Tuesday, 12 February 2013

శ్రీ లలితా పంచమి

అయ్యా,
15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి
ఎల్లుండి 15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి. జగన్మాత ఆవిర్భవించిన రోజు. మహత్తరమైన రోజు. రాక్షసులను సంహరించడానికి తానూ అగ్నిగుండం లో నుంచి అవతరించినది.
ఆ తల్లి బాలా త్రిపుర సుందరిగా కొలువై వుండే రోజు. అందరూ చక్కగా శ్రీ లలితా సహస్రనామములు చదువుకొని, ఆ తల్లికి పంచ పూజలు చేసి, ధూప, దీప, నైవేద్యములను సమర్పించ వలసినదిగా మనవి.
ఈ రోజు అమ్మ బాల రూపములో వుంటుంది, బాలలను పూజించండి.

అయ్యా ఈ మాఘ శుద్ధ పంచమీ (15-2-2013), వసంత పంచమీ అని, మదన పంచమీ అని, లలితా పంచమీ అని వాడుకలో పిలుస్తూ వుంటారు.
త్రిశక్తి స్వరూప మైన ఆ లలిత త్రిపుర సుందరి, వాగ్భవ రూపిణి అయిన ఆ తల్లి సరస్వతీ రూపములో రేపు కొలువై వుంటుంది.
బాసరలో రేపు చాలా కోలాహలముగా వుంటుంది. చదువుల తల్లి యైన ఆ అమ్మ వారు దేదీప్యమానముగా వెలిగి పోతూ వుంటుంది రేపు. కొన్ని వేల మంది పసి పిల్లలు తమ అక్షరాభ్యాసమును రేపు ఆమె సమక్షములో దిద్దుకో బోతున్నారు.
ఎవరైనా పసి పిల్లలు వుంటే రేపు దివ్యమైన ముహూర్తం అమ్మ సన్నిధిలో, ఎ దేవాలయములోనైనా సరే మీ పిల్లలకు అక్షరాభ్యాసము చేయించండి.
ఆ సరస్వతీ కటాక్షము మెండుగా వుంటాయి.
రేపు మానవులే కాకుండా యక్ష, రాక్షస, గంధర్వాది దేవతా బృందములు, మునులు, యోగులు ఆ తల్లిని పూజించి ఉపాసించుతారు.
ప్రాతః కాలమునందే లేచి స్నానం, సంధ్య, ధ్యానం మొదలైన నిత్య నైమిత్తిక కర్మలు ముగించుకొని స్వశాఖ పద్ధతి అనుసరించిగానీ, స్వ కుల సాంప్రదాయానుసారముగా గానీ కలశ స్థాపన చేసి, దాని ముందు పుస్తకం వుంచి రెంటి యందునూ బంగారు నాణెములు వుంచి, ఆపైన షోడశోప చారములతో సరస్వతీ మాతను పూజించవలెను.
పూజానంతరము పాలు, పెరుగు,వివిధ పిండి వంటకములు, పంచదార, తెల్ల బెల్లం, పాయసం, నేతితో వండిన గోధుమ పిండి అప్పాలు, అరటి పళ్ళు, వెన్న ... అమ్మకు నివేదన చేయాలి.
తెల్లని వస్త్రం, చందనం, తెల్ల పూవ్వుల దండ... మొదలగునవి సమర్పించాలి.
వీణా పుస్తక పాణీ, సరోజ దళ నయనా అని అంటూ కీర్తించాలి.
xxxxx సరస్వత్యై స్వాహా అనే అష్టాక్షరీ మహా మంత్రమును శ్రద్ధతో జపించాలి.
మునుపు వాల్మీకి గంగ ఒడ్డున ఈ మహా మంత్రమును భక్తీ శ్రద్ధలతో జపించి సరస్వతీ కృపకు పాత్రుడు అయి మహా కవి అయినాడు. భ్రుగువు వల్ల శుక్రుడు, బ్రహ్మ నుండి భ్రుగువు ఈ మంత్రమును పొంది ఆ తల్లి యొక్క కటాక్షమును పొందినారు. ఈ మహా మంత్రమును నాలుగు లక్షల మార్లు జపించిన వాడు సరస్వతి అనుగ్రహానికి పాత్రుడై మహా కవి, సర్వ శాస్త్ర కళా విశారదుడై సమస్త విద్వజ్జన వందితుడు అవుతాడు.
అటువంటి చదువుల తల్లికి నమస్కరిస్తూ,
నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ,
త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యా దానం చ దేహిమే.
 
25-02-2013 - మాఘ పౌర్ణమి
ఈ రోజు అమ్మ తన పరిపూర్ణ స్వరూపమతో, చతుషష్టి కళలతో లలితా త్రిపుర సుందరిగా, శ్రీ రాజ రాజేశ్వరిగా, శ్రీమత్సింహాసనేశ్వరీ గా పున్నమి వెలుగులో, చంద్ర బింబములో కొలువై భక్తుల కోరికలను ఈడేర్చేందుకు
సంసిద్దురాలై వుంటుంది. ఈ రోజు అమ్మ పెద్ద ముత్తైదు రూపములో వుంటుంది, కావున ఈ రోజు ఇంటికి వచ్చిన మొదటి ముత్తైదువును పూజించండి. ఎవరు కనిపించినా వెంటనే పసుపు, కుంకుమలను, వస్త్రములను సమర్పించండి. పౌర్ణమి నాడు అమ్మ విశేష కృపతో, ప్రేమతో నిండి వుంటుంది, అడిగిన వారికీ అడిగినట్లుగా అన్నీ తీరుస్తుంది. ఈ రోజు అమ్మ నవ్వును చంద్ర బిమ్బములో చూచిన వాడు ధన్యుడు.
ఈ రోజు అందరూ ఆ తల్లికి పంచ పూజలు చేసి, ఐదు సార్లు లలిత సహస్రనామ పారాయణ చేయవలెను. అలా చేసిన వారికి,
యత్రాస్తి భోగోన చ తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో న చ తత్ర భోగః
శ్రీ సుందరీ సేవన తత్పరాణాo
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ
నిష్కామముగా పారాయణ చేసిన వారికి బ్రహ్మ జ్ఞానము, ధనార్ధికి ధనము, కీర్తిని కోరువారికి కీర్తిని, విద్యను కోరువారికి విద్య, భోగము కోరుకోనువారికి భోగము, మోక్షము కోరుకోనువారికి మోక్షము సిద్ధించును.
అందరూ ఆ తల్లి యొక్క పరి పూర్ణ అనుగ్రహమును పొందెదరు గాక. మాయను తొలగించి బ్రహ్మ విద్యను ప్రసాదించే తల్లి ఈ తల్లి.
అమ్మ ఉపాసన మొదలు పెట్టాలను కొనే వారికి మంచి సుదినము ఈ రోజు. ఆ చిత్కళ దొరికేరోజు ఈ రోజు. అమ్మ కాళ్ళు పట్టుకోండి, మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు.
జగత్తు అంతా అమ్మ మయం . అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే.
మీ
శ్రీ భాస్కరానంద నాథ 
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.