందురు.
3. స్వాధిష్టాన చక్రము:-
స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్త్ర మనోహరా,
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాzతి గర్వితా,
మేదోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా,
ధధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపదారిణీ
స్వాధిష్టాన కమలము ఆరు దళములతో కాకినీ అను యోగినీ దేవత లింగ స్థానమున మేధస్సు రూపములో    మధువు నందు ప్రీతీ కలిగి ఉండును. అగ్నితత్వము. పీత వర్ణము కలిగి వుంటుంది.. ఈ సాధన చేసే వాళ్ళు పెరుగు అన్నమును తినవలెను. ఈ కమలమును కామగిరి పీఠము అని అందురు.

4. అనాహత చక్రము:-
అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా,
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాది ధరా రుధిర సంస్థితా,
కాళ రాత్ర్యాది శక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా,
మహావీరేంద్ర వరదారాకిన్యాంబా స్వరూపిణీ
అనాహత కమలము, 12 దళములు, హృదయ స్థానము, వాయుతత్వము. ఈ కమలమును జాలంధర పీఠము అని అందురు. ఈ సాధన చేసే వాళ్ళు నేతితో వండిన అన్నమును తినవలెను. రక్తము అనే ధాతువు నందు రాకిని అను యోగినీ దేవత శ్యామ వర్ణముతో ఉండును.
5. విశుద్ధ చక్రము:-
విశుద్ధ చక్ర నిలయాzzరక్తవర్ణా త్రిలోచనా
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా
పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ
విశుద్ది కమలము 16 దళములతో, శ్వేత వర్ణముతో కంఠస్థానమున, ఆకాశ తత్వముతో కూడి, పాయసాన్నము నందు ప్రీతి కలిగి, చర్మము అనే ధాతువు నందు డాకిని అను యోగినీ దేవత రక్త వర్ణముతో కలదు.
6. ఆజ్ఞా చక్రము :-
ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్ల వర్ణా షడాననా,
మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా హాకినీరూప ధారిణీ
ఆజ్ఞా కమలము 2 దళములతో, భ్రూమధ్య స్థానమున, మనస్త త్త్వాత్మకము తో కూడి హరిద్రాన్నం నందు ఆసక్తి కలిగి తెల్లని రంగుతో హాకీని అను దేవత ఇచ్చట కలదు. ఈ దేవత ఎముకలలోని మజ్జ యందు వుండి అన్ని చక్రములకు సర్వ శక్తులు ఇచ్చు చుండును. ఈ కమలమును ఓడ్యాణ పీఠము అని అందురు.
7. సహస్రార చక్రము :-
సహస్ర దళ పద్మస్థా సర్వ వర్ణోప శోభితా
సర్వాయుధ ధరా శుక్ల సంస్థితా సర్వతో ముఖీ,
సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ
సహస్రార కమలము , 1000 దళములతో శిరో మధ్య భాగమున బ్రహ్మ రంద్రము దగ్గర సహస్ర దళ కమలము గలదు. సకల వర్ణముల చేత ప్రకాశించుచూ సకల ఆయుధములు ధరించి సకల పదార్దముల యందు ఆశక్తి కలిగి శుక్ల ధాతువు, వీర్యము నందు జీవ రూపములో యాకిని అను యోగినీ దేవత కలదు.

ఈ ఆరు చక్రములలో మూలాధార, స్వాధిష్టానములను ప్రధమ ఖండము, వాగ్భవ కూటము అని,
మణిపూర, అనాహతా చక్రములను ద్వితీయ ఖండము, కామరాజ ఖండము అని,
విశుద్ది, ఆజ్ఞా చక్రములను తృతీయ ఖండము, శక్తి ఖండము అని మూడు భాగములుగా విభజించిరి.

ప్రధమ ఖండము పై భాగమున బ్రహ్మ గ్రంధి, ద్వీతీయ ఖండము పై భాగమున విష్ణు గ్రంధి, తృతీయ  ఖండము పై భాగమున రుద్ర గ్రంధి కలవు.
బ్రహ్మ గ్రంధిని అగ్ని మండలము, సృష్టి స్థానము అని,
విష్ణు గ్రంధిని సూర్య మండలము, స్థితి స్థానము అని,
రుద్ర గ్రంధిని చంద్ర మండలము, లయ స్థానము అని అందురు.

