Sunday, 27 April 2014

సౌందర్యలహరి- 2

సౌందర్యలహరి- 2

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్‌ విరచయతి లోకా నవికలమ్‌ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్‌ ||


ఓ మాతా! బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాటి వైకల్యం లేకుండ సృజిస్తూన్నాడు. ఈ ఇంచుకపదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో కష్టముతో  మోయుచున్నాడు . కొసరంత నీ పాద ధూలినే శివుడు చక్కగామొదిపి తన శరీరానికి విభూతిగా అలదు కొంటున్నాడు.

అమ్మా, నీ పాద కమలముల యొక్క పుప్పొడిని (పాదాబ్జ రేణువు), పాద రజస్సు లో లేశమాత్రముగ్రహించి, ఆ శక్తితో బ్రహ్మ దేవుడు సృష్టి కార్యము చేస్తున్నాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వికల్పము  రాకుండా. ఈ స్థావర జంగమాత్మక మైన ప్రపంచాన్ని, ఈ పదునాలుగు లోకాలను నీ శక్తితో చాలా సునాయాసంగా రచన చేయుచున్నాడు. నీ పాద రజస్సునే కించుక శిరస్సున ధరించి శ్రీ మహావిష్ణువు ఆది శేషు రూపములో ఈ పదునాలుగు భువనములను మోయుచున్నాడు గదమ్మా. అదే పాద ధూళిని తన శరీరానికి విభూతిగా పూసుకొని ప్రళయ కాలము నందు హరుడు సమస్త లోకములను లయము చేయుచున్నాడు గదా తల్లీ.
అంటే ఈ మూడు కార్యములను సృష్టి, స్థితి, లయములను త్రిమూర్తుల రూపములలో ఆ తల్లే చేయుచున్నది అని అర్ధము.
గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ,
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరానంద నాథ









సౌందర్యలహరి- 1

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
సౌందర్యలహరి- 1
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ,
అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి .

అమ్మా , ఓ భగవతీ సర్వ మంగళ సహితుడగు శివుడు జగన్నిర్మాణ శక్తి వగు నీతో గూడిననే కానీ జగములను సృజించుటకు సమర్ధుడు కాడు. అట్లు నీతో కూడడేని ఆ దేవుడు తాను కదులుటకు సైతము శక్తుడు కాడు. కావున హరిహర హిరణ్యగర్భులు లోనగు వారి చేతను కూడా పూజింప దగిన నిన్ను గూర్చి నమస్కరించుటకు గాని, స్తుతించుటకు గాని పూర్వ జన్మమున పుణ్యము చేయని వాడు ఎట్లు సమర్ధుడు అగును? కానేరడు.

శుభముల నొసగే ఆ పరమ శివుడు అమ్మ లేకుండా ఒక్క పని కూడా చేయ లేడు, అమ్మ లేకుండా కనీసం స్పందించను కూడా లేడు, కదలడం వేరు,స్పందన వేరు. అమ్మా నీవులేనిదే మా అయ్య ఏ పని చేయలేడు గదమ్మా, ఏ పనీచేయ డానికి కూడా తోచదు ఆయనకు. అటువంటి శక్తి స్వరూపిణివి నీవు. బ్రహ్మ,విష్ణు,రుద్రాదులు చేత నిత్యమూ పూజించ బడే నిన్ను పూజించాలన్నా, నమస్కరించాలన్నా, నీ స్తోత్రము చదువాలన్నా మేము పూర్వ జన్మలో ఎంతో పుణ్యము చేసి వుండాలి తల్లీ, లేక పోతే మా వల్ల అవుతుందా నిన్ను కొలవడం, ఎంత భాగ్యమో కదా తల్లీ నిన్ను పొగడడం. ఏ నోము ఫలమో, ఏ వ్రత, యజ్ఞ, హోమ, జప, ధ్యాన ఫలితమో తల్లీ ఈ రోజు నిన్ను తలుచుకొనే భాగ్యము మాకు కలిగినది. కరుణ జూపు తల్లీ, కరుణ జూపు.

శివ అంటే సర్వ మంగళ కరుడు, శుభంకరుడు.  సర్వ మంగళ అంటే గౌరీ, కాబట్టి శివ అంటేనే గౌరితో కూడిని వాడు.
అయ్య లోనే అమ్మ వున్నది అని మనకు అర్ధం అవుతుంది. శివ శబ్దం లోనే అమ్మ వున్నది.
శివ చక్రములు నాలుగింటి తోను, శక్తి చక్రములు అయిదింటి తోను కలిసి శివ శక్త్యాత్మకమైన  శ్రీ చక్రము శివాశివుల శరీరమై యున్నది.
సూచన:- భార్యాభర్తలు ఎలా కలిసి మెలిసి ఉండాలో ఉండాలో ఈ శ్లోకం మనకు చెబుతుంది. ప్రకృతీ పురుషులు ఆ పార్వతీ పరమేశ్వరులు. వారి అన్యోన్యత దాంపత్యం గురించి ఎంత చక్కగా భగవత్పాదులు వివరించినారో కదా. ప్రతి కార్యంలో కూడా ధర్మపత్ని యొక్క చేయూత తప్పక వుండాలి అని చెబుతుంది ఈ శ్లోకం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరానంద నాథ




SOWNDARYA LAHARI సౌందర్యలహరి - భాస్కరప్రియ - 0

శ్రీ గురుభ్యోనమః
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
సౌందర్యలహరి.

