సౌందర్యలహరి- 10
శ్లో|| సుధాధారాసారై
శ్చరణ యుగళాంతర్విగళితైః
ప్రపఞ్చం
సిఞ్చంతీ పునరపి రసామ్నాయ మహసః |
అవాప్య
స్వాంభూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం
కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి ||
అమ్మా, భగవతీ! నీ
పాదపద్మాల రెంటి మధ్యప్రదేశం నుంచి స్రవించే అమృత ధారలచేత ప్రపంచాన్ని (డబ్భైరెండు వేల నాడులతో కూడుకున్న
జీవుడి దేహాన్ని) తడుపుతూ, అమృతతుల్య కాంతిచే వెలుగొందే చంద్రుణ్ణి వీడి స్వస్థానమైన మూలాధారచక్రన్ని మరల ప్రాపించి, సుషుమ్న
చివరి భాగంలో స్వస్వరూపాన్ని గ్రహించి, సర్పం వలె
చుట్టచుట్టుకుని కుండలినీ శక్తివై నిద్రిస్తావు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
భాస్కరానందనాథ
భావము:-
ఆచార్యులు
9వ శ్లోకము ద్వారా మనకు అమ్మ వారి యొక్క సూక్ష్మ
ఆరాధన, కుండలిని
సాధన ఆరోహణ క్రమమము, కుండలిని సాధన ఎలా చేయాలి, షట్చక్ర సాధన, నిరూపణ, నాద బిందు
కళ తెలియజేసినారు.
ఇప్పుడు
ఈ శ్లోకము ద్వారా కుండలిని సాధనలో అవరోహణ, ఎలా
క్రిందకు దిగాలి ? ఎలా
తిరిగి వెనక్కి స్వస్థానము చేరాలి అనేది
నేర్పుతున్నారు. ఈ శ్లోకంలో అమ్మను ఎలా చూడాలి? ఎలా దర్శించాలి అనేది కూడా నేర్పుతున్నారు.
సహస్రారమును
మూలాధార చక్రమును కలుపబడేది సుషుమ్న నాడి. కుండలినీ శక్తి పాము నడక వలే, తోక మీద
నిలబడిన పాము వలే పైకి జరజరా ఎగబ్రాకి షట్చక్రములను దాటి సహస్రారమును జేరును. ఈ
సమయములో ఒక అనూహ్యమైన అనుభూతికి సాధకులు లోనగుదురు. వెన్నెముక మధ్యలో ఒక పాము
ప్రాకినట్లుగా అంచెలంచలుగా పైకి ప్రాకును. ఇది స్పష్టముగా మనము గమనించ వచ్చును.
కాని క్రిందకు దిగునప్పుడు ఒక్కసారిగా శక్తి మూలాధారమును చేరును. క్రిందకు
పడేటప్పుడు మనకు తెలియదు. పాదరస గొట్టములో
(B.P. machine) లో పాదరసము ఎక్కినట్లుగా మనము కొంత భావన
చేయవచ్చును. అంచెలంచలుగా పైకి ఎగ బ్రాకును. పైకి శరీరము మీద మనకు ఏమీ స్పర్శ
తెలియదు.
స్థూల
శరీరము నందు ఇడ, పింగళ, సుషుమ్న అను మూడు ప్రాధాన నాడులు గలవు. అందు మధ్యనున్న
సుషుమ్న నాడి సహస్రారము నుండి మూలాధారము వరకు వ్యాపించి నీల మేఘముల మధ్యనున్న మెరుపుతీగ
వలె ప్రకాశించు చుండును. ఇడ, పింగళ అనే జంట నాడులు సుషుమ్న నాడి చుట్టూ మెలిక
వేసుకొని సర్పాకారములో జంట పాములు కలిసి ఉన్నట్టుగా సుషుమ్నను అల్లుకొని ఆజ్ఞా
చక్రము లోని రుద్ర గ్రంధి నందు ఐక్యమగు చున్నవి.