సర్వ వేద మయీ దేవి సర్వ మంత్ర స్వరూపిణీ
షన్మాసాభ్యాస యోగేన చైతన్యా కుండలీ భవేత్ ...............రుద్రయామళ తంత్రము:-
ఆరు నెలల అభ్యాసముచే కుండలినీ శక్తి జాగృతమగును.  గురు సేవా పరాయణుడు, శుద్ధ సత్వ గుణ సంపన్నుడు, భక్తీ అష్టాంగ యోగ ప్రవర్తకుడు అయిన సాధకుడు కుండలినీ శక్తి యొక్క అనుగ్రహమును పొందును. సంవత్సరమునకు ఒక్కొక్క శక్తి పీఠము నందు నివసించుచూ కుండలినీ సాధన చేయ వలెను.
బ్రహ్మచర్యముతో, మౌన వ్రతముతో, నిర్మలమైన మనస్సుతో  యోగుల సాంగత్యముతో ఈ సిద్ధి కలుగును. మూలాధారము నందు మనస్సును లగ్నము చేసి ఉదరము నందు వాయువును పూరించి శ్రీవిద్యా మంత్రములతో రేచక పూరక కుంభకములు చేసిన ప్రాణాయామము సిద్దించును. ఎడతెరగని ప్రాణాయామ సాధన వలన  కుండలినీ శక్తి ఉద్ధీపనము అగును. బ్రహ్మచర్యముతో శక్తిని (వీర్యమును) ఊర్ధ్వముఖము గావించి సహస్రారములోని శివునితో సంగమించి స్పందించడమే స్కలించడమే ... శివేన సహా మోదతే.
గూడార్ధము:-
జీవుడు కుండలినీ (శక్తి) రూపములో సుషుమ్న నాడి ద్వారా షట్చక్రములను దాటి, సిద్దులను కాదని, గ్రంధి త్రయమును దాటి (కాదని), మనస్సును జయించి  సహస్రారములోని పరమాత్ముడు అయిన శివున్ని కలసి క్రీడించడమే ..... శివేన సహా మోదతే .....జీవుడు పరమాత్మతో ఐక్యం కావడమే మోక్షం సాధన. ఇది సాధకుని యొక్క లక్ష్యం. 
ఆ పరమ శివునికి నమస్కరిస్తూ ........

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/10-05-2014 @ శ్రీకాళహస్తి

Thursday, 1 May 2014

సౌందర్యలహరి- 8

సౌందర్యలహరి- 8
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
      మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే|
      శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్‌
      భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్‌ || 8


తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూలతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన ( త్రికోణపు) పానుపుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదు కదా.


(భాస్కరానంద భావము)

శ్రీ గురువులు క్రిందటి శ్లోకములలో మనకు అమ్మ శక్తిని గురించి, అమ్మ పేరు, ఆమె ఎలా వుంటుందో వర్ణన చేసినారు, ఆమె రూపురేఖలు చెప్పినారు. ఇప్పుడు ఆమె ఎక్కడ వుంటుందో ఆమె చిరునామా మనకు తెలియ జేస్తున్నారు.
ఈ బ్రహ్మాండం పైన సప్త ప్రాకారముల వెనుక నాలుగు ఆమ్నాయములు (నాలుగు వేదములు)  నాలుగు ద్వారములు, పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ద్వారములు, వాటి మధ్య క్షీర సాగరము, దాని మధ్య రత్న ద్వీపము, దాని మధ్య కల్ప వృక్ష వనము, దాని మధ్య రత్న సింహాసనము, రత్న సింహాసనో పరిస్థిత శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాయై నమో నమః.         అదిగో అక్కడ కూర్చోని వుందయ్యా అమ్మ.
సుధా సిన్దోర్మధ్యే సుర విటపి వాటీ పరివృతే
 సుధా సిన్దోర్మధ్యే..... అంటే ఏమిటి?   అమృత బిందువు మధ్యలో ఏమున్నది ?
 శ్రీదేవి ఉపాసన మూడు విధములుగా వుంటుంది. ప్రతిదీ మూడు అంకెల మీద నడుస్తూ వుంటుంది.
మూడు లోకములు, మూడు దేవతలు, మూడు విద్యలు మూడు అగ్నులు, మూడు జ్యోతిస్సులు, మూడు గుణములు, మూడు శబ్దములు,  మూడు ఆశ్రమములు, మూడు కాలములు, మూడు అవస్థలు, మూడు వేదములు (వేద త్రయము). మూడు పురములు, త్రిదోషములు, త్రివర్గములు... అ కార, ఉ కార. మ కార రూపములలో నివసించునది.

అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము ......కామేశ్వరీ, వజ్రేశ్వరీ, భాగామాలినీ, వీరే శక్తి స్వరూపులైన పార్వతి, లక్ష్మి, సరస్వతి అను మూడు శక్తులు.
మూడు బిందువులు ... రక్త, శుక్ల, మిశ్రమ బిందువులు.
శ్రీదేవి  స్థూలము, సూక్ష్మము, పరము అను మూడు రూపములు కలిగి త్రివిధయై వున్నది. కాబట్టి ఆమె ఉపాసన కూడా   పూజ, జప, ధ్యాన రూపములలో వుంటుంది.   పూజ, జపము బహిర్యాగము అని,  ధ్యానము అంతర్యాగము అని అందురు. పూజ చేత జప, ధ్యానాదులు సిద్దించును.
 శ్రీచక్రము (పూజ), శ్రీవిద్య (జపము), శ్రీమాత (ధ్యానము). శ్రీవిద్యా మంత్రములు, శ్రీచక్రార్చన, లలితా సహస్ర నామములు ... ఈ మూడింటిని కలిపి త్రిపుటి అని అందురు. శ్రీవిద్యోపాసకులు నిత్యమూ ఈ మూడింటిని కలిపి సాధన చేయుచుందురు. 
భగవత్పాదులు ఇప్పటి వరుకు అమ్మ యొక్క స్థూల రూపాన్ని వర్ణించినారు. ఇప్పుడు అమ్మ యొక్క సూక్ష్మ రూపాన్ని ఈ శ్లోకములో వర్ణిస్తున్నారు బహు చక్కగా మనము పట్టు కోవడానికి వీలుగా. అమ్మను బహిర్యాగములో ఎలా పూజించాలి,  అంతర్ముఖముగా ఎలా ధ్యానించాలి అనేది మనకు ఇక్కడ నేర్పుతున్నారు.
 భావనాపరో జీవన్ముక్తో భవతి.       భావనాపరుడు జీవన్ముక్తుడు అగుచున్నాడు.
ఎలా భావన చేయాలి అనేది జగద్గురువులు మనకు ఇక్కడ నేర్పుచున్నారు.
భవానీ భావనాగమ్యా..........అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ....కదా ఆమె !

