Tuesday, 27 May 2014

సౌందర్యలహరి- 22 - “భాస్కర ప్రియ”

సౌందర్యలహరి- 22

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంచన్కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్ || 22

తల్లీ, భవాని! నేను నీ దాసుణ్ణి, నీ కృపా కటాక్ష వీక్షణం నాపై ప్రసరింపజేయుము అని ఉపాసకుడు ప్రార్థించినంతనే, అతడికి, ముకుందబ్రహ్మేంద్రులు తమ రత్నకిరీటాలచేత నీరాజనం గావించబడే  నీ పాదపద్మాల యొక్క సాయుజ్యాన్ని కల్పిస్తున్నావు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

  భాస్కర ప్రియ  (భాస్కరానందనాథ  భావము)
చాలా అత్భుతమైన శ్లోకము. ఆచార్యులు వారు మనకు దేవతార్చనలో నిత్యం చదువుకొనేదానికి ఇచ్చిన గొప్ప శ్లోకము ఇది. ఆత్మార్పణము అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి  అనేది మనకు ఈ శ్లోకము ద్వారా నేర్పిస్తున్నారు.
భవాని త్వం.... భవానీ నీవు ....అని  అనీ అనే లోపల అమ్మ మనకు మోక్షం ఇచ్చేస్తుంది అట. అది ఎలాగో చూస్తాము.
భవానిత్వం అంటే  మోక్షత్వం.  భా అంటే ప్రకాశించునది. కాంతివంత మైనది. శుద్ధ తత్త్వం లోనే, సత్వ గుణం తోనే  ఆత్మ ప్రకాశిస్తూ వుంటుంది.   సదా ప్రకాశిస్తూ ఉండడమే మోక్షత్వం లో వుండడం. భవానిత్వం అంటే  మోక్షత్వం, మోక్షత్వం అంటే ప్రకాశించడం అని అర్ధం. కర్మలు లేకుండా వుండడటమే ప్రకాశించడము.
మోక్షం దేని నుంచి అంటే కర్మ నుంచి. కర్మ నుంచి విముక్తి పొందడమే మోక్షం. కర్మలు లేకుండా ఉండడమే  కైవల్యము.
భ అంటే భవము. అంటే సంసారము. సంసారము నుంచి విముక్తి ప్రసాదించేది గనుక భవాని.

భవస్య పత్నీ భవానీ, భవుని భార్య భవాని.  
భవతి భవతేవా సర్వమితి భవః.....అంతయూ తానైన వాడు.   అంతయూ నిండిన వాడు. భవుడు అంటే శివుడు. మహాదేవుడు.
భవము  అంటే పుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము  అని కూడా అర్ధము.  ఇతని వలన పుట్టును గనుక భవము. మన్మధుని జీవింపజేయునది భవానీ. సంసార సాగరమును దాటింప జేయునది  భవాని. శుభములను ప్రాప్తింప జేయునది భవాని.  తరింప జేయునది భవాని. మరలా పుట్టుక లేకుండా జేయునది భవాని. ముముక్షత్వం ప్రసాదించేది భవాని.
భవం మహాదేవం సంసారం కామం వా ఆనయతి, జీవయతీతి భవానీ.
భవం జీవన రూపం జలమప్యానయతి జీవయతీతి భవానీ.
రుద్రో భవో భవః కామో భవ స్సంసార సాగరః తత్ప్రాణనా దియం దేవీ భవానీ పరికీర్తితా....దేవీ భాగవతం.

పరమేశ్వరుని అష్ట మూర్తులలో జల మూర్తికి భవుఁడు అని పేరు గలదు. శివుడు లోకములను బ్రతికింప జేయువాడగుటచే భవుఁడు అని పేరు.  దేని నుండి భూతములు పుట్టు చున్నవో, దేనిలో బ్రతుకు చున్నవో, అది జల రూపము.  అట్టి పుట్టుకను జీవింప జేయునది గాన అది భవుఁడన బడుచున్నది.  భవ మనగా జీవ రూపమైన నీరు. అట్టి జల రూపుడగు భవుఁని జీవింపజేయునది కనుక భవాని అని చెప్ప బడినది. ప్రాణ శక్తికి, జీవ శక్తికి  మూలం భవాని.   బ్రతికించేది భవాని.

