Thursday, 1 May 2014

సౌందర్యలహరి- 8

సౌందర్యలహరి- 8
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
      మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే|
      శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్‌
      భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్‌ || 8


తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూలతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన ( త్రికోణపు) పానుపుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదు కదా.


(భాస్కరానంద భావము)

శ్రీ గురువులు క్రిందటి శ్లోకములలో మనకు అమ్మ శక్తిని గురించి, అమ్మ పేరు, ఆమె ఎలా వుంటుందో వర్ణన చేసినారు, ఆమె రూపురేఖలు చెప్పినారు. ఇప్పుడు ఆమె ఎక్కడ వుంటుందో ఆమె చిరునామా మనకు తెలియ జేస్తున్నారు.
ఈ బ్రహ్మాండం పైన సప్త ప్రాకారముల వెనుక నాలుగు ఆమ్నాయములు (నాలుగు వేదములు)  నాలుగు ద్వారములు, పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ద్వారములు, వాటి మధ్య క్షీర సాగరము, దాని మధ్య రత్న ద్వీపము, దాని మధ్య కల్ప వృక్ష వనము, దాని మధ్య రత్న సింహాసనము, రత్న సింహాసనో పరిస్థిత శ్రీ లలితా పరమేశ్వరీ దేవతాయై నమో నమః.         అదిగో అక్కడ కూర్చోని వుందయ్యా అమ్మ.
సుధా సిన్దోర్మధ్యే సుర విటపి వాటీ పరివృతే
 సుధా సిన్దోర్మధ్యే..... అంటే ఏమిటి?   అమృత బిందువు మధ్యలో ఏమున్నది ?
 శ్రీదేవి ఉపాసన మూడు విధములుగా వుంటుంది. ప్రతిదీ మూడు అంకెల మీద నడుస్తూ వుంటుంది.
మూడు లోకములు, మూడు దేవతలు, మూడు విద్యలు మూడు అగ్నులు, మూడు జ్యోతిస్సులు, మూడు గుణములు, మూడు శబ్దములు,  మూడు ఆశ్రమములు, మూడు కాలములు, మూడు అవస్థలు, మూడు వేదములు (వేద త్రయము). మూడు పురములు, త్రిదోషములు, త్రివర్గములు... అ కార, ఉ కార. మ కార రూపములలో నివసించునది.

అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము ......కామేశ్వరీ, వజ్రేశ్వరీ, భాగామాలినీ, వీరే శక్తి స్వరూపులైన పార్వతి, లక్ష్మి, సరస్వతి అను మూడు శక్తులు.
మూడు బిందువులు ... రక్త, శుక్ల, మిశ్రమ బిందువులు.
శ్రీదేవి  స్థూలము, సూక్ష్మము, పరము అను మూడు రూపములు కలిగి త్రివిధయై వున్నది. కాబట్టి ఆమె ఉపాసన కూడా   పూజ, జప, ధ్యాన రూపములలో వుంటుంది.   పూజ, జపము బహిర్యాగము అని,  ధ్యానము అంతర్యాగము అని అందురు. పూజ చేత జప, ధ్యానాదులు సిద్దించును.
 శ్రీచక్రము (పూజ), శ్రీవిద్య (జపము), శ్రీమాత (ధ్యానము). శ్రీవిద్యా మంత్రములు, శ్రీచక్రార్చన, లలితా సహస్ర నామములు ... ఈ మూడింటిని కలిపి త్రిపుటి అని అందురు. శ్రీవిద్యోపాసకులు నిత్యమూ ఈ మూడింటిని కలిపి సాధన చేయుచుందురు. 
భగవత్పాదులు ఇప్పటి వరుకు అమ్మ యొక్క స్థూల రూపాన్ని వర్ణించినారు. ఇప్పుడు అమ్మ యొక్క సూక్ష్మ రూపాన్ని ఈ శ్లోకములో వర్ణిస్తున్నారు బహు చక్కగా మనము పట్టు కోవడానికి వీలుగా. అమ్మను బహిర్యాగములో ఎలా పూజించాలి,  అంతర్ముఖముగా ఎలా ధ్యానించాలి అనేది మనకు ఇక్కడ నేర్పుతున్నారు.
 భావనాపరో జీవన్ముక్తో భవతి.       భావనాపరుడు జీవన్ముక్తుడు అగుచున్నాడు.
ఎలా భావన చేయాలి అనేది జగద్గురువులు మనకు ఇక్కడ నేర్పుచున్నారు.
భవానీ భావనాగమ్యా..........అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ....కదా ఆమె !