జగన్మాతను ఆది శంకరాచార్యుడు స్తుతించిన అపూర్వ గ్రంధము సౌందర్యలహరి. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. సౌందర్య లహరి అంటే అమ్మవారి సౌందర్యం యొక్క తరంగాలు. హైందవ ధర్మానికి ఆది శంకరుడు ఇచ్చిన అద్భుతమైన వరం సౌందర్య లహరి.   శంకర భగవత్పాదులు  అమ్మ వారి అఖండ తేజో రూపాన్ని వర్ణించిన అద్భుత కావ్యము.
సౌందర్య లహరి స్తోత్రా విర్భావం గురించి ఒక కధ చెప్పబడుతుంది. ఒకనాడు, ఆది శంకరుడు స్వయంగా కైలాసం వెళ్ళాడట. అక్కడ వ్రాసి ఉన్న ఒక శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రింది నుండి చెరిపేశాడట. అది మానవులకు అందరాని అత్యంత గుహ్య విద్య గనుక గణేషుడు అలా చేసాడు. అలా శంకరుడు మొదటి 40 శ్లోకాలు మాత్ర,మే చదివాడు. తను చదివిన 40 శ్లోకాలు, వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యుడు రచనం చేసాడు. ఆ వంద శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కధకు వివిధ రూపాంతరాలున్నాయి. ఏమయినా మొదటి 40 శ్లోకాలు యంత్ర తంత్ర విధాన రహస్యాలు తెలుపుతుండగా తరువాతివి శ్రీమాత యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నాయి.
సౌందర్యలహరి ఒక స్తోత్రము, ఒక మంత్రము, ఒక తంత్రము, ఒక యంత్రము.

ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం
ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.
ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంధం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.
సౌందర్యలహరి రెండుభాగాలలో కనిపిస్తుంది - ఆనందలహరి మరియు సౌందర్యలహరి. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు ఉన్నాయి. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్ట పరుస్తున్నాయి. సౌందర్యలహరి అన్న పేరులో సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములతో పంచదశీ విద్య కనిపిస్తుంది.
అటువంటి ఆమహాతల్లి కి నమస్కరిస్తూ, నా తృప్తి కొరకు, నా ఆనందం కొరకు  అమ్మ తత్వాన్ని రోజుకొకటి ఇక్కడ వ్రాసుకొంటూ వస్తాను...

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/09-08-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/

Monday, 13 January 2014

శ్రీకాళహస్తి – దక్షిణ కైలాసం -2



ఆలయ నిర్మాణ పద్ధతి :-
భారత దేశమందలి ఆలయముల వలే గాక శ్రీ కాళహస్తీశ్వర ఆలయ నిర్మాణములో నొక ప్రత్యేకత గలదు. ఇచ్చట వినాయకుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, దక్షిణామూర్తి, అమ్మవార్లు ఒక్కొక్కరు ఒక్కో దిక్కునకు వెలసియున్నారు. దీనిని బట్టి జీవులు తరింప బడుటకు మూల మగు ధర్మార్ధ కామ మోక్షములను చతుర్విద పురుషార్ధ సూచనమే ఈ దేవాలయమని మనస్సునకు తోచు చున్నదని పెద్దల నమ్మిక. మొదటి దిన ధర్మము, ఆత్మ ధర్మముగా ఉత్తరాభి ముఖమైన శ్రీ పాతాళ గణపతి ఉనికిలో తెలియనగును. రెండవ అర్ధము ఆత్మ జ్ఞానోపదేశానార్ధముగా ఉమా దేవి స్వరూపమైన శ్రీ జ్ఞాన ప్రసూనామ్భికా దేవి తూర్పు ముఖముగా నిలిచి ముముక్షువులకు భోధించు చుండును. మూడవదయిన కామము దక్షిణ ముఖముగా నుండి మహా ద్వారమునకు ఎదురుగా సత్య శివ సుందర దక్షిణామూర్తిగా, గురు స్వరూపములో జీవులకు ఇహ పర కార్యంబులు సిద్దించుట తధ్యమని తెలుపు చున్నారు.   
తుదిగా మోక్షాధికారి అయిన పరమ శివుని స్వరూపమగు శ్రీ కాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖముగా నిలిచి అస్తమయ సూర్యుని మూలమున జీవునకు మరణము తధ్యమని తెలుపుచూ, శివ సాయుజ్య ప్రాప్తికి ప్రయత్నం జేయవలెను అని మనకు సూక్ష్మ సందేశము ఇచ్చు చున్నాడు.  ధర్మార్ధ కామ మోక్షములకు ఒక ప్రతీకయే శ్రీ కాళహస్తీశ్వరాలయము.
శ్రీకాళహస్తీశ్వర మహత్యము:-
శ్రీ కాళహస్తీశ్వర స్వామి స్వయంభువు. శ్రీ అనగా సాలె పురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు జంతువులు శివ భక్తి వలన సాయుజ్యము పొంది శివునిలో కలిసి పోయినవి. అందువలన ఇచ్చట స్వామి వారికి శ్రీ కాళహస్తీశ్వరుడనియు, ఈ పురమునకు శ్రీ కాళహస్తీ అనియు పేరు వచ్చెను.
సాలె పురుగు – శివ సాయుజ్యము:-
కృత యుగములో చెలది పురుగు తన శరీరము నుంచి వచ్చు సన్నని దారముతో కొండపై నున్న శివునకు గుళ్ళు గోపురములు ప్రాకారములు కట్టి శివుని పూజించు చుండెను. ఒకనాడు శివుడు పరీక్షించదలచి అక్కడ మండుచున్న దీపము తగిలి సాలీడు రచించిన గుడి గోపురములు తగుల బడి పోవునట్లు చేసెను. ఇది చూసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రత్యక్షమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనేను. అప్పుడు సాలీడు తనకు మరల జన్మ లేకుండా చేయమని కోరుకొనగా, శివుడు సమ్మతించి సాలీడును తనలో ఐక్యము చేసుకొనెను. ఈ విధముగా సాలీడు శివ సాయుజ్యము నొందినది.
నాగు పాము – ఏనుగు శివారాధన చేసి తరించుట:-
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది. ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినమున శివ లింగమునకు పూజ చేసి పోవుచుండెను. త్రేతాయుగము ముగిసి, ద్వాపర యుగము వచ్చినది. అప్పుడు ఒక ఏనుగు శివ లింగమునకు పూజ చేయ తలచి సువర్ణ ముఖి నదిలో స్నాన మాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వ దళములు తెచ్చి, పాము సమర్పించిన మణులను త్రోసి వేసి, తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములతో నలంకరించి పూజించి వెడలి పోవు చుండెను. మరునాడు ఉదయం పాము వచ్చి తాను  పెట్టి వెళ్ళిన మణులను గానక దానికి బదులు బిల్వములు, పుష్పములు గాంచి పాము మనస్సు చాలా బాధపడి, యధాప్రకారముగా వాటిని త్రోసి వేసి, శివున్ని మణులతో పూజించెను. ఇలా కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు, ఏనుగు ఉంచిన పూలను పాము శుభ్ర పరచి తమ ఇచ్చానుసారముగా పూజ చేసి శివున్ని ఆరాధించు చుండెను. ఒక రోజు పాము విసుగు చెంది తన మణులను తొలగించిన ఆ ప్రాణి పై కోపము చెంది కారణము తెలుసుకోన గోరి ప్రక్కనే యున్న పొదలో దాగి పొంచి ఉండెను. అంత వాడుక ప్రకారము ఏనుగు పూజకు వచ్చి, తన పూజ మొదలు పెట్టెను. తొండముతో మణులను త్రోసి వేయుచుండెను. అది గమనించిన పాము కోపముతో తన శత్రువైన ఏనుగు తొండములో దూరి కుంభస్థలమున నిలిచి దానికి ఊపిరి ఆడకుండా చేసెను. ఈ బాధకు ఏనుగు తాళజాలక ఈశ్వర ధ్యానముతో తొండముతో శివ లింగమును తాకి శిరస్సును గట్టిగా రాతికి మోది తుదకు ప్రాణములను విడిచెను. ఆ శిలా ఘాతమునకు పాము గూడా చచ్చి బయట పడినది. పరమ శివుడు వాటి భక్తికి మెచ్చి రెంటికీ మోక్షమును ప్రసాదించెను. ఇద్దరు తమ నిజ స్వరూపములతో రుద్ర గణములుగా మారి స్వామి వారిలో ఐక్య మొందిరి.
ఈ స్మృతి చిహ్నముగా పాము శిరోభాగమున, ఏనుగు సూచకముగా రెండు దంతములు, సాలె పురుగు అడుగు భాగమున తన లింగాకృతిలో ఐక్య మొనరించుకొని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా నాటి నుంచి దర్శనమిచ్చు చున్నాడు. ఆనాటి ఈ పుణ్య క్షేత్రము “శ్రీకాళహస్తీ” అని పేరు గాంచెను.
హర నమః పార్వతీ పతయే నమః
ఇంకా వుంది....... మీ
శ్రీ భాస్కరానంద నాథ/శ్రీకాళహస్తి  //  http://vanadurga-mahavidya.blogspot.in/






