Saturday, 13 October 2012

శ్రీదేవీ తత్వం – 10 - లలితా సహస్రనామములు.


శ్రీదేవీ తత్వం – 10  - లలితా సహస్రనామములు.

శ్రీవిద్యాం  జగతాం  ధాత్రీం  సర్గ స్థితి లయేశ్వరీమ్,
నమామి  లలితాం  నిత్యాం మహా త్రిపుర సుందరీమ్.
 

శ్రీవిద్య అనబడే బాలా, నవాక్షరి, పంచదశి, షోడశీ మంత్ర రూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నింటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యములను నిర్వర్తించేది, నిత్యా అనే కళా స్వరూపిణిగా విలసిల్లుతున్నది, త్రిపుర సుందరీ స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవికి నేను నమస్కరిస్తున్నాను.

బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు.

లలితా దేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న  తపోధనుడైన అగస్త్యుడిని చూచి

హయగ్రీవులు ఇలా అన్నారు.

లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా,  లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి, భక్తిప్రపత్తులతో అడుగుతున్నందువలన నీకు ఉపదేశము చేస్తున్నాను.

ఇవి శఠునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృ భక్తిలో పూర్ణ భక్తి గల వారికి, శ్రీవిద్య ఎరిగిన వారికి, శ్రీ దేవీ ఉపాసకులకు మాత్రమే యీ సహస్రనామములు చెప్పవలెను.

మంత్రములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీవిద్యలలో ఎలా కాదివిద్య ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమైనదో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీవిద్యోపాసకులలో పరమ శివుడు ఎలా గొప్ప వాడో, అలా సహస్రనామాలలో యీ లలితా సహస్రనామాలు బహు శ్రేష్టాలు.

ఈ నామాలు పఠి౦చటం చేత శ్రీ లలితా దేవి బహు ప్రీతి నొందును. శ్రీచక్ర రాజములో లలితా దేవిని బిల్వ దళాలతోగాని, పద్మాలతో గాని, తులసి పత్రములతో గాని, ఈ సహస్రానామాలతో ఎవడు పూజిస్తాడో అతడికి లలితా దేవి వెంటనే మేలు చేకూర్చును.

చక్రరాజమైన శ్రీచక్రమును పూజించి, పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి, తరువాత ప్రతి దినము యీ సహస్రానామాలతో కీర్తించ వలెను. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణం చేయాలి. ప్రతిదినము నిత్య కర్మల మాదిరి యీ లలితా సహస్రనామములు చేయవలెను.

శ్రీలలితా దేవి ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు యీ లలితా సహస్రనామములను స్తోత్రము చేసిరి.

సకల రోగాలను పోగొట్టి, సకల సంపదలను ఇచ్చే ఈ స్తోత్రమునకు సమానమైన స్త్రోత్రము ఇంతవరకు లేదు.

ఇది సమస్త అకాల మరణములను పోగొట్టి, అపమృత్యువుని దరి చేరనీయకుండా, సకల జ్వరాలను, రోగాలను శమింపజేసి, దీర్గాయుస్సును అందజేస్తుంది.

పుత్ర భాగ్యం లేనివారికి పుత్రులను ఇస్తుంది. ధర్మార్ధ కామ మోక్షా లనే నాలుగు పురుషార్ధములను చేకూరుస్తుంది.

లలితాదేవి పూజాతత్పరులు ప్రతిదినం ప్రయత్నపూర్వకముగా శ్రీవిద్యా జపము చేసి, శ్రీచక్రార్చన చేసి, ఈ నామములను చదువ వలెను.

గంగ మొదలైన నదులలో కోటి జన్మలు స్నాన మాచారిస్తే ఏ ఫలం కలుగుతుందో, కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ట చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కురుక్షేత్రములో సూర్య గ్రహణ సమయంలో కోటిమార్లు దానాలు చేస్తే ఏ ఫలం దక్కుతుందో, గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం దక్కుతుందో,

అంతటి పుణ్యానికి కోటి రెట్లు అధిక పుణ్యము యీ సహస్ర నామాలలో ఒక్కటి పఠి౦చినా కూడా లభిస్తుంది.

