Saturday, 9 March 2013

శ్రీవిద్య - గురువులు


మిత్రులకు నమస్కారములు

 
గురువు మంత్రమును మాత్రమే ఇవ్వగలడు, దారి చూప గలడు, కానీ ఆ దారిలో నడవవలసినది, సాధన చేయవలసినది మాత్రము శిష్యుడే. సాధన లేనిదే మంత్రము సిద్దించదు, అమ్మ అనుగ్రహించదు.

 శ్రీవిద్య అనేది కడు దుర్లభమైన విద్య, మనకు కావాలంటే రాదు అది, అమ్మ సంపూర్ణ అనుగ్రహము వుండాలి. అప్పుడే వస్తుంది.
రాగ ద్వేషాలకు లోబడిగాని, ఆశకు లోబడి గాని, విత్తమునకు గాని, మొహావేశములకు లోబడిగాని, ప్రలోభాలకు లొంగి గాని ఈ విద్యను ఇవ్వకూడదు.
కేవలం ఎవరికైతే అమ్మ మీద సంపూర్ణ విశ్వాసము వుంటుందో, భక్తీ ప్రపత్తులు వుంటాయో వారికి మాత్రమే ఈ విద్యను ఇవ్వాలి. శ్రీవిద్య మంత్ర శాస్త్రము, కడు దుర్లభమైనది, ఇది దొరికినది అంటె జన్మ ధన్యమైనట్లే.
అన్ని మంత్రముల కంటే విశిష్టమైనది ఈ శ్రీవిద్య. సాక్షాత్తు ఆ పరమ శివుడు తన ప్రియ సఖియైన పార్వతికి ఈ విద్య ఇచ్చాడు.
 

ఇది ఆది విద్య, శుద్ధ విద్య, ఆత్మ, బ్రహ్మ విద్య, వేదాలలో అతి రహస్యముగా వుంచబడినది ఈ విద్య. మూర్ఖుడికి, శఠునికి, దుష్టునికి, విశ్వాసము లేని వానికి ఈ విద్యను ఉపదేశించ రాదని శివుని ఆజ్ఞ.
శ్రీమాత యందు భక్తి గల వానికి ఈ విద్యను చెప్ప వచ్చును. భక్తి లేని వానికి ఈ విద్యను ఎంత మాత్రమూ చెప్పరాదు.
గురువు భక్తుడైన శిష్యునకు రహస్యమైనను ఈ విద్యను చెప్ప వలెను.
భర్త కిష్టమైన దేవి యొక్క ఆరాధన చేయు గృహిణికి అనుకూల దాంపత్యము కలుగును. లోపాముద్ర అట్టి గృహిణి,ఆమె ఉపాసించిన విద్య ఇది. ఆమె శ్రీమాత భక్తురాలు, ఆమె వలెనే అగస్త్యునకు కూడా ఈ విద్య దొరికినది.
ఇటువంటి శ్రీవిద్యను మొట్ట మొదట ఉపాసించిన వాడు, అగ్రగణ్యుడు ఆ పరమ శివుడే.
శ్రీవిద్యా మంత్రముల ఉపాసనచే ఆ జగన్మాత తన భక్తులకు వశమగును, అయితే ఎన్నో క్లిష్టమైన పరీక్షలు ఉండును,

శ్రీవిద్యా ఉపాసకులను చూచిన వెంటనే ఎంతటి వారైనా వారి పాదముల మీద దండము వలే క్రింద పడి నమస్కరించవలెను. శ్రివిద్యోపాసకుడు సాక్షాత్తు దేవీ స్వరూపము. శ్రివిద్యో పాసకులు బహు విచిత్రముగా కనిపించును, అతి సామాన్యముగా కనిపించును, వారి శక్తులను ప్రదర్శించుటకు వారు ఇష్ట పడరు. వారిని గుర్తించుట కూడా చాలా కష్టము. శ్రివిద్యోపాసకుడు అవిచ్చన్నమైన గురు సాంప్రదాయము లోని వాడైవుండవలెను.