సహస్ర
కమలే శక్తిః శివేన సహా మోదతే, సా చావస్థా పరా
జ్ఞేయా సైవ నిర్వృతి కారణమ్.||
కుండలినీ
శక్తి ఆధార చక్రమున సర్పాకారమును ధరించి, తోకను నోటితో కరచి పట్టుకొని బ్రహ్మ
రంద్రము వరకు వ్యాపించి ఉండును. సాధకుడు కుంభక ప్రాణాయామ తత్పరుడై స్వాధిష్టాన
చక్రమున యందు అగ్నిని ప్రజ్వలింపజేయగా కుండలినీ శక్తి నిద్ర లేచి ఊర్ధ్వముఖముగా పయనించి, అంతర్లీనంగా తామర తూడు
లాంటి సుషుమ్న నాడి మార్గమున గ్రంధి
త్రయమును దాటి సహస్ర దళ పద్మమును జేరి, సహస్రార కమల కర్ణిక యందలి చంద్ర మండలమును భేదించి,
ఆ తల్లి పాద పద్మముల మధ్య నుంచి స్రవిస్తున్న సుధా ధారలలో తడిసి
అమృతత్త్వమును పొంది కామేశ్వరునిలో ఐక్యం చెంది, ఆనందమును
పొందుచున్నది. శక్తి శివునితో జేరు
అవస్థయే పరావస్థ. ఆమెయే పరాశక్తి, ఆమెయే నిత్య సుఖమునకు హేతువగుచున్నది.
సుధాధారాసారై
శ్చరణ యుగళాంతర్విగళితైః -
అర్ధనారీశ్వర
స్వరూపమైన కామ కామేశ్వరీ పాద ద్వయములు అవి. చరణ యుగళము.
ఒకటి
అ కారము (శివుడు), మరొకటి హ కారము (శక్తి). శ్రీదేవి యొక్క పాద యుగళము నందు దక్షిణ
పాదము ప్రకాశాంశము, శుక్ల చరణము. వామ పాదము విమర్శాంశము రక్త చరణము.
ఒకటి
వాక్కు, మరొకటి అర్ధము. అచ్చుల హల్లుల సంయోగమే వాఙ్మయము.
ఒకటి
అమ్మ పాదము శోణము ఎరుపు రంగుతో ప్రకాశించు చున్నది. మరొకటి అయ్య పాదము శుక్లము
తెల్లగా కనిపించు చున్నది. ఈ రెంటి
సామరస్యమే జగన్నిర్మాణమునకు హేతువు అగుచున్నది. జగత్తుకు తల్లి తండ్రి యైన ఆ శివ
పార్వతుల పాదములే ఆ రెండు పాదములు.
కాదు
అవి మహా పాదుకలు, దక్షిణామూర్తి పాదములు. అజ్ఞానపు
చీకట్లను పారద్రోలే గురు పాదుకలు అవి.
శ్రీచక్రార్చనలో
శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అని శ్రీవిద్యోపాసకులు, పాదుకాంత పూర్ణ దీక్షాపరులు సహస్రారము లోని ఆ
శక్తి పాదములకు, గురు పాదములకు పూజ తర్పణ గావించెదరు. చరణ యుగళాం అంటే గురు దేవుళ్ళు అయిన శ్రీ
దక్షిణామూర్తి పాదములు అవి. జ్ఞాన, మోక్షము
లను ప్రసాదించే ముక్తి నొసగే పాదములు అవి. శక్తి యుక్త శివమూర్తికి “పరా పాదుకా” అని నామము
కూడా కలదు.
స్వప్రకాశ
శివ మూర్తిరేకికా తద్విమర్శతను రేకితా తయోః|
సామరస్య
వ పురిష్యతే పరా పాదుకా వర శివాత్మనో గురుః ||
వందే
గురు పద ద్వంద్వ మవాఙ్మానస గోచరమ్, రక్త శుక్ల ప్రభా మిశ్ర మతర్క్యం త్రైపురం మహః ||
గురు
పాదోదకం పానం గురోరుచ్చిష్ట భోజనమ్ | గురుమూర్తేస్సదా ధ్యానం గురోర్నామ సదా జపః ||
అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ |
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం గురోః పాదోదకం పిబేత్ ||
........... శ్రీ గురు గీత.
భగవత్పాదులు
ఇక్కడ వాఙ్మనసములకు అగోచరమైన, జగత్తుకు కారణభూతమైన, ఆ తల్లి దండ్రుల పాదములను పట్టుకోవడానికి
చూపిస్తున్నారు, కాదు మనకు నేర్పిస్తున్నారు. బ్రహ్మ రంద్రము వద్ద వుండే గురు
పాదుకలను మనకు చూపించు చున్నారు. అవి బ్రహ్మ కడిగిన పాదములు, కామ కామేశ్వరుని
పాదములు. అర్ధ నారీశ్వరుని పాదములు. నిర్గుణ పర బ్రహ్మము యొక్క పాదములు. కామాక్షి
యొక్క పాదములు. గురు మండల స్వరూపిణి పాదములు. శ్రీ దక్షిణామూర్తి పాదములు. జన్మ
సాఫల్య పాదములు.