 

నిత్య కర్మలు చెయ్యకపోవటం చేత, నిషిద్ధ కర్మలు చెయ్యటం చేత కలిగే పాపాలు కూడా సమసిపోవటం నిశ్చయం. సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక్క సహస్రానామానికి వుండే శక్తి ఎలాంటిది అంటే, ఈ పద్నాలుగు లోకాలలోని వారంతా కలిసి చేసే మొత్తం పాపాలు కూడా యీ సహస్రనామ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏ మాత్రం కావు.

 

ప్రతి రోజు చేయక పోయినా పుణ్య దినములలో, తన భార్య, తన బిడ్డల జన్మ నక్షత్రము వచ్చే రోజులలో, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, శుక్రవారములలో ముఖ్యముగా పఠి౦చవలెను.

పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచోపచారముల చేత పూజ చేసి, సహస్ర నామములను పఠిస్తే సమస్త రోగములు పోయి, దీర్గాయుస్సు కలుగుతుంది. ఇది కామ్య ప్రయోగ విధి.

పిల్లలు లేని గొడ్రాలకి వెన్నను ఈ నామ పారాయణ చేత మంత్రించి యిస్తే గ్రహ పీడలు తొలగి పుత్రులు కలుగుతారు.

ఈ సహస్ర నామ పారాయణుని పై ఎవరైనా అభిచారాది దుష్ట ప్రయోగములు చేస్తే, ప్రత్యంగిరా దేవి ఆ ప్రయోగములను తిరుగ గొట్టి, ఆ ప్రయోక్తలను సంహరిస్తుంది.
 

 శ్రీదేవీ ఉపాసకులను, ఎవరైనా దూషించినా, నిందించినా, అనరాని మాటలు అనినా, అగౌరవపరచినా, అవమానపరచినా,  క్రూర దృష్టితో చూచినా, వాదించినా, వాడి ధనమును దోచినా, కృతఘ్నత చూపినా,
వాడ్ని క్షేత్రపాలకుడు అయిన శివుడు చంపుతాడు. నకులేశ్వరి వాడి నాలుకను తేగకోయును. 
వాక్ స్థంభనము చేయును.

ఎవడు భక్తితో ఈ నామములను ఆరు నెలలు చేస్తాడో, అతడి యింట లక్ష్మీ దేవి స్థిరముగా ఉండును.

ఎవరు శ్రీవిద్యను ఉపాసన చేస్తారో, ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో, ఎవరు యీ నామాలను కీర్తిస్తారో, వారికి దానం ప్రయత్న పూర్వకముగా ఇవ్వవలెను. దానం చెయ్యాలను కొనేవారు, పరీక్షించి శ్రీవిద్య తెలిసిన వారికే దానం చెయ్యవలెను.

లోక వాక్యాలకంటే విష్ణు సంకీర్తనం ముఖ్యం. అలాటి విష్ణు సహస్ర నామముల కంటే గొప్పది ఒక్క శివ నామము. శివ సహస్ర నామాలకన్నా దేవీ నామం ఒక్కటి ఎంతో మహిమ గలది.

 

దేవీ సహస్ర నామాలలో పది విధాలైన సహస్ర నామములు ప్రధానమైనవి. అవి గంగ, భవాని, గాయత్రీ, కాళి, లక్ష్మి, సరస్వతి, రాజ రాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. వీటిలో లలితా సహస్ర నామములు అతి శ్రేష్ఠమైనవి.

అందు చేత కలి దోష నివారణ నిమిత్తం వీటిని నిత్యం పారాయణ విధిగా చేయవలెను.

 

ఇతర దేవతా నామములను కోటి జన్మల యందు కీర్తించి వుంటేనే, ఈ జన్మలో శ్రీదేవీ పూజ యందు, పారాయణ యందు భక్తి శ్రద్దలు కలుగును. మానవునికి తన చివరి జన్మలోనే ఈ శ్రీవిద్య దొరుకును. అట్టి శ్రీవిద్యను కోరుకున్న మాత్రమున దొరకదు అమ్మ అనుగ్రహము లేనిదే. దొరికిన శ్రీవిద్యను నిలబెట్టుకోవడము కూడా చాలా కష్టము.