 
 
మంత్రములకు మూలము శ్రీ గురు సార్వభౌములు. మోక్షమునకు మూలము జ్ఞానము, దానికి మూలము మహేశ్వరుడు, అతనికి మూలము శివ పంచాక్షరి, దానికి మూలము గురు వాక్యము.
అటువంటి గురువుల మీద పూర్తి విశ్వాసము, నమ్మకము వుండాలి. గురువుల మీద అచంచలమైన భక్తి, విశ్వాసము లేక పోతే ఈ విద్య రాదు. శ్రీవిద్యలో మూలం గురువే. గురువు అనుగ్రహిస్తేనే ఆ పరదేవత అనుగ్రహిస్తుంది.
అలాంటి గురువు ఆగ్రహిస్తే, ఆ తల్లి కూడా ఆగ్రహిస్తుంది. గురువే సర్వస్వం, గురు వాఖ్యమే శిరోధార్యం అని అనుకోవాలి. అటువంటి గురువులను ఎన్నడూ అనుమానించరాదు, అవమానించరాదు.
 
గురువును మించిన వాడు లేడు అని ఎల్లప్పుడూ గట్టి నమ్మకంతో వుండాలి. నగురోరధికం నగురోరధికం నగురోరధికం  నగురోరధికం అని పదే పదే అనుకోవాలి. గురువులు ఏది చేసినా అది అమ్మ పెట్టె పరీక్ష అనుకోవాలి గాని, గురువును నిందించ రాదు. గురువులోని లోపములను వెతుక రాదు, తన గురువులను ఇతర గురువులతో పోల్చుకొరాదు. గురువు చెప్పినదే వేదం అని అనుకోవాలి, గురువు ఒక శక్తి, ఒక తత్వం అంతేగాని ఒక వ్యక్తి గాదు. గురుమండల రూపిణిగా ఆ తల్లి ప్రకాశిస్తూ వుంటుంది. గురు రూపములో ఆ పర దేవత తిరుగుతూ వుంటుంది. గురువు సాక్షాత్తు ఆ పర దేవతా స్వరూపము అని నిండుగా భావించి పూజించాలి. గురువులకు తలవంపు వచ్చే పనులు గాని, భాధ గలిగే పనులు గాని ఎప్పుడూ తలపెట్ట కూడదు. గురువులకు అనుగ్రహము కలిగి నప్పుడే ఒక్కో మంత్రము ఇచ్చెదరు, అంతే గాని గురువులను బలవంత పెట్టి, ప్రలోభపెట్టి మంత్రము లను పొందరాదు.
 

గురు శిష్యుల బంధము ఒక తండ్రి కొడుకుల బంధములా ప్రేమానురాగాలతో వుండాలిగాని మరే విధముగానూ వుండకూడదు. రోజుకో గురువును మార్చుకొనే విధముగా వుండకూడదు. మంత్ర దీక్ష ఒకే ఒక్క గురువుల వద్దనే తీసుకొనవలెను, ఎన్నో కోట్ల జన్మలు ఎత్తినా దొరకని ఈ విద్యను అతి జాగ్రత్తగా కాపాడు కోవలెను. తపస్సు వలెనే జ్ఞానము సిద్దించును.  అంతటి పార్వతియే శివున్ని చేరడానికి ఎన్నో కష్టాలు, అవాంతరాలు ఎదుర్కొన్నది. 

గురువుల మీద నమ్మకము, శ్రద్ధ లేక పోతే ఈ విద్య ఎంత మాత్రము రాదు. 

 
శ్రీవిద్య ఇతర అన్ని విద్యలు లాంటిది  కాదు. శ్రీవిద్యా గురువులు మరమోత్క్రుష్టమైన గురువులు. 
తాత్కాలిక కోరికల కోసం, సుఖాల కోసం ఈ విద్య పనికి రాదు. ఇది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. అమ్మ ఉపాసన అన్నింట్లోకన్నా చాలా విలువైనది, గొప్పది. అవసరమైతే అమ్మ కోసం, గురువుల కోసం మన ప్రాణాలైనా సరే లెక్క పెట్ట కూడదు. గురు శిష్యులిద్దరికీ స్వార్ధము అసలు పనికి రాదు. మోహము పనికిరాదు. పