Wednesday, 2 January 2013

02. మంత్రము – మంత్ర శాస్త్రము

02. మంత్రము – మంత్ర శాస్త్రము

మంత్రము సృష్టికి పునాది కావాలి. వినాశనమునకు కారణము కాగూడదు. మంత్రముతో పుష్పములను పూయిన్చ వచ్చును,మంత్రములతో ప్రాణములను నిలబెట్ట వచ్చును, ప్రాణములను పోయవచ్చును. అవసరమైతే ప్రాణములను తీయవచ్చును. రాళ్ల నుంచి సంగీతము పలికించ వచ్చును. వర్షము కురిపించ వచ్చును. దావాగ్నిని రగిలించ వచ్చును. సభను దిగ్భంధనము చేయ వచ్చును, అగ్నిని మంచుగా చేయ వచ్చును, వాదించేవాడ్ని మూగ వాణ్ణి చేయ వచ్చును, మూగ వాణ్ణి పలికిన్చనూ వచ్చును. క్షితిపతిని భయపెట్ట వచ్చును,  క్రోధిని శాంత పరచ వచ్చును, దుర్జనున్ని సుజనునిగా మార్చ వచ్చును. ఒక్కటేల ప్రపంచాన్నే గడ గడ లాడించ వచ్చును.  మంత్రములతో మనకు మనమే  మేలు చేసుకోవచ్చును, ఇతరులకు కీడు తలపెట్ట వచ్చును. మంత్రములతో సృష్టి చేయ వచ్చును, సృష్టి వినాశనము చేయవచ్చును. మంత్రము ఒక బ్రహ్మాస్త్రము. ఒక ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబు. మంత్రము ఒక అమృతము, ఒక కామధేనువు. కాళ్ళు లేనివారికి, కళ్ళు లేని వారికీ మంత్రముతో నయం చేయవచ్చు. మంత్రముతో మనశ్శాంతి పొందవచ్చును, మనశ్శాంతి లేకుండా చేయ వచ్చును.దుష్టులను, దుర్మార్గులను, శత్రువులను అంతమొందించ వచ్చును. మంత్రములతో కావలసిన వారిని సమ్మొహ పరిచి వశీకరణం చేసుకోవచ్చును. అవసరము లేని వారిని విద్వేషణ మంత్రములతో విడ గొట్టనూ వచ్చును. మంత్రములతో జ్ఞానమును, మోక్షమును పొందవచ్చును.మంత్రములతో ఒకడ్ని పిచ్చి వాడ్ని చేయవచ్చును. ఒక కుటుంబాన్ని నిలబెట్ట వచ్చును, ఒక సంసారమును కూలద్రోయవచ్చును. మంత్రముతో మేలు చేయ వచ్చును, కీడు తల పెట్ట వచ్చును. మంత్రము ఒక కత్తి లాంటిది, మామిడి పండు కోసుకోవచ్చును, లేదా ఒకరి పీక కూడా కోయవచ్చును.

ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. శ్రద్ధతో చేస్తే అన్ని మంత్రములును ఫలించును, అన్ని ఆటంకములను తొలగించు కోవచ్చును.

వేదము, ఆమ్నాయములు, తంత్రములు, మనకు రెండూ ఇచ్చినవి. దానితో బాటు బుద్దిని కూడా ఆ పరమ శివుడు ఇచ్చినాడు. ఏది మంచిదో మనల్నే తెలుసుకొని ఆచరించమని చెప్పినాడు.చెడిపోవాలో, బాగు పడాలో నిర్ణయము తీసుకొనే అధికారమును మనకే వదలి వేసినాడు.

సృష్టి చేయలేనప్పుడు సృష్టి వినాశనము చేయుటకు అర్హత లేదు మనకు. ఒకరికి ప్రాణములను పోయలేనప్పుడు, ఒకరి ప్రాణములు తీసే అర్హత లేదు. ఒకర్ని బ్రతికించలేనప్పుడు, ఒకర్ని చంపే అధికారము కూడా లేదు. భగవంతుడు చేసిన సృష్టికి, దాని వినాశనమునకు మనము కారణము అయినామా! ఆ పరమ శివుడు వీరభద్రుడు అవుతాడు. ఆ మహాకాళి భద్రకాళి అయి నిన్ను నీ కుటుంబాన్ని సర్వ నాశనము చేస్తుంది. దీనికి మనకు ఎన్నో తార్కాణములు పురాణములలో కనిపిస్తాయి. ఎందఱో రాక్షసులు ఈ విధముగానే దెబ్బతిన్నారు. అందరూ ఆ పరమాత్ముని బిడ్డలే అని మనము ఓర్పుతో, సహనముతో సర్దుకొని పోవాలి. ఎవడి ఖర్మ వాడు అనుభవిస్తాడులే అని ఆ పర్మాత్మునికే వదలి వేయాలి. నీ కోపము ఇంకొకడికి ఖేదము కాకూడదు. ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చిననూ మంత్రములతో ఇతరులకు కీడు తల పెట్టకూడదు. ప్రాణ హాని తలపెట్టగూడదు. ప్రేమను పంచు, త్యాగము చేయి. పెద్దలు చెప్పిన మాటలను, ధర్మమును పట్టుకొని వేద సమ్మతముగా మన నిత్య కర్మలను చేస్తాము.

మంత్ర శాస్త్రమును మానవాళి అభ్యున్నతి కొరకు వాడుకొందాము. పదిమందికి మంచి చేయడానికి వాడుకొందాము. మనము బ్రతుకుతూ మనతో బాటు సమస్త సృష్టిని బ్రతికిస్తాము. బ్రతుకు బ్రతికించు అన్న నినాదము ద్వారా మన కోప తాపములను, స్వార్ధమును బాగుగా నియిన్త్రించుకొని మంత్ర శాస్త్రమును మానవాళి మనుగడకు ఉపయోగిస్తాము. మంత్ర శాస్త్రముతో పది మందికి మేలు చేస్తాము అని ప్రతిన బూని, కంకణం కట్టుకొంటాము. స్వార్ద ప్రయోజనములకు ఇది ఎంత మాత్రము తగదు, వలదు. మనకు, మన కుటుంబ మేలుకొరకు దీనిని వాడు కొందాము. ప్రకృతి మాత ఆగ్రహానికి గురి కాకుండా ప్రకృతిని పుష్పింప చేస్తాము. మన జీవితములలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి దీనిని ఉపయోగిస్తాము. మన కోర్కెలను న్యాయ బద్దముగా, ధర్మ బద్ధముగా నెరవేర్చుకోవడానికి ఆ పరమ శివుడు నొసంగిన ఈ మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రమును పెద్దలు నిర్దేశించిన మార్గములో ఉన్నతిని పొందుటకు, బాగుగా ఉపయోగించు కొంటాము, తద్వారా మన జన్మను సార్ధకత చేసుకొంటాము.

పిల్లల చదువుకో, ఆరోగ్యమునకో, ధర్మ బద్దమైన ధనమునకో, పెళ్ళికో, సంతానము కొరకో, ఉద్యోగము కోసమో, అభివృద్ధికో, జాతకము లోని దోషములను నివారించుటకో, పెద్దల ఆరోగ్యము కోసమో, విద్య కోసమో, జ్ఞానము కోసమో, మోక్షము కోసమో, ఉన్నతమైన బ్రతుకు కోసమో, ఉన్నతమైన జన్మ కోసమో ఇలా కామ్య మైన కోరికలను తీర్చుకోవడానికి కొరకు మంత్ర శాస్త్రమును ఉపయోగించు కొంటాము. దీనిలో ఎలాంటి తప్పు లేదు. అందుకోసమే ఈ శాస్త్రము వచ్చినది.