మంత్రములలో శ్రేష్టమైన యీ మంత్రరాజము, శ్రీచక్ర పూజ, నామ పారాయణ గొప్ప తపస్సంపన్నులకు మాత్రమే దొరుకును. యీ శ్రీవిద్యను అతి గోప్యముగా వుంచవలెను. పశువులతో సమానులైన వారికి, మూర్ఖులకు యీ ఉత్తమమైన స్తోత్రాన్ని ఉపదేశించరాదు. ఒక వేళ ఉపదేశించినా వాడి ఇంట ఆ దేవి నుండదు. అందుచేత అతనికి గొప్ప అనర్ధములు సంభవించును.

ఇటువంటి రహస్యమైన లలితా స్తోత్రములను శ్రీవిద్య ఎరుగని వాడికి భోధిస్తే, వాడి మీదకు యోగిని గణానికి కోపము వస్తుంది.  

ఇటువంటి మహత్తరమైన శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రములను గురు ముఖ:త ఉపదేశము పొంది చేయ వలెను. శ్రీవిద్య (బాల) ఉపదేశము లేని వారు అంగన్యాస, కరన్యాసములు చెప్పకుండా ధ్యాన శ్లోకములు చెప్పుకొని స్తోత్రము పారాయణముగా చేసుకోవచ్చును.

సకల సౌభాగ్యములను ఇచ్చే యీ నామ పారాయణము అందరూ యీ నవ రాత్రులలో చేసుకొని తరించేదరని ఆశిస్తూ,

 అమ్మ కృపతో, అమ్మ పలికించినంత మేర, అమ్మ ఆజ్ఞగా స్వీకరించి యీ పది సంపుటములను నాకు తెలిసినంత మేర అమ్మ గొప్పతనాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నము చేసినాను. దీనిలో తప్పులున్న, ఎవరి మనసునైనా నొప్పించినా,  పెద్దలు, పిల్లలు, తల్లులు, అందరూ నన్ను మన్నించి, ఆశ్వీరదించెదరని

నమస్కారములతో విన్నవించుకొంటూ

శ్రీ మాత్రేనమః  స్వస్తి. 
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ  సంస్థితా
నమస్తస్యై   నమస్తస్యై   నమో నమః

భాస్కరానందనాధ / 14-10-2012
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.
శ్రీకాళహస్తి., చిత్తూరు (ఆ.ప్ర);

 

Friday, 12 October 2012

శ్రీదేవీ తత్వం – 9 - త్రిగుణ స్వరూపము.


శ్రీదేవీ తత్వం – 9  - త్రిగుణ స్వరూపము.

. సత్వగుణ లక్షణములు:- 

    సత్యము, శౌచము, శ్రద్ధ, క్షమ, ధైర్యము, దయ, లజ్జ, శాంతి, సంతోషము
    కాబట్టి సత్వగుణ లక్షణములను పెంపోదించు కోవాలంటే పై గుణములను అలవాటు చేసుకోవలెను.
    ఇది  తెల్లని  వర్ణము గలది.   ఇది ధర్మమునందు ప్రీతిని కలిగించును.  

. రజో గుణ లక్షణములు:-

    ఇది రక్త వర్ణము. ఇది దు:ఖ సంయోగమున కలుగును. మదము, గర్వము, ద్రోహ చింతన, మచ్చరము.

౩. తమో గుణ లక్షణములు:-

    ఇది నల్లని రంగు కలది. మోహము, విషాదము, అజ్ఞానము, అలసత్వము, నిద్ర, దైన్యము, భయము, 

    వివాదము, కృపణత్వము, కుటిలత్వము,  వైషమ్యము, నాస్తికత, పర దోష దర్శనము. 

తనకు శుభము కోరువాడు  సత్వ గుణమును ప్రకాశింప జేయవలెను. రజోగుణమును అణచి పెట్టవలెను, తమోగుణమును సంహరించవలెను.  

