రాజా శ్యామల / రాజ మాతంగి
అయ్యా ఈమె దశ విద్యలలో ఒక దేవత. విష్ణువు కు పది అవతారములు ఉన్నట్లే ఆ పర దేవతకు కూడా పది విద్యలు, పది దేవతలు కలరు. ఒక్కో దేవతను ఒక్కో రూపములో, ఒక్కో మంత్రముతో ఆరాధిస్తారు. ఈ రాజ శ్యామల శ్యామల వర్ణముతో కూడి వుంటుంది. ఈమె త్రిపుర సుందరికి మంత్రిణి. ఈమెనే మరకత శ్యామల అని సంస్కృతమునందు, పచ్చైయమ్మన్ అని తమిళము నందు పిలిచెదరు.
లలితా స్తోత్రము నందు " మంత్రిన్యంబా విరచిత నిషంగ వధ తోషితా" అని ఈమె అనుగ్రహ తత్వమును వర్ణింప బడినందున వాశిష్ట గణపతి ముని ఈమెను ఉపాశించి ఈమె అనుగ్రహమును పొందెను.
కొందఱు దశావతారములను శక్తి పరముగా అన్వయించి శ్రీరాముడు లలితాదేవి యని, శ్రీ కృష్ణుడు శ్యామల అని భావించి కీర్తించినారు. ఈమెనే రాజ మాతంగి అని అందురు. మతంగ మహర్షి కడిమి చెట్ల మధ్య, అడవిలో ధ్యానం చేస్తుండగా ఈ దేవత సాక్షాత్కరించింది. నూరు సంవత్సరాలు ఆ మహర్షి తపస్సు చేస్తే కాళీ దేవి శ్యామలయై సాక్షాత్కరించింది. కాళీ తీవ్ర రూపమైతే, శ్యామల కోమల రూపం. మాతంగికి మరో పేరు శ్యామల.
ఈమెను ఆరాధించే కాళిదాసు మహా కవి అయినాడు. ఎ వ్యక్తీ ఈమెను ఉపాసిస్తాడో అతను మహా కవి అవుతాడు, అతనికి సంగీత విద్య ప్రసాదింప బడుతుంది. రాజ మాతంగి, సంగీత మాతంగి, సాహిత్య మాతంగి అని మంత్ర భేదములతో ఈమెను ఉపాసిస్తారు.
మాతంగీ సాధన చేసిన సాధకులకు చిలుకలు దగ్గరకు రావటం, అరవటం అన్న అనుభవాలు కలుగుతాయి. ఈ విద్య అత్యంత పురాణ కాలము నుండి వస్తున్నది. వశీకరణము, ఐశ్వర్యము, రాజాశ్రయం కోరు వారు ఈమెను ఆరాధిస్తూ వుంటారు.
మాతా మరకత శ్యామా మాతంగీ మధు శ్యాలినీ,
కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబ వన వాసినీ.
అటువంటి తల్లికి నమస్కరిస్తూ
మీ
భాస్కరానందనాథ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.