సుధా సిన్దోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే....మణిద్వీపే నీపోపవనవతి  చింతామణి గృహే ...
శివా కారే మంచే పరమ శివ పర్యంక నిలయామ్
క్షీర సాగర మధ్యలో రత్నాల దీవిలో, కల్పవృక్ష వనములో, కడిమి చెట్ల మధ్యలో, చింతామణులతో నిర్మించబడిన  గృహములో శివశక్తి అనే మంచే మీద పరమ శివుని ఒడిలో ఎడమ తోడ పై అమ్మ కూర్చోని వున్నది.
ఇదే విషయాన్ని శ్రీ మహాకవి కాళిదాసు తన శ్యామలా దండకములో అమ్మను గురించి స్తోత్రము చేసినారు.
జయజననీ సుధా సముద్రాంత రుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే......
సుధా సిన్దోర్మధ్యే:- ..... సుధా సాగర మధ్యస్థా.......అని మనకు లలితా సహస్రనామం లో కనిపిస్తుంది.
బ్రహ్మాండముల పైన సుధా సముద్రము, దాని మధ్య రత్న ద్వీపము, దాని మధ్యన చింతామణి గృహము కలదు. దీనినే శ్రీనగరము అని అందురు. (శ్రీమన్నగరనాయిక).  చింత చేత దొరుకునది చింతామణి, అంటే సాధన చేత, మంత్ర జపము చేత లభించునది, కోరిన కోర్కెలు తీర్చునది.
బిందు స్థానం సుధా సింధుః పంచ యోన్యః సుర ద్రుమాః తత్రైవ నీప శ్రేణి చ తన్మధ్యే మణి మండపం.తత్ర చింతామణిమయ.........అని వామకేశ్వర తంత్రములో కనిపిస్తుంది.
బ్రహ్మ రంద్రమే బిందు స్థానమని యోగ శాస్త్రము చెప్పుచున్నది. సహస్రారమే బైందవ గృహము అని, దాని మద్యలో వుండే బ్రహ్మ రంద్రమే సుధా సింధువు అని, దీనినే మహా బిందువు అని కూడా అందురు. ఈ బిందువు నుండియే సృష్టి వచ్చినది. శ్రీచక్రము లోని త్రికోణము బైందవ స్థానము.
 త్రికోణే బైందవమ్ శ్లిష్టం ...అని రుద్రయామళము, భైరవయామళము మరియు వామ కేశ్వర తంత్రములలో చెప్ప బడినది. కాబట్టి బిందువు త్రికోణములోనే గలదు. త్రికోణము త్రిమూర్తి స్వరూపము. దీనినే బీజ త్రయము, బిందు త్రయము, గుణ త్రయము, శక్తి త్రయము, మండల త్రయము, మూర్తి త్రయము, త్రిపుటి, యోని చక్రము అని అందురు.
సోమ, సూర్యాగ్ని మండలములు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని)  త్రికోణము లోని మూడు బిందువులు.
త్రికోణము లోని మధ్య బిందువే సృష్టికి మూలం, ఇదే సుధా సింధువు. ఇదియే బ్రహ్మ రంద్రము. అందుకే ఆమె త్రికోణాంతర దీపిక అయ్యినది.
౧. మూలాధార పద్మము యొక్క కర్ణికలో త్రికోణము కలదు.   దాని మద్యలో అగ్ని మండలము వున్నది. త్రికోణము యొక్క మధ్య లో దీపము వలె ప్రకాశించు దీపిక రూపములో అమ్మ వారు నెలకొని వున్నది. సకల ప్రాణుల యొక్క మూలాధారము నందు అగ్ని కలదు.
 ఈ  అగ్ని మండలమునే   శ్రీవిద్యలో ప్రధమ కూట స్వరూపము అని అందురు.
౨. హృదయము నందు సూర్య మండలము కలదు.
౩. శిరస్సున బ్రహ్మ రంధ్రమునకు క్రింద దిగువన  చంద్ర మండలము   కలదు.

సహస్రారం లో వుండే ఆ  చిత్కలను ఈ మూడింటితో అనుసంధానం చేస్తూ, నాద బిందువులను ఏకం చేస్తూ యోగ ప్రక్రియలో శ్రీవిద్యోపాసకులు కుండలినీ యోగ సాధన అంతర్ముఖంగా ,అంతర్యాగము చేస్తూ వుంటారు. దీనిని నాద బిందు కళ అని అంటారు. ఈ విద్యను గురువుల ద్వారా నేర్చుకొని సాధన చేయవలెను.          అగ్ని మండలము అయిన మూలాధారము  నుండి కుండలినీ శక్తిని లేపి సుషుమ్న నాడి ద్వారా సూర్య మండలము దాటి  బ్రహ్మ రంధ్రమునకు చేర్చి, అచ్చట వున్నచంద్ర మండలమును ద్రవింప జేసి, ఆ అమృత బిందులవలన తడిసి, సహస్రార పద్మమును  అధిష్టించిన ఆ చిత్కలను ధ్యానింప వలెను.  ఈవిధముగా సాధన చేసిన వాళ్ళు ఎంతో ధన్యులు కదమ్మా!
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్‌..............ఎంతో ధన్యులు అర్హత గల వాళ్ళు మాత్రమే ఆ హృత్కమలవాసినిని, చిదానంద లహరిని భజింతురు.
సూక్ష్మ రూపార్ధము :-   శ్రీచక్ర మధ్య బిందువు సుధా సింధువు. పంచ యోనులు నీప వనము (కదంబం చెట్లు).   అష్ట దళ షోడశ దళములు మహాపద్మ వనము.  బ్రహ్మాండోపరి భాగమున మహా పద్మ వనము కలదు. బ్రహ్మ రంద్రము లోని సహస్రార కమలము మహా పద్మము అని, అందుగల బిందు రూపమే సుధా సింధువు అని, ఆ స్థానమే సృష్టికి మూలమని, శ్రీ దేవి అచ్చటనే కలదని దీని భావము. అందుకే ఆమెను            మహా పద్మాటవీ సంస్థాయై నమః అని కొని యాడినారు లలితా సహస్ర నామం లో.