ఆ మహా మాయా శక్తియే యీ సదసదాత్మకమైన బ్రహ్మాండము లందు బ్రహ్మ, విష్ణు, రుద్రులు మొన్నగు దేవతలందరినీ వారి వారి గుణ కర్మ విభాగమున సృజించును. వీరేల్లరూ ఆ శక్తితో యుక్తులగుటచే కార్యకరణ దక్షు లగుచున్నారు. ఆ శక్తి లేనిచో వారు ఎంత మాత్రమూ చలింపజాలరు. ఆ తల్లియే శ్రీ మహాకాళి, మహా సరస్వతి, మహా లక్ష్మి రూపములతో నిత్య పూజలందు కొనుచున్నది. ఆమెయే సర్వ భూతేశ్వరి.  

సృష్టికి పూర్వమున్నది మహా బిందువు. సృష్టికి ముందు సత్ అను పదార్ధముండెను. ఇదియే చిదగ్నిగా ఉపదేశింపబడిన బ్రహ్మ పదార్ధము. ఇదియే మొట్ట మొదటి మహా బిందువు.  

ఆత్మా వా   ఇదమేక   ఏవాగ్ర   ఆసీత్,   నాన్యత్కించన.

మిషత్,     ఈక్షత   లోకాన్ను  సృజా    ఇతి.            ( ఐతరేయోపనిషత్తు 1-1-1)
 

ఈ ప్రపంచమున సృష్టికి పూర్వము ఒకే ఆత్మ ( ఒకే బిందువు) గా వుండినది. ఆ ఆత్మ తప్ప వేరొకటి ఏదియునూ లేదు.  ఆ ఆత్మ లోకములను సృష్టించవలయునని ఆలోచించెను.

స దేవ సోమ్యేదమగ్ర   ఆసీ  దేకమేవాద్వితీయం   .....   ఛాందోగ్యోపనిషత్తు ... 6-2-1

ఈ జగత్తు ఉత్పన్న మగుటకు పూర్వము సత్తుగా  ఏకమై,  అద్వితీయమై యుండినది.

   “ హ్రీశ్చతే   లక్ష్మీశ్చ    పత్న్యౌ “  ... పురుష సూక్తం.

బ్రహ్మ వాచకమయిన ప్రణవమునకు హ్రీ,  శ్రీ లు రెండునూ పత్నీ స్థానీయములు. ప్రణవము చిదగ్నికి నిర్దేశాక్షరము.  చిదగ్ని యందలి మహాగ్నిని మంత్ర శాస్త్ర రీత్యా రేఫ (ర) సూచిస్తుంది.  అట్టి మహాగ్నికి వేడి, వెలుతురు, అనేవి రెండు లక్షణములు, అందు హ్రీ  వెలుతురు (తేజస్సును) ను,  శ్రీ  వేడిని తెలియ చెప్పుచున్నది.  ఈ రెండును అగ్ని లక్షణములు గనుకనే రెంటి యందును రేఫ లున్నవి.  శ్రీచక్రమనగా సృష్టి స్థితులను నిర్వచించు యంత్ర విశేషము.  హ్రీ చక్రమనగా   స్థితి సంహారములను తెలియజేయు యంత్ర సంకేతము.
 శ్రీవిద్యలో రుద్ర, నమక, చమక, పురుష, శ్రీ సూక్తముల యొక్క మంత్ర రహస్యములు ఎన్నో గలవు.
వాటిని గురు ముఖత నేర్చుకోనవలెను.

 

శ్రీ మాత్రేనమః  స్వస్తి.  // మీ  భాస్కరానంద నాధ, // 14-10-2012

 

Thursday, 11 October 2012

శ్రీ లలితా పూజ. - శ్రీదేవీ తత్వం - 8



శ్రీదేవీ తత్వం - 8

శ్రీ లలితా పూజ.

ఏ యజ్ఞమైనా సరే, ద్రవ్య శుద్ధి, క్రియా శుద్ధి, మంత్ర శుద్ధి లేకపోతే పూర్ణ ఫలము రాదు. అధర్మ మార్గమున సంపాదించిన ధనముతో చేసిన యజ్ఞం పారలౌకిక సౌఖ్యానికి బంధకం అవుతుంది.