కాబట్టి జగద్గురువులు అమ్మను భవానీ అని పిలిచినారు ఈ స్తోత్రంలో.
భవానిత్వం అంటే  ముముక్షత్వం. అద్వైత సిద్ధాంతము. రెండు లేవు తల్లి వున్నది ఒక్కటే. ఇద్దరమూ ఒక్కటే. తత్త్వమసి. అమ్మా నీవే నేను, నేనే నీవు అని చెప్పడం. భవానిత్వం...అని అనగానే, చెప్పగానే  జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం వస్తే మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి శివ సాయుజ్యం లభించినది. నిజసాయుజ్యపదవీం... అన్నారు ఇక్కడ.
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
భవానీ ...త్వం దాసే..అమ్మా నీ దాసుడను అమ్మా, నీ కరుణ జూపవమ్మా నా పైన. అని ప్రార్ధించాలని మనసులో అనుకొన్నాడు. ఇతి స్తోతుం వాంఛన్..,
కథయతి భవాని త్వమితి యః.... ఇంకా పూర్తిగా కూడా అనలేదు. “భవాని త్వం”...అని రెండు మాటలు నోట్లో నుంచి బయటకు వచ్చినాయి అంతే ఇంతలోనే ఆ భావానికి సాధకుడి మీద ఎనలేని ప్రేమ కలిగినది.  ఆ పిచ్చి తల్లి మరోలా అర్ధం చేసుకొన్నది, భవాని త్వం.. అనే రెండు మాటలను “నీవు నేను అగుదును గాక”..అని అర్ధము తీసుకొన్నది. అలా సాధకుడు అడుగుతున్నాడు కాబోలు అని అనుకోని “తధాస్తు” అని అన్నది. ఎంత కరుణ తల్లీ నీకు భ అంటే భవాని అని అనుకొన్నావా, త అంటే త్వం అనుకొన్నావా, వెరసి భవాని త్వం అనుకోని సాయుజ్యం ఇచ్చేస్తావా? అవ్యాజ కరుణామూర్తివి అని నామము సార్ధకం చేసుకొన్నావు గదా తల్లి, ఈ బిడ్డ మీద నీకు ఎందుకు అంత జాలి. ప్రేమ.? సాయుజ్యం అంటే ఉపాసకుడు అమ్మ వారిలో లీనం కావడం సాయుజ్యం.
దాసే ... నేను దాసుడను అని అంటే ఆమె యజమానురాలు అయ్యినది. ఒక్క యజమానికి మాత్రమే విముక్తి ప్రసాదించే గుణము, అర్హత వుంటాయి. జన్మ రాహిత్యము ప్రసాదించడానికి భవాని త్వం వుండాలి. కాబట్టి గురు దేవుళ్ళు తనను దాసుడిగా పోల్చుకొని అమ్మను యజమానురాలిని చేసి, భావానిత్వం అంటగట్ట్టి, ఓ.. తల్లీ నన్ను గమనించుకో అని చాలా తెలివిగా అడిగారు. అడిగిన కోరిక చిన్నదేమీ కాదు.
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం....
అడిగి అడగక మునుపే, వెంటనే అమ్మ తన సాయుజ్యాన్ని అనుగ్రహించినది. ఆ తల్లి యొక్క అపార కారుణ్యం పెల్లుబికినది బిడ్డ పైన.
సాయుజ్యం అంటే ముక్తి . ముక్తి నాలుగు రకాలు అని పెద్దలు అంటారు.
౧. సాలోక్యము :- పరమాత్మ లోకాన్ని చేరడం సాలోక్య ముక్తి.
౨. సామీప్యము:- పరమాత్మ సన్నిధికి చేరడం సామీప్య ముక్తి.
౩. సారూప్యము:- పరమాత్మ తో సమాన రూపం పొందడం సారూప్య ముక్తి.
౪. సాయుజ్య ముక్తి:- పరమాత్మతో ఏకం కావడం సాయుజ్య ముక్తి.

ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్........
హరి బ్రహ్మేంద్ర సేవితా ...అని అమ్మను వశిన్యాది వాగ్దేవతలు కొనియాడినారు. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారు నిత్యమూ నీ పాదాలకు నమస్కరిస్తూ వుండడం వలన, వారి కిరీటాల రత్న కాంతులతో నీ పాదాలు ప్రకాశిస్తూ వున్నాయి తల్లీ.  ఆ కాంతులు ఎలా వున్నాయి అంటే అవి వారు ఇచ్చే కర్పూర నీరాజనాల్లాగ వున్నాయి.
మరొక విషయం తల్లీ, వాళ్ళు ఎప్పడూ వచ్చి నీ పాద పద్మములకు నీరాజనాలు ఇచ్చి నీ సేవకులుగానే మిగిలి పోయినారు. కానీ నేనేమో భవానీ త్వం అని నీ సాయుజ్యాన్ని పొందాను సునాయాసంగా. అంటే హరి బ్రహ్మెంద్రులకు కూడా దక్కనిది అమ్మ తన బిడ్డలకు, ఉపాసకులకు సాయుజ్య పదవిని ప్రసాదిస్తుంది అని గ్రహించాలి.

గూడార్ధము :-  అమ్మ మనసు ఏమిటో ఈ శ్లోకము ద్వారా గురువులు మనకు చెబుతున్నారు.
భవాని త్వం  ......... అనేది గొప్ప మహా వాక్య ప్రయోగము. తత్వమసి సిద్ధాంతము. ఇది ఒక్కటి అనుకొంటే చాలు సాధకుడు తరించి పోతాడు. ఎంత గొప్ప విషయమో. భవాని త్వం ... అని అనుకొంటే  చాలు తరించి పోతాడు. సాయుజ్యాన్ని ఇచ్చే అధికారము ఒక్క అమ్మ వారికి మాత్రమే కలదు. విముక్తిని ప్రసాదించే అధికారము అర్హత ఒక్క యజమానురాలికే వుంటుంది. కాబట్టి శంకరులు తనను తాను దాసుడు అని సంభోధించు కొన్నాడు. మనము అందరమూ దాసులము. ఆ తల్లి మన యజమానురాలు. యజమాను రాలికి ప్రాణ బిక్ష పెట్టె అధికారము కలదు. అందువలన మనకు విముక్తి ప్రసాదించినది. అదే భవాని త్వం. అది ఒక అధికారం. మోక్షాన్ని ప్రాసాదించే అధికారం. అమ్మా కరుణ జూపవమ్మా అని వేడుకొంటే చాలు, ఆ తల్లి మనకు ప్రాణ బిక్ష పెడుతుంది. మరలా జన్మ లేకుండా చేస్తుంది.  

