Wednesday, 25 June 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 27

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 27

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య  క్రమణ మశనాద్యాహుతి విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యా పర్యాయ స్తవభవతు యన్మే విలసితమ్ || 27 ||

అమ్మా, భగవతీ! ఆత్మార్పణ దృష్టితో నేను చేసే సల్లాపం నీ మంత్ర జపంగాను, నా హస్త విన్యాసమంతా నీ అర్చనలో ముద్రా రచనగాను, నా స్వేచ్ఛాగమనం నీకు గావించే ప్రదక్షిణగాను, నా భోజనాదులు నీకు ఆహుతిగాను, నా శయనక్రియ నీకు ప్రణామంగాను, నా సుఖ లాలసాలన్నీ  నీ పూజా విలసనముగాను అగుగాక! అలా అయ్యేట్లు నువ్వు నన్ను కరుణించు తల్లీ అని భావం.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ   శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు ఆత్మార్పణ దృష్టి అంటే ఏమిటో మనకు  తెలియ జేస్తున్నారు. అత్భుతమైన శ్లోకము ఇది. నాకు చాలా ఇష్టమైన శ్లోకము. రోజుకు ఒక్కసారైనా చదువుకోవడం మంచిది.

ముందరి కాళ్ళకు బంధం వేశారు జగద్గురువులు ఇక్కడ. ఆత్మార్పణ అని. ఆత్మార్పణ లేకుండా వూరికే మాటలు చెబితే లాభం లేదు.   జగద్గురువులు చెప్పారు కదా అని పూజాదులు, అనుష్ఠానం లేకుండా, మానేసి,  యోగం అనే పేరుతో అందరూ పైకి మాటలు చెబుతూ తప్పించు కొంటున్నారు. ఇది తగదు. భావన రావాలి. నిజంగా అలా ఆత్మార్పణ దృష్టి కలిగి యుండాలి. మనం చేసే ప్రతి క్రియలోను, ప్రతి చేష్ట లోను ఆ బుద్ధి రావాలి, ఆ సమర్పణ రావాలి, అప్పడు అది అంతర్యాగము అవుతుంది. ప్రతి క్షణం, ప్రతి క్రియ లోను  అమ్మా....అమ్మా అని కలవరించాలి, పలువరించాలి, కోటకలాడలి. అసలు ఆ స్పృహ కలగాలి. ఆ స్పృహ తో చేయాలి అప్పుడే అది ఆత్మ నివేదన అవుతుంది.
తల్లీ, నిదుర లేచి నప్పటి నుంచి ఏవేవో పనికి మాలిన మాటలు ఎన్నో మాట్లాడుతూ వుంటాను. నీ జపం చేయడానికి మాత్రం సమయం దొరకదు. మిగతా అనవసరమైన  విషయములు, వ్యవహారిక విషయములు,  మాట్లాడటానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం  వస్తుంది. లలితా సహస్ర నామం చేయాలంటే మాత్రం మనస్సుకు సమయం దొరకదు. మూడు గంటలు సినిమాలు, సీరియల్స్ చూడటానికి సమయం దొరుకుతుంది కానీ నీముందు మోకరిల్లడానికి ఒక్క పది నిముషాలు దొరకదు గదా. Time లేదండీ అని అంటాము.  వెదవది ఈ మనస్సు పట్టుకోదు గదా, అనవసరమైన  బంధనాలలో చిక్కుకొని, కొన్నింటిని చేజేతులారా తగిలించుకొని మొహంతో, మాయతో  తల్లడిల్లి పోయి, అదే శాశ్వతమని అల్లాడి పోతూ వుంటాము. ఏది శ్వాశ్వతం ఏది బంధం అని దీర్ఘంగా ఆలోచిస్తే నీ భార్యా భర్తలు, నీ తల్ల్లిదండ్రులు, మీ తాతా అమ్మమలు, నీ సోదరీ సోదరులు,  నీ వాళ్ళు, నీ ముఖ్య స్నేహితులు . వీళ్ళు నీ ముఖ్య బంధువులు. వీళ్ళను మించి మనము ఎక్కువ పెట్టుకోన్నామా అవి అన్నీ అనవసర బంధనాలు మాత్రమే, స్వార్ధ చింతనతో కూడిన అధర్మ బద్ద సాంగత్యాలు మాత్రమే. అవి కర్మ బంధనాలు. ఎంత తక్కువ చేసుకొంటే అంత మంచిది. కొన్ని మనము కోరి తెచ్చుకొంటాము, వాటితో అనవసరంగా బాధపడ్తూ ఉంటాము. విషయ బంధనాలు ఎంత తక్కువ చేసుకొంటే అంత మంచిది. బాహ్య ప్రపంచాన్ని చూసే వాడు లోపలికి చూడ లేడు, లోపలికి చూడడం నేర్చుకొన్నవాడు బయటకు చూడలేడు. అంటే బయట ప్రపంచం కనిపించదు. ప్రతి నిమిషం ఆ దేవ దేవుణ్ణి ఎలా స్మరించాలో ఇక్కడ గురువులు మనకు నేర్పిస్తున్నారు. ప్రతిది భగవత్ కైంకర్యముతో ముడి వేయాలి. సమర్పణ బుద్దితో చేయాలి అని చెప్పారు.