పూర్వము ధర్మరాజు చేసిన రాజసూయ యాగం నెల తిరగకుండానే వారిని సర్వభ్రష్టులను చేసినది. కారణం ఆ యజ్ఞానికి వారు సంపాదించిన ధనం అన్యాయ మర్గాన సంపాదించిన అవడం వల్లనే.

పాండవులు పడిన కష్టాలు ఎవ్వరూ పడలేదు. మయాజూదముతో సర్వ నాశనం. ద్రౌపదికి అవమానం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ఇలా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ యగామునకు వారు సమకూర్చుకొన్న డబ్బు నిష్కారణముగా ఎందరో రాజులను చంపి, సంపాదించినది. దాని ఫలం వారు అనుభవించినారు.

ధర్మమర్గాన సామగ్రి సమకూర్చోని యజ్ఞం చేసినా యజ్ఞం చేడిపోయిందంటే అది మంత్ర శుద్ధి లేదని గ్రహించాలి. యజ్ఞ నిర్వహణకు వచ్చిన ఋత్విజులలో దోషము వున్నది అని గ్రహించాలి. కర్తను, ద్రవ్యమును, మంత్రమును బట్టి దేనివల్ల లోపము వుంటే దాని ఫలితముగా కర్మకి దోషం పట్టుతుంది.  చేసే యజ్ఞము, దానిని చేయించే బ్రహ్మ, దానికి సమకూర్చిన వస్తువులు శాస్త్ర సమ్మతముగా వుండాలి. వీటిలో ఏది విపరీతమైనా కర్మ సత్ఫలితమును ఇవ్వజాలదు.

శ్రీదేవి మంత్రమును దీక్షతో జపించే శ్రీదేవీ ఉపాసకుల, పుణ్యాత్ముల పాద స్పర్శతో పాపుల వల్ల సంక్రమించే పాపాలు పటాపంచలవుతాయి. తన భక్తుల స్పర్శవల్లనూ, దర్శనము వల్లనూ జలము, స్థలము రెండూ పవిత్రములవుతాయి. వారు మెట్టిన నేల పుణ్యక్షేత్రమూ, వారు చేపట్టిన నీరు పుణ్య తీర్ధమూ అవుతుంది. వారి ఆగమనముతో కష్టములు దూరమై, పాప విముక్తులౌతారు. వారి ఇంట నుంచి అలక్ష్మీ దూరమౌతుంది.

సప్తమి, అష్టమి, నవమి ఈ మూడు దినములు దేవి పూజ చేసిన వారికి, నవరాత్రి పూజలు జరిపిన వారికి ఫలం పరదేవతానుగ్రహం వల్ల కలుగుతుంది. నవరాత్రి పూజ చక్కగా చేసిన వారికి ఆ పర దేవత దీర్ఘాయువును, విద్యా కీర్తి, వైభవములను, సర్వ శుభములను అనుగ్రహిస్తుంది. ఈ పూజకు సాటిగా చెప్పదగిన పూజ మరొకటి లేదు.  ఈ జన్మలో నవరాత్రి పూజ చేయని వారు మరు జన్మలో దరిద్రులు, సంతతి లేనివారు, రోగులు, దుష్టులు, కష్టజీవులు, వితంతువులు  అవుతారు. వేయి మాటలేల ఘోర పాపాలు చేసినవాడు కూడా దేవీ నవరాత్ర వ్రతం చేసినట్లైతే సర్వ పాప విముక్తుడు అవుతాడు.

పూర్వం శ్రీరాముడు వనవాసములో తన భార్యను ఎడబాసి సుగ్రీవుని సహాయముతో ఈ దేవీ పూజావ్రతం చేసి విజయదశమి నాడే యుద్ధమును ప్రారంభించి, రావణున్ని సంహరించి, సీతను తెచ్చుకొన్నాడు.