శరణ్యే వరణ్యే సుకారుణ్య మూర్తే, హిరణ్యోదరాద్యై రగణ్యే సుపుణ్యే,
భవారాణ్య భీతేశ్చ మాం పాహి భద్రే, నమస్తే నమస్తే నమస్తే భవానీ ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/27-05-2014 @ శ్రీకాళహస్తి
మా వివాహ వార్షిక శుభ దిన సందర్భముగా ఆ తల్లి పాదములకు సమర్పించుకొంటున్నాను
 ఈ “భాస్కర ప్రియ” ను.
www.facebook.com/sribhaskaranandanatha/
http://vanadurga-mahavidya.blogspot.in/    


Thursday, 22 May 2014

సౌందర్యలహరి- 12

సౌందర్యలహరి- 12

శ్లో|| త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరిఞ్చి ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యా దమర లలనాయాంతి మనసా
తపోభి ర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్‌ ||  12

ఓ హిమగిరి తనయా! నీ నెమ్మేని లావణ్యాన్నిఅవయవాల సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించడానికి బ్రహ్మవిష్ణువుఇంద్రుడు మొదలైన కవివరేణ్యులు వేరొక వస్తువు కానక మిన్నకున్నారు. నిన్ను తెలుసు కోలేకుండావున్నారు. అలాంటి నీ లోకోత్తర సౌందర్యాన్ని తిలకించడానికి  కుతూహలం గలవారైఅప్సరసలు  నీ అందంతో తాము కించిత్తూ సరిరాకపోయిన వారైతపస్సులచేత కూడ పొందరానిదైన పరమశివుడితోడి సాయుజ్యస్థానాన్ని మనస్సుచేత పొంద ఇచ్చగిస్తున్నారు. (ఒక్క పరమశివుడు మాత్రం నీలో సాయుజ్యమొందగలడు కావున వారు ముందు శివసాయుజ్యమొంది నిన్ను చేరుకో ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనూ వారు సఫలీకృతులు కాక ఒక మానసికమైన అనుభూతితో సంతృప్తి చెందుతున్నారని భావము).
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కరానందనాథ  భావము:-
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం……  ఓ హిమ గిరి తనయా, హైమవతీ, తల్లీ   నీ  సౌందర్యాన్ని వర్ణించడానికి గాని, పోల్చడానికి గానికి బ్రహ్మాది దేవతలకు వీలుకాదు. అసలు సరి పోల్చడానికి మరొక వస్తువు, మరొక దేవత, మనిషి లేక ఆశక్తులై వున్నారు. అప్సరలతో పోల్చుదామా అంటే వారే నీ సౌందర్యాన్ని చూడడానికి నీ చెంతకు వచ్చి నీ అందాన్ని పరికించడానికి ఆశక్తులై శివున్ని ధ్యానించి శివ సాయుజ్యాన్ని పొంది నీ కడకు వచ్చినారు.   ఎందుకంటే అమ్మ సౌందర్యం అయ్యకు మాత్రమే తెలుసు. మరెవ్వరికీ తెలియదు గనుక.   అమ్మ సౌందర్యాన్ని స్పృశించడానికి, చేరువవ్వడానికి ఆ పరమ శివునికి ఒక్కడికే సాధ్యం. మరొకరు సాహసించ లేరు, వీలు పడదు. అందువలన అప్సరసలు, బ్రహ్మాది దేవతలు మానసికంగా శివున్ని పూజించి, అర్చించి శివ రూపం, శివ సాయుజ్యం పొంది నిన్ను నీ అందం చూడడానికి సాహసిస్తున్నారు తల్లీ.
న రుద్రో మర్చయేత్... రుద్రుడు కానిదే రుద్రున్ని అర్చించలేరు, కాబట్టి మొదట వాళ్ళు శివుణ్ణి ఆరాధించి, మానసికంగా శివ సాయుజ్యాన్ని పొంది, శివునిలో ఐక్యం పొంది, తర్వాత నీ దగ్గరకు వస్తున్నారు నీ సౌందర్యాన్ని చూడడానికి. అంటే నీ సౌందర్యాన్ని చూచిన వాళ్లకు అ ప్రయత్నంగా శివ సాయుజ్యం సిద్దిస్తున్నది అని అర్ధము. నీకు చేరువైన వాళ్లకు నీ దర్శనంతో బాటు అయ్య దర్శనం కూడా లభిస్తుంది తల్లి. ఇది మహా పతివ్రతా లక్షణం. ఆమె సదాశివ పతివ్రత కదా! ప్రతి జన్మ యందు, ప్రతి యుగము నందు, ప్రతి కల్పము నందు  శివుడే భర్తగా నియమము గలది ఆమె అందుకని సదాశివ పతివ్రత అయినది. తన భర్తతో సమాన ధర్మములు గలది. ఆ తల్లి తన భక్తులకు పరమ శివుని సాయుజ్యము, మోక్షము కలుగజేయునది గాన శివంకరి అయినది.

ఆమె శివ మూర్తి, శివుడే స్వరూపముగా గలది. భక్తులకు శివ స్వరూపమును తెలుపునది, శివ జ్ఞానము ఇచ్చునది  గాన శివ పరా, శివ దూతి, శివ జ్ఞాన ప్రదాయిని  అని లలితా సహస్రనామం లో తెల్పినారు.
ఆ తల్లి మహా సాధ్వి.   “సతీ సాధ్వీ పతివ్రతా”.....అని అమరకోశము నందు గలదు. భూత, భవిష్యద్వర్తమాన కాలము లందు వేరొక భర్త సంబంధము లేక పోవుటచే అనితరసాధ్యమైన పాతివ్రత్యము చే మహా పతివ్రత అగుచున్నది.
 “అనన్య సామాన్య మైన పాతివ్రత్యము చే   ఓ ... దేవి నీవు సతి అని చెప్పబడుచున్నావు”... అని దేవీ భాగవతములో చెప్ప బడినది. కవులందరూ సరస్వతీ పతులే, కాస్త ధనము గల వారందరూ లక్ష్మీ పతులే, కానీ నీ విషయము అలా కాదు తల్లీ, ఒక్క మహా దేవునికి తప్ప మరెవ్వరికీ సాధ్యము కాదు తల్లీ నీ దరి చేరడానికి. నీ సౌందర్యము చూడ డానికి.
గూడార్ధము:-
ఆ తల్లి మహా లావణ్య శేవధి, మహా త్రిపుర సుందరి, ఆమెను చూడాలంటే ఆజ్ఞా చక్రము దాటి, రుద్ర గ్రంధిని దాటి సహస్రార కమలములో ఆ తల్లిని దర్శించ వలెను. అచ్చటకు వెళ్ళేటప్పటికి మనస్సు యొక్క చేష్టలుడిగి పోతాయి. ఇక మనస్సు పట్టుకోలేదు. కావున ఆమె సౌందర్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. పోల్చడానికి, ఊహించ డానికి అలవి కాదు అని. 
ఈ శ్లోకములో రహస్య మంత్రార్ధము గలదు.

