Saturday, 21 June 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 25

సౌందర్యలహరిభాస్కర ప్రియ – 25

త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్పూజా పూజా తవ చరణయోర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తంసమకుటాః || 25 ||

ఓ శివానీ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించిన వారైన త్రిమూర్తులకు చేసే పూజ కూడా. వారికి ప్రత్యేక పూజలవసరం లేదు. ఎందుకంటే వారు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో చేరి, హస్తాలు తమ మణిమయ శిరోమకుటాలకు తాకునట్లు వహించి మొక్కుతూ, నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు. భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావం.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క గొప్పతనాన్ని  మనకు తెలియ జేస్తున్నారు.

శివా అన్నా శివే అన్నా ...శివుని రాణి అని అర్ధం...... Mrs. Siva అని అర్ధం.  వేద పురాణ కాలములోనే భార్యను భర్త పేరుతో పిలిచేవారు. ఈ సంస్కృతి మన నుంచి పశ్చిమ దేశాలకు వచ్చినది. భవాని, రుద్రాణి, ఇంద్రాణి, అని భర్త పేరు మీద భార్యలను పిలిచే వారు. అలా శంకరులు శివే అని అన్నారు.
శివే ..మంగళ ప్రదమైనది.  మంగళకర గుణములు కలది గాన శివా అని, శివే అని అందురు. శమింప జేయునది గాన శివే అని, మోక్షము ఇచ్చునది గాన శివా, శివే అని అందురు.  
శివుడెట్లో దేవి అట్లు, శివునకు దేవికి భేదము లేదు. అందుకని శివే అన్నారు. అమ్మ ఎలా మూలమైనది? ఈ సృష్టికి తల్లి అయినది కాన, ప్రకృతి ఆమె గనుక ఈ ప్రకృతి లో నుంచి జగత్తు వచ్చినది గనుక అమ్మ మంగళ కరమైనది. పూర్ణ గర్భిణి అయినది.

అయ్య పేరు మీదుగా అమ్మ పేరు. ఎంత మర్యాద? ఆడ వాళ్ళను  భర్త పేరుతో, ఇంటి పేరుతో పిలవడం ఎంతో మర్యాద. వావిళ్ళ వారు, యద్దనపూడి వారు, వింజమూరి వారు, ... ఇలా.
అలాగే ఆడవాళ్ళను వాళ్ళ భర్త పేరు మీదుగా  పిలవడం Mrs. RAO అని, మీనాక్షీ సుందరం, లలితా సుబ్రహ్మణ్యం అని కూడా.
అయ్యవారిని, అమ్మవారిని ఒకేసారి తలుచుకోవడం. మరలా వేరుగా స్మరించే అవసరం లేకుండా.

నీ వల్ల గుణ దోషమేమి, నా వల్లనే కానీ .... నా వల్లనే కానీ.... నీ వల్ల గుణ దోషమేమి.....రామా....
అని శ్రీ త్యాగరాజు కొనియాడినారు.  మనస్సు త్రిగుణ జనితమైనది. శరీరం త్రిదోషములతో కూడినది.
సత్వ, రజ, తమో గుణములతో కూడినది మనస్సు. వాత, పిత్త, కఫ దోషములతో కూడినది శరీరము. జీవుడు తన ప్రారబ్ధ  ఖర్మ చేత త్రిగుణముల యొక్క నిష్పత్తి తో జన్మ తీసుకొంటాడు. ఆ గుణ దోషముల చేత మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ గుణములను తారుమారు చేయాలంటే భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యం.

త్రిగుణాత్మికా .... సత్వ, రజ, తమో గుణములను ఆశ్రయించి ఉండునది, మూడు గుణముల స్వరూపము గలది. గుణ త్రయమునకు కారణభూతురాలైనది. మూడు బిందువుల కలయకే మూల ప్రకృతి.  అమ్మ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే త్రిగుణములతో కూడినది. సృష్టి లోని ప్రతి ప్రాణి కూడా త్రిగుణములతో ఏర్పడినదే. పుట్టినది అంటే త్రిగుణములతో కూడినది అని అర్ధము. ఎవ్వరినా ఈ మూడు గుణముల తోనే పుట్టాలి.  త్రిగుణాతీతుడు పరమ శివుడు ఒక్కడే. మిగతా వాళ్ళు అందరూ త్రిగుణములకు లోబడిన వారే.

