Wednesday, 10 October 2012

దేవీ నవరాత్రులు - శ్రీదేవి పూజ – నవరాత్రి పూజ

శ్రీదేవీ తత్వం - 5

దేవీ నవరాత్రులు - శ్రీదేవి పూజ నవరాత్రి పూజ
Devi Navaratri - sridevi pooja.

తొమ్మిది దినములు వసంత రుతువులోను, శరదృతువు లోను ఆ పరదేవతను పూజించడము నవరాత్రి పూజ అనబడును. చైత్ర మాసమునందును, ఆశ్వీజమాసమునందును శుక్ల పక్షములో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మను ఆరాధించాలి. ఈ పూజ చేసే వ్యక్తి తొలినాటి అమావాస్యనాడు పూజకు కావలసిన పదార్ధములను సమకూర్చుకోవాలి.  ఆనాడు ఏక భుక్తం చెయ్యాలి.  ఎచ్చు తక్కువలు లేని సమతల మైన ప్రదేశములో పదారు మూరల ప్రమాణముగా ఒక మండపము నిర్మించుకొని, బంకమన్ను, ఆవు పేడ కలిపి అలికి ముగ్గులు పెట్టి దాని నడుమ నాలుగు మూరలు వైశాల్యం, ఒక మూర ఎత్తు వుండే వేదిక ఏర్పరచాలి. దానికి పైన చాందనీ తోరణాలు కట్టాలి. ఆ రాత్రి శ్రీవిద్యోపాసకులను, వేద వేత్తలను, నియమపరులైన బ్రాహ్మణులను సగౌరవముగా తన ఇంటికి ఆహ్వానించాలి.

మర్నాడు వేకువ జామునే దగ్గరగా వుండే నదిలో గాని, చెరువులో గాని, ఇంటి పెరటిలో వున్న నూతిలో గాని స్నానం, సంధ్య, గాయత్రి జపం చేసి, బ్రాహ్మణులకు యధావిధిగా సపర్యలు చేసి నూతన వస్త్రములు, నగలు సమర్పించాలి. జగజ్జనని మంత్ర జపానికి యోగ్యులైన విప్రులు తొమ్మిది మందిని గాని, ఐదుగురు గాని, ముగ్గురు గాని, చివరకు ఒక్కడైనా వుండాలి. అలాగే పారాయణకి తగిన వాడు ఒకడు వుండాలి.

స్వస్తి వాచకముతో దేవి పూజ ఆరంభించాలి. మొదట చెప్పిన వేదిక యందు పట్టు బట్ట పరచిన సింహాసనం నెలకొల్పి, దాని మీద చతుర్భుజ యైన, సింహవాహిని యైన దేవి యొక్క ప్రతిమను గాని, మట్టితో చేసిన విగ్రహము గాని, తుదకు పటము గాని స్థాపించాలి. విగ్రహము లభించని పక్షమున నవాక్షర సహితమైన యంత్రమును గాని స్థాపించి దాని ప్రక్కన మేడి, మర్రి, రావి, జువ్వి, మామిడి చిగుళ్ళతో వైదిక సూక్త పరిష్కృతమైన పుణ్యజల పూర్ణము అయిన కలశము వుంచి ఆ యంత్రముతో సహా దానిని పూజించాలి.

ఈ పూజ హస్తా నక్షత్రముతో కలసిన పాడ్యమి నాడు మొదలు పెట్టడము చాలా మంచిది అని పెద్దలు అందురు.  పగలంతా ఉపవాసము వుండి రాత్రి మాత్రమే పూజ ముగిశాక భోజనము చేస్తాను అని గాని, లేక పూర్తిగా తొమ్మిది రోజులు ఉపవాసం చేసి ఈ పూజ చేస్తాను తల్లి ! అనుగ్రహించు అని పీఠము ముందు నియమము బల్కి పూజ ఆరంభించ వలెను.