13 వ శ్లోకము నుంచి 21 వ శ్లోకము వరకు అత్యంత గోప్యమైన మంత్రార్ధములతో కూడిన ప్రయోగ శ్లోకములు.
మంత్ర శాస్త్రము తో కూడుకొన్నవి. అంతరార్ధము వివరించాలంటే మంత్ర శాస్త్రమును తెలుప వలెను. ఇది శ్రీవిద్యోపాసకులకు తప్పించి అన్యులకు తెలుపరాదు. బహిరంగముగా చర్చించరాదు. గురు ముఖః త తెలుసుకోవలెను. కావున పెద్దలు నిర్ణయించిన మర్యాదను పాటిస్తూ వీటి వివరణను  నేను పొందు పరచడం లేదు. తిరిగి 22 వ శ్లోకముతో ఆ తల్లి ఇచ్చిన పరి జ్ఞానము మేరకు వివరించడానికి ప్రయత్నము చేస్తాను.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/22-05-2014 @ శ్రీకాళహస్తి

Wednesday, 14 May 2014

సౌందర్యలహరి- 11

సౌందర్యలహరి- 11

శ్లో|| చతుర్భి శ్శ్రీకణ్ఠై శ్శివయువతిభిః పఞ్చభిరపి
ప్రభిన్నాభి శ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ
త్రిరేఖాభి స్సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11

తల్లీ, భగవతీ! నలుగురు శ్రీకంఠులతోను (శివ చక్రాలు), ఐదుగురు శివశక్తులతోనూ (శక్తి చక్రాలు), మొత్తం తొమ్మిది మూల ప్రకృతులతోను,  అష్టదళం, షోడశదళం, మేఖలాత్రయం, భూపురం, అనే వాటితోను కూడి నీకు నివాసస్థానమైన శ్రీచక్రం యొక్క కోణాలు నలభై నాలుగు సంఖ్య గలవిగా పరిణమించి ఉన్నవి. (నాలుగు శివ చక్రాలతోనూ, ఐదు శక్తి చక్రాలతోనూ కూడి తొమ్మిది చక్రాలతో సొంపారు చున్నదని భావం).

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కరానందనాథ  భావము:-
ఆచార్యుల వారు క్రిందటి శ్లోకములలో కుండలినీ శక్తిని గురించి చక్కగా మనకు వివరించి యున్నారు. సూక్ష్మ రూపములో తల్లిని ఎలా ఆరాధన చేయాలి అనేది కూడా మనకు తెలిపినారు. ఇప్పుడు మనకు సూక్ష్మ ఆరాధన క్రింద అసలు శ్రీచక్రము అంటే ఏమిటి? దానిలో ఏమున్నది, దాని నిర్మాణము ఏమిటి ? దానిలో దాగి వున్న రహస్యము ఏమిటి అనేది మనకు చక్కగా వివరిస్తున్నారు ఈ శ్లోకములో. అత్యంత విలువైన శ్లోకము ఇది. Geometrical view ను సూత్రములతో సహా  సిద్ధాంతీకరిస్తున్నారు గురు దేవుళ్ళు. లలితా సహస్ర నామములను  చదివితే ఆ శబ్ద తరంగములకు  శ్రీచక్ర రేఖా చిత్రము వస్తుందని రుజువు కూడా చేయడమైనది. అటువంటి శ్రీ యంత్రము గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఎందరెందరో మహానుభావులు ఈ శ్రీచక్రమును గురించి కొన్ని వందల పుస్తకములు వ్రాసివున్నారు, ఇంకా వ్రాస్తూనే వున్నారు. అందరికీ మూలం సౌందర్య లహరి మరియు తంత్ర శాస్త్రములు.

ఆది గురువులు పెట్టిన బిక్ష ఇది మనకు, వారె విరచించి స్తోత్రము చేయక పోతే ఈనాడు మనము ఆది మానవులము గా, అజ్ఞానులుగా మిగిలి పోయి వుండే వాళ్ళము. ఈ జ్ఞాన వీచికలు వీయవు, ఆ సౌగంధిక సౌరభాలు దొరకవు ఈ ఆనందం ఉండదు.  మనశ్శాంతి ఉండదు. గురుదేవుల్లకు ఎంతో రుణపడి వున్నాము. లేదంటే వామాచార పద్దతిలో అవైదిక మార్గములో అంతా సర్వ నాశనం అయ్యి వుండేది. ఒకరికొకరు పీక్కొని చచ్చి వుండే వాళ్లము. తంత్ర గ్రంధము లన్నీ వారు పరిష్కరించి మనకు నూతన మార్గము చూపిస్తూ నాగరికత నేర్పిన మహానుభావులు వారు, ఎన్నో గ్రంథములకు వారు భాష్యములు వ్రాసి భావార్ధము లను విడమర్చి చెప్పిన  అపర శంకరులు, శ్రీ దక్షిణామూర్తి అవతారం శంకర భగవత్పాదులు.

ప్రతి శ్లోకములో వారు స్థూల, సూక్ష్మ, పరార్ధములు చెప్పి యున్నారు. వారి యొక్క మనో భావాన్ని పట్టుకొంటే చాలు మనకు అర్ధం అయ్యినట్లే.   మూలం అర్ధం అయితే చాలు, మనము సాధన చేయ వచ్చును.
ప్రతి పదాన్ని ఎంతో దూరం ఆలోచించి వారు వేసినారు. ఆ పదం అక్కడే ఎందుకు వేయాలి, మరొకటి ఎందుకు వేయకూడదు  అని దీర్ఘంగా ఆలోచిస్తే, ప్రతి పదం వెనుక పరిగెడితే  పద లహరి అయిన సౌందర్య లహరి అర్ధమైనట్లే,  అమ్మ వారి దర్శనం పొందినట్లే.  