సత్త్వాది గుణములకు నిధి వంటిది అమ్మ. సృష్టి ఆది నందు బ్రహ్మ పదార్ధము సంపూర్ణముగా వున్నది. సృష్టి ఆవిర్భావ కాలము నందు గుణ త్రయ సంయుక్తమైన అవ్యక్తము ఉత్పన్నము అయినది. కాన గుణ త్రయమునకు శ్రిదేవియే కారణభూతురాలు, స్థానభూతురాలు అని భావము. అందుకే ఆమె గుణనిధి అయినది....(లలితా సహస్రనామం).

కామ కామేశ్వరుల సంయోగ రూపమే జగన్మాత సగుణ రూపమని, “తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం”...ఇత్యాది ఋక్కుల యందు లలితా దేవి అగ్ని వర్ణము గలదని చెప్పబడెను. అరుణాం కరుణాతరంగి తాక్షీం .....అని దేవిని అరుణ కాంతితో ఎరుపు వర్ణము తో పోల్చివున్నారు.
 పుట్టుక లేని మాయ మూల ప్రకృతి ఎరుపు, నలుపు, తెలుపు వర్ణములు కలిగి త్రిగుణాత్మికయై యున్నదని,

శ్రు||“అజ మేకాం లోహిత కృష్ణ శుక్లాం బహ్వీం ప్రజాం జనయంతీగ్ సురూపామితి ”...అని శ్వేతాశ్వతరము నందు చెప్ప బడి వున్నది. నిజజ్ఞారూప నిగామాయై నమః, శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ దూళికాయై నమః అని ఆ తల్లిని లలితా సహస్ర నామంలో కొనియాడినారు.  నాలుగు వేదములు పర దేవత యొక్క ఆజ్ఞా రూపముగా నున్నవి, కావున వేదమార్గముననుసరించి  దేవతలు శ్రిదేవి యొక్క అనుగ్రహమునకు పాత్రులు అగుచున్నారని     భావము.

అధర్వ శిరస్సు నందు “అహం బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతిః పురుషాత్మకం జగత్ “......అని శ్రీ దేవియే స్వయముగా చెప్పెను. దీనిని బట్టి సృష్టికి పూనుకోనిన బ్రహ్మమే శ్రీమాత అని తెలియుచున్నది.
“త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మేతత్”.....ఈ లోకమంతా మాయా శక్తి చేత సమ్మోహిత మగుచున్నది. మాయ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే త్రిగుణములు అని తెలియ వలెను. త్రిగుణముల యొక్క సామ్యావస్థయే (state of equilibrium) ప్రకృతి. ఆ గుణముల హెచ్చు తగ్గుల వలన, ఆ గుణముల యొక్క వైషమ్యము వలన జగత్తుగా పరినమించు చున్నది.   
త్రిమూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క గుణమునకు ప్రధానముగా గలవారని చెప్పబడి యుండుట చేత గుణత్రయము తో కూడిన మాయ, త్రిమూర్తులతో కూడిన మాయ, ప్రకృతి (అమ్మ) తురీయమగు బ్రహ్మము నే  ఆశ్రయించి ఉండును. అంటే కామేశ్వరునితో ఉండును. కామ కామేశ్వరీ రూపములో. దీనినే మైత్రాయణీ శృతి ఇలా చెప్పుచున్నది.