తరింపజేసే
భవానీ పాదములు అవి. జ్ఞాన సుధలు ఆ సుధా ధారలు.
ఆ
తల్లి చంద్ర మండల మధ్యస్థా.... ఆ చల్లని కిరణములు సుధా ధారలు. సహస్రార కమల కర్ణిక యందలి చంద్ర మండలమున ఆ
తల్లిని ధ్యానించ వలెను. ఆ దేవి
కళాస్వరూపిని చంద్రమండల రూపిణి, జ్ఞాన స్వరూపిణి. ఆమె కళావతి.
సహస్రారమున
చంద్ర మండలము వున్నదని, ఈ చంద్రమండలము షోడశ కలాత్మకమగుట ఆ భావనకు హేతువు అని
పెద్దలు అందురు. శ్రీవిద్యా సంప్రదాయమున ప్రతిపత్తు మొదలు పదునైదు దినముల తిధుల
యందు కళల వృద్ధి క్షయములు చెప్పబడెను. మనకు కనిపించు చున్న చంద్రమండలము కూడా శ్రీ
చక్రమే నని గౌడపాదాచార్య విరచిత సుభగోదయము నందు ఆచార్యుల వారు చెప్పియున్నారు.
కావున
ఈ కుండలినీ సాధన చంద్ర కళలు లాంటిది. పాడ్యమి నుంచి వృద్ది పొంది పున్నమి నాటికీ
సహస్రారము చేరి మరలా తిరిగి స్వస్థానమునకు
పాడ్యమి (ప్రతిపత్తి) కి చేరి నట్లుగా, యోగ సాధనతో మూలాధారము నుంచి బయలు దేరి
షట్చక్రములు దాటి సహస్రారము జేరినట్లితే పున్నమి నాటి చంద్రుని లాగ ఆ తల్లి సాక్షాత్కారము
మనకు లభిస్తుంది. పున్నమి చంద్రుని దర్శనం కలగడం అంటే అమ్మను చూడటమే. అమ్మ దర్శనం అయ్యినట్లే. శ్రీ కామాక్షి యొక్క దివ్య మంగళ స్వరూపమును
సాధకుడు చూడ వచ్చును. అమృత ధారలు వర్షించడం అంటే ఆ తల్లి యొక్క కరుణా రసం లభించినట్లే. అదే ఈ కుండలిని సాధనకు మూలము. అమ్మను చూడటమే.
అమ్మ దర్శనమే తరువాయి ఆమె కరుణా పూరిత రసామృత బిందువులలో తడవడమే సుధా బిందువులలో
తడవడం.
కమలే కమలాక్ష
వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మా
మకించనానాం ప్రథమం పాత్ర మ కృత్రిమం దయాయాః
భుజంగాకార
రూపేణ మూలాధారం సమాశ్రితా | శక్తిః
కుండలినీ నామ బిసతంతు నిభాzశుభా ||
అమ్మ
దర్శనాంతరం కుండలినీ శక్తి తిరిగి తన స్వస్థానం జేరి సర్పాకారములో చుట్టాలు చుట్టుకొని
నిద్రిస్తుంది.
గూడార్ధం:-
కుండలినీ
సాధనతో సహస్రారం చేరి చంద్రమండల గత యైన పున్నమి నాటి చంద్రున్ని చూడటమే దేవి
దర్శనం. అలా చూచి అమ్మను ధ్యానించ వలెను అని శంకర భగవత్పాదులు మనకు చెబుతున్నారు.
చంద్ర దర్శనమే అమ్మ దర్శనం. సాధకుడు
జీవన్ముక్తుడు అవడానికి చేసే యోగ ప్రక్రియే ఈ కుండలినీ సాధన.
అటువంటి
చంద్రమండల మధ్యస్థ కు నమస్కరిస్తూ,
నారాయణ
సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య
పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం
శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా
సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ
రామచంద్ర రావు)/12-05-2014 @ శ్రీకాళహస్తి
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.