Sunday, 5 January 2014

నాయన - శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని జీవిత చరిత్ర



నాయన - శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని జీవిత చరిత్ర-దీనిని రచించిన వారు శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారు. 

నాయన - భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి ముఖ్య శిష్యులలో ప్రధమముగా చెప్పుకోవలసిన వారు. 

శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 17-11-1878 లో జన్మించిరి.

వీరు తమ పదియేండ్ల వయసు నందే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదము నందు అసమాన ప్రతిభ చూపినారు.

వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని 'కావ్యకంఠ' బిరుదమును పొందిరి.

వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు. 

అయినను ఇంకా సంతృప్తి పడక - ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి '....... తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను.... ' అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:

1. " 'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు. 

2. జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.

గణపతిముని వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక' అని పలికెను. 

'సరే, నాయనా' యని రమణుడు దానిని స్వీకరించెను.

అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి.

తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి (1922 వేసవి).

గణపతిముని ఉమా సహస్రము, శ్రీ రమణ గీత, శ్రీ రమణ చత్వరిమ్సత్, ఇంద్రాణి సప్తశతీ, మహా విద్యాది సూత్రావళి, గీతమాల, విశ్వమీమాంస, మొదలగు గ్రంధములను రచించెను. మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షి సంస్కృతములో రచించిన 'ఉపదేససారము' నకు వ్యాఖ్యానము రచించిరి.

'నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని 25-07-1936న తమ భౌతిక శరీరమును వీడిరి. 

ఈ దివ్యపురుషుని భౌతిక దేహమంతరించినను, తన గ్రంధములందు బోధరూపమున ప్రకాశించుచున్నారు.

నాయన కలకత్తా కి 24-11-34 న వచ్చి శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారి ఇంట్లో బస చేసితిరి. వీరి ఆదరాభిమానములకు సంతసించి, నాయన షుమారు ఒకటిన్నర సంవత్సరములు కలకత్తా లో వీరి దగ్గర వుండిరి. ఆ సమయములో ప్రతిరోజూ నాయన వీరికి అనేక ముఖ్య విషయములను బోధించెడివారు.. ముఖ్యముగా లక్ష్మికాంతము గారి కోరిక మేర నాయన గారు స్వయముగా తమ జీవిత చరిత్ర, ఉమా సహస్రము నకు అర్ధము మరియు వ్యాఖ్యానము,ఇంద్రాణి సప్తశతీ యొక్క అర్ధము మరియు వ్యాఖ్యానము, విశ్వమీమాంస వివరణము, మొదలగు విషయములు బోధించిరి. గణపతి ముని గారు (వీరనారి సత్యప్రభ అను కథను) 'పూర్ణ' అని సంస్కృత భాష యందు వ్రాసి, 'పూర్ణ' అని తెలుగులో వ్రాసిరి. (ఈ కథను భారతి పత్రికలో అచ్చు వేసిరి).

గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు. 

భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. 

