Sunday, 3 March 2013

సాధన – తపస్సు


సాధన – తపస్సు

కర్మ రెండు విధములు. ఒకటి పాప కర్మ, రెండు పుణ్య కర్మ. పాపపు పనులు చేస్తే దానిని పాపపు కర్మ అని, పుణ్య మైన పనులు చేస్తే దానిని పుణ్య కర్మ అని అంటారు అని మన అందరికీ తెలుసు.

ఒకరికి ద్రోహం చేసినాము, ఒకరిని అనవసరముగా కొట్టినాము, తిట్టినాము, భాధ కలిగించినాము, ఏడిపించినాము, చంపినాము  అధర్మముగా నడుచు కొన్నాము, చేయ కూడని పనులు చేసినాము, అసత్యము చెప్పినాము,  అన్యాయము చేసినాము, వేద విరుద్ద పనులు చేసినాము, పెద్దలను, గురువులను అవమాన పరిచినాము, భాగవతోత్తములకు, సిద్ధ పురుషులకు ఇబ్బంది కలిగించినాము ...ఇలా   ... ఇవన్నీ పాపపు కర్మలు.

తీర్ధ యాత్రలు చేసినాము, దాన, ధర్మములు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, త్యాగాలు, చేసినాము. వేద, ఇతిహాస, పురాణాదులు, శ్రవణం, మననం చేసినాము, భజనలు చేసినాము. ధర్మ బద్దముగా, సత్యము చెబుతూ పరోపకార బుద్దితో, త్యాగ బుద్దితో నడుచుకోన్నాము ఇవన్నీ పుణ్య కర్మలు.

పాపం, పుణ్యం అనుభవిస్తే క్షయం అవుతుంది, తరిగి పోతుంది. రెంటినీ అనుభవించడానికి మరలా జన్మ ఎత్తాలి. ఇలా సాగిన తరువాత చివరకి మిగిలిన ఖర్మ అనుభవించ డానికి యమలోకం, స్వర్గ లోకం రెండూ వున్నాయి. జీవి అక్కడ తన ఖాతా పూర్తి చేసుకొంటాడు. ఎక్కడైనా జీవి తన ఖర్మను తానే ఎప్పటికైనా అనుభవించక తప్పదు. తన ఖర్మ తాను అనుభవించడానికే జన్మలు తీసుకొంటాడు. తను చేసిన పాప, పుణ్య ఖర్మలు జ్యోతిష చక్రములో గ్రహాల రూపములో నీ కుండలిని తయారు అవుతుంది. నీ జాతక చక్రం తయారు అవుతుంది. ఆ జాతక కుండలిని ప్రకారము జీవుడు మరలా జన్మిస్తాడు. నీవు చేసుకొన్న ఖర్మే నీ జాతక చక్ర రూపములో వస్తుంది. నిన్ను బాధిస్తుంది, సుఖ పెడుతుంది, యోగ మిస్తుంది, దుర్యోగ మిస్తుంది. భార్యా బిడ్డలను ఇస్తుంది, డబ్బును ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, దుఖాన్ని ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, అవమానము ఇస్తుంది. అంతా నీ జాతక చక్ర ప్రభావమే, అంతా నీవు చేసుకొన్న ఖర్మ ప్రభావమే. నీవు చేసుకొన్న కర్మ ప్రభావమే గ్రహాలు ఎదుటి వ్యక్తుల ద్వారా వచ్చి నీకు కష్టాన్ని, సుఖాన్ని ఇస్తూ వుంటారు గోచార రీత్యా. ఇది నీ ప్రారబ్ద ఖర్మ, ఇది నీ సంచిత ఖర్మ. అనుభవించక తప్పదు.

ఇది నేను చేసుకొన్న ఖర్మే అని ప్రతి ఒక్కడూ ఒప్పుకోక తప్పదు. ఒక్కోరికి ఒక్కోసారి ఈ ఖర్మను అనుభవించక తప్పదు గ్రహ గతులు మారినప్పుడు. ఎవరు చేసుకొన్న ఖర్మ వాడు అనుభవించ కుండా తప్పదు ఎవరికైనా.

అయితే ఇక్కడే మనము ఆలోచించ వలసినది ఒకటి వున్నది. మరి దీనికి విముక్తి లేదా? ఎప్పుడో ఏదో పాపం ఏదో జన్మలో చేసినాను. తెలియక చేసినానో, తెలిసి చేసినానో అది కూడా తెలియదు. ఇప్పుడు ఈ జన్మలో నాకు సంతానము లేదు, ఇక నా బ్రతుకు ఇంతేనా అని కొందఱు ప్రశ్నిస్తూ వుంటారు. ఈ జన్మలో పెళ్లి లేదు, ఈ జన్మలో లక్ష్మీ కటాక్షము లేదు, ఉన్నతి లేదు,  సద్గతి లేదు, ఇంతేనా నా బ్రతుకు, నాకు మోక్షము లేదా? దారి లేదా ? అని...

వున్నది. సద్గతి వున్నది. నీ పాప ఖర్మను తొలగించుకోడానికి ఉపాయము వున్నది. నీ జన్మ జన్మల పాప ఖర్మను ప్రక్షాళన చేసుకోవడానికి దారి వున్నది. అది మూడు రకములు.

౧. నీ పాప ఖర్మను ఎవరన్నా తీసుకొని వారు అనుభవిస్తే అది పోతుంది.

౨. నీ పాప ఖర్మను నీవే పూర్తిగా అనుభవిస్తే అది పోతుంది.

౩. సాధన చేత, తపస్సు చేత, జ్ఞానము చేత  నీ పాప ఖర్మ అగ్నిలో కాలి బూడిద అవుతుంది.

మొదటి రెండు మనము చేయలేము కాబట్టి, అది మన వలన కాదు కాబట్టి మూడవది చేస్తాము.

మనం సృష్టిని గమనిస్తే, ఏ పనీ ఏకాగ్రత లేకుండా సఫలము కాలేదు. ఈ నామ రూపాత్మక సృష్టికి మూల కారణమైన పర బ్రహ్మము కూడా సృష్టి అనేది తన కంటే భిన్నముగా చేయటానికి పూనుకోన్నప్పుడు, ఆ బ్రహ్మ పదార్ధము కూడా సాధన చేసిన పిమ్మటనే క్రియాశీలత వచ్చినది. సృష్టి ఆవిర్భవించినది.