సుధా సిన్దోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే....మణిద్వీపే నీపోపవనవతి  చింతామణి గృహే ...
శివా కారే మంచే పరమ శివ పర్యంక నిలయామ్
క్షీర సాగర మధ్యలో రత్నాల దీవిలో, కల్పవృక్ష వనములో, కడిమి చెట్ల మధ్యలో, చింతామణులతో నిర్మించబడిన  గృహములో శివశక్తి అనే మంచే మీద పరమ శివుని ఒడిలో ఎడమ తోడ పై అమ్మ కూర్చోని వున్నది.
ఇదే విషయాన్ని శ్రీ మహాకవి కాళిదాసు తన శ్యామలా దండకములో అమ్మను గురించి స్తోత్రము చేసినారు.
జయజననీ సుధా సముద్రాంత రుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే......
సుధా సిన్దోర్మధ్యే:- ..... సుధా సాగర మధ్యస్థా.......అని మనకు లలితా సహస్రనామం లో కనిపిస్తుంది.
బ్రహ్మాండముల పైన సుధా సముద్రము, దాని మధ్య రత్న ద్వీపము, దాని మధ్యన చింతామణి గృహము కలదు. దీనినే శ్రీనగరము అని అందురు. (శ్రీమన్నగరనాయిక).  చింత చేత దొరుకునది చింతామణి, అంటే సాధన చేత, మంత్ర జపము చేత లభించునది, కోరిన కోర్కెలు తీర్చునది.
బిందు స్థానం సుధా సింధుః పంచ యోన్యః సుర ద్రుమాః తత్రైవ నీప శ్రేణి చ తన్మధ్యే మణి మండపం.తత్ర చింతామణిమయ.........అని వామకేశ్వర తంత్రములో కనిపిస్తుంది.
బ్రహ్మ రంద్రమే బిందు స్థానమని యోగ శాస్త్రము చెప్పుచున్నది. సహస్రారమే బైందవ గృహము అని, దాని మద్యలో వుండే బ్రహ్మ రంద్రమే సుధా సింధువు అని, దీనినే మహా బిందువు అని కూడా అందురు. ఈ బిందువు నుండియే సృష్టి వచ్చినది. శ్రీచక్రము లోని త్రికోణము బైందవ స్థానము.
 త్రికోణే బైందవమ్ శ్లిష్టం ...అని రుద్రయామళము, భైరవయామళము మరియు వామ కేశ్వర తంత్రములలో చెప్ప బడినది. కాబట్టి బిందువు త్రికోణములోనే గలదు. త్రికోణము త్రిమూర్తి స్వరూపము. దీనినే బీజ త్రయము, బిందు త్రయము, గుణ త్రయము, శక్తి త్రయము, మండల త్రయము, మూర్తి త్రయము, త్రిపుటి, యోని చక్రము అని అందురు.
సోమ, సూర్యాగ్ని మండలములు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని)  త్రికోణము లోని మూడు బిందువులు.
త్రికోణము లోని మధ్య బిందువే సృష్టికి మూలం, ఇదే సుధా సింధువు. ఇదియే బ్రహ్మ రంద్రము. అందుకే ఆమె త్రికోణాంతర దీపిక అయ్యినది.
౧. మూలాధార పద్మము యొక్క కర్ణికలో త్రికోణము కలదు.   దాని మద్యలో అగ్ని మండలము వున్నది. త్రికోణము యొక్క మధ్య లో దీపము వలె ప్రకాశించు దీపిక రూపములో అమ్మ వారు నెలకొని వున్నది. సకల ప్రాణుల యొక్క మూలాధారము నందు అగ్ని కలదు.
 ఈ  అగ్ని మండలమునే   శ్రీవిద్యలో ప్రధమ కూట స్వరూపము అని అందురు.
౨. హృదయము నందు సూర్య మండలము కలదు.
౩. శిరస్సున బ్రహ్మ రంధ్రమునకు క్రింద దిగువన  చంద్ర మండలము   కలదు.

సహస్రారం లో వుండే ఆ  చిత్కలను ఈ మూడింటితో అనుసంధానం చేస్తూ, నాద బిందువులను ఏకం చేస్తూ యోగ ప్రక్రియలో శ్రీవిద్యోపాసకులు కుండలినీ యోగ సాధన అంతర్ముఖంగా ,అంతర్యాగము చేస్తూ వుంటారు. దీనిని నాద బిందు కళ అని అంటారు. ఈ విద్యను గురువుల ద్వారా నేర్చుకొని సాధన చేయవలెను.          అగ్ని మండలము అయిన మూలాధారము  నుండి కుండలినీ శక్తిని లేపి సుషుమ్న నాడి ద్వారా సూర్య మండలము దాటి  బ్రహ్మ రంధ్రమునకు చేర్చి, అచ్చట వున్నచంద్ర మండలమును ద్రవింప జేసి, ఆ అమృత బిందులవలన తడిసి, సహస్రార పద్మమును  అధిష్టించిన ఆ చిత్కలను ధ్యానింప వలెను.  ఈవిధముగా సాధన చేసిన వాళ్ళు ఎంతో ధన్యులు కదమ్మా!
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్‌..............ఎంతో ధన్యులు అర్హత గల వాళ్ళు మాత్రమే ఆ హృత్కమలవాసినిని, చిదానంద లహరిని భజింతురు.
సూక్ష్మ రూపార్ధము :-   శ్రీచక్ర మధ్య బిందువు సుధా సింధువు. పంచ యోనులు నీప వనము (కదంబం చెట్లు).   అష్ట దళ షోడశ దళములు మహాపద్మ వనము.  బ్రహ్మాండోపరి భాగమున మహా పద్మ వనము కలదు. బ్రహ్మ రంద్రము లోని సహస్రార కమలము మహా పద్మము అని, అందుగల బిందు రూపమే సుధా సింధువు అని, ఆ స్థానమే సృష్టికి మూలమని, శ్రీ దేవి అచ్చటనే కలదని దీని భావము. అందుకే ఆమెను            మహా పద్మాటవీ సంస్థాయై నమః అని కొని యాడినారు లలితా సహస్ర నామం లో.