“ తమోవా ఇదమేక మగ్ర ఆసీత్ తత్పరే స్యాత్, తత్పరేణేరితం, విషమత్వం, ప్రయాత్యేత ద్వైరజ స్తద్రజః ఖల్వీరితం విషమత్వం ప్రయాత్యేతద్వై సత్త్వస్య రూపమ్.”.....తమస్సు లో నుంచి రజస్సు, రజస్సు లో నుంచి సత్త్వము బుట్టినది అని అర్ధం. అంటే మనము కూడా క్రింద నుంచి పైకి ఒక్కో గుణములోకి మారుతూ సత్వ గుణము వైపు ప్రయాణించాలి. గుణములతోనే మనిషి మారాలి. మనిషిని మార్చాలంటే మనస్సును మార్చాలి, అంటే అతని యొక్క త్రిగుణముల నిష్పత్తి మారాలి. తమోగుణము తగ్గి, సత్వ గుణము పెరగాలి. దీనికి పురాణ పఠనములు, భగవన్నామ సంకీర్తన అవసరము. సత్వ గుణ సంపన్నుడు ఎప్పుడు అవుతాడో అప్పుడు ఒక సాదు, ఒక ఋషి, ఒక యోగి, ఒక మహర్షి, ఒక జ్ఞాని జన్మ వస్తుంది. ఆ జన్మలో కూడా పరిపూర్ణుడు అయితే శుద్ధ సత్వం లోకి అడుగు పెడతాడు, అంటే మరో జన్మ లేకుండా మాయా ప్రకృతి బంధనాల నుంచి విముక్తి పొంది శివునిలో ఐక్యమౌతాడు.  అందువలన ఉపాధి మారాలంటే గుణములు మారాలి. మంచి ఉపాధి (జన్మ, శరీరం) కోసం, మంచి గుణాలు అలవర్చుకోవాలి. మరి సత్వ గుణములు తెలుసుకోవాలంటే సత్ సాంగత్యము చేయవలెను. సాధు పురుషుల, పురాణ పురుషుల కలియక చేత మనస్సు నెమ్మదిగా మారును.

“ఆరాధ్యా పరమాశక్తిః సర్వై రపి సురాసురైః,  మాతుః పరతరం కించి దధికం భువనత్రయే”.
పరాశక్తి సురాసురల చేత కూడా ఆరాధ్యమగుచున్నది. ముల్లోకముల యందు అమ్మ కంటే ఇతరమైనది, అధికమైనది, గొప్పదైనది లేదు.
కావున అమ్మ యొక్క త్రిగుణములకు ప్రతీకగా జనించిన బ్రహ్మాది దేవతలు నిత్యమూ అమ్మ పాదములకు నమస్కరించు చున్నారు. అమ్మ పాదములకు చేసిన పూజ త్రిమూర్తులకు కూడా చెందుతుంది. ఎందుకంటే అమ్మ పాదముల చెంత నిత్యమూ త్రిమూర్తులు కొలువై అమ్మ కు సేవ చేస్తూ వుంటారు గావున. ముక్కోటి దేవతలు నిత్యమూ అమ్మ పాదముల చెంత శిరస్సులు వంచి మ్రోక్కుతూ వుంటారు గావున, శ్రీదేవీ పూజ సకల దేవతా పూజ అగును. వేరే పూజలు అక్కర్లేదు. అందరూ ఆమె కడుపులో నుంచి వచ్చిన వారే గనుక.
శ్రు|| భీషాzస్మా ద్వాతః పవతే భీషోదేతి సూర్యః , తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సర్వ మిదం విభాతీతి.
పై శృతి వలన దేవతలు అందరూ త్రిగుణాత్మకులుగా యున్నారని, ఆ గుణ త్రయమే కోణ బిందువులు అని, ఇవియే శుక్ల, రక్త, మిశ్ర బిందువులు అని, శ్రీవిద్యా తంత్రము నందు, కామకలా విలాసము నందు వివరించబడి  వున్నది. ఈ మూడు బిందువుల చేతనే సృష్టి జరుగు చున్నది అని తెలియ వలెను.

శివ రూపం శక్తి రూపం బ్రహ్మ స్వరూప రూపకమ్,
త్రిపురాం పరమేశానీం మహా ప్రళయ సాక్షిణీమ్ ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/21-06-2014 @ శ్రీకాళహస్తి

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.