సో కామయత బహుస్యాం ప్రజాయే యేతి,     
సా తపస్తత్వా   ఇమామ్  లోకాం అసృజత్,  
 స ఈక్షాం  చకార,                                                                                                                                                                                                                                                  
ధాతా యధాపూర్వమకల్పయత్.

అన్న నాలుగు వేద వాక్యముల ప్రకారము  బ్రహ్మ పదార్ధము తనని తాను ద్వైతముగా భావించుకొని, బ్రహ్మము ఒకటి, బ్రహ్మము యొక్క శక్తి పేర అదే మహా మాయ (ఆది శక్తి, మూల ప్రకృతి) గా రెండుగా తాను భావన చేసిన కారణము చేత సృష్టి చేయాలి అనే కోర్కె అతనిలో కలిగినది.
కలిగినంత మాత్రం చేత మహాత్కార్యములు మాటలతో ముడి పడవు. దాని వెనుక ఎంతో కృషి వుండాలి. అదే సాధన, తపస్సు.

"సాతపః తప్త్వా"....ఆ బ్రహ్మ ఎంతో తపస్సు చేసి, ఇమాం లోకాం అసృజత్.... ఈ లోకాలన్నీ సృష్టించ గలిగినాడు. తరువాత సాఫల్యముతో  స ఈక్షాం చకార,    తన్ను తాను చూచుకొని, తాను ఒక్కడినే ఉన్నానుకొని,   తాను శక్తిమంతుడని,   తాను ఒక్కడే ఎందుకు ఉండవలెను, తన లాంటి జీవులను కొన్నింటిని పుట్టిస్తే బాగుండునని అనుకొన్నాడు. అనుకోని   థాతా యధాపూర్వమకల్పయత్. .. అనుకున్నంత మాత్రాన సాధన పూర్తి కాలేదు. మళ్ళీ తపస్సు చేసి, పూర్వ మన్వంతరముల యందు ఏ రీతిగా తాను బ్రహ్మమయి, సృష్టిని చేసుకోన్నాడో ఆ రీతిన మరలా తిరిగి ఈ సృష్టిని కల్పించినాడు అని ఈ వేద వాక్యము యొక్క తాత్పర్యము.      

సృష్టికి మూల కారణమైన బ్రహ్మయే మహత్కార్య సాధనకు అంత సాధన చేయవలసి వస్తే ఇక సామాన్య మానవులం, మనం లౌకిక కార్యమునకు గానీ, అలౌకిక కార్యమునకు గానీ లేక మన పాప ఖర్మ తొలిగించుకోవడానికి గానీ ఎంత కృషి అవసరము ఎంత సాధన అవసరము, ఎంత తపస్సు అవసరమో ఒక్క సారి ఆలోచించండి.

ఆ కృషి కోన సాగించ వలెనంటే, ఆ కార్యము నందు, సంకల్పము నందు  భక్తీ, శ్రద్ధ రెండూ వుండవలె. ఆ పని తప్ప మరొకటి మన మనస్సుకు గోచరించకుండా అందే మనస్సు లగ్నము అయి ఉండవలెను. ఆ రీతిగా వుంటే తప్ప, సాధన చేస్తే తప్ప అది తపస్సుగా మారదు. తపస్సు అయితే తప్ప మన కర్మలు నశించవు.

మనస్సు లగ్నముతో చేసే ఏ పుణ్య కార్యమైనా అది తపస్సుగా మారును. తపస్సు నుండి అగ్ని జనించును, ఆ అగ్ని యందు నీ పాప ఖర్మలు అన్నీ నశించును. తదేకముగా ఒక పాట వినుట, ఒక ప్రవచనం వినుట, ఒక పురాణం చదువుట, ఒక దృశ్య కావ్యము చూచుట, ఒక మంత్రోపాసన చేయుట,  ఒక మంచి మాట చెప్పుట, ఒకే దాని మీద దృష్టి నిల్పి ధ్యానము చేయుట ఇవి అన్నీ తపస్సులే.

మంత్రోపదేశము పొంది దానిని పుర్చరణ చేయుట సాధన,  పుర్చరణ తరువాత దానిని మననం చేయుటయే ఉపాసన.
ఉపాసనయే  తపస్సు.  దీర్ఘ కాలము తపస్సు చేయుట సమాధి. సమాధి దీర్ఘ కాలము అయితే నిర్వికల్ప సమాధి. అది దీర్ఘమయితే మహా నిర్వికల్ప సమాధి.
సత్యము చెప్పుట ఒక వ్రతముగా ఆచరించుట తపస్సు. ఏదైనా ఒక మంచి పనిని ఏకాగ్రతతో, మనస్సు లగ్నం చేసి ఆచరించుట తపస్సు.

మనస్సుతో ఏకాగ్రతగా చేసే పనిని అంటారు లగ్నం.
భగవంతునికి చేసే పూజాదికములు ఏకాగ్రతగా కొన్ని క్షణములు,
నిమిషములు చేస్తే అది లగ్నం.
ఆ లగ్నం కొన్ని గంటలు చేస్తే అది తపస్సు.
ఆ తపస్సు కొన్ని రోజులు నిరంతరముగా చేస్తే సమాధి .
ఆ సమాధి కొన్ని నెలలు, సంవత్సరములు చేస్తే అది నిర్వికల్ప సమాధి.     
 తపస్సు వలన అన్ని కర్మలు నశించును.   శుభం కలుగును.    

ఎందరో మహా పురుషులు, యోగులు, గురువులు అందరికీ వందనములు.
జ్ఞాన బిక్ష పెట్టె వారు అందరూ గురువులే. వారి అందరికీ నా నమస్కారములు

తెలియజేసుకొంటూ,                                            

స్వస్తి

మీ
శ్రీ భాస్కరానంద నాథ
4-3-2012, @ 1.26 AM


 




 









 


Friday, 1 March 2013

గురియే గురువు.

గురువు అంటే గురి. గురి లేనిదే గురుత్వం లేదు.
మనకు ఎవరిమీద గురి వుంటుందో వారినే గురువుగా స్వీకరించవలెను.
అక్కడే మనకు భక్తీ, గౌరవము కలుగుతుంది, విద్య వస్తుంది. లేక పోతే చాలా విపత్కర పరిస్థితులకు అది దారి తీస్తుంది.
అది ఎలాగంటే " మనస్సు ఒకచోట మనువు ఒకచోట"... అన్నట్లుగా అలా జరిగితే అది వివాహము, సంసారము అని అనిపించుకోదు. అలాగే ఇది కూడా.
ఎక్కడైతే మనకు ప్రశాంతత కలుగుతుందో, ఎవరిని చూస్తే మనకు భక్తీ భావము కలుగుతుందో, ఎవరి మీద నమ్మకము కలుగుతుందో, ఎక్కడ గురి కుదురుతుందో వారినే గురువుగా స్వీకరించాలి.
అప్పుడే మనము ఆధ్యాత్మకముగా ముందుకు వెళ్ళగలము.