అక్షర సముదాయమే వాక్యము. ఆ అక్షరములే మాతృకలు. మాతృకలు దేవీ స్వరూపములు. అ నుంచి క్ష వరకు గల వర్ణములు  అక్షరములు.  శక్తి స్వరూపములు. అక్షరములలో ప్రాణ శక్తి గలదు. ఐ...ఐ ..ఐ అని కొలచిన ఒక మూగ బాలుడికి అమ్మ ప్రత్యక్షమైనది. ఒక్కో అక్షరములో ఒక్కో జీవ శక్తి గలదు. ఏ మంత్రమూ, తంత్రము పల్లేదు వూరికే   క..క..క అని జపిస్తూ వుంటే చాలు మహా శక్తి ఉద్భవిస్తుంది.   ఈం...ఈం అని పలుకరిస్తూ వుంటే చాలు జీవ శక్తి పుట్టుకొస్తుంది.   మ...మ..మ.. అంటూ వుంటే చాలు పరమ శివుడు ప్రత్యక్ష మౌతాడు.
మన సనాతన ధర్మములో ఒక్క శబ్దము చాలు తరించడానికి. పాప పుణ్యములతో ముడిపెట్టి మనిషిని సంస్కరించినాయి వేదములు. లేదంటే ఏ చట్టములు, న్యాయములు మనల్ని కాపాడలేవు. మన సంస్కృతి యొక్క ధర్మమే మనకు శ్రీరామ రక్ష. ఎవడికి వాడే ధర్మ చట్రాన్ని తనకు తానుగా బిగించుకొని తాళాలు వేసుకొని, హద్దులల్లో వుండి జీవన యాత్ర కోన సాగిస్తున్నాడు. లేదంటే అందరూ జంతువులుగా వ్యవహరించి వుండేవాళ్ళు. అటువంటి చక్కటి మార్గాన్ని నిర్దేశించిన మన ఋషి పుంగవులకు, ఆచార్యులకు, గురువులకు మనము ఎంతో రుణ పడి ఉన్నాము.  తస్మే శ్రీ గురవే నమః

అమ్మను చూడటానికి, పట్టుకోవడానికి  సౌందర్య లహరి.
లేకపోతే అది లహరి కాదు ఉత్త సౌందర్యం, ఒక కాంత సౌందర్యం.
భావమును పట్టుకోండి భావము వెనుక భవానీ వచ్చేస్తుంది. భవానీ భావనాగమ్యా....అని అన్నారు కదా!
 పెద్దలు చెప్పినది అదే, నేను ఆచరిస్తున్నది కూడా అదే. శంకరులు ఆ పరమ శివుని యొక్క భావమును పట్టుకొని శ్రీచక్రము గురించి ఈ శ్లోకాన్ని రచించి స్తోత్రం చేసినారు, అమ్మ దర్శనం కలిగినది. ఇప్పుడు మనము ఆ  శంకరుల యొక్క భావమును పటుకొంటే ఆ తల్లి దర్శనం తప్పక లభిస్తుంది మన అందరికీ.

పరమేశ్వరుడు జగత్తునందలి ప్రాణుల కామ్య సిద్దుల కొరకు 64 తంత్రములను సృష్టించెను. కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర, తంత్రము వలన లభించునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరునిచే నిర్మింపబడినవి. ఈ తంత్రమునకు సిద్ద వజ్రమని, స్వతంత్ర తంత్రమని,  శ్రీచక్రము అన్ని మంత్ర, తంత్ర యంత్రములలో కెల్లా గొప్పదని సాక్షాత్తు ఆ కామకామేశ్వరుల ప్రతి రూపమని చెప్పుదురు. చక్రరాజము అని కూడా శ్రీచక్రమునకు పేరు.

శ్లో:   బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ,
      మన్వశ్రదళ సంయుత షోడశారమ్,
      వృత్తత్రి భూపురయుతం పరితశ్చతుర్ద్వాః,
      శ్రీచక్రమేత దుదితం పరదేవతాయాః
బిందువు, త్రికోణము, అష్ట కోణము, దశ దళ యుగ్మము, చతుర్దశ దళము, అష్ట దళము, షోడశ దళము, త్రివలయుము, భూపురము అను వానితో  గూడి, నాలుగు ద్వారములు గలదై ఆ పర దేవతయే శ్రీచక్ర స్వరూపమై  వెలసియున్నది.

శ్లో:   చతుర్భి శ్శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః |
      నవ చక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః ||......భైరవయామళము

శక్తి చక్రములు, 4 శివ చక్రములతో కూడి పరదేవతా స్వరూపమైన శ్రీ చక్రము ఏర్పడినది.
నవ యోనులనగా తొమ్మిది కోణములు, తొమ్మిది ధాతువులు. 
అయిదు ధాతువులు – శక్తి మూలకములు:-  చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు.
నాలుగు ధాతువులు – శివ మూలకములు:-  మజ్జ, వీర్యము, ప్రాణము, జీవము.
ఈ దేహము నవ యోనులతో బుట్టినదై  నవ ధాతు మయము అగు చున్నది. పదవ యోని బైన్ధవ స్థానము.
చరాచర స్వరూపమైన ఈ జగము శివ శక్తుల స్వరూపము. చరము అనగా పిండాండము, మన శరీరము. అచరము అనగా బ్రహ్మాండము అని అర్ధము. చరాచర స్వరూపమే శ్రీచక్రము.

ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమే శ్రీచక్రము.   శివాశివుల శరీరమే శ్రీచక్రము.

