సౌందర్యలహరి -
భాస్కర ప్రియ – 26
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా
మహాసంహారేzస్మిన్విహరతి
సతి త్వత్పతిరసౌ || 26 ||
తల్లీ ! జగజ్జననీ! మహాప్రళయం సంభవించిన సమయంలో బ్రహ్మ
పంచభూతాలలో లయమవుతున్నాడు. మహావిష్ణువు నిర్లిప్తుడవుతున్నాడు. యముడూ వినాశనాన్ని
పొందుతున్నాడు. కుబేరుడు కాల ధర్మం చెందుతున్నాడు. పదునల్గురు మనువులు, ఇంద్రులు కన్నుమూస్తున్నారు. కాని ఓ పతివ్రతా!
ఆ సమయంలో కూడా నీ భర్త సదాశివుడు, నీ పాతివ్రత్య మాహాత్మ్యం వల్ల, విశృంఖలుడై స్వేఛ్ఛగా విహరిస్తున్నాడు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
“భాస్కర
ప్రియ” -
(భాస్కరానందనాథ
భావము)
భవానిని సన్నుతించ, ‘భాస్కర ప్రియ’ అను నామఁబున నే తెల్పేద నా
భావంబు, విభుద
జనులు మెచ్చంగ, భక్తి
తోడన్ భాస్కరా !
పై శ్లోకములో
జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క పాతివ్రత్య మాహాత్మ్యం ను తెలియ జేస్తున్నారు.
శివ రూపం శక్తి రూపం బ్రహ్మ స్వరూప రూపకమ్,
త్రిపురాం పరమేశానీం మహా ప్రళయ సాక్షిణీమ్ ||
అంత్యములో, మహా ప్రళయ కాలంలో, యుగాంతము నందు పరమేశ్వరుడు, పరమేశ్వరీ సాక్షులుగా ఉంటూ
జరుగుతున్న ప్రళయాన్ని చూస్తూ వుంటారు. అదిగో మహా ప్రళయం వీక్షించండి.
సృష్టిలో ఏదియునూ క్రొత్తగా సృష్టించబడదు, పూర్తిగా నశింప
బడదు. ప్రతి పదార్ధమూ ప్రతి జీవి ఒక రూపము లోనుంచి ఇంకో రూపములోకి మారుతూ పాతది
అంతమౌతూ వస్తుంది. చివరకు అన్నీ ఒకే రూపంలో కలిసి పోతాయి. ఒక పదార్ధము ఇంకో
పదార్ధము లోకి, ఒక అణువు ఇంకో అణువులోకి కలిసి పోతూ, మార్పు చెందుతూ మహా ప్రళయంలో
జీవ రాశి అంతా నాశనం అయి ఒకే ఒక పదార్ధముగా రూపాంతరము చెంది బ్రహ్మం లోకి కలిసి
పోతుంది.
జీవ రాశి అంతా పంచ భూతములలో కలిసిపోతుంది. భూమి నీటిలో,
నీరు అగ్నిలో, అగ్ని వాయువు ఆకాశంలో కలిసిపోతుంది. గ్రహములన్నీ సూర్య చంద్రులలో
కలిసి పోతాయి. సూర్య చంద్రులు ఒకటైపోతారు. సూర్యుడు సూర్యుడులో కలిసిపోతాడు.
గ్రహములన్నీ గతులు తప్పి ఒకదానిలో ఒకటి ఢీ కొని ఆకాశమంతా దుమ్ము ధూళితో నిండి,
సూర్యుడు కప్పబడి పోతాడు. గ్రహాంతరాలములన్నీ ఏకమై పోతాయి. మొత్తం బ్రహ్మాండము లోని
ప్రతిదీ ఒక దానిలో ఒకటి కలిసి పోతూ చివరకు పంచ బ్రహ్మాలలో కలిసి పోతుంది. పంచ
బ్రహ్మలు త్రిమూర్తులుగా మారుతారు. ఆ త్రిమూర్తులు ఒకరిలో ఒకరు కలిసి, త్రిగుణములు
ఏక గుణమై ఒకే ఒక శక్తిగా మారిపోతుంది. ఆ మహా శక్తియే నిర్గుణాకారమైన ఒక
బ్రహ్మాండమైన మహా కారణ బిందువుగా రూపాంతరము చెందుతుంది.
శ్లో||శివశక్తి సమాశ్లేష స్ఫుర ద్యోమాంత రేపునః ,
ప్రకాశాయతీ విశ్వం సా సూక్ష్మ రూప స్థితం సదా.
బీజ రూపా
మహాముద్రా సర్వసిద్ధి మయేస్థితా ........యోగినీ హృదయం
ప్రళయం సంభవించినప్పుడు జగత్తులోని జీవ రాశి అంతా నాశనమయి
పోతుంది. ఈ జీవులలో అన్నీ ముక్తిని పొందవు. కొన్నిటికి ప్రారబ్ద కర్మ ఇంకా ఉంటంది.
అటువంటి జీవులు తమ ప్రారబ్ద విశేషములతో మాయలో కలిసి పోతారు. ఆ మాయ చిచ్చక్తిగా మారి
బ్రహ్మానందము ననుభావిస్తూ మిగిలిన జీవులతో కలిసి పరబ్రహ్మ యందు సామరస్యము
పొందుతుంది. ఈ పరిస్థితులలో పరబ్రహ్మము పూర్ణ బిందు రూపుడై మహా కారణ
బిందువుగా అమ్మతో కలిసి ఉంటాడు. మర్రి
విత్తనంలో పెద్ద మర్రి వృక్షము దాగి వున్నట్లు. ఈ విశాలమైన విశ్వమంతా, సృష్టి అంతా
సూక్ష్మ రూపం లో, బీజ రూపం లో దాగి వుంటుంది.