గురువు శిష్యుణ్ణి పరీక్షించాలి, అలాగే శిష్యుడు కూడా తన గురువు ఎలాంటి వాడు అనేది కూడా తెలుసుకోవాలి, ఒకరినొకరు తెలుసుకోకుండా దీక్ష తీసుకొంటే చాలా ఇబ్బందులు వస్తాయి.
గురువు తన శిష్యుణ్ణి అనేక రకాలుగా పరీక్ష చేస్తారు. కొంతమంది ఆ మొదటి రెండు, మూడు పరీక్షలలోనే ఫెయిల్ అయి వెనుకకు తిరుగుతారు.
గురువు తనకు విద్య చెప్పలేదే అని అసంతృప్తితో ఉండకూడదు, చెప్పలేదు అని మనసులో కూడా అనుకోకూడదు. అది వారి ఇష్టం.

"గురువు గారు మీకు నా మీద ఇంకా ఎందుకు దయ రాలేదు, ఏమి పాపం నేను చేసినాను, నా మీద మీ కరుణ చూపండి, జ్ఞానము భిక్ష పెట్టండి, నా జీవితము రోజు రోజుకు తరిగి పోతున్నది, దయ చూపండి గురువరేణ్య, దయ చూపండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాలి."
గురువులను ఎలా అడగాలో నేర్చుకోవాలి. అంతే గానీ chating లోనో, e-mails లోనో అడుగ కూడదు. 

మనకు ఎవరి మీద గురి ఉన్నదో వారి దగ్గరకు వెళ్ళాలి, వారిని ప్రాధేయ పూర్వకముగా అడుగాలి,
" ఓ .. మహాభాగా, నన్ను, నా ఆత్మను ఉద్దరించండి అని కన్నీళ్ళతో వేడుకోవాలి. వారి కాళ్ళు పట్టుకోవాలి, పదే పదే తిరగాలి, ఆవేదన చెందాలి.  గురువు గారి మనస్సు కరిగి పోయేలా మీ (మన) ప్రవర్తన వుండాలి. పది సంవత్సరములు అయినా సరే వదలకుండా తిరగాలి.
ఇది మామూలు లౌకిక విద్యలు కాదు అడుగ గానే చెప్పడానికి, ఏదో కొంత ధనము తీసుకొని.

మీకు విద్య ధారపోస్తే , తత్ఫలితముగా గురువు ల యొక్క తపః శక్తి నశిస్తుంది. ఎలా అంటే వారి పుణ్యము మీకు వస్తుంది, మీ పాపము వారికి వెళుతుంది. మీ పాప కర్మ వారు అనుభవించాలి మీకు మంత్ర దీక్ష ఇచ్చినందులకు. ఎందుకు ఇలా చేయాలో ఆలోచిన్చినారా ? గురువులు కరుణా స్వరూపులు, ప్రేమ స్వరూపులు, మనల్ని ఉద్దరించడానికే వారు వచ్చినారు.  మరలా వారు ఎక్కువగా సాధన చేసుకోవాలి. స్వార్ధము లేకుండా వారు మీకు విద్యను ఇస్తారు. మీకు మంత్రోపదేశము చేయడము అంటే వారి యొక్క తపః శక్తిని ధారపోసినట్లే, ఇక ఆ క్షణము నుంచి మీరు చేసే ఎ చిన్న తప్పు అయినా దానిలోని సగము పాపము మీ గురువులకు చుట్టు కొంటుంది. మనము వారికీ మేలు చేయక పోయినా కీడు తల పెట్ట కూడదు కదా ? మన పాపము వారికి తగులకూడదు కదా? అదే మీరు గురువులకు ఇచ్చే గురు దక్షిణ. వారు చెప్పినట్లు నడుచుకోవడమే గురు దక్షిణ.

శిష్యుడు అంటే గురు పాదములకు పాదుకలు లాగా మనము కావాలి. వారి చెప్పులు మాదిరి మన  జీవితము కావాలి. అప్పుడే గురువుల పూర్తి అనుగ్రహము మన  పైన కలుగుతుంది. అప్పడు నీకు విద్య చెప్పకపోయినా, నీమీద వాత్సల్యముతో నీ అంత్య దశలో, నీవు మూర్ఖుడువైనా, తెలివి లేని వాడివి అయినా  
నీ జుట్టు పట్టుకొని పైకి లాగుతారు గురువులు, నీకు ఒక్క క్షణములో పూర్తి విద్యనూ ప్రసాదిస్తారు. జ్ఞాన,మోక్షములను అవలీలగా అనుగ్రహిస్తారు.

అదీ గురు అనుగ్రహము అంటే. అది తెలుసుకొని నడుచుకోవడం మన విధి. గురు పాదములు పట్టుకోండి. మీ గురువులు మీ ఎదుటనే వున్నారు. వారిని ఆశ్రయించండి. గురువులు అంటే అమ్మే. అమ్మ మనసు వెన్న. గురువులు ఎప్పుడూ మనకు దగ్గరగా వుండాలి, మన ఊరిలోని వారు అయ్యి వుండాలి.

అందుకని గురువులు ఎంతో దూరం ఆలోచించి శిష్యులను ఎంపిక చేసుకొంటారు. సద్భావన కలిగిన వాడినే శిష్యుడిగా స్వీకరిస్తారు. అది మనకు తెలియకుండా మనము వారిని నిందిస్తాము.
గురువులకు కూడా పై నుంచి ఆజ్ఞ రావాలి నీకు విద్య చెప్పాలంటే . ఎప్పడు వారి మనస్సు కరుగుతుందో, అప్పుడు వారు నీకు దీక్ష ఇస్తారు. అది అర్ధరాత్రి కావచ్చు, ఎ అడివిలోనో కావచ్చు.
అప్పటి దాకా నీవు ఓర్పుతో వేచి వుండాలి.