మల్లె, మాలతి, సంపెంగ, మందారము, కదంబం మొదలైన పువ్వులతో, మంచి గంధం, అగరు, కర్పూరము, మారేడు పత్రీ, అర్ఘ్యం, పాద్యం, మొదలైన షోడశోపచారములతో, కొబ్బరి, అరటి, నారింజ, దానిమ్మ, పనస, మొదలైన ఫలాలతో, భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలతో, అన్నపాయసాలతో, ధూప దీపాలతో, స్తోత్రాలతో, అష్టోత్తరశతనామావళిలతో, లలితా సహస్ర నామావళితో, నమస్కృతులతో అమ్మను ఘన౦గా  పూజించి ఆనందపరచ వలెను. ఇలా తొమ్మిది రోజులు చేసిన వారు సాంసారిక జీవితమును సుఖ సంతోషములతో గడుపుతారు, ఎలాంటి బాధలకూ లోనుకారు.  పూజ యధావిధిగా చేసి యధాశక్తిగా అన్నదానం శ్రద్దా భక్తులతో చెయ్యాలి.

పూజ చేసే వ్యక్తి ఈ తొమ్మిది రోజులు నేలపై పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. క్రొత్త బట్టలు, నగలు ఇచ్చి కుమారీ పూజ చెయ్యాలి.

రెండు సంవత్సరాల వయసుది కుమారి, మూడేల్లది త్రిమూర్తి, నాల్గేల్లది కళ్యాణి, ఐదు సంవత్సరాలది రోహిణి, ఆరెండ్లది  కాళి, ఏడేండ్లది చండిక, అష్ట వర్ష శాంభవి, నవ వర్ష దుర్గ, దశాబ్ద సుభద్ర,  ఆపై వయసుగల కన్యకలు పూజార్హులు కారు. కుమారి పూజవల్ల దారిద్ర్య దు:ఖాలు పోతాయి. త్రిమూర్తి పూజ దీర్ఘాయువును, ధర్మార్ధ కామ ఫలమును ఇస్తుంది, కళ్యాణి పూజ వల్ల విద్య, రాజ భోగాలు కలుగుతాయి, కాళీ పూజ పగను మట్టి పెడుతుంది, చండికా పూజ సంపత్కరి, శాంభవి పూజ రాజ్య పూజమైన ధీశక్తిని సమకూర్చుతుంది. దుర్గ ఎలాటి క్లిష్టములైన కార్యాలను సాధిస్తుంది. సుభద్ర అభీష్ట ఫలదాయిని. రోహిణి పూజ రోగములను పారద్రోలుతుంది.

కుమారి పూజ శ్రీరస్తు అని ఆరంభించాలి లేదా శ్రీ మంత్రముతోగాని, బీజ మంత్రముతోగాని మొదలు పెట్టాలి. అవలక్షణముల గల కన్యలు, రోగాలతో వున్న కన్యలు  ఈ పూజకు పనికి రారు.  ఈ పద్ధతిని అనుసరించి శ్రద్ధాభక్తులతో యధాశక్తిగా నవ రాత్రి పూజ చేయడం సర్వ శ్రేయస్కరం. శక్తి చాలనివాడు కనీసం అష్టమి నాడైనా అంబ పూజ చేస్తే మేలు కలుగుతుంది. తొమ్మిది దినాలు ఉపవాసం ఉండలేని వాడు సప్తమి, అష్టమి, నవమి యీ మూడు దినములు ఉపవాసం వుండి అమ్మ పూజ చేస్తే అమ్మ కరుణిస్తుంది. అటువంటి ఆ మహా తల్లికి నమస్కరిస్తూ,

అమ్మా నారాయణి, బద్రీ నారాయణి, దేవి నారాయణి, లక్ష్మీ నారాయణి.

స్వస్తి,

మీ

భాస్కరానంద నాధ. / 10-10-2012

 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.