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా

జల్పము అంటే ఉపయుక్తము కాని మాటలు  మాటలాడుట అంటే పనికి మాలిన మాటలు మాటలాడుట. వ్యర్ధ ప్రసంగము అని అర్ధము. అమ్మా భగవతీ, నిద్ర లేచి నప్పటి నుంచి పడుకొనే దాక నేను మాట్లాడే ప్రతి మాట, నీ జపం క్రింద లెక్క వేసుకో తల్లీ. నీ మంత్ర జపం చేస్తున్నాను అనుకో. అక్షర లక్షలు జపం చేసాడు ఈ భాస్కరానంద నాథ అని వ్రాసుకో. నా మాటలు నీ మంత్ర జపము అగు గాక.
శిల్పం అంటే హస్త విన్యాసములు. అమ్మా నేను చేతులు అటు ఇటు త్రిప్పుతూ ఉంటా ఏమీ తోచక అవి అన్నీ నీ ముద్రలు అనుకో. శ్రీవిద్యలో శ్రీచక్రార్చన చేసేటప్పుడు దశ ముద్రలు ప్రదర్శించాలి. కాబట్టి అవి అన్నీ నాకు రావు, ఒకవేళ వచ్చినా ఓపిక లేదు. కాబట్టి నా హస్త క్రియాలాపములు అన్నింటిని నీ ముద్రలు క్రింద జమ కట్టుకొని సంతోషించు. ఏదోలే చిన్న పిల్లవాడు అని సర్దుకో. కోపగించకోకు నా పైన. నీ బిడ్డను అమ్మా నేను. 
(Navigation signals లాగ, తప్పకుండ శ్రీచక్రము ముందు ప్రదర్శించాలి.) మంత్రము లేకుండా దశ ముద్రలతో అమ్మను ఆవాహన, ఆసనాది క్రమములు  చేయవచ్చును, పూజ పూర్తిచేయవచ్చును.

గతిః ప్రాదక్షిణ్య  క్రమణ మశనాద్యాహుతి విధిః
అమ్మా భవానీ, నేను గతి తప్పి కాలు కాలిన పిల్లి లాగ అటు ఇటు నడిచే నా నడక నీకు ప్రదిక్షణం అగు గాక. నీకు పద్దతిగా, శాస్త్రీయముగా  ముమ్మార్లు ప్రదిక్షణ చేశాను అని వ్రాసుకో తల్లీ. అశనము అంటే భోజనము అని అర్ధము.  నేను తినే ఆహారము అంతయూ నీకు నివేదన అగుగాక, ఆహుతి అగు గాక. నా ఆకలి కోసం నేను తినే పదార్ధములన్నీ నీకు యజ్ఞ హవిస్సులు అగు గాక. నీకు సమర్పించాను అని అనుకో తల్లీ. ఎందుకంటే నా కడుపులో వుండి తింటున్నది నీవే కదా. జఠరాగ్ని రూపములో పచనము చేస్తున్నది నీవే కదా. అది లేక పోతే నేను తిన్నది నాకు అరగదు కదా. కాబట్టి నీకు సమర్పించాను అని అనుకో.

ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా
అమ్మా కాత్యాయనీ, నిద్ర పోయేటప్పుడు  నాకు నేను  వొళ్ళు తెలియకుండా అటు ఇటు దొర్లడం చేస్తూ ఉంటా, అవన్నీ నీకు నేను చేసే సాష్టాంగ దండ ప్రణామములు అని జమ కట్టుకో. మరలా నీ గుడికి వచ్చి నేను విడిగా చేయలేను, నీ చుట్టూ తిరగ లేను. సంవేశము అంటే నిద్ర పోవుట, పండుకొనుట.
అనుభవించమని, ఆనందించమని నీవు నాకు ప్రాసాదించిన సుఖ వస్తువులతో, పంచేంద్రియములతో నే జరుపు సరస కల్లాపము లన్నీ నీకు సమగ్రమైన, సంపూర్ణ మైన పూజ అగు గాక.
అలా అగునట్లు నీవు నన్ను అనుగ్రహించు అమ్మా. ఏదో తెలియని వాణ్ని, చేతకాని వాణ్ని, ఓపిక లేని వాడ్ని. బద్దకస్థుడ్ని.
కానీ అమ్మా నా మనసు మాత్రం నీ దగ్గరే వున్నది. నీ పాదాల చెంతనే వున్నది. నీ బిడ్డనమ్మా నేను. ఆత్మార్పణతో నే గావించే ఈ సమస్త క్రియలు నీ శ్రీచక్రార్చన అగుగాక తల్లిరో తల్లి.


ఇదే విషయాన్ని జగద్గురువులు శివ మానస పూజలో ఇలా చెప్పినారు.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ||  ..... శివ మానస పూజ

ఓ శంభో ! నా ఆత్మయే నీవు; నాలో బుద్ధి రూపములో  పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి); నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు); నా ఈ శరీరమే మీ గృహము; ఈ శరీరముద్వారా నేను అనుభవించెడి విషయ భోగములన్నియూ నేను మీకు ఆచరించుచున్నట్టి పూజయే; నా నిద్రే సమాధి స్థితి; నా పాదములద్వారా నేను చేస్తున్న సంచారమంతా మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే; నే పలుకుచున్న మాటలన్నీ మీ స్తోత్రములే; నేను చేయుచున్నట్టి కర్మలన్నీ, మీయొక్క ఆరాధనయే!

కరచరణ కృతం వా, కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||……… శివ మానస పూజ.

నా కర చరణములు, వాక్కు, శరీరములతో చేసిన కర్మలలోగానీ, నా కన్నులు, చెవులుతోగానీ, మానసికంగాగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, నే చేసిన అపరాధములు అన్నింటినీ, కరుణా సముద్రుడవైన ఓ మహాదేవ శంభోనీవు దయతో క్షమించుము.

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;.....భాగవతము.

నా మనస్సును, పంచేంద్రియములను, కర్మేంద్రియములను నీ ఎడల భక్తి భావముతో సమర్పణ దృష్టి తో వినియోగిస్తున్నాను తల్లీ, అలా కానినాడు నేను రెండు కాళ్ళ జంతువుతో సమానము.

జపో జల్పః శిల్పం..... జపము, జల్పము, శిల్పము అని గొప్ప రహస్యమును చెప్పుచున్నారు గురువు గారు.   జపము మనస్సుతో చేసేది, జల్పము అంటే మాటలు వాచా, వాక్కుతో చేసేది.
 శిల్పము అంటే చేష్టలు అంటే చేతులతో, కాళ్ళతో చేసేది, కర్మణా.
మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్దిగా అమ్మను ఆత్మార్పణ దృష్టితో ఆరాధించాలి అని చెబుతున్నారు. అప్పుడే పూజ సంపూర్ణము అవుతుంది అని దీని రహస్యము. ఈ పద్య రహస్యాన్ని మూడు ముక్కలలో ముందుగానే మనకు చెప్పినారు. మనసా, వాచా, కర్మణా, జపో జల్పః శిల్పం..... అని.