చతుశ్చత్వారింశత్ అంటే శ్రీచక్రము లోని కోణాల సంఖ్య 44 అని. ఏ యంత్రము అయిన సరే ఈ శ్రీచక్రములో ఇమిడి పోవలసినదే. అంటే సర్వ యంత్రములు శ్రీచక్రములో వున్నవి. అందుకే శ్రీచక్రమును మాతృకాచక్రము అని అందురు.  ముక్కోటి దేవతలు శ్రీచక్రములో వున్నారు. పంచ ప్రేతాసీన అయినటువంటి ఆ తల్లి ముక్కోటి దేవతలకు తల్లి. త్రిమూర్తుల కంటే పూర్వము వున్నది. శక్తి రూపమై అందరిలో వున్నది.  సమస్త సృష్టి ఈ శ్రీ చక్రము నుంచే ఉద్భవించినది.  శ్రీచక్రమే ఈ సమస్త బ్రహ్మాండము.  ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమే శ్రీచక్రము. 

సమస్త దేవతలకు, గురువులకు నిలయం ఈ శ్రీచక్రము.   సమస్త ప్రాణి కోటి ఈ శ్రీచక్రము నుంచే ఉత్పన్నమైనది.    అమ్మ అందరికీ అతీతంగా అందరికంటే పైన శ్రీనగరములో వున్నది. ఒక్క శ్రీచక్రమును పూజిస్తే చాలు  సమస్త శక్తులను, దేవతలను, త్రిమూర్తులను పూజించినట్లే. అంబికా పంచాయతనం శ్రీచక్రములోనే వున్నది. శ్రీ చక్రము వున్న ఇంట్లో పంచాయతనం ఉన్నట్లే. సర్వ శక్తి మంతమైనది శ్రీచక్రము. శ్రీచక్రము వున్న ఇంట్లో సాక్షాత్తు అమ్మవారు నివసిస్తూ ఉన్నట్లే. ఎంతో భక్తితో, శ్రద్ధతో, మడితో శ్రీచక్రమును కొలవవలయును.  మహా పుణ్యము వుంటేగాని శ్రీచక్రమును కొలిచే అర్హత రాదు.  

బిందు స్థానమే సుధా సింధుః, కామకామేశ్వరుల నిలయం. శివ శక్తుల సమ్మేళన రూపం  బిందువు.       జీవ బ్రహ్మైశ్వరుల సమ్మైక్య రూపమే  బిందువు.   శ్రీచక్ర రాజ నిలయా శ్రీమత్త్రిపుర సుందరీ.  బిందువే త్రిపుర సుందరి, లలితాంబిక.

 మూడు కోణములు మూడు పురములు.  బ్రహ్మ, విష్ణు, రుద్రులే  త్రిపురములు.   త్రిపురాంతకుడు సదాశివుడు. అతని భార్య త్రిపుర సుందరి. అందుకే బిందువు క్రింద త్రికోణము గలదు.
మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడివున్నది.  శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరములోని షట్చక్రములకు శ్రీచక్రములోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబంధము వున్నది. శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. నవావరణ పూజ అని ఈ తొమ్మిది చక్రములకు చేసెదరు.

శ్రీచక్రము మూడు రకములుగా లోకములో పూజింప బడుచున్నది.  ౧. మేరు ప్రస్తారము, ౨. కైలాస ప్రస్తారము,  ౩. భూ ప్రస్తారము.  సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీ చక్రమును పూజించిన యెడల సర్వ శక్తులు, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని పెద్దలు, ఋషులు చెప్పి యున్నారు.
శ్రీ చక్రము యొక్క నాలుగు ద్వారములు నాలుగు వేదాలకు ప్రతీకలు.
సర్వ మంత్ర స్వరూపిణి, సర్వ యంత్ర స్వరూపిణి, సర్వ తంత్ర  స్వరూపిణి... శ్రీచక్రము.

గూడార్ధము:-
శరీరమే శ్రీచక్రము.  స్థూల, సూక్ష్మ, కారణ దేహములు శరీర త్రయములు రధ త్రయములు.  బిందువు బ్రహ్మ రంద్రము. చిత్కలా రూపమే ఆత్మ.  ఇంద్రియములు అశ్వములు. మనస్సు మంత్రిణీ దేవి, బుద్ధి వారాహి దేవి..
బిందువు లోని ఆ పర దేవతను మానసికముగా పూజించ వలయును అని గురు దేవుళ్ళు చెప్పు చున్నారు.

44 కోణములతో, 44 తత్వములతో శివ శక్త్యైక్య రూపమై శ్రీచక్రము ప్రకాశించు చున్నది.

మహా వైశాఖి అయిన ఈ వైశాఖ పున్నమి లో ఆ జగదంబను చూస్తూ, పూజిస్తూ, కొలుస్తూ, తలుస్తూ, ఆ తిరుమల కోనేటి రాయుడికి  సమర్పించు కొంటున్నా ఈనాటి భావార్ధములు.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/14-05-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/sribhaskaranandanatha/
http://vanadurga-mahavidya.blogspot.in/   






Monday, 12 May 2014

సౌందర్యలహరి- 10

సౌందర్యలహరి- 10

శ్లో|| సుధాధారాసారై శ్చరణ యుగళాంతర్విగళితైః
ప్రపఞ్చం సిఞ్చంతీ పునరపి రసామ్నాయ మహసః |
అవాప్య స్వాంభూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి ||