మనో బుద్ధి చిత్తాహంకారములను జయించి నాద బిందువులను ఏకం చేస్తూ యోగ మార్గమున శివ శక్తులను సంయోగ పరచిన మహా యోగులు సుధా సింధువులను  అమృత పానము చేయుదురు సహస్రార కమలములో. 72 వేల నాడులు తదుప బడును.  ఆ సుధా సింధువులో మునక వేయడం వలన పునర్జన్మ రహిత మైన మోక్షమును పొంది శివ సాయుజ్యమును పొందుదురు. మన శిరస్సు ఉపరి బాగమున బ్రహ్మ రంద్రము వుండు చోటున మహా పద్మము కలదు. అదే చంద్ర మండలము.
చింత చేత దొరుకునది చింతామణి అగుట చేత తన దగ్గరకు వచ్చిన యోగుల కోరికలను తీర్చి, ఆ శివాని  తన భక్తులకు శివ సాయుజ్యాన్ని ప్రసాదిస్తున్నది.

శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్‌:-   బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు మంచమునకు నాలుగు పాదములు కాగా, సదాశివుడు పర్యాంకము (పలక) కాగా  ఆ ఉపరి భాగమున శ్రీ మహా రాజరాజేశ్వరి ఆసీనురాలై వున్నది. అనగా స్థూలముగా మన శరీరములో మూలాధార స్వాధిష్టానములు పై భాగమున బ్రహ్మ గ్రంధి,  మణిపూర, అనాహతముల పైన విష్ణు గ్రంధి, విశుద్ధ ఆజ్ఞా చక్రముల పైన రుద్ర గ్రంధి, ఈ మూడు గ్రంధుల పైన లలాటము నుండి శిరో మధ్య భాగము వరకు ఈశ్వర స్థితియు, తదుపరి బిందు స్థానము నందు సదాశివ తత్వము అనియు, ఆ పైన చిత్కలా రూపములో శ్రీదేవి యున్నది అని దీని అర్ధము. కనుక పంచ బ్రహ్మాసనా స్థితి శ్రీదేవికి సిద్దించినది అని పెద్దలు చెప్పుదురు.

 శ్రీదేవియే  పంచ మహాబ్రహ్మల రూపములో  వామాది శక్తుల రూపములలో పంచ కృత్యములను నేరవేర్చున్నది. ఆ శక్తియే లేనప్పుడు, శక్తి విహీనులు, నిర్జీవులు  అయినప్పుడు వారు పంచ ప్రేతలు అగుదురు. శివునికి శక్తి లేనప్పుడు అతను కూడా మహా ప్రేత అగు చున్నాడు, చలన రహితుడు కాబట్టి.  కావున అమ్మ  పంచ ప్రేత మంచాధిశాయినీ, పంచ ప్రేతాసనాసీనా, పంచ బ్రహ్మ స్వరూపిణి  ....అయినది.

పంచ మహా బ్రహ్మలు:- సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పురుష, ఈశానములు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు శక్తితో కూడి నందువలన శ్రీ దేవి పంచ బ్రహ్మ స్వరూపిణి అయ్యి మహా శక్తి స్వరూపిణి  అగు చున్నది.

శ్లో: సిద్ధి సిద్ధవృత రత్న భూమికా కల్ప వృక్ష వనపాటి సంకులే |
    నీప వాటీ మణి మంటపేzరూణే చంఢ భాను కోటి భాసురే |
    ఆది పంచ శవ మంచకే, పరే  శంకరాంకృత పీఠికామణౌ |
    కాది హాది మను రూపిణీమహం భావయామి పర దేవతాం ||

హ్రీంకార మంత్ర మధనం వలన, జపం వలన శ్రీదేవీ కటాక్షం లబిస్తుంది, అదే సుధా సింధువు. చింతామణి దొరకడం అంటే అమ్మ సాక్షాత్కారం కావడం. చిదానంద లహరీం అంటే శివ సాయుజ్యము అంటే మోక్ష౦ లబించడం. 
మనస్సుకు ఆనందం కలిగించే స్వరూపము ఆ మహా శివుడు, ఆయనే చిదానంద రూపుడు.                                 ఆ చిదానంద స్వరూపాన్ని చూపించే మహా శక్తి గనుక ఆమె చిదానంద లహరీం.

ఇదే ఈ శ్లోక గూడార్ధము.  అటువంటి చిత్కలకు  నమస్కరిస్తూ......

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.

(సరస్వతీ రామచంద్ర రావు)/01-05-2014 @ శ్రీకాళహస్తి