గురువులకు దూరములో వున్న శిష్యుడి పైనే ఎక్కువ ప్రేమ, ఆలోచన, దిగులు వుంటుంది దగ్గర వారికన్నా. అయ్యో మనము చాలా దూరములో ఉన్నాము, గురువులు మనల్ని పట్టించుకోవడము లేదే అని దిగులు పడనవసరము లేదు. గురువులు సర్వాంతర్యామి. వారికి అన్నీ తెలుస్తాయి.
గురువుల మనస్సు కరగాలి, వారికి మనపై జాలి, దయ, ప్రేమ కలగాలి , అప్పటి దాకా మనము వేచి వుండాలి. ఏ గురువులు అయినా ఇంతే. గురు తత్వము అంతే.
శిష్యుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అంటే " నాగమహాశయుని జీవిత చరిత్ర చదవాలి మనము.

వారు వారి గురువుల (శ్రీ రామకృష్ణుల వారి ) కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది.
దానిలో ఆవ గింజ అంత కూడా మనము సాధన చేయుట లేదు.
భగ భగ మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు, ఇది గుర్తు పెట్టుకొని మనము మసులుకోవాలి.
మనమే కోపముగా వుంటే మన దగ్గరకు ఎవరు వస్తారు, ఎవరు నీకు ఆశ్రయమిస్తారు. ఎవరు నిన్ను దగ్గరకు తీసుకొంటారు, ఎవరు విద్యను ఇస్తారు.

ఎవరు అనుగ్రహమిస్తారు. ఒక వేళ ఇచ్చినా అది సఫలము కాదు. శ్రీమాత అనుగ్రహము కలుగదు.
శాంతి, ప్రేమ, త్యాగము ... పరోపకారం ... వుంటే అందరూ నీ దగ్గరకు వస్తారు. ఇదే మనము నేర్చుకోవలసినది.

పట్టుదల వుంటే సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. గ్రహా గతులను కూడా మార్చవచ్చు.
చిరు నవ్వుతో మెలుగుదాము అందరమూ. ఆనందమును పంచుతాము.

ఓం శాంతి: శాంతి: శాంతి:

శ్రీ గురుభ్యోనమః 

మీ
శ్రీ భాస్కరానంద నాథ/  01-03-2013




Sunday, 24 February 2013

గురువు - శిష్యుడు



గురువులు వేరు ఉండవచ్చు కానీ గురు తత్వం ఒక్కటే.
అమ్మలు వేరు ఉండ వచ్చు, కానీ అమ్మ తనం ఒక్కటే.
గురువే అమ్మ, అమ్మే గురువు. వారిద్దరికీ భేదము లేదు. గురువులు అందరూ ఒక్కటే. మార్గదర్శకులే.
ఇది తెలుసుకో లేనివాడు మూర్ఖుడు.

 
గురు శిష్యుల అనుబంధము ఎంతో పవిత్రమైనది, తండ్రి కొడుకుల కంటే ఎంతో గొప్పది మహోన్నతమైనది అని ఎంతో మంది చెప్పారు, ఆచరించి చూపారు. దానికి పురాణములలో ఎందరో ఋషులు మనకు తార్కాణముగా కనిపిస్తారు.
 
గురువు తన శిష్యులను కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, చూస్తారు. 
ఒక సారి నేను హరిద్వార్ దగ్గర పని చేసేటప్పుడు చాలా తీవ్రమైన జ్వరం వచ్చినది, వారం, పది రోజులైనా తగ్గలేదు, అప్పడు మా గురువు గారు (80) మహా విద్య పారాయణం చేసి, ఆ తీర్ధమును తీసుకొని వేరే శిష్యుణ్ణి వెంట పెట్టుకొని రైలు లో అన్నం నీళ్ళు లేకుండా రెండు రోజులు ప్రయాణించి నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఆ తీర్ధము నాకిచ్చి మా ఇంట్లో వారం  రోజులు వుండి , రోజూ  మహా విద్య పారాయణం చేసి తీర్ధము ఇచ్చారు. 
నా పేరు రామచంద్ర, అందుకని "రామచంద్రా, రామచంద్రా" అని అంటూ ఎంతగానో బాధ పడ్డారు. వారు ఇంట్లో తప్పించి మరే ఎక్కడా ఏమీ తినరు, పచ్చి మంచి నీళ్ళు ముట్టరు. ఏది చేసినా మడి తోనే, మడి లేకుండా ఏమీ చెయరు.  రైల్లో కూడా ఇంటి నుంచి పట్టుకొచ్చిన మంచి నీళ్ళే, ఆ రెండు రోజులు అటుకులు తింటూ మంచి నీళ్ళు త్రాగుతూ తెనాలి నుంచి నాకోసం హరిద్వార్ కు వచ్చినారు. ఇప్పటికీ అదే ప్రేమ వారిది.  
 
గురువును చూడ దానికి శిష్యుడు వెళ్ళాలి, కానీ మా గురు దేవుళ్ళు నేను వెళ్ల లేక పోతే వారె నా దగ్గరకు ఒక తండ్రి లాగా వస్తారు. ఒక్క పైసా నా నుంచి తీసుకోరు. మా తండ్రి గారి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, నాకోసం ఆందోళన చెందుతారు. ఏమి ఇచ్చి నేను ఋణం తీర్చుకోగలను, అటువంటి వారు నాకు ఎన్ని జన్మలు తపస్సు చేస్తే లభిస్తారు. వారి దగ్గర ప్రేమ తప్పించి కోపము ఉండదు. కోపం ఎరుగని మహా మనిషి. అమ్మను పూజించే వాళ్ళు, ఉపాసించే వాళ్ళు కొన్నాళ్ళకు అమ్మలాగ అయిపోతారు, అమ్మ తనం వారికి వచ్చేస్తుంది. అమ్మ లాగ వారి హృదయం మారి పోతుంది, మగ వాళ్ళు అయినా సరే, తండ్రి హృదయం పోయి అమ్మ హృదయం వస్తుంది వాళ్ళకు. 
ఒక తల్లి దగ్గరకు పోతే ఎంతటి అనుభూతి లభిస్తుందో అంతటి ఆప్యాత లభిస్తుంది వారి దగ్గర.. 
మా పిల్లలకు ఏదన్నా బాగాలేక పోతే నాకు వీలు కాక చేయక పోతే వారు మా ఇంటికి వచ్చి, మా పిల్లల కోసం వారు రోజుకి మూడు సార్లు మహా విద్య పారాయణ చేసి ఆ తీర్ధం ఇచ్చి, మా పిల్లల జబ్బు నయం చెస్తారు. నేను చేయలేనిది మా గురువులు వచ్చి మా కోసం వారు ఉపవాసం వుండి, పూజ చేస్తారు,
వారి అభిమానము, అవ్యాజమైన ప్రేమను చూచి తట్టుకోలేక, వారిని ఈ వయస్సులో ఇబ్బంది పెట్ట కూడదని, ఇప్పుడు మేము వారికి  అబద్దాలు చెబుతున్నాము ఏది జరిగినా. ఏవీ చెప్పడం లెదు. 
 