అమ్మా, భగవతీ! నీ పాదపద్మాల రెంటి మధ్యప్రదేశం నుంచి స్రవించే అమృత ధారలచేత  ప్రపంచాన్ని (డబ్భైరెండు వేల నాడులతో కూడుకున్న జీవుడి దేహాన్ని) తడుపుతూ, అమృతతుల్య కాంతిచే వెలుగొందే చంద్రుణ్ణి  వీడి స్వస్థానమైన మూలాధారచక్రన్ని మరల ప్రాపించి, సుషుమ్న చివరి భాగంలో స్వస్వరూపాన్ని గ్రహించి, సర్పం వలె చుట్టచుట్టుకుని కుండలినీ శక్తివై నిద్రిస్తావు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కరానందనాథ  భావము:-
ఆచార్యులు 9వ  శ్లోకము ద్వారా మనకు అమ్మ వారి యొక్క సూక్ష్మ ఆరాధన, కుండలిని సాధన ఆరోహణ క్రమమము,  కుండలిని సాధన ఎలా చేయాలిషట్చక్ర సాధన, నిరూపణ, నాద బిందు కళ తెలియజేసినారు.
ఇప్పుడు ఈ శ్లోకము ద్వారా కుండలిని సాధనలో అవరోహణ, ఎలా క్రిందకు దిగాలి ? ఎలా తిరిగి వెనక్కి స్వస్థానము చేరాలి  అనేది నేర్పుతున్నారు. ఈ శ్లోకంలో అమ్మను ఎలా చూడాలి? ఎలా దర్శించాలి అనేది కూడా నేర్పుతున్నారు.

సహస్రారమును మూలాధార చక్రమును కలుపబడేది సుషుమ్న నాడి. కుండలినీ శక్తి పాము నడక వలే, తోక మీద నిలబడిన పాము వలే పైకి జరజరా ఎగబ్రాకి షట్చక్రములను దాటి సహస్రారమును జేరును. ఈ సమయములో ఒక అనూహ్యమైన అనుభూతికి సాధకులు లోనగుదురు. వెన్నెముక మధ్యలో ఒక పాము ప్రాకినట్లుగా అంచెలంచలుగా పైకి ప్రాకును. ఇది స్పష్టముగా మనము గమనించ వచ్చును. కాని క్రిందకు దిగునప్పుడు ఒక్కసారిగా శక్తి మూలాధారమును చేరును. క్రిందకు పడేటప్పుడు మనకు తెలియదు. పాదరస గొట్టములో  (B.P. machine) లో పాదరసము ఎక్కినట్లుగా మనము కొంత భావన చేయవచ్చును. అంచెలంచలుగా పైకి ఎగ బ్రాకును. పైకి శరీరము మీద మనకు ఏమీ స్పర్శ తెలియదు.
స్థూల శరీరము నందు ఇడ, పింగళ, సుషుమ్న అను మూడు ప్రాధాన నాడులు గలవు. అందు మధ్యనున్న సుషుమ్న నాడి సహస్రారము నుండి మూలాధారము వరకు వ్యాపించి నీల మేఘముల మధ్యనున్న మెరుపుతీగ వలె ప్రకాశించు చుండును. ఇడ, పింగళ అనే జంట నాడులు సుషుమ్న నాడి చుట్టూ మెలిక వేసుకొని సర్పాకారములో జంట పాములు కలిసి ఉన్నట్టుగా సుషుమ్నను అల్లుకొని ఆజ్ఞా చక్రము లోని రుద్ర గ్రంధి నందు ఐక్యమగు చున్నవి.

సహస్ర కమలే శక్తిః శివేన సహా మోదతేసా చావస్థా పరా జ్ఞేయా సైవ నిర్వృతి కారణమ్.||
కుండలినీ శక్తి ఆధార చక్రమున సర్పాకారమును ధరించి, తోకను నోటితో కరచి పట్టుకొని బ్రహ్మ రంద్రము వరకు వ్యాపించి ఉండును. సాధకుడు కుంభక ప్రాణాయామ తత్పరుడై స్వాధిష్టాన చక్రమున యందు అగ్నిని ప్రజ్వలింపజేయగా కుండలినీ శక్తి నిద్ర లేచి  ఊర్ధ్వముఖముగా పయనించి, అంతర్లీనంగా తామర తూడు లాంటి  సుషుమ్న నాడి మార్గమున గ్రంధి త్రయమును దాటి సహస్ర దళ పద్మమును జేరి, సహస్రార కమల కర్ణిక యందలి చంద్ర మండలమును భేదించి, ఆ తల్లి పాద పద్మముల మధ్య నుంచి స్రవిస్తున్న సుధా ధారలలో తడిసి అమృతత్త్వమును  పొంది  కామేశ్వరునిలో ఐక్యం చెంది, ఆనందమును పొందుచున్నది.  శక్తి శివునితో జేరు అవస్థయే పరావస్థ. ఆమెయే పరాశక్తి, ఆమెయే నిత్య సుఖమునకు హేతువగుచున్నది.

సుధాధారాసారై శ్చరణ యుగళాంతర్విగళితైః -
అర్ధనారీశ్వర స్వరూపమైన కామ కామేశ్వరీ పాద ద్వయములు అవి. చరణ యుగళము.
ఒకటి అ కారము (శివుడు), మరొకటి హ కారము (శక్తి). శ్రీదేవి యొక్క పాద యుగళము నందు దక్షిణ పాదము ప్రకాశాంశము, శుక్ల చరణము. వామ పాదము విమర్శాంశము రక్త చరణము.
ఒకటి వాక్కు, మరొకటి అర్ధము. అచ్చుల హల్లుల సంయోగమే వాఙ్మయము.
ఒకటి అమ్మ పాదము శోణము ఎరుపు రంగుతో ప్రకాశించు చున్నది. మరొకటి అయ్య పాదము శుక్లము తెల్లగా కనిపించు చున్నది.  ఈ రెంటి సామరస్యమే జగన్నిర్మాణమునకు హేతువు అగుచున్నది. జగత్తుకు తల్లి తండ్రి యైన ఆ శివ పార్వతుల పాదములే ఆ రెండు పాదములు.
కాదు అవి మహా పాదుకలు, దక్షిణామూర్తి పాదములు.  అజ్ఞానపు చీకట్లను పారద్రోలే గురు పాదుకలు అవి.
శ్రీచక్రార్చనలో శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అని శ్రీవిద్యోపాసకులు,  పాదుకాంత పూర్ణ దీక్షాపరులు సహస్రారము లోని ఆ శక్తి పాదములకు, గురు పాదములకు పూజ తర్పణ గావించెదరు.  చరణ యుగళాం అంటే గురు దేవుళ్ళు అయిన శ్రీ దక్షిణామూర్తి పాదములు అవి. జ్ఞాన, మోక్షము లను ప్రసాదించే ముక్తి నొసగే పాదములు అవి. శక్తి యుక్త శివమూర్తికి పరా పాదుకాఅని నామము కూడా కలదు.
   