ఈ జీవిత చరిత్ర మొదట 1958 లోను, తదుపరి 1964,1998,2001 మరియు 2013 ప్రచురింపబడినది.

వేల రూ 250/- + Postage. ప్రతులకు jvslakshmi@gmail.com సంప్రదించండి. ధన్యవాదములు

 

​Phone:-  09840119425​


--

మీ

శ్రీ భాస్కరానంద నాథ

 

Tuesday, 31 December 2013

శ్రీకాళహస్తి – దక్షిణ కైలాసం - 1


శ్రీకాళహస్తి – దక్షిణ కైలాసం - 1

"భూమౌ దక్షిణ కైలాసే ప్రవేశాన్ముక్త ఏవ" ... అను ప్రమాణం గలిగి ప్రాణులకు ముక్తిని కరతలామలకముగా నొనర్చి, దక్షిణ కైలాసముగా, దక్షిణ కాశిగా వెలిగిన ఈ పుణ్య క్షేత్రము యొక్క మహిమ ఎంతనియు వర్ణింపవచ్చును. కృతయుగాది నాల్గు యుగములయందును వరుసగా ఈ క్షేత్రము నందు వాయలింగముగా, బంగారు, వెండి, తామ్ర, శిలా మూర్తి రూపమున భక్తులకు దర్శనము ఇచ్చుచు, ఆ పరమ శివుడు జీవులను కృతార్ధులను జేయుచున్నాడని స్థల పురాణము తెలుపుచున్నది.
బ్రహ్మ,విష్ణు, ఇంద్రుడు, వాయువు మున్నగు దేవతలు, వశిష్ట, అగస్త్య, భరద్వాజ. రోమశాది మహర్షులు సాలెపురుగు.పాము, ఏనుగు మొదలగు జంతువులు కూడా ఇచ్చోట తరింప గలిగినవి. మరియు కన్నప్ప, నత్కీరుడు, వేశ్య కన్యకల వలె ఎందఱో భక్త వరులు ఇచ్చట శివైక్యము నందిరి. జాతి మత వర్గ వివక్షతల కతీతమై ఈ క్షేత్రము శివ క్షేత్రములలో తలమానికమైనది.  శ్రీ ధూర్జటి మహాకవి శివున్ని మెప్పించి శ్రీకాళహస్తీశ్వర మహాత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం ఇచ్చోటనే రచించినారు. ఎందఱో మహానుభావులు ఇచ్చట నివసించి, స్వామిని మనసుతో, తనువుతో సేవించి తరించినారు. సర్వ జీవులకు మోక్షమివ్వ గల క్షేత్రము   శ్రీకాళహస్తి.  పిలిస్తే పలికే దైవం, భక్త సులభుడు, భక్త వత్సలుడు, కరుణామూర్తి,  భోలా శంకరుడు ఈ మహా దేవుడు. ఎన్నో ప్రమాణములతో మోక్షమోసగే మోక్ష పురిగా, దక్షిణ కైలాసముగా, దక్షిణ కాశిగా వెలుగొందినది శ్రీకాళహస్తి.
ఇక మాయమ్మ కరుణామూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి:
పార్వతిదేవికి పరమశివుడు పంచాక్షరీ మంత్రమునులను భోధించి నిశ్చల చిత్తముతో జపింప వలయుననేను. జపము సేయునప్పుడు ఆమెకు మంద బుద్ధి ఆవరించి నియమము విస్మరించెను. అపుడు శివుడు కోపించి ఆమెను భూమిపై మానవ స్త్రీగా అవుతావని శపించెను. అపుడామే శాప విమోచనకై శివుని ప్రార్ధింపగా భూలోకమున కైలాసగిరి ప్రాంతమున ఈశ్వరుని లింగమును పూజించుమని ఆనతిచ్చేను. పార్వతీ దేవి నారదుని సాయముతో భూమికి వచ్చి ఘోర తపంబాచారించెను. శివుడు ప్రత్యక్షమయ్యెను. ఆమె తన అర్ధాంగమును అర్ధనారీశ్వరతత్వమున నిలుపుకోనెను. అప్పటి నుండి ఆమె జ్ఞాన ప్రసూనామ్భిక అను పేరుతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సాన్నిధ్యమున వెలసినది. ప్రణవ పంచాక్షరీ జప సిద్ధిని పొంది జ్ఞాన ప్రదీప్తిని భక్త జన లోకమునకు ప్రసాదించుటచే ఆమెకు జ్ఞాన ప్రసూనాంబయను పేరు సార్ధక నామమై విరాజిల్లుతున్నది. అందుకే ఇచ్చట జ్ఞాన సిద్ది, పంచాక్షరీ జప సిద్ది త్వరగా కలుగును అని పెద్దలు చెప్పుదురు.
ఉనికి:-
శ్రీకాళహస్తి పట్టణము చిత్తూరు జిల్లాలోఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనిది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి  కేవలం 40 కి.మీ. దూరంలో, ఉత్తర వాహినియైన సువర్ణముఖి నది చెంతన వెలిసినది. ఈ క్షేత్రము చేరుటకు అన్ని వైపుల నుండి బస్సు, రైలు, విమాన సౌకర్యములు గలవు.
చారిత్ర్యాత్మిక ప్రాశస్త్యము:-
క్రీస్తు పూర్వము ఒకటి రెండు శతాబ్దములలో వ్రాయబడిన తమిళ గ్రంధములలో శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది. రెండు మూడవ శతాబ్దములలో అరవై ముగ్గురు నాయనార్లు శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరన్, సంబంధర్, మాణిక్యవాచగర్ అను వారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించిరి. మూడవ శతాబ్ధములో నత్కీర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని స్తోత్ర రూపమున కీర్తించినారు.  జగద్గురు శ్రీ ఆది శంకరుల వారు ఈ క్షేత్రమును సందర్శించి అమ్మ వారి ఎదుట శ్రీచక్ర ప్రతిష్టాపన గావించి యున్నారు. వారే స్పటిక లింగమును నెలకొల్పినారు. పల్లవ, చోళ, విజయ నగర రాజులు కాలపు శిల్ప కళా నైపుణ్యమును ఇక్కడ చూడ వచ్చును. క్రీ.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు వారు పెద్ద గాలి గోపురమును నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు. ఈ గాలి గోపురము ఈ మధ్యన కూలిపోయినది.
పూజా విధానము:-
ఈ దేవాలయమును వైదిక ఆగమ విధానములలో పంచ కాల పూజలు జరుగును. ఉదయం నుండి మధ్యాహన్నము వరకు మూడు సార్లు అభిషేకములును, సాయంత్ర సమయ ప్రదోష కాలమున ఒక అభిషేకము స్వామి అమ్మ వార్లకు జరుగును. ఇచ్చటి గురుకులులు (పూజారులు) భరద్వాజముని వంశీయులైన భరద్వాజ గోత్రీకులు మాత్రమే పూజకు, అర్చనకు అర్హులు. వారు మాత్రమే స్వామి వారిని స్పృశించెదరు. ఇచ్చట శివరాత్రికి పది రోజులు బ్రహ్మోత్సవాలు ఏటా జరుగును. మరియు దశరా రోజులలో అమ్మవారి ఉత్సవాలు ప్రత్యేకము. ఇవిగాక ఏటా రెండు సార్లు, జనవరి నెలలో కనుమ పండుగ రోజున మరియు శివరాత్రి అయిన నాలుగవ రోజున గిరి ప్రదక్షిణము జరుగును.
దక్షిణ కైలాసము – దక్షిణ కాశి
ఈశ్వరుని ఆజ్ఞ చేత బ్రహ్మదేవుడు కైలాసమున గల శిఖరములలో ముఖ్యమైన శివానందైక నిలయమును, శిఖరమును శ్రీకాళహస్తి  క్షేత్రములో స్థాపించి శివుని పూజించి ధన్యుడాయేను. దీనివలన శ్రీకాళహస్తిలో వెలసిన పర్వతమునకు దక్షిణ కైలాసము అని పేరు వచ్చెను.
శ్రీకాళహస్తీశ్వరాలయము నానుకొని సువర్ణముఖి నది ఉత్తర వాహినిగా ఆలయమునకు ఆనుకొని ప్రవహించు చున్నది. పశ్చిమ భాగమున తిరుమంజన గోపురమున ఎదురుగా నున్న నదీ స్నాన ఘట్టమునకు మణికర్ణికా ఘట్టము అని పేరు. కాశీ వలె ఇచ్చట ఉత్తర వాహిని నదియు, మణికర్ణికా స్నాన ఘట్టమును నుండుటచే దీనికి దక్షిణ కాశీయని పేరు గలిగినది. ఇక్కడ కూడా శివుడు జీవులకు తారక మంత్రోపదేశముగా గావించు చున్నాడని పెద్దల ఉవాచ.
....... ఇంకా వుంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో, మీ కందరికీ ఈ నూతన సంవత్సరములో శ్రీ జ్ఞానప్రసూనామ్భిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శన భాగ్యము కలగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ
మీ
శ్రీ భాస్కరానంద నాథ/శ్రీకాళహస్తి

Saturday, 3 August 2013

శ్రీ మహాలక్ష్మి సాధన – 5



శ్రీ మహాలక్ష్మి సాధన – 5

శ్రీసూక్త రహస్యార్ధము
 

వేదముల యందు మహా శక్తి వంతమయిన మంత్రములలో పురుష సూక్తము,                     శ్రీ సూక్తము, నారాయణ సూక్తము, దుర్గా సూక్తము మొదలగునవి వేదమునకు శిరస్సు వంటివి.  వేదము అంటే జ్ఞానము, జ్ఞానమంటే వెలుగు, వెలుగు అంటే ఆనందము,   ఆనందమే శ్రీమహాలక్ష్మి. వేద స్వరూపిణి, వేద మాత అయిన శ్రీమహాలక్ష్మి యొక్క మంత్ర౦, వేదాన్తర్గతమైన శ్రీసూక్తము, సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము.  

శ్రీ సూక్తము యొక్క విశేష ప్రాశస్త్యము గురించి ఇప్పుడు మనము చర్చించుకొనేదము.

జీవుల పుట్టుకకు కారణమైన ప్రకృతి పురుషులలో ప్రకృతి స్వరూపిణి యైన జగన్మాతయగు శ్రీ మహాలక్ష్మిని ఉపాసించు మంత్రమే శ్రీ సూక్తము. ముగ్గురమ్మలలో ఒకరైన శ్రీదేవి  ఈ సూక్తమునకు అధిష్టాన దేవత. పదిహేను ఋక్కులతో, పదిహేను వేదమంత్రములతో శ్రీ మహాలక్ష్మిని కీర్తింప బడినది. పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు గల 15 రోజులలో, 15 కళలతో, రోజుకు ఒక్కో కళ చొప్పున వృద్ది చెందుతూ పౌర్ణమి నాటి చంద్ర బింబములో షోడశిగా వెలుగొందే జగన్మాత యొక్క చంద్ర కళకు రహస్య సంకేతమిది.  గురుముఖత: నేర్చుకొని, స్వరయుక్తముగా సామాన్యుడు సహితము ఈ సూక్తమును ఉపాసించ వచ్చును.

దారిద్ర్య నాశనము కొరకు, దుఖ నాశనము కొరకు, కష్టములు తొలుగుట కొరకు, అన్న వస్త్రములు సమృద్ధిగా ఉండుట కొరకు, సౌఖ్యము, సౌభాగ్యము, సౌందర్యము కొరకు ఈ ఉపాసన చేయవచ్చును. అష్ట్యైశ్వర్య సిద్ధి, అధికార ప్రాప్తి, మహా భాగ్యము, భోగము, ఆనందము, సుఖ సంతోషముల కొరకు, శాంతి కొరకు, సత్సంతానము, వంశాభి వృద్ధి,    మోక్ష ప్రాప్తి కొరకు ఈ శ్రీ సూక్త పఠనము చేయుట చాలా చాలా ఉత్తమము.