అదీ గురువు ల యొక్క ప్రేమ వారి గురించి చెప్పాలంటే కొన్ని వేల పేజీలు  వ్రాయ వలసి వస్తుంది.  అదీ గురు ప్రేమ. గురువులు శాంతి, ప్రేమ స్వరూపులు
 
గురువులకు ఎప్పుడూ అందరి మీదా ఒకే ప్రేమ వుంటుంది, అందరి శిష్యుల మీద ఒకే ఆప్యాత వుంటుంది. అందరి కోసం వారు కోటకలాడుతారు. ఒకరి మీద ఎక్కువ, ఒకరి మీద తక్కువ వుండదు. అది మీ అపోహ మాత్రమె. గురువులు తమ కన్న బిడ్డల కన్నా శిష్యులను ఎక్కువగా ప్రేమిస్తారు..  ఒక్కోసారి తమ కొడుకులకు కూడా చెప్పని మూల మంత్రములను శిష్యులకు ఇస్తారు. దానికి మా గురువులే సాక్ష్యం. వీడు ఇందుకు తగడు అని అనుకొంటే వాడు తన స్వంత బిడ్డైనా సరే ఈ శ్రీవిద్య చెప్పడు, అర్హుడైన తన శిష్యునికే చెబుతాడు . 
 
తన శిష్యుల కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తాడు, తన కొడుకు చావు బ్రతుకుల మధ్య వున్నా, శిష్యుని కోసం పరిగేత్తుకొని  వస్తాడు. అదీ గురువు అంటే. అటువంటి గురువులను మనము అవమానించ కూడదు, వారిని కష్ట పెట్ట కూడదు, వారి బరువును శిష్యులుగా మనము మోయాలి, అప్పుడే మనము నిజమైన శిష్యులము అని      అని పించుకొంటాము. గురువు కోసం మనము తనక లాడాలి. త్యాగం చేయాలి. 
 
గురువులు దొరక లేదు, గురువులు చెప్పలేదు అని మనము అనకూడదు, ఎంత వెదికినా గురువులు దొరక లేదు అని అనకూడదు.  ఏదో లోపం నీలోనే వున్నది, నీకు ఇంకా సమయం రాలేదు, ప్రారబ్ద ఖర్మ వదల లేదు, అందుకే గురువుల అనుగ్రహము నీ పైన కలుగ లేదు.  నీవు ఎదురుగా నులుచొని వున్నా వారు నీకు ఉపదేశము చేయరు, ఎక్కడో దూరముగా ఉన్నవారిని  వెతుక్కొన్ని వెళ్లి మంత్ర దీక్ష ఇస్తారు..  నా విషయములో అలాగే జరిగినది. 

గురువులు మంత్ర దీక్ష నీకు ఇచ్చారు అంటే దానితో పాటు వారు తపస్సు చేసి సంపాదించుకున్న తపః శక్తి, పుణ్యము నీవు అడగ కుండానే నీకు ధారపోస్తారు, నీ జన్మ జన్మల పాపం వారు స్వీకరిస్తారు. ఇది నీవు అడిగినావా లేదా అని చూడరు. మంత్ర దీక్ష అంటే అది. ఎదో మంత్రము ఇచ్చారు అని నీవు అనుకోకూడదు, నీ పాపము వారు స్వీకరిస్తారు. నీ బదులు వారు నీ పాపము అనుభవిస్తారు. అది గురువుల యొక్క ఉదారత. ప్రేమ. అది తెలుసుకొని నీవు మసులుకోవాలి. ఇలా తపః శక్తి అంతా వారి శిష్యులకు ధార పోస్తే ఇక వారికి మిగిలేది ఏమిటి? అదే త్యాగం.
 
శ్రీవిద్య మామూలు విద్య కాదు, దీనికోసం గురువులను మోహపరచకూడదు, బలవంత పరచకూడదు, వారికి మనపై అనుగ్రహము కలగాలి, అది ఒక రోజు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఒక జన్మ కావచ్చు. ఎదురు చూడాలి తపనతో. తపన,శ్రద్ధ, పట్టుదల లేకుండా శ్రీ విద్య రాదు. అనుకోగానే వచ్చేయడానికి ఇది మామూలు విద్య కాదు. గురువులకు మనపై ఎంతో నమ్మకం కలగాలి, దానికి వారు ఎన్నో పరీక్షలు పెడతారు, ఒక్కోసారి అమ్మే పరీక్షలు పెడుతుంది. నీవు ఈ విద్యకు సిద్దముగా వున్నావా లేదా అని గురువులు చూస్తారు, పూర్వ జన్మ పుణ్య ఫలము వుంటే కానీ ఈ విద్య రాదు. కొంత మందికి అడుగగానే ఈ విద్య ఇస్తారు, కొంత మందికి పది సంవత్సరములైనా ఇవ్వరు, ఇవ్వనంత మాత్రాన వారికీ మీ పైన శ్రద్ద లేదు అని కాదు, నీకు వారి పైన శ్రద్ద లేదు అని అర్ధము. నీవు ఇంకా సంసిద్దుడవు కాలేదు అని అర్ధం . లోపం నీలో వుంచుకొని గురువులను నినదించ కూడదు. 
 