మంత్ర శాస్త్రమును గురువు ద్వారానే నేర్చుకోవలెను. గురు ముఖతః ఈ విద్యను స్వీకరించ వలెను. మంత్రములు పుస్తకములో వున్నవి గదా అని ఆచరించ కూడదు. ఉపాసన చేయకూడదు.దానివలన చాలా అనర్ధములు జరుగును. మీకు వచ్చిన కష్టమును గురువులతో చెప్పుకొంటే,వారు అలోచించి తగిన మంత్రమును, మార్గమును తెలుపుదురు. గురువు ఆజ్ఞ లేనిదే ఏ మంత్రమును ఉపాసన చేయకూడదు. మంత్రములకు మహా శక్తి గలదు. తప్పు జరిగినదా చివరికి ఎవ్వరూ మిగులరు. మంత్రములను మోక్ష సాధన కొరకే ఉపయోగించ వలెను. విద్వంసమునకు వాడకూడదు. గృహస్థాశ్రమ ధర్మములలో వచ్చే ఓడుదుడులకు మాత్రమె దీనిని ఉపయోగించు కొనవలెను. మంత్ర, తంత్రములు ఆత్మ శ్రేయస్సుకు, పరోపకారానికీ, దు:ఖ నివృత్తికి ఉపయోగించాలి గానీ, మారణ కాండలకు ఇది ఉపయోగించరాదు. దుష్కర్మలకు, పగ ప్రతీకారములకు వినియోగించిన దాని ఫలితం కూడా కర్మ రూపేణా సంక్రమిస్తుంది. అది కూడా అనుభవించక తప్పదు ఏనాటికైనా. ఐహిక శ్రేయస్సుకు సత్కర్మ, జప సాధనలే రాజ మార్గములు. అదే ఉత్తమోత్తము.

మంత్రము, తంత్రము, యంత్రము ఈ మూడింటిని త్రిపుటి అని అందురు. దైవం మంత్రాధీనం, మంత్రం యంత్రాథిష్టితం. ఆ యంత్రం తంత్ర సమ్మిత౦. ఈ మూడూ మార్గాలు కలిసి నడిచే ప్రస్తానమే ఆచార కాండ. మంత్రం దర్శన మూలం, బీజాక్షర సంయుతం. బీజాక్షరం దైవ ప్రాణం. మనకు ఎందరు దేవతలు వున్నారో అన్ని మంత్రములు వున్నవి. ఎన్ని సిద్దులు ఉన్నాయో అన్ని మంత్రములు గలవు. మనకు ఎన్ని కోరికలు వున్నాయో వాటిని పొందడానికి కూడా అన్నే మంత్రములు గలవు. మంత్ర మూల మిదం జగత్ అని అన్నారు పెద్దలు.మంత్రం వలన దైవదర్శనం, యంత్రం వలన దైవ శక్తి, తంత్రం వలన దైవ సాన్నిద్యం కలుగుతాయి. మంత్ర, యంత్ర, తంత్రాలు భౌతిక భాధలను, ఈతి భాధలను తొలిగించటానికి మరియు కలిగించటానికీ ఉపయోగ పడుతాయి. సాధించటం తెలియక పోతే ఆచించిన ఫలితాలు అందక పోవచ్చును. అందుకే మంత్ర శాస్త్రమునకు రెండు వైపులా పదునైన కత్తులు గలవు అని పెద్దలంటారు. వినియోగంలో చాలా మెలుకవలు ప్రదర్శించాలి. వేద సమ్మతమైన మార్గముల ద్వారా మనము అన్ని ఇబ్బందులను అధిగమించి ఈ మంత్ర శాస్త్రముతో భుక్తిని, ముక్తిని పొందవచ్చును. భోగమునకు,మోక్షమునకు కారణభూతమైనదీ మంత్ర శాస్త్రము.

పంచాక్షరీ మంత్రమును ఒక నిముషమునకు వంద సార్లు జపము చేయవచ్చును. ఒక గంటకు ఆరు వేలు అగును. 84 గంటలు జపము చేసినచో 5 లక్షల 4 వేలు జపమగును. ఈ విధముగా ఒక సంవత్సరము సాధన చేసినచో, వాక్ సిద్ది కలుగును. వశీకరణ, ఆకర్షణ శక్తులు కలుగును.సంచిత పాప కర్మ అంతయూ దగ్ద మగును.

కాలం ఎంతో విలువైనది,వృద్ధా చేయకండి, మీ శక్తి సామర్ధ్యముల ననుసరించి ఏ మంత్రమో, నామముతోనో సాధన ప్రారంభించి ముక్తికి చేరువ అవుతాము అందరము.

ఉపాసన ఎలా చేయాలి? మంత్ర శాస్త్రములోని రకములు, మంత్రాక్షరముల శక్తి ... ఇవన్నీ మరో టపాలో తెలుసుకొంటాము..... సశేషం ...... సర్వం ఉమామాహేశ్వరార్పణ మస్తు.

అందరూ బాగుండాలి అనే తలంపుతో,

మీ

శ్రీ భాస్కరానంద నాథ / 02-01-2013.

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యా పూర్ణ దీక్షాపరులు. 
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.