సౌందర్యలహరి- 12
శ్లో|| త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరిఞ్చి ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యా దమర లలనాయాంతి మనసా
తపోభి ర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్ || 12
ఓ హిమగిరి తనయా! నీ నెమ్మేని లావణ్యాన్ని, అవయవాల సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన కవివరేణ్యులు వేరొక వస్తువు కానక మిన్నకున్నారు. నిన్ను తెలుసు కోలేకుండావున్నారు. అలాంటి నీ లోకోత్తర సౌందర్యాన్ని తిలకించడానికి కుతూహలం గలవారై, అప్సరసలు నీ అందంతో తాము కించిత్తూ సరిరాకపోయిన వారై, తపస్సులచేత కూడ పొందరానిదైన పరమశివుడితోడి సాయుజ్యస్థానాన్ని మనస్సుచేత పొంద ఇచ్చగిస్తున్నారు. (ఒక్క పరమశివుడు మాత్రం నీలో సాయుజ్యమొందగలడు కావున వారు ముందు శివసాయుజ్యమొంది నిన్ను చేరుకో ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనూ వారు సఫలీకృతులు కాక ఒక మానసికమైన అనుభూతితో సంతృప్తి చెందుతున్నారని భావము).
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
భాస్కరానందనాథ భావము:-
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం…… ఓ హిమ గిరి తనయా, హైమవతీ, తల్లీ నీ సౌందర్యాన్ని వర్ణించడానికి గాని, పోల్చడానికి గానికి బ్రహ్మాది దేవతలకు వీలుకాదు. అసలు సరి పోల్చడానికి మరొక వస్తువు, మరొక దేవత, మనిషి లేక ఆశక్తులై వున్నారు. అప్సరలతో పోల్చుదామా అంటే వారే నీ సౌందర్యాన్ని చూడడానికి నీ చెంతకు వచ్చి నీ అందాన్ని పరికించడానికి ఆశక్తులై శివున్ని ధ్యానించి శివ సాయుజ్యాన్ని పొంది నీ కడకు వచ్చినారు. ఎందుకంటే అమ్మ సౌందర్యం అయ్యకు మాత్రమే తెలుసు. మరెవ్వరికీ తెలియదు గనుక. అమ్మ సౌందర్యాన్ని స్పృశించడానికి, చేరువవ్వడానికి ఆ పరమ శివునికి ఒక్కడికే సాధ్యం. మరొకరు సాహసించ లేరు, వీలు పడదు. అందువలన అప్సరసలు, బ్రహ్మాది దేవతలు మానసికంగా శివున్ని పూజించి, అర్చించి శివ రూపం, శివ సాయుజ్యం పొంది నిన్ను నీ అందం చూడడానికి సాహసిస్తున్నారు తల్లీ.
న రుద్రో మర్చయేత్... రుద్రుడు కానిదే రుద్రున్ని అర్చించలేరు, కాబట్టి మొదట వాళ్ళు శివుణ్ణి ఆరాధించి, మానసికంగా శివ సాయుజ్యాన్ని పొంది, శివునిలో ఐక్యం పొంది, తర్వాత నీ దగ్గరకు వస్తున్నారు నీ సౌందర్యాన్ని చూడడానికి. అంటే నీ సౌందర్యాన్ని చూచిన వాళ్లకు అ ప్రయత్నంగా శివ సాయుజ్యం సిద్దిస్తున్నది అని అర్ధము. నీకు చేరువైన వాళ్లకు నీ దర్శనంతో బాటు అయ్య దర్శనం కూడా లభిస్తుంది తల్లి. ఇది మహా పతివ్రతా లక్షణం. ఆమె సదాశివ పతివ్రత కదా! ప్రతి జన్మ యందు, ప్రతి యుగము నందు, ప్రతి కల్పము నందు శివుడే భర్తగా నియమము గలది ఆమె అందుకని సదాశివ పతివ్రత అయినది. తన భర్తతో సమాన ధర్మములు గలది. ఆ తల్లి తన భక్తులకు పరమ శివుని సాయుజ్యము, మోక్షము కలుగజేయునది గాన శివంకరి అయినది.
ఆమె శివ మూర్తి, శివుడే స్వరూపముగా గలది. భక్తులకు శివ స్వరూపమును తెలుపునది, శివ జ్ఞానము ఇచ్చునది గాన శివ పరా, శివ దూతి, శివ జ్ఞాన ప్రదాయిని అని లలితా సహస్రనామం లో తెల్పినారు.
ఆ తల్లి మహా సాధ్వి. “సతీ సాధ్వీ పతివ్రతా”.....అని అమరకోశము నందు గలదు. భూత, భవిష్యద్వర్తమాన కాలము లందు వేరొక భర్త సంబంధము లేక పోవుటచే అనితరసాధ్యమైన పాతివ్రత్యము చే మహా పతివ్రత అగుచున్నది.
“అనన్య సామాన్య మైన పాతివ్రత్యము చే ఓ ... దేవి నీవు సతి అని చెప్పబడుచున్నావు”... అని దేవీ భాగవతములో చెప్ప బడినది. కవులందరూ సరస్వతీ పతులే, కాస్త ధనము గల వారందరూ లక్ష్మీ పతులే, కానీ నీ విషయము అలా కాదు తల్లీ, ఒక్క మహా దేవునికి తప్ప మరెవ్వరికీ సాధ్యము కాదు తల్లీ నీ దరి చేరడానికి. నీ సౌందర్యము చూడ డానికి.
గూడార్ధము:-
ఆ తల్లి మహా లావణ్య శేవధి, మహా త్రిపుర సుందరి, ఆమెను చూడాలంటే ఆజ్ఞా చక్రము దాటి, రుద్ర గ్రంధిని దాటి సహస్రార కమలములో ఆ తల్లిని దర్శించ వలెను. అచ్చటకు వెళ్ళేటప్పటికి మనస్సు యొక్క చేష్టలుడిగి పోతాయి. ఇక మనస్సు పట్టుకోలేదు. కావున ఆమె సౌందర్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. పోల్చడానికి, ఊహించ డానికి అలవి కాదు అని.
ఈ శ్లోకములో రహస్య మంత్రార్ధము గలదు.
13 వ శ్లోకము నుంచి 21 వ శ్లోకము వరకు అత్యంత గోప్యమైన మంత్రార్ధములతో కూడిన ప్రయోగ శ్లోకములు.
మంత్ర శాస్త్రము తో కూడుకొన్నవి. అంతరార్ధము వివరించాలంటే మంత్ర శాస్త్రమును తెలుప వలెను. ఇది శ్రీవిద్యోపాసకులకు తప్పించి అన్యులకు తెలుపరాదు. బహిరంగముగా చర్చించరాదు. గురు ముఖః త తెలుసుకోవలెను. కావున పెద్దలు నిర్ణయించిన మర్యాదను పాటిస్తూ వీటి వివరణను నేను పొందు పరచడం లేదు. తిరిగి 22 వ శ్లోకముతో ఆ తల్లి ఇచ్చిన పరి జ్ఞానము మేరకు వివరించడానికి ప్రయత్నము చేస్తాను.
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/22-05-2014 @ శ్రీకాళహస్తి
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.