Wednesday, 4 June 2014

సౌందర్యలహరి- భాస్కర ప్రియ - 23

సౌందర్యలహరి- 23

త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటమ్ || 23 ||

ఓ భగవతీ ! నీవు తొలుత శంభుడి శరీర వామభాగాన్ని అపహరించి  తనివితీరని మనస్సుతో ఆయన  తక్కిన సగం కూడా గ్రహించావని నాకు తోచుచున్నది. ఏలనన నా హృదయంలో విరాజిల్లుతున్న నీ దివ్యశరీరం ఉదయభానుడి కాంతితో సాటివచ్చే కెంపుకాంతులతో ఒప్పారుతూ, పాలిండ్ల జంటచే యించుక ముందుకు వంగినట్లు కనబడుతూ, మూడు కన్నులు కలిగి, వంపు తిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్నకిరీటంతో సొంపారుతూ, విరాజిల్లుతుంది.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు చెబుతున్నారు. అర్ధనారీశ్వర స్వరూపాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు.

అదేమిటి అమ్మా, అర్ధనారీశ్వర స్వరూపములో మొత్తం రెండు ప్రక్కల కుడి ఎడమల నీ రూపమే కనిపిస్తున్నది. మొత్తం శంభుని శరీరాన్ని పూర్తిగా నీవే ఆక్రమించినావు. చిన్నగా స్వామి వారి యొక్క వామ భాగాన్ని అపహరించినావు, అది చాలదన్నట్లు ఆయన కుడి భాగాన్ని కూడా అతి లాఘవముగా లాగు కొన్నట్లుగా  నాకు సందేహము కలుగుతున్నది.
ఎందుకంటే నీ అరుణ కాంతి ఆయన ధవళచ్చాయ మీద పడి అది కూడా ఎరుపుగా కనిపిస్తున్నది. మొత్తం రెండు వైపులా ఎర్ర రంగుతో రెండు వైపులా నీవే కనిపిస్తున్నావు. ఒక ప్రక్క పురుష రూపం తో ఉండాల్సిన శరీరం రెండు వైపులా స్తన ద్వయం తో ముందకు వంగి నట్లుగా కనిపిస్తున్నది. మరి ఆ మూడో కన్ను నీ ముఖ తిలకం లాగ కనిపిస్తున్నది. అమ్మా,  ఎక్కడా అయ్యవారి చాయలు కనిపించడం లేదు, నీ సౌందర్యం తో ఆ శంభున్ని దాచేసినావు గదమ్మా. ఎంత గడుసరి దానివి గదమ్మా నీవు. పాపం మా అయ్య ఉనికిని కూడా నీవు లాగేసుకోన్నావు గదా తల్లీ.
అమ్మ యొక్క గడుసు తనాన్ని ఇక్కడ చాలా తమాషాగా వర్ణించినారు. పాపం మా తండ్రిని (శంభుని) అమాయకుణ్ణి చేసి మొత్తం నీ అరుణ కాంతితో ఆయన్ను పూర్తిగా కప్పెసినావు గదా తల్లీ. 

శ్రీవిద్యాం శివ వామభాగ నిలాయాం, హ్రీంకార మంత్రోజ్వలాం.......
అర్ధనారీశ్వర తత్వాన్ని ఉపాసన చేయడం యోగ శాస్త్రములో చాలా గొప్ప విషయము. కుండలినీ సాధకులు ఈ స్వరూపమును నిత్యం సాధన చేస్తూ వుంటారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి. ప్రతి అణువులోనూ స్త్రీ పురుష సమ్మేళనము వున్నది, అర్ధనారీశ్వర తత్వం వున్నది. ఈ తత్వాన్ని అర్ధం చేసుకోనిదే సహస్రారము చేరలేరు. స్త్రీ పురుష భేధమును చూచే వారు సుధా సింధువును చేర లేరు. అమ్మలో అయ్య, అయ్యలో అమ్మను చూడ గలిగే శక్తికి ఎదగాలి. ప్రతి అణువులో శివ శక్త్యైక్య స్వరూపాన్ని చూడగలగాలి.  స్త్రీ పురుష రూపములు మిళితమైన ఏకైక రూపాన్ని ఆరాధించాలి. అర్ధం చేసుకోవాలి.  అదే నిర్గుణ స్వరూపము.
పంచదశీ మహా మంత్రము నుంచి అమ్మను కామ కామేశ్వర స్వరూపముగా అర్ధనారీశ్వర తత్వముగా ధ్యానించాలి.
చాంపేయగౌరార్ధశరీరకాయై - కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ - నమః శివాయై చ నమః శివాయ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై - స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ ||