పూర్వము సుశీలుడు అనే వైశ్యుడు శ్రీదేవి మంత్రమును ఉపాసించి, యధాశక్తిగా దేవీ నవరాత్రులు తొమ్మిది సంవత్సరములు చేసినాడు. తొమ్మిదవ యేట అష్టమి నాడు అర్ధ రాత్రియందు దేవి ప్రత్యక్షమై వారలు అనుగ్రహించినది.

పరదేవతకు పంచామృతములతో స్నాన మొనరించవలెను. మంచి చెరుకు రసముతో నిండిన నూరు కలశములతో శ్రీదేవిని అభిషేకించినవాడు తిరిగి జన్మించడు. జగదంబికను మంచి మామిడి పండ్ల రసముతో స్నానము చేయించినను, వేదపారాయణము చేయుచు చెరుకు రసముతో స్నానము చేయించినను, అట్టి భక్తుని యింటిని లక్ష్మీ, సరస్వతులెన్నడును వదలి పెట్టరు. ఎవడు వేద పారాయణ చేయుచు ద్రాక్ష రసముతో సకుటుంబముగా మహేశ్వరి నభిషేకించునో అతడు మహారాజు అగును. అగరు, కుంకుమ పువ్వు, కస్తూరి కప్పురములతో కలసిన నీటితో శ్రీసూక్తముతో దేవిని అభిషేకించిన అతని నూరు జన్మల పాపరాసులు భస్మరాసులగును. ఇలా పాలతో, తేనెతో, పెరుగుతో, నెయ్యితో శ్రీచక్రమును అభిషేకించి, మారేడు దళములతో మాయా బీజ సహిత భువనేశ్వరీ మంత్రముతో పూజించిన వాడి ప్రారబ్ద కర్మ మంతయు నశించును.

పాడ్యమి నాడు శ్రీదేవికి నేయి నైవేద్యమొసగి బ్రాహ్మణునకు దానమిచ్చిన వాడు ఆరోగ్యవంతుడగును. విదియనాడు పంచదారతో దేవిని పూజించి విప్రునకు పంచదార దాన మిచ్చినవాడు పెక్కు ఏండ్లు బ్రతుకును. తదియ నాడు పాలు నైవేద్యము పెట్టి , దానము చేసినవాడు సర్వ దుఖములనుండి విముక్తుడగును. చవతినాడు అపూపములు దానము చేసిన వాడికి విఘ్నములు తోలుగును. పంచమినాడు అరటి పండ్లు దానము చేసిన వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ యగును, షష్టినాడు కమ్మని జుంటి తేనే సమర్పించి దానము చేసినవాడు మదన సుందరుడగును. సప్తమినాడు శ్రీదేవికి గుడ నైవేద్యము చేసి దానము చేసినవాడు శోక రహితుడగును. అష్టమినాడు కొబ్బరికాయ నివేదన చేసి దానము చేసినవాడికి తాపత్రయములుండవు. నవమినాడు శ్రీ జగదంబకు పేలాలు నివేదించి దానము చేసిన వానికి పై లోకములలో సౌఖ్యములు గల్గును.

౧. పాడ్యమినాడు ...... శ్రీ బాలాత్రిపుర సుందరీ పూజ.

౨. విదియ ....             శ్రీ గాయత్రి

౩.  తదియ .....           శ్రీ మహాలక్ష్మి

౪. చవతి   .....           శ్రీ అన్నపూర్ణ

౫. పంచమి ......         శ్రీ లలిత

౬.  షష్టి      .......        శ్రీ శాకంబరి           

౭. సప్తమి    .....         శ్రీ సరస్వతి.

౮. అష్టమి   ......         శ్రీ దుర్గా దేవి

౯. నవమి   ......         శ్రీ చండిక / మహిషాసుర మర్ధిని.

౧౦. దశమి  .....          శ్రీ రాజరాజేశ్వరి

 

ఇలా తొమ్మిది రోజులు గాని, లేదా చివర మూడు రోజులు సప్తమినుంచి గానీ లేదా చివర అష్టమి, నవమి నాడు అయినా సరే శ్రీ దుర్గా దేవిని పూజించవలెను.  పూజకు అశక్తుడు అయినవాడు కనీసము రోజూ     శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమునైనా  చదువ వలెను.       శ్రీచక్ర పూజ, శ్రీ జపము చేయలేనివాడు తప్పక
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును యధాశక్తిగా పఠించవలెను.