గురువులు ఒక మాట చెప్పినారు అంటే అది వేద వాక్యం అని నమ్మాలి, దానిని ప్రశ్నించ కూడదు, వెంటనే ఆచరించాలి. గురువులు నీకు విద్య ఇవ్వలేదు అని అంటే దాని వెనుక ఏదో పెద్ద కారణం వుండి వుంటుంది,నీ లోపమేమిటో నీవు తెలుసుకో.    "అయ్యో గురువు గారికి నా మీద ఎందుకు అనుగ్రహము కలుగ లేదు"... అని ఏడవాలి, అంతేగాని గురువులను తప్పు పట్ట కూడదు, గురువుల మనస్సును నీవు దోచుకోవాలి, అలా నీ నడవడిక వుండాలి. గురువులకు, అమ్మకు ఎప్పుడు అనుగ్రహము కలుగుతుందో అప్పుడే నీకు ఈ శ్రీవిద్య వస్తుంది.  నీవు పరిగెత్తగానే ఈ విద్య రాదు. కొన్ని వేల సంవత్సరములు కాళ్ళు పట్టుకొంటే గానీ అగస్త్యులకు, శ్రీ హయగ్రీవులు ఈ శ్రీవిద్యను చెప్ప లేదు, ఇక మనమెంత చెప్పండి. ఎన్నో పరీక్షలు వస్తాయి. ఎవరు నిజముగా మనఃస్పూర్తిగా, భక్తితో తమ గురువుల యొక్క పాదములను తమ శిరస్సు మీద వుంచుకొంటారో వారికి ఈ శ్రీవిద్య త్వరగా వచ్చును. గురువుల చెంత కొద్దిగా కూడా అహంకారము ఉండకూడదు. నీ డబ్బు, హోదా, ఆస్తి వారి ముందు తృణప్రాయము అది తెలుసుకొని మనము మసులు కోవాలి. గురువుల మీద పూర్తిగా నమ్మకము వుంటే నీ కోరికలన్నీ తీరుతాయి, లేదంటే లేదు. గురువులను అనుమానించకూడదు, వారి తపః శక్తిని శంకించకూడదు. ఏదన్నా జరగక పోతే నీకు సరైన సమయము రాలేదని అనుకో. గురువులను దూషిస్తే అది అమ్మను దూషించినట్లే.
 
శ్రీవిద్యా సాంప్రదాయములో ఎన్నో మార్గములు, ఎన్నో పద్దతులు వున్నాయి, ఒక్కోరు ఒక్కో సాంప్రదాయములో చెబుతారు, మార్గములు అనేకము వున్నా చివరకు చేరేది ఒకే చొటికి. అందరి goal ఒకటే. 
ఒక గురువు ఎక్కువ ఇంకో గురువు తక్కువ అని అనుకోకూడదు, అలా అనుకోన్నవాడు ఈ శ్రీ విద్యకు అనర్హుడు, వాడికి ఈ విద్య రాదు, వాడి చెంత అమ్మ ఉండదు. శ్రీవిద్యలో గురువు లను మార్చకూడదు.  చివర దాకా ఒకే గురువు దగ్గర వుండాలి, చెప్పినా చెప్పక పోయినా వారినే అంటి పెట్టుకొని వుండాలి, వారి అనుగ్రహము కలిగే దాక. స్త్రీ తన భర్తను ఎలా మార్చదో, అలా శిష్యుడు తన గురువులను మార్చ కూడదు, ఒక వేళ అలా చేస్తే దానిని వ్యభిచారము అని అంటారు. ఎవరికి ఎవరు గురువులో అమ్మ నిర్ణయిస్తుంది, వాడి పూర్వ జన్మ కర్మానుసారము, క్రితము జన్మలో ఏ సాంప్రదాయములో కొనసాగినాడో అదే సాంప్రదాయములో ఈ జన్మ లో కూడా గురువు ధొరుకుతారు. ఇది జన్మ జన్మల బంధం. గురువుల మీద నమ్మకము, భక్తీ లేకపోతే ఈ విద్య రాదు.
కర్మ పూర్తి కాగానే గురు దేవుళ్ళు మీకు కనబడుతారు, మీకు శ్రీ విద్య ఇస్తారు, అప్పటి దాకా మీ సాధన కోన సాగాలి, మీ అన్వేషణ కోన సాగాలి. 

సాధారణముగా శ్రీవిద్య పూర్తిగా నేర్చుకోవడానికి, పూర్ణ దీక్షుతుడు (పట్టాభిషిక్తుడు) కావడానికి ఒక పుష్కర కాలం (12 సం.) పడుతుంది, అయితే శిష్యుల యొక్క స్థాయి బేధమును బట్టి కొంతమంది పది, ఐదు, రెండు, ఒకటి సంవత్సరములలో, ఈ విద్యను  నేర్చుకొంటారు.

ఇది పూర్తిగా మంత్ర శాస్త్రము. గట్టి పట్టుదల, గురువుల మీద నమ్మకము వుండాలి, నమ్మకము లేక పోతే ఈ విద్య రాదు. ఫలించదు. స్త్రీలు, పురుషులు, అన్ని వర్ణముల వారు ఈ విద్యకు అర్హులే.

అమ్మ ఒడిలోకి చేరడానికి అందరూ అర్హులే ఒక్క ప్రేమ వుంటే చాలు.

కావలసిన అర్హత అమ్మ మీద, గురువుల మీద ఎనలేని నమ్మకం, భక్తీ వుండాలి. దూకమంటే దూకేటట్టు వుండాలి.

గురువులు తలుచుకొంటే ఒక్క రోజులో 12 ఏండ్ల పూర్తి సాధన, విద్యనూ ఒక్క రోజులో నేర్పించగలరు.
అవసరమైతే శిష్యుని యొక్కజుట్టు పట్టుకొని పైకి లాగ గలరు.

ఈరోజు నేర్చుకొని, రేపు వదిలేసి, ఎల్లుండి తన గురువులనే తిట్టేటట్టు ఉండకూడదు, జన్మ జన్మలకు ఆ పాపం కట్టి కుదిపేస్తుంది. వదలదు.
 
గురువులు అందరూ ఒక్కటే. గురువులు వేరు ఉండవచ్చు కానీ గురు తత్వం ఒక్కటే. 
అమ్మలు వేరు ఉండ వచ్చు, కానీ అమ్మ తనం ఒక్కటే. 
గురువే అమ్మ, అమ్మే గురువు. వారిద్దరికీ భేదము లేదు. గురువులు కరుణాసముద్రులు.
 
గురువు లందరినీ ఒక్కటిగా చూచి గౌరవించు కోవడం నేర్చుకోవాలి, ఒకరిని గౌరవించి, ఇంకోరిని తిట్ట కూడదు, పాపం చుట్టు కొంటుంది, అది మీ గురువులకే తగులుతుంది.  గురుమండలం ఒక్కటే, గురుమండల స్వరూపిణి ఒక్కటే. గురువు లందరూ ఒక్కటే, అందరిలో మీ గురువులను, మీ గురువులో అందర్నీ చూడటం నేర్చుకోండి.
ఎవరు ఇలా ఉంటారో వారికి అమ్మ దర్శనం సులభముగా దొరుకొతుంది.