స్వప్రకాశ శివ మూర్తిరేకికా తద్విమర్శతను రేకితా తయోః|
సామరస్య వ పురిష్యతే పరా పాదుకా వర శివాత్మనో గురుః ||

వందే గురు పద ద్వంద్వ మవాఙ్మానస గోచరమ్, రక్త శుక్ల ప్రభా మిశ్ర మతర్క్యం త్రైపురం మహః ||
గురు పాదోదకం పానం గురోరుచ్చిష్ట భోజనమ్ | గురుమూర్తేస్సదా ధ్యానం గురోర్నామ సదా జపః ||
అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ |
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం గురోః పాదోదకం పిబేత్ || ........... శ్రీ గురు గీత.

భగవత్పాదులు ఇక్కడ  వాఙ్మనసములకు అగోచరమైన,  జగత్తుకు కారణభూతమైన,  ఆ తల్లి దండ్రుల పాదములను పట్టుకోవడానికి చూపిస్తున్నారు, కాదు మనకు నేర్పిస్తున్నారు. బ్రహ్మ రంద్రము వద్ద వుండే గురు పాదుకలను మనకు చూపించు చున్నారు. అవి బ్రహ్మ కడిగిన పాదములు, కామ కామేశ్వరుని పాదములు. అర్ధ నారీశ్వరుని పాదములు. నిర్గుణ పర బ్రహ్మము యొక్క పాదములు. కామాక్షి యొక్క పాదములు. గురు మండల స్వరూపిణి పాదములు. శ్రీ దక్షిణామూర్తి పాదములు. జన్మ సాఫల్య పాదములు.
తరింపజేసే భవానీ పాదములు అవి. జ్ఞాన సుధలు ఆ సుధా ధారలు.

ఆ తల్లి చంద్ర మండల మధ్యస్థా.... ఆ చల్లని కిరణములు సుధా ధారలు.   సహస్రార కమల కర్ణిక యందలి చంద్ర మండలమున ఆ తల్లిని ధ్యానించ వలెను.  ఆ దేవి కళాస్వరూపిని చంద్రమండల రూపిణి, జ్ఞాన స్వరూపిణి. ఆమె కళావతి.
సహస్రారమున చంద్ర మండలము వున్నదని, ఈ చంద్రమండలము షోడశ కలాత్మకమగుట ఆ భావనకు హేతువు అని పెద్దలు అందురు. శ్రీవిద్యా సంప్రదాయమున ప్రతిపత్తు మొదలు పదునైదు దినముల తిధుల యందు కళల వృద్ధి క్షయములు చెప్పబడెను. మనకు కనిపించు చున్న చంద్రమండలము కూడా శ్రీ చక్రమే నని గౌడపాదాచార్య విరచిత సుభగోదయము నందు ఆచార్యుల వారు చెప్పియున్నారు.

కావున ఈ కుండలినీ సాధన చంద్ర కళలు లాంటిది. పాడ్యమి నుంచి వృద్ది పొంది పున్నమి నాటికీ సహస్రారము  చేరి మరలా తిరిగి స్వస్థానమునకు పాడ్యమి (ప్రతిపత్తి) కి చేరి నట్లుగా, యోగ సాధనతో మూలాధారము నుంచి బయలు దేరి షట్చక్రములు దాటి సహస్రారము జేరినట్లితే పున్నమి నాటి చంద్రుని లాగ ఆ తల్లి సాక్షాత్కారము మనకు లభిస్తుంది. పున్నమి చంద్రుని దర్శనం కలగడం అంటే అమ్మను చూడటమే.    అమ్మ దర్శనం అయ్యినట్లే.    శ్రీ కామాక్షి యొక్క దివ్య మంగళ స్వరూపమును సాధకుడు చూడ వచ్చును. అమృత ధారలు వర్షించడం అంటే ఆ తల్లి యొక్క  కరుణా రసం లభించినట్లే.   అదే ఈ కుండలిని సాధనకు మూలము. అమ్మను చూడటమే. అమ్మ దర్శనమే తరువాయి ఆమె కరుణా పూరిత రసామృత బిందువులలో తడవడమే సుధా బిందువులలో తడవడం. 

కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః |  
అవలోకయ మా మకించనానాం ప్రథమం పాత్ర మ కృత్రిమం దయాయాః   
భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితా | శక్తిః కుండలినీ నామ బిసతంతు నిభాzశుభా ||

అమ్మ దర్శనాంతరం కుండలినీ శక్తి తిరిగి తన స్వస్థానం జేరి సర్పాకారములో చుట్టాలు చుట్టుకొని నిద్రిస్తుంది.
  
గూడార్ధం:-
కుండలినీ సాధనతో సహస్రారం చేరి చంద్రమండల గత యైన పున్నమి నాటి చంద్రున్ని చూడటమే దేవి దర్శనం. అలా చూచి అమ్మను ధ్యానించ వలెను అని శంకర భగవత్పాదులు మనకు చెబుతున్నారు. చంద్ర దర్శనమే అమ్మ దర్శనం.  సాధకుడు జీవన్ముక్తుడు అవడానికి చేసే యోగ ప్రక్రియే ఈ కుండలినీ సాధన.
అటువంటి చంద్రమండల మధ్యస్థ కు నమస్కరిస్తూ,  

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.

భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/12-05-2014 @ శ్రీకాళహస్తి