మనో బుద్ధి చిత్తాహంకారములను జయించి నాద బిందువులను ఏకం చేస్తూ యోగ మార్గమున శివ శక్తులను సంయోగ పరచిన మహా యోగులు సుధా సింధువులను  అమృత పానము చేయుదురు సహస్రార కమలములో. 72 వేల నాడులు తదుప బడును.  ఆ సుధా సింధువులో మునక వేయడం వలన పునర్జన్మ రహిత మైన మోక్షమును పొంది శివ సాయుజ్యమును పొందుదురు. మన శిరస్సు ఉపరి బాగమున బ్రహ్మ రంద్రము వుండు చోటున మహా పద్మము కలదు. అదే చంద్ర మండలము.
చింత చేత దొరుకునది చింతామణి అగుట చేత తన దగ్గరకు వచ్చిన యోగుల కోరికలను తీర్చి, ఆ శివాని  తన భక్తులకు శివ సాయుజ్యాన్ని ప్రసాదిస్తున్నది.

శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్‌:-   బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు మంచమునకు నాలుగు పాదములు కాగా, సదాశివుడు పర్యాంకము (పలక) కాగా  ఆ ఉపరి భాగమున శ్రీ మహా రాజరాజేశ్వరి ఆసీనురాలై వున్నది. అనగా స్థూలముగా మన శరీరములో మూలాధార స్వాధిష్టానములు పై భాగమున బ్రహ్మ గ్రంధి,  మణిపూర, అనాహతముల పైన విష్ణు గ్రంధి, విశుద్ధ ఆజ్ఞా చక్రముల పైన రుద్ర గ్రంధి, ఈ మూడు గ్రంధుల పైన లలాటము నుండి శిరో మధ్య భాగము వరకు ఈశ్వర స్థితియు, తదుపరి బిందు స్థానము నందు సదాశివ తత్వము అనియు, ఆ పైన చిత్కలా రూపములో శ్రీదేవి యున్నది అని దీని అర్ధము. కనుక పంచ బ్రహ్మాసనా స్థితి శ్రీదేవికి సిద్దించినది అని పెద్దలు చెప్పుదురు.

 శ్రీదేవియే  పంచ మహాబ్రహ్మల రూపములో  వామాది శక్తుల రూపములలో పంచ కృత్యములను నేరవేర్చున్నది. ఆ శక్తియే లేనప్పుడు, శక్తి విహీనులు, నిర్జీవులు  అయినప్పుడు వారు పంచ ప్రేతలు అగుదురు. శివునికి శక్తి లేనప్పుడు అతను కూడా మహా ప్రేత అగు చున్నాడు, చలన రహితుడు కాబట్టి.  కావున అమ్మ  పంచ ప్రేత మంచాధిశాయినీ, పంచ ప్రేతాసనాసీనా, పంచ బ్రహ్మ స్వరూపిణి  ....అయినది.

పంచ మహా బ్రహ్మలు:- సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పురుష, ఈశానములు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు శక్తితో కూడి నందువలన శ్రీ దేవి పంచ బ్రహ్మ స్వరూపిణి అయ్యి మహా శక్తి స్వరూపిణి  అగు చున్నది.

శ్లో: సిద్ధి సిద్ధవృత రత్న భూమికా కల్ప వృక్ష వనపాటి సంకులే |
    నీప వాటీ మణి మంటపేzరూణే చంఢ భాను కోటి భాసురే |
    ఆది పంచ శవ మంచకే, పరే  శంకరాంకృత పీఠికామణౌ |
    కాది హాది మను రూపిణీమహం భావయామి పర దేవతాం ||

హ్రీంకార మంత్ర మధనం వలన, జపం వలన శ్రీదేవీ కటాక్షం లబిస్తుంది, అదే సుధా సింధువు. చింతామణి దొరకడం అంటే అమ్మ సాక్షాత్కారం కావడం. చిదానంద లహరీం అంటే శివ సాయుజ్యము అంటే మోక్ష౦ లబించడం. 
మనస్సుకు ఆనందం కలిగించే స్వరూపము ఆ మహా శివుడు, ఆయనే చిదానంద రూపుడు.                                 ఆ చిదానంద స్వరూపాన్ని చూపించే మహా శక్తి గనుక ఆమె చిదానంద లహరీం.

ఇదే ఈ శ్లోక గూడార్ధము.  అటువంటి చిత్కలకు  నమస్కరిస్తూ......

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.

(సరస్వతీ రామచంద్ర రావు)/01-05-2014 @ శ్రీకాళహస్తి

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.