జపో ......అని శంకర భగవత్పాదులు ముందుగా అన్నారు. జపానికి కారణభూతమైనది మనస్సు. ఇంద్రియములకును విషయములకును అన్నింటికినీ మూల కారణము మనస్సే. మనోపాసన చేయవలెను. అంటే అమ్మ నామము గాని, మంత్రము గాని జపించవలెను. జపము వలెనే  కర్మ క్షయము అవుతంది. ఆత్మను సమర్పించడం అంటే మనస్సు ను సమర్పించడం అన్నమాట. మనస్సు ఒక్కటి ఇస్తే చాలు అమ్మకు. కర్మ పరి పక్వం అవుతుంది. అంగాంగముల శుద్ధి అంటే ఇదే. వాచక శుద్ధి, కాయక శుద్ధి. నోటితో, చేతులతో, కళ్ళతో, కాళ్ళతో, చెవులతో, శరీరముతో చేసే పాపములు పోగొట్టుకోవాలి అంటే, నోటితో భగవన్నామము జపించాలి, చేతులతో పూజించాలి, కళ్ళతో భగవంతుని దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి, కాళ్ళతో ప్రదక్షిణ చేయాలి, చెవులతో నామం, కీర్తనలు వినాలి, శరీరముతో యజ్ఞము చేయాలి. అనవసర మైన వ్యర్ధ ప్రసంగములు మాని మనకు వున్న కొద్దిపాటి సమయాన్ని భగవంతుణ్ణి సేవలో గడపమని గురువు గారి హెచ్చరిక. అమ్మకు ముద్రలు అంటే చాలా చాలా ఇష్టం, ఆవాహనాది ముద్రలు చూపితే అమ్మ సంతోషిస్తుంది.
జల్పం ... వ్యర్ధ ప్రసంగములు. ఎన్ని ఏండ్లు వచ్చినా, ఎంత వయస్సు వచ్చినా, ఎంత మంది మొత్తుకొన్నా మనషులు మారరు. పనికి మాలిన విషయముల మీద అనవసరమైన చర్చ, ఎదుటి వారిని సూటి పోటీ మాటలతో కుళ్ళ పొడవడము, విమర్శించడం  ఇదే అలవాటు. ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనము? దీని వలన ఓరిగేది ఏమిటి? ఎవడి పుణ్యము వాడిది, ఎవడి కర్మ వాడిది. నీవు ఏమీ చేయలేవు. నీవు ఆపలేవు.  జ్ఞానము అనంతము. ఎవడు మూట కట్టుకొన్నది వాడికే స్వంతము. వాడు స్వర్గానికి పోతాడు, నీవు నరకానికి పోతావు చివరకి. డబ్బును దోచుకోవచ్చు కానీ జ్ఞానమును దోచుకోలేవు. ఎదుటి వాడిని విమర్శించడము, ఎగతాళి చేయడము. అవసరమా. చివరకు నీకు ఉపయోగము ఏమిటి? దొరికిన కాస్త సమయము కూడా భగవంతుని సేవలో ఉపయోగిస్తే, నలుగురికి నాలుగు మంచి మాటలు చెబితే. భాగవత కధలు గురించి చర్చిస్తే ఎంత మంచిది. ఇకనైనా మారు, కాలము మించి పోతున్నది దొరికిన పది నిమిషములు అయినా సరే కృష్ణా, గోవిందా అను,  వ్యర్ధ ప్రసంగములు మాను అని వాత పెట్టి శ్రీ గురువులు మనకు చెబుతున్నారు.

యోగరతో వా భోగరతోవా సంగరతో వా సంగవీహినః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ ||

శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం పరాత్పరే
      యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/26-06-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/
 www.facebook.com/sribhaskaranandanatha/


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.