Friday, 7 December 2012

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం -2


ఆదిత్య హృదయం పరఃబ్రహ్మ హృదయం -2

సకల జగత్తును నిలబెడుతున్నది సూర్యభగవానుడు. సూర్యుణ్ణి ఒక గ్రహంగా కాక,దేవునిగా ఆరాధించడం మన సంప్రదాయం. సూర్యోపాసన అనేది అనాదిగా మన ఆచార వ్యవహారాల్లో భాగం.పొద్దుపొడవకపోతే ముద్ద మింగని వారు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. ఆరోగ్యాన్నీ,ఐశ్వర్యాన్నీ ఇచ్చే సూర్యుణ్ణి కొలవని వారు ఎవరూ ఉండరు. సూర్యుడు నమస్కార ప్రియుడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేసినంత మాత్రాన పొంగిపోయి మన కోర్కెలను తీర్చే వర ప్రదాత సూర్యభగవానుడు.

మనుషులకే కాదు, సకల జీవరాశికి ప్రాణదాత. ఆకాశం మబ్బు పట్టి సూర్యోదయం కాకపోతే, పశుపక్ష్యాదులు కూడా తమ దైనందిన కార్యకలాపాలకు కదలవు. సూర్యునికి మాఘమాసం అత్యంత ప్రీతికరమైనది.మాఘ శుద్ధ సప్తమినాడు రథసప్తమి పేరిట తెలుగునాట పండుగను జరుపుకుంటారు. నదీనదాల్లో జిల్లేడు ఆకులను శిరస్సు మీద పెట్టుకుని స్నానమాచరించి సూర్యునికి అంజలి ఘటిస్తారు. పిడకల పొయ్యిపై పొంగలిని తయారు చేసి చిక్కుడు ఆకులలో ఉంచి సూర్యునికి నివేదన చేస్తారు. చిక్కుడు కాయలతో రథాల మాదిరిగా తయా రుచేసి చిక్కుడు ఆకుల్లో ఉన్న పొంగలిని సూర్యునికి నైవేద్యం సమర్పిస్తారు. బ్రహ్మచారులు సూర్యారాధనతో పాటు గాయత్రి జపాన్ని చేసినట్టయితే, వారికి విద్యాబుద్ధులు చక్కగా అలవడతాయి.

సూర్యోదయం కాకముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్య నమస్కారం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.సూర్యోదయం అయిన తరువాత దంతధావనం చేయకూడదన్నది పెద్దలు ప్రవేశపెట్టిన సంప్రదాయం.అలాగే, స్త్రీలకు సౌభాగ్యం, ఐశ్వర్యం, సౌందర్యాలను ప్రదానం చేసే దేవుడు సూర్యుడు.  సూర్యుణ్ణి శ్రీమన్నారాయణునిగా కొలుస్తారు. అందుకే, సూర్యనారాయణునిగా కూడా ఆదిత్యుడు ప్రసిద్ధుడు. సూర్యుణ్ణి భక్తితో ఆరాధిస్తే సకల దేవతలనూ కొల్చినట్టే. ఉత్తరాయణ పుణ్యవేళ సూర్యారాధన ఎంతో పుణ్యం., అలాగే,సూర్య రశ్ని సోకకపోతే చర్మ వ్యాధులు ప్రబలుతాయి. సూర్యారాధన వల్ల సకాలంలో వర్షాలు పడతాయి. పంటలు పండుతాయి

ప్రజల అభీష్టం నెరవేరుతుంది. ఇతర దేవతల కన్నా సూర్యుడు భక్త సులభుడు. ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిష్టగా ప్రతిరోజూ పఠిస్తారో వారికి ఎటువంటి రుగ్మతలు కలగవు. శ్రీరామచంద్రునికి మేలు చేకూర్చినది కూడా ఆదిత్య హృదయమే. త్రేతాయుగం నుంచి పౌరాణిక కాలం నుంచి ప్రస్తుత కాలం వరకూ ప్రత్యక్ష సాక్షిగా సకలజగత్తుకూ మార్గదర్శకునిగా,దిక్సూచిగా సూర్యభగవానుడు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం. సూర్యోపాసన అనేది మనిషిలో వివేకాన్ని తట్టి లేపుతుంది. మనిషికి చురుకు తనాన్ని, తేజస్సును ఇస్తుంది. మనిషిని రుజుమార్గంలో నడుపుతుంది. అన్నింటికీ మించి మనిషికి బలాన్ని ఇస్తుంది. మనిషికి ప్రాణాధారం సూర్యోపాసన.

సంధ్యా వందనం అని అంటున్నాము గానీ గాయత్రీ వందనం అని ఎందుకు అనట్లేదు. సూర్యమండలము లోని గాయత్రి మాతకు ఉపాసన చేస్తున్నాము. సూర్యోపాసనతో బాటు గాయత్రిని చేస్తున్నాము. సూర్యోపాసన లేకుండా గాయత్రి లేదు. సూర్య భగవానుడే పర బ్రహ్మము, ఆ పర బ్రహ్మమే గాయత్రి మాత. సమస్త గ్రహ దోష నివారణార్ధం ఆదిత్య హృదయం చదవాలి.

 మీ
భాస్కరానందనాథ

 

 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.