వేదములను, మంత్ర శాస్త్రమును ఔపోసన పట్టిన వారికి మాత్రమే, నిగూడార్ధముతో ఉన్న ఈ మంత్ర సూక్తము యొక్క రహస్యములు తెలియును.  ఐదు వందల సంవత్సరములకు పూర్వము శ్రీ విద్యారణ్య మహా స్వామి శ్రీసూక్త రహస్యార్ధములను తమ భాష్యములో చాలా వివరముగా తెలిపి వున్నారు. భక్తీ, గౌరవములతో శ్రీసూక్త ఉపాసనా మంత్ర రహస్యములను తెలుసుకొనవలెనని ఆసక్తి కలిగిన వారు ఇది పఠి౦చి సకల భోగ భాగ్యములను, ఆనందములను  పొందగలరని ఆశిస్తూ. సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము ఈ శ్రీసూక్తం. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. శ్రీసూక్తంతో అమ్మ వారికి  అభిషేకము చేయడం లోకోచారము.

1.        హిరణ్య వర్ణాం హరిణీ౦ సువర్ణ రజతస్రజాం

              చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా

బంగారు వర్ణముతో మెరయుచు అష్ట్యైశ్వర్యము లను ప్రసాదించునది, హ్రీంకారము కలిగినది, విష్ణువును కలిగినది, సూర్య మరియు చంద్ర నాడులను మెడయందు హారములుగా కలిగినది, చంద్ర సహోదరి, నారాయణ శక్తి అయిన శ్రీ దేవి నన్ను ఆవహించు గాక.
 

౨.  తాం మ ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం |

     యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషా నాహమ్ ||

యజ్ఞ సంపదల నిచ్చు ఓ అగ్ని హోత్రుడా, అష్ట్యైశ్వర్యములను, సిరి సంపదలను, కామధేనువును, మంది మార్బలము, బంధు మిత్ర పరివారమును ప్రసాదించు,                ఏ సమయములయందును మమ్ములను విడువకుండా ఉండునట్లుగా ఆ శ్రీ దేవిని             మా యందు ఆవాహన చేయుము.

౩.    అశ్వపూర్వా౦ రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ |

       శ్రియం దేవీ ముపహ్వాయే శ్రీర్మాదేవీ జుషతామ్ |

ఇచ్చట అశ్వములనగా ఇంద్రియములు, రథమధ్యాం అనగా రథమనేడి శరీర మధ్యమున అనగా మనస్సునందు ఆసీనురాలైన సామ్రాజ్యలక్ష్మీ, గజముల ఘీంకారముతో మేలుకోనేడి ఆ శ్రీ దేవిని శ్రద్ధాభక్తులతో పూజించు చున్నాను. మాతృమూర్తి అయిన ఆ దేవి నన్ను ప్రేమతో  అనుగ్రహించు గాక.  ఈ శ్లోకము ప్రతి దినము సహస్రం చేసిన అధికారం దక్కుటయే గాక, ఎల్లకాలం నిలబడుతుందని దుర్గా కల్పము నందు తెలుపబడినది.

౪.       కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం,          

         పద్మేస్థితాం పద్మ వర్ణాం తామిహోపహ్వాయే శ్రియం ||

బంగారు వర్ణముతో తయారయిన ప్రాకారమునందు నివచించేడిది, జీవుల మనస్సులయందు ఆర్ధతను కలిగించునది, అన్ని కోర్కెలను తీర్చి, జీవులకు తృప్తిని కలిగించునది, పద్మము నందు ఆసీనురాలై యుండెడిది, పద్మము వంటి వర్ణముతో ప్రకాశించునది అయిన శ్రీ మహాలక్ష్మి దేవిని   శ్రద్ధా భక్తులతో ఆశ్రయించు చున్నాను.

ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ పఠి౦చుచున్న శ్రీ దేవి యొక్క కృపగలిగి, సమస్త కోరికలు తీరి, జీవితమును సంపూర్ణ ఆనందముతో అనుభవించ గలరు.
 

౫.    చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం,  శ్రియం లోకే దేవ జుష్టాము దారాం

          తాం పద్మినిమీం శరణ మహం ప్రపద్యే అలక్ష్మీర్యే నశ్యతాం త్వాం వృణే ||

చంద్రుని వోలె ప్రకాశించునది, ప్రకృతి యందు విలీనమైనది, తెల్లటి యశస్సు చేత నలుదిక్కులు ప్రకాశించునది, కుండలినీ శక్తిని హృదయ పద్మము నందు వికసింప చేయునది, “ఈ౦” అను బీజాక్షరము చేత ద్యానింప బడునది, దారిద్ర్య దేవతను తరిమివేసి, అష్ట్యైశ్వర్యము లను సిద్ధింప జేయునది అయిన ఆ శ్రీ దేవిని అహం విడిచి శరణు జొచ్చుచున్నాను.

ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న అమ్మ అనుగ్రహముతో అఖండ సంపదలు ప్రాప్తించును.
 

౬.   ఆదిత్య వర్ణే తపసోzధిజాతో వనస్పతిస్తవ వృక్షోzధ బిల్వః

       తస్య ఫలాని తపసానుదంతు బాహ్యాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ: ||

సూర్య భగవానునితో సమానమైన తేజస్సుతో ప్రకాశించు శ్రీదేవిని, శ్రీ మహాలక్ష్మి అధిష్టాన దేవతగా ఉండేడి బిల్వ వృక్షము క్రింద తపమాచరించు మహాలక్ష్మి యంత్రమునకు పూజలు చేసి మారేడు ఫల సమిధులతో పూర్ణాహుతి చేసిన,  ఆ శ్రీదేవి లోపల, బయట వుండే మాయను పూర్తిగా తోలగించి, జీవుని ఆవహించిన దారిద్ర్యమును నశింప చేయును.

ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న, జన్మ జన్మల

దారిద్ర్యము కూడా నశించును.
 

౭.    ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ

       ప్రాదూర్భూతోzస్మి రాష్ట్రే zస్మిన్ కీర్తి మృద్ధి౦ దధాతు మే ||

యక్షులకు అధిపతి, అనంతమైన సంపదలు నిచ్చునది కుబేర మంత్రము, అఖండమైన యశస్సును ఇచ్చేడి చింతామణి మంత్రమును రెండింటితో పాటు ఈ ఏడవ శ్లోకమును జపించిన శ్రీ దేవి మర్త్య లోకమున లేదా జీవుని శరీరము నందు సంపూర్ణారోగ్యము కలిగింప చేసి, అష్ట్యైశ్వర్యములను, కీర్తిని పెంపొందించును గాక.

ఈ శ్లోకమును భక్తితో 44 లక్షల జపము చేసి పూర్ణాహుతి చేసిన వారికీ దారిద్ర్యము నశించి, సంపూర్ణారోగ్యము,   అష్ట్యైశ్వర్యములు కలుగును.
 

౮.   క్షుత్పిపాసా మలాం జ్యేష్టా౦ అలక్ష్మీర్ నాశయామ్యహం

       అభూతి మ సమృద్ధి౦చ సర్వాన్ నిర్ణుద, మే గృహాత్ ||

  అలక్ష్మి దేవి, గృహమనేడి శరీరమును ఆవహించిన దారిద్ర్యమును కలుగ చేయును. జ్యేష్టా దేవి ఆవహించిన ఆకలి, అతినిద్ర, దప్పిక, ఆశుభ్రతను కలిగించు బద్ధకము వంటివన్నీ శరీరము యందు కలుగ చేయును, వీటి ఫలితముగా దారిద్ర్యమును అరిష్టములు సంభ విన్చును. కావున ఈ శ్లోకమును పఠి౦చిన ఇటువంటి దారిద్ర్యము అరిష్టము లన్నింటిని శ్రీదేవి నశింపచేసి సౌభాగ్య లక్ష్మిని వాని యందు ఆవహింపజేయును.

పై శ్లోకమును ప్రతి నిత్యమూ 108 పర్యాయములు జపించు చున్న ఆ దేవి కృపచే అలక్ష్మి, జ్యేష్టా దేవి ఇరువురు ఆ సాధకుని నుంచి అతి దూరముగా తొలగి పోవును.

 .     గంధద్వారా౦ దురాధర్షా౦ నిత్యపుష్టాం కరీషిణీ౦

       ఈశ్వరీం సర్వ భూతానాం తామిహోపహ్వాయే శ్రియం ||

పంచ ప్రాణముల యందు ముఖ్యమైన ప్రాణము శ్వాస యందుండును. అటువంటి ప్రాణము, ప్రాణాయామము చేయుటకు, ఉపాసించుటకు, వీలును కల్పించుతున్న ఆత్మ స్వరూపిణి, అనురాగవర్షిణీ, మాతృ స్వరూపిణి, ఈశ్వర శక్తి అయిన శ్రీదేవిని గోమయం తో అలికిన ప్రాంతము నందు ఆసీనులై ఆరాధించిన వారి యందు ధాన్య లక్ష్మిని ఆవహింప జేసి ధన, ధన్య, పశు సమృద్ధిని ప్రాప్తింప జేయును.

ఈ శ్లోకము 5000 పర్యాయములు జపము చేసి దశాంశము హోమ తర్పణము గావించి అన్న దానము శక్తి కొలది గావించిన మంత్రం సిద్దియగును. శ్వాశ మీద జయము కలిగి లక్ష్మీ కటాక్షము కలుగును.
 

౧౦    మనసః కామమా కూతిం వాచః సత్యమశీమహి

        పశూనాం రూపమన్నస్యమయి శ్రీ: శ్రయతాం యశః ||

మనస్సునందుండు కోరికలు, యిష్టములు సిద్దించుట, వాక్సిద్ధి మరియు అన్న వస్త్ర గో సంపద, రూప సంపద, లక్ష్మీ సంపదలను ఎల్లప్పుడూ నా యందు స్థిరముగా ఉంచమని శ్రీలక్ష్మీ దేవిని భక్తీ తో ఆశ్రయించు చున్నాను.

ఈ శ్లోకమును దీక్షతో మనస్సును, వాక్కును పవిత్రముగా నుంచి 8 లక్షల సార్లు జపించిన అనంతరం ప్రతినిత్యం 108 సార్లు జపించు చున్న భోగ భాగ్యములు, అన్న వస్త్రములు, గో సంపద, పాడి పంటలు అభివృద్ధి చెంది వాక్ సిద్ధి  కలుగును.
 

౧౧.     కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ

           శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ||

కర్దమ మహర్షి కోరికపై స్వయముగా లక్ష్మీ దేవి ఆయన కూమార్తేయై జన్మించినది. సర్వ జగత్తుకు మాతృమూర్తి అయినది, శరీరము నందలి మూలాధార పద్మము మొదలుకొని సహస్రార దళ కమలముల వరకు వెన్నును దండము వలే ధరించునట్టి, శ్రీ మహాలక్ష్మి నా వంశమునందు స్థిరముగా నివాసమును ఏర్పరచు కొనవలెను.

ఈ శ్లోకమును దీక్షతో లక్ష సార్లు జపించిన వారికి, సంతానముతో బాటు అష్ట్యైశ్వర్యములు కలుగును.
 