గురుమండల స్వరూపిణి అయిన  ఆ తల్లికి నమస్కరిస్తూ,
సమస్త గురు దేవుళ్ళకు నమస్కరిస్తూ, ఆది గురువులకు, మూల గురువులకు నమస్కరిస్తూ,

 
న గురోరధికం,   న గురోరధికం,   న గురోరధికంన గురోరధికం
శివ శాసనతః   శివ శాసనతః   శివ శాసనతః    శివ శాసనతః

మీ

శ్రీ భాస్కరానంద నాథ
24-02-2013
 
 

Wednesday, 20 February 2013

మంత్రోపాసన – నాదోపాసన


మంత్రోపాసన నాదోపాసన

శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాదం ఎక్కడి నుంచి ఉత్పన్నమౌతుంది? మంత్రానికి మూలం ఏమిటి? మంత్రానికి మూలం బీజం, ఆ బీజానికి మూలం నాదం, ఆ నాదానికి మూలం బిందువు. అన్నింటికీ మూలం బిందువు.
బిందువు లో నుంచే సృష్టి అంతా జరిగినది. బిందువు వికసనం వలన ఇది అంతా జరిగినది అని మనకు తెలుసు. బిందువు ఎందుకు వికసనం జరిగినది? దాని లోపలి శక్తి తాడనము చేత.కాబట్టి బిందువు లోపలే శక్తి వున్నది. దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే బిందువు పరమాత్మ, దానిలోపలి శక్తి ప్రకృతి.
అయ్య, అమ్మ ఇద్దరూ ఒక్కటే. ఒకరి లోపల ఒకరు వున్నారు. శక్తి లేనిదే అయ్య కదలడానికి అశక్తుడు అని మనకు తెలుసు. ఇదే మాటను శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పి వున్నారు.
ఇప్పడు మనము తెలుసు కోవలసినది అసలు ఈ శక్తి ఎవరు? ఏమిటి?ఎక్కడి నుంచి వస్తుంది? అని.
ఝుమ్మంది నాదం .. అని మనకు తెలుసు. నాదం లో నుంచి ఝు౦ అనే శబ్దం వస్తుంది. ఏమిటి ఈ ఝు౦ అనే నాదం అని పరిశీలిస్తే ఇదే శక్తి. బిందువు లో నుంచి ఝు౦ అనే నాదం వస్తుంది, అదే శక్తి. అదే అమ్మ. అదే భ్రమరాంభిక. అదే ఆది శక్తి. శబ్దం లో నుంచి నిశ్శబ్దం, దానిలో నుంచి శబ్దం. నిశ్శబ్దం లో నుంచి శబ్దం ఎలా? అదే ఝు౦ అనే నాదం.
ఈం, ఈమ్ , అమ్ , మ్. వీటిల్ని పరిశీలించండి. మ్” ... అనేది శక్తి. అదే ఉమా. అదే మూల ప్రకృతి.
నాదంలో నుంచి వచ్చేది అదే... “మ్”.

హార్మోనియం పెట్టెలో నుంచి వచ్చేది అదే ధ్వని. వీణ మీటితే అదే ధ్వని, నాద స్వరములో అదే ధ్వని,

గంట లో నుంచి వచ్చేది అదే ... “మ్”.

ఇతర గ్రహాలలో విన వచ్చేది అదే. నిశ్శబ్దం లో నుంచి వచ్చేది అదే. చంద్ర మండలములో“మ్”. అనే ధ్వని వినిపిస్తుందని చెప్పారు శాస్త్రజ్ఞులు. విద్యుచ్చక్తి లో అదే ధ్వని. శక్తి ఎక్కడ వుందో అక్కడ అదే ధ్వని.

High Induction transformer / HT voltage లో అదే ధ్వని. ...... “మ్”. 

ల౦, హం, య౦, రం, వం, సం, గం... లో నుంచి వచ్చేది అదే శబ్దం ...... “మ్”.

శ్రీరాముని తారక మంత్రమైన బీజాక్షరం రాం, రామ్లో నుంచి అదే శబ్దం ...... “మ్”.

రామం, విష్ణుం,శివం, కేశవం, దామోదరం ..... లో నుంచి అదే శబ్దం...... “మ్”.

విష్ణు సహస్ర నామం లోని విష్ణుంఅదే.

 హ్రీం కారము లోని   కారము అదే. ... మ్”.  అదే శ్రీమాత. 

హిరణ్య వర్ణాం హరిణీం,........... హిరణ్మయీం... అదే శబ్దం...... “మ్”.  

ఏ మంత్ర మైనా అదే "ఈమ్" అనే శబ్దం రావాలి. అదే ప్రాణ శక్తి, అదే జీవ శక్తి. అదే చలనము. మంత్రానికి మూల శక్తి అదే.

అదే ఆదిశక్తి. "ఈం"అనేది మూల ప్రకృతి, అదే నాదం.

ఓం కారములోని జీవ శక్తి అదే. "మ్.

దానిని మీద ధ్యాస వుంచండి, సమాధి లోకి వెళ్లి పోతారు. మనము చేయవలసిన సాధన అదే. అందరం కలిసి చేద్దాము.

ఝు౦ కారం వినడమే. శ్రీశైలం లో వినబడేది అదే. కైవల్యం అదే. అదే కైవల్యం. అదే కైవల్యం. నిశ్శబ్దం లోకి వెళ్ళగలిగిన వాడు ఈ శబ్దం వినగలడు , అది వినగలిగిన వాడు ధన్యుడు.

అదే సమాధి స్థితి. దానిలో లీనం అయిపోవడమే.
--



మీ

శ్రీ భాస్కరానంద నాథ



 

Tuesday, 12 February 2013

శ్రీ లలితా పంచమి

అయ్యా,
15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి
ఎల్లుండి 15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి. జగన్మాత ఆవిర్భవించిన రోజు. మహత్తరమైన రోజు. రాక్షసులను సంహరించడానికి తానూ అగ్నిగుండం లో నుంచి అవతరించినది.
ఆ తల్లి బాలా త్రిపుర సుందరిగా కొలువై వుండే రోజు. అందరూ చక్కగా శ్రీ లలితా సహస్రనామములు చదువుకొని, ఆ తల్లికి పంచ పూజలు చేసి, ధూప, దీప, నైవేద్యములను సమర్పించ వలసినదిగా మనవి.
ఈ రోజు అమ్మ బాల రూపములో వుంటుంది, బాలలను పూజించండి.