 

శ్రీ మాత్రేనమః  స్వస్తి. 

భాస్కరానందనాధ / 11-10-2012
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.
http://vanadurga-mahavidya.blogspot.in/



 

 

 

Wednesday, 10 October 2012

దేవీ నవరాత్రులు - శ్రీదేవి పూజ – నవరాత్రి పూజ

శ్రీదేవీ తత్వం - 5

దేవీ నవరాత్రులు - శ్రీదేవి పూజ నవరాత్రి పూజ
Devi Navaratri - sridevi pooja.

తొమ్మిది దినములు వసంత రుతువులోను, శరదృతువు లోను ఆ పరదేవతను పూజించడము నవరాత్రి పూజ అనబడును. చైత్ర మాసమునందును, ఆశ్వీజమాసమునందును శుక్ల పక్షములో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మను ఆరాధించాలి. ఈ పూజ చేసే వ్యక్తి తొలినాటి అమావాస్యనాడు పూజకు కావలసిన పదార్ధములను సమకూర్చుకోవాలి.  ఆనాడు ఏక భుక్తం చెయ్యాలి.  ఎచ్చు తక్కువలు లేని సమతల మైన ప్రదేశములో పదారు మూరల ప్రమాణముగా ఒక మండపము నిర్మించుకొని, బంకమన్ను, ఆవు పేడ కలిపి అలికి ముగ్గులు పెట్టి దాని నడుమ నాలుగు మూరలు వైశాల్యం, ఒక మూర ఎత్తు వుండే వేదిక ఏర్పరచాలి. దానికి పైన చాందనీ తోరణాలు కట్టాలి. ఆ రాత్రి శ్రీవిద్యోపాసకులను, వేద వేత్తలను, నియమపరులైన బ్రాహ్మణులను సగౌరవముగా తన ఇంటికి ఆహ్వానించాలి.

మర్నాడు వేకువ జామునే దగ్గరగా వుండే నదిలో గాని, చెరువులో గాని, ఇంటి పెరటిలో వున్న నూతిలో గాని స్నానం, సంధ్య, గాయత్రి జపం చేసి, బ్రాహ్మణులకు యధావిధిగా సపర్యలు చేసి నూతన వస్త్రములు, నగలు సమర్పించాలి. జగజ్జనని మంత్ర జపానికి యోగ్యులైన విప్రులు తొమ్మిది మందిని గాని, ఐదుగురు గాని, ముగ్గురు గాని, చివరకు ఒక్కడైనా వుండాలి. అలాగే పారాయణకి తగిన వాడు ఒకడు వుండాలి.

స్వస్తి వాచకముతో దేవి పూజ ఆరంభించాలి. మొదట చెప్పిన వేదిక యందు పట్టు బట్ట పరచిన సింహాసనం నెలకొల్పి, దాని మీద చతుర్భుజ యైన, సింహవాహిని యైన దేవి యొక్క ప్రతిమను గాని, మట్టితో చేసిన విగ్రహము గాని, తుదకు పటము గాని స్థాపించాలి. విగ్రహము లభించని పక్షమున నవాక్షర సహితమైన యంత్రమును గాని స్థాపించి దాని ప్రక్కన మేడి, మర్రి, రావి, జువ్వి, మామిడి చిగుళ్ళతో వైదిక సూక్త పరిష్కృతమైన పుణ్యజల పూర్ణము అయిన కలశము వుంచి ఆ యంత్రముతో సహా దానిని పూజించాలి.

ఈ పూజ హస్తా నక్షత్రముతో కలసిన పాడ్యమి నాడు మొదలు పెట్టడము చాలా మంచిది అని పెద్దలు అందురు.  పగలంతా ఉపవాసము వుండి రాత్రి మాత్రమే పూజ ముగిశాక భోజనము చేస్తాను అని గాని, లేక పూర్తిగా తొమ్మిది రోజులు ఉపవాసం చేసి ఈ పూజ చేస్తాను తల్లి ! అనుగ్రహించు అని పీఠము ముందు నియమము బల్కి పూజ ఆరంభించ వలెను.