౧౨.     ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే

          నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే ||

సృష్టికి కారణమైన మన్మధుడు లక్ష్మీ దేవి పుత్రుడు. మాయ అయిన ఈ సంసార బంధములను, ఆ కామ దేవునిని జయంచ వలెనన్న నారాయణ శక్తి యగు నారాయణిని ప్రార్ధించి, ఆమె అనుగ్రహము పొంది మోక్షము పొంద వచ్చును. ఇంకను జగన్మాత స్వరూపిణి అయిన ఆ మహాలక్ష్మిని మా వంశాభి వృద్ధిని చేయమని సదా ప్రార్ధన చేయు చున్నాను.

మారేడు చెట్టు క్రింద 64,000 జపము చేసి, అన్నదానము చేసిన ఈ మంత్ర సిద్ధి కలిగి వంశాభి వృద్ధి కలిగి అమ్మ స్థిర నివాసము ఏర్పరుచు కొనును.

౧౩.    ఆర్ద్రాం పుష్కరిణీ౦ పుష్టిం పింగళా౦ పద్మ మాలినీం

         చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||

బంగారు వర్ణముతో మెరయుచున్న ఇడ పింగల నాడులు అనగా సూర్య చంద్ర నాడులను ధరించి కుండలినీ  శక్తిని మేల్కొలిపినందు వలన కలిగిన అపరితమైన ఆనందముచే కలిగిన ఆర్ధ్రతచే వచ్చిన కన్నుల యందు నీటితో తడిసినది, అన్న వస్త్రములను భక్తులకు ఇచ్చునటువంటి ఆ మహా తల్లి నన్ను ఆవహించుగాక.
 

౧౪      ఆర్ద్రాం యః కారిణీ౦ యష్టీం సువర్ణాం హేమమాలినీం

           సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||

ఆర్ద్రత చే కన్నుల యందు నీటితో తడిచినది, బ్రహ్మ దండము అనే మేరు దండమును కలిగి వుండి, అధర్మము వైపు వేడలుచున్న వారిని దండిన్చునది, బంగారు రంగు చ్చాయతో బంగారు వర్ణము కలిగిన పాదములతో సూర్యనాడి కలిగినది అగు ఆ శ్రీ మహాలక్ష్మి నన్ను ఆవహించుగాక.
 

౧౫.    తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం

          యాస్యాం హిరణ్యం ప్రభూతం గావో, దాస్యో అశ్వాన్ విన్దేయం పురుషానహం ||

యజ్ఞముచే సంపదలు నిచ్చు ఓ అగ్నిహోత్రుడా ఎవరిచే బంగారము విశేషముగా ఉద్భవించినదో, గోవులు, అశ్వములు వంటి సంపదలు, దాసీ జనములు, పుత్ర, పౌత్ర బంధు మిత్ర, పరివారములను ఇచ్చును. అట్టి శ్రీ మహాలక్ష్మీ దేవి మా యందు ఎల్లప్పుడూ ఆవహించి మోక్షమును ప్రాసాదించుగాక.

ఈ మంత్రమును ప్రతి దినము జపించిన ఆరోగ్య, ప్రతిష్ట, కీర్తి, ఐశ్వర్యములు ప్రాప్తించును.

 

౧౬.     యః శుచి: ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్వహం

          శ్రియః పంచ దశర్చ౦చ శ్రీ కామః సతతం జపేత్  ||

 

సాధకుడు ఏకాగ్రతతో ఇంద్రియములను జయించి బాహ్య అన్త్ర్యములను శుచితో నుంచుకొని ప్రతి నిత్యమూ ఆవు నేతితో అగ్ని హోత్రములో పై 15 ఋక్కులతో  ఆహుతులను వేసి యజ్ఞమును నిర్వహించ వలెను.

లేదా 15 ఋక్కులతో  15 రోజులు అఖండ పారాయణ చేసిన వారికి సర్వ కార్య సిద్ది కలుగును.

శ్రీ మహాలక్ష్మి సాధనకు అత్యంత విశిష్టమైన మంత్రములు ౧. కనకధారాస్తవము, ౨. శ్రీసూక్తము. ప్రతి నిత్యం నారాయణ సహిత శ్రీమహాలక్ష్మి దేవి యొక్క ఈ మంత్రములను పారాయణ గావించిన వారికి భగవదానుగ్రహము కలిగి మోక్ష ప్రాప్తి లభించును.
 

విద్య అంటే జ్ఞానము. జ్ఞానము అంటే గంగ లాంటిది. అది ఎప్పుడూ ప్రవహిస్తూనే వుండాలి గాని, అది నిలిచి పోకూడదు. నిలిస్తే నీరు పాడౌవుతుంది. ఈ జ్ఞాన గంగ ఏ ఒక్కరి సోత్తో కాదు, ఇది అందరిది మన అందరిది. దీనిని గోప్యముగా ఉంచ కుండా అందరికీ అందు బాటలోకి తీసుకొని రావాలనే మన మహర్షులు ఎంతో తాపత్రయ పడినారు. అర్హత కలిగిన వారు అందరూ ఈ విద్యను అభ్యసిస్తూ ముందుకు కదిలి ఆ జగన్మాత పాదములు పట్టుకో గలరని రాబోయే శ్రావణ మాసపు పర్వ దినములలో అందరూ శ్రీహరితో గూడిన శ్రీమహాలక్ష్మీని  సాధన చేసి అమ్మ అనుగ్రహమును పొంది, అష్ట్యైశ్వర్యములు బడసి, ఆనందముతో, సుఖ సంతోషములతో పిల్లా పాలలతో తరించేదరని ఆశిస్తూ, అందరూ సుఖముగా వుండాలని కోరుకొంటూ,   అతి సులభుడు శ్రీ వరదుడు. కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తుంది అమ్మ శ్రీమహాలక్ష్మి.

లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం

దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీ మన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియాం ||

 
శ్రావణ మాసపు శుభాకాంక్షలతో,

 

మీ

శ్రీ భాస్కరానందనాథ
3-08-2013