అయ్యా ఈ మాఘ శుద్ధ పంచమీ (15-2-2013), వసంత పంచమీ అని, మదన పంచమీ అని, లలితా పంచమీ అని వాడుకలో పిలుస్తూ వుంటారు.
త్రిశక్తి స్వరూప మైన ఆ లలిత త్రిపుర సుందరి, వాగ్భవ రూపిణి అయిన ఆ తల్లి సరస్వతీ రూపములో రేపు కొలువై వుంటుంది.
బాసరలో రేపు చాలా కోలాహలముగా వుంటుంది. చదువుల తల్లి యైన ఆ అమ్మ వారు దేదీప్యమానముగా వెలిగి పోతూ వుంటుంది రేపు. కొన్ని వేల మంది పసి పిల్లలు తమ అక్షరాభ్యాసమును రేపు ఆమె సమక్షములో దిద్దుకో బోతున్నారు.
ఎవరైనా పసి పిల్లలు వుంటే రేపు దివ్యమైన ముహూర్తం అమ్మ సన్నిధిలో, ఎ దేవాలయములోనైనా సరే మీ పిల్లలకు అక్షరాభ్యాసము చేయించండి.
ఆ సరస్వతీ కటాక్షము మెండుగా వుంటాయి.
రేపు మానవులే కాకుండా యక్ష, రాక్షస, గంధర్వాది దేవతా బృందములు, మునులు, యోగులు ఆ తల్లిని పూజించి ఉపాసించుతారు.
ప్రాతః కాలమునందే లేచి స్నానం, సంధ్య, ధ్యానం మొదలైన నిత్య నైమిత్తిక కర్మలు ముగించుకొని స్వశాఖ పద్ధతి అనుసరించిగానీ, స్వ కుల సాంప్రదాయానుసారముగా గానీ కలశ స్థాపన చేసి, దాని ముందు పుస్తకం వుంచి రెంటి యందునూ బంగారు నాణెములు వుంచి, ఆపైన షోడశోప చారములతో సరస్వతీ మాతను పూజించవలెను.
పూజానంతరము పాలు, పెరుగు,వివిధ పిండి వంటకములు, పంచదార, తెల్ల బెల్లం, పాయసం, నేతితో వండిన గోధుమ పిండి అప్పాలు, అరటి పళ్ళు, వెన్న ... అమ్మకు నివేదన చేయాలి.
తెల్లని వస్త్రం, చందనం, తెల్ల పూవ్వుల దండ... మొదలగునవి సమర్పించాలి.
వీణా పుస్తక పాణీ, సరోజ దళ నయనా అని అంటూ కీర్తించాలి.
xxxxx సరస్వత్యై స్వాహా అనే అష్టాక్షరీ మహా మంత్రమును శ్రద్ధతో జపించాలి.
మునుపు వాల్మీకి గంగ ఒడ్డున ఈ మహా మంత్రమును భక్తీ శ్రద్ధలతో జపించి సరస్వతీ కృపకు పాత్రుడు అయి మహా కవి అయినాడు. భ్రుగువు వల్ల శుక్రుడు, బ్రహ్మ నుండి భ్రుగువు ఈ మంత్రమును పొంది ఆ తల్లి యొక్క కటాక్షమును పొందినారు. ఈ మహా మంత్రమును నాలుగు లక్షల మార్లు జపించిన వాడు సరస్వతి అనుగ్రహానికి పాత్రుడై మహా కవి, సర్వ శాస్త్ర కళా విశారదుడై సమస్త విద్వజ్జన వందితుడు అవుతాడు.
అటువంటి చదువుల తల్లికి నమస్కరిస్తూ,
నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ,
త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యా దానం చ దేహిమే.
 
25-02-2013 - మాఘ పౌర్ణమి
ఈ రోజు అమ్మ తన పరిపూర్ణ స్వరూపమతో, చతుషష్టి కళలతో లలితా త్రిపుర సుందరిగా, శ్రీ రాజ రాజేశ్వరిగా, శ్రీమత్సింహాసనేశ్వరీ గా పున్నమి వెలుగులో, చంద్ర బింబములో కొలువై భక్తుల కోరికలను ఈడేర్చేందుకు
సంసిద్దురాలై వుంటుంది. ఈ రోజు అమ్మ పెద్ద ముత్తైదు రూపములో వుంటుంది, కావున ఈ రోజు ఇంటికి వచ్చిన మొదటి ముత్తైదువును పూజించండి. ఎవరు కనిపించినా వెంటనే పసుపు, కుంకుమలను, వస్త్రములను సమర్పించండి. పౌర్ణమి నాడు అమ్మ విశేష కృపతో, ప్రేమతో నిండి వుంటుంది, అడిగిన వారికీ అడిగినట్లుగా అన్నీ తీరుస్తుంది. ఈ రోజు అమ్మ నవ్వును చంద్ర బిమ్బములో చూచిన వాడు ధన్యుడు.
ఈ రోజు అందరూ ఆ తల్లికి పంచ పూజలు చేసి, ఐదు సార్లు లలిత సహస్రనామ పారాయణ చేయవలెను. అలా చేసిన వారికి,
యత్రాస్తి భోగోన చ తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో న చ తత్ర భోగః
శ్రీ సుందరీ సేవన తత్పరాణాo
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ
నిష్కామముగా పారాయణ చేసిన వారికి బ్రహ్మ జ్ఞానము, ధనార్ధికి ధనము, కీర్తిని కోరువారికి కీర్తిని, విద్యను కోరువారికి విద్య, భోగము కోరుకోనువారికి భోగము, మోక్షము కోరుకోనువారికి మోక్షము సిద్ధించును.
అందరూ ఆ తల్లి యొక్క పరి పూర్ణ అనుగ్రహమును పొందెదరు గాక. మాయను తొలగించి బ్రహ్మ విద్యను ప్రసాదించే తల్లి ఈ తల్లి.
అమ్మ ఉపాసన మొదలు పెట్టాలను కొనే వారికి మంచి సుదినము ఈ రోజు. ఆ చిత్కళ దొరికేరోజు ఈ రోజు. అమ్మ కాళ్ళు పట్టుకోండి, మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు.
జగత్తు అంతా అమ్మ మయం . అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే.
మీ
శ్రీ భాస్కరానంద నాథ