మల్లె, మాలతి, సంపెంగ, మందారము, కదంబం మొదలైన పువ్వులతో, మంచి గంధం, అగరు, కర్పూరము, మారేడు పత్రీ, అర్ఘ్యం, పాద్యం, మొదలైన షోడశోపచారములతో, కొబ్బరి, అరటి, నారింజ, దానిమ్మ, పనస, మొదలైన ఫలాలతో, భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలతో, అన్నపాయసాలతో, ధూప దీపాలతో, స్తోత్రాలతో, అష్టోత్తరశతనామావళిలతో, లలితా సహస్ర నామావళితో, నమస్కృతులతో అమ్మను ఘన౦గా  పూజించి ఆనందపరచ వలెను. ఇలా తొమ్మిది రోజులు చేసిన వారు సాంసారిక జీవితమును సుఖ సంతోషములతో గడుపుతారు, ఎలాంటి బాధలకూ లోనుకారు.  పూజ యధావిధిగా చేసి యధాశక్తిగా అన్నదానం శ్రద్దా భక్తులతో చెయ్యాలి.

పూజ చేసే వ్యక్తి ఈ తొమ్మిది రోజులు నేలపై పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. క్రొత్త బట్టలు, నగలు ఇచ్చి కుమారీ పూజ చెయ్యాలి.

రెండు సంవత్సరాల వయసుది కుమారి, మూడేల్లది త్రిమూర్తి, నాల్గేల్లది కళ్యాణి, ఐదు సంవత్సరాలది రోహిణి, ఆరెండ్లది  కాళి, ఏడేండ్లది చండిక, అష్ట వర్ష శాంభవి, నవ వర్ష దుర్గ, దశాబ్ద సుభద్ర,  ఆపై వయసుగల కన్యకలు పూజార్హులు కారు. కుమారి పూజవల్ల దారిద్ర్య దు:ఖాలు పోతాయి. త్రిమూర్తి పూజ దీర్ఘాయువును, ధర్మార్ధ కామ ఫలమును ఇస్తుంది, కళ్యాణి పూజ వల్ల విద్య, రాజ భోగాలు కలుగుతాయి, కాళీ పూజ పగను మట్టి పెడుతుంది, చండికా పూజ సంపత్కరి, శాంభవి పూజ రాజ్య పూజమైన ధీశక్తిని సమకూర్చుతుంది. దుర్గ ఎలాటి క్లిష్టములైన కార్యాలను సాధిస్తుంది. సుభద్ర అభీష్ట ఫలదాయిని. రోహిణి పూజ రోగములను పారద్రోలుతుంది.

కుమారి పూజ శ్రీరస్తు అని ఆరంభించాలి లేదా శ్రీ మంత్రముతోగాని, బీజ మంత్రముతోగాని మొదలు పెట్టాలి. అవలక్షణముల గల కన్యలు, రోగాలతో వున్న కన్యలు  ఈ పూజకు పనికి రారు.  ఈ పద్ధతిని అనుసరించి శ్రద్ధాభక్తులతో యధాశక్తిగా నవ రాత్రి పూజ చేయడం సర్వ శ్రేయస్కరం. శక్తి చాలనివాడు కనీసం అష్టమి నాడైనా అంబ పూజ చేస్తే మేలు కలుగుతుంది. తొమ్మిది దినాలు ఉపవాసం ఉండలేని వాడు సప్తమి, అష్టమి, నవమి యీ మూడు దినములు ఉపవాసం వుండి అమ్మ పూజ చేస్తే అమ్మ కరుణిస్తుంది. అటువంటి ఆ మహా తల్లికి నమస్కరిస్తూ,

అమ్మా నారాయణి, బద్రీ నారాయణి, దేవి నారాయణి, లక్ష్మీ నారాయణి.

స్వస్తి,

మీ

భాస్కరానంద నాధ. / 10-10-2012