ఒకే తత్వము, ఒకే గుణము, ఒకే రూపము, ఒకే ఒక బిందువు. అదే
బ్రహ్మ పదార్ధము. అదే పర బ్రహ్మము. అదే పరమాత్మ. ఆయనే సదా శివుడు.
శ్రు|| సర్వం ఖల్విదం బ్రహ్మ.....చాందోగ్యోపనిషత్తు.
........ఏక మేవా ద్వితీయం......తన కంటే రెండవది లేక సర్వము
తానే యైనది బ్రహ్మము.
నామ రూపాత్మకమగు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయివున్నది. ఈ
జగత్తు దాని నుండియే కలిగినది, దాని యందే లయ మగుచున్నది.
శ్లో|| తన్మయీం పరమానంద నందితాం స్పంద రూపిణీం,
నిసర్గ
సుందరీం దేవీం జ్ఞాత్వా స్వైరము పాసతే || ..... యోగినీ హృదయం
పరదేవత తానే మంత్ర తంత్రము అయివున్నది. శక్తి స్వరూపిణి
అయిన దేవి ప్రకాశాంశతో, శివుని తో
సామరస్యము పొంది పరమానందము పొందుచూ
సృష్టి ఆరంభ కాలమున ప్రకాశ శక్తి నుంచి విడివడి జగద్రూపము పొంది సృష్టించిన
జగత్తుకు స్థితి కల్పిస్తుంది. సంహార కాలమున పరమ శివునిలో లీనమవుతున్నది. ఈ
విధముగా జగన్మాత సృష్టి స్థితి సంహార రూపములుగా ప్రకాశించు చున్నది.
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
పంచత్వము అంటే
చావు, పంచ భావము అని అర్ధము. శరీరము పంచ భూతాత్మకము గనుక చనిపోయినప్పుడు ఆయా అంశలు
ఆయా భూతములలో కలిసిపోవును గనుక పంచత అన్నారు. పంచత అనగా మరణము అని, పంచత్వము అంటే
పంచ భూతములలో కలిసి పోవుట అని అర్ధము. పంచత లో నుంచి వచ్చినదే పంచనామా.
ప్రళయ కాలము నందు, లోకాలను సృష్టి చేసే బ్రహ్మ (విరంచి)
పంచత్వాన్ని పొందుతాడు, మరణిస్తాడు, హరి కూడా విరామము పొందుతాడు, దీర్ఘ నిద్ర లోకి
జారు కొంటాడు, తన పరిపాలన రక్షణాధికారాలు మాని విశ్రాంతి పొందుతాడు.
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్
మృత్యువు నకు అధిపతియైన యముడు (కీనాశుఁడు) సైతము మహా ప్రళయ
కాలమున నశిస్తాడు. నవ నిధులకు అధిపతియైన కుబేరుడు కూడా నిధన మౌతాడు, మరణిస్తాడు.
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి
సమ్మీలితదృశా
ఇంద్రుని పరివారమైన చతుర్దశ మనువులు కూడా కన్నులు మూసుకొని
(సమ్మీలితదృశా) గాఢ నిద్రలోకి జారుకొంటారు.
మహాసంహారేzస్మిన్విహరతి
సతి త్వత్పతిరసౌ
తల్లీ, మహా ప్రళయ కాలమున బ్రహ్మ, విష్ణువు, యముడు,
కుబేరుడు, ఇంద్రాదులు అందరూ మృతి చెందుతారు. ప్రపంచం అంతా నాశనమౌతుంది. కానీ మహాదేవుడు మాత్రం ప్రళయ కాలమున మహా
తాండవము చేస్తూ నిలబడి పోతాడు. అందరూ పడిపోతున్నారు కానీ శివుడు మాత్రం పడిపోలేదు
అమ్మా. మహాదానందముతో చిందులు త్రోక్కుతున్నాడు. ఎందుకనీ?
ఎందుకంటే అమ్మా అదంతా నీ మాంగల్యం బలం. సుమంగళీత్వం.
అందరూ పంచత్వం పొందినా శివునికి పంచత్వం లేదు. నీ పాతివ్రత్య మహిమ
అలాంటిది. ఎందుకంటే నీవు సర్వ మంగళవు కదా!
అందుకని జగద్గురువులు సతీ అని సంభోదించినారు. సతీ, సాధ్వీ, పతివ్రతా అని అమరకోశ అర్ధము.
అనన్య సామాన్యమైన పాతివ్రత్యము గలది. శివుడే భర్త అని నియమముగా గలది గాన సదాశివ పతివ్రత అయినది. శివుని వలె శివ
పత్నీత్వము ఎల్లప్పుడూ ఉండును. సర్వ మంగళములకు నిలయమైనందున సర్వ మంగళ అయినది అమ్మ.
అటువంటి తల్లి చెంతనుండగా మా అయ్యకు కొదవేమిటి?
శ్లో|| సృష్టి స్థితి వినాశానాం
శక్తి భూతే సనాతని, గుణాశ్రయే గుణమయే నారాయణి నమోzస్తుతే.
జగత్తును సృజించునట్టియు, పోషించునట్టియు, నశింపజేయునట్టియు
శక్తి గలదానవును, నిత్యవును, త్రిగుణములకు నిలయమవును, త్రిగుణ స్వరూపవును, అగు ఓ
... నారాయణీ నీకు ప్రణామములు.
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/25-06-2014 @ శ్రీకాళహస్తి
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.