శం సుఖం భవ త్యస్మాత్ శంభుః – శం అనగా సుఖము. ఎవరి వలన ఈ సుఖము కలుగునో అతను శంభువు.  నిత్యం పరమానంద రూపములో గలవాడు శంభువు. నిత్యం సుఖ రూపియై యుండు వాడు శంభువు. పర బ్రహ్మము నకు శంభు అని పేరు కూడా గలదు. నిజ సుఖము బ్రహ్మానంద స్వరూపము. మిగతా సుఖములు విషయ సుఖములు. ఇవి వస్తు సంబంధములు, అనిత్యములు.
శంభుడి అర్ధ శరీరాన్ని లాగేసుకోవడం అంటే బ్రహ్మానందాన్ని గ్రప్పివేయుట, మరుగున పరుచుట. శాశ్వతమైన సుఖాన్ని మాయతో మరుగున పరుచుట. స్వ స్వరూపము తెలుసుకోక పోవడం అవిద్య.
బ్రహ్మానంద స్వరూపమును (తెలుపు) మరుగున పరుచునది మాయ (ఎరుపు) అని ఎరుగ వలెను.

గూడార్ధము :-
అమ్మ అంటే ప్రకృతి, అవిద్య. మాయ, అజ్ఞానము, అరుణ కాంతి, ఎరుపు రంగు అంటే మాయ. రజో గుణము.
తెలుపు స్వచ్చతకు, సత్వ గుణమునకు, శుద్ధ తత్వాన్నికి, జ్ఞానానికి, విద్యకు చిహ్నములు. అవిద్య విద్యను కప్పుతుంది. అజ్ఞానము జ్ఞానాన్ని, విద్యను  మరుగున పడేటట్లు చేస్తుంది. భ్రమింప జేస్తుంది. తెలుపు రంగు ఎరుపు రంగు చాటున,  వెనుకాల దాగి వుంటుంది.
 మాయ (ఎరుపు) సంసారంలోకి లాగుతుంది. మొహం కలుగ జేస్తుంది. వున్నది అంతా ఎరుపే అనేటట్లు చేస్తుంది. రెండు వస్తువులు ఉన్నట్లుగా కల్పన చేస్తుంది.
మాయ చేత మావి చేత జీవుడు సదా గ్రప్పబడి ఉంటాడు. ఇదే ప్రపంచం, ఇదే సర్వస్వం, నేను, నాది అనుకోవడమే అరుణ కాంతి. ఎర్రని కాంతి చేత సమ్మోహింప బడి ఉంటాడు జీవుడు ఎప్పుడూ. అది అమ్మ లీల. అమ్మ మాయ. అదే విష్ణు మాయ.
అమ్మా ఎంతటి వాడ్ని అయినా సరే నీ మాయలో పడేస్తావు కదా తల్లీ.
అమ్మ అనుగ్రహముతోనే ఆ దేవీ మాయను వీడి, ఆ అరుణ వర్ణాన్ని వీడి శుద్ధ తత్వాన్ని (తెలుపు) పొందాలి. అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని పొందాలి అంటే అమ్మ యొక్క కరుణ వుండాలి. అప్పుడే శంభున్ని చూడ గలము. మాయ వీడితేనే జ్ఞాన జ్యోతి కనబడ గలదు. మాయ అమ్మ, జ్ఞానము అయ్య.
ప్రకాశ బిందువును విమర్శ బిందువు సదా ఆవరించి వుంటుంది.

ఓకే రూపంలో, ఒకే శరీరంలో స్త్రీ పురుషులు వున్నారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. వున్నది ఒక్కటే.
న శివేన వినా దేవీ దేవ్యా చ న వినాశివః
నై తయోరంతరం నాస్తి చంద్ర చంద్రిక యోరివః

అయ్య లేనిదే అమ్మ లేదు, అమ్మ లేనిదే అయ్య లేడు. ప్రకాశ విమర్శ బిందువులే స్త్రీ పురుష రూపములు. శివ శక్తులు. శివశివాని. అదే శ్రీచక్రము. ఈ తత్వాన్ని అర్ధం చేసుకొన్నవాడు సౌందర్యలహరిని అర్ధం చేసుకోగలడు.
సకల భువనోదయ స్థితి లయ మయ లీలా వినోద నోధ్యుక్తః
అంతర్లీన విమర్శః పాతు మహేశః ప్రకాశ మాత్ర తనుః ........కామకలావిలాసము

శ్రు|| యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్టితః,
       తస్య ప్రకృతి లీనస్య యః పర స్స మహేశ్వరః ||
ఆ పురుషునిలో ప్రకృతి (స్త్రీ) లీనమగుచున్నది. ప్రకృతిని తొలిగిస్తే వుండేది పరమాత్మ.

యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభో తవారాధనం.....
  
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ....

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/04-06-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/sribhaskaranandanatha/
http://vanadurga-mahavidya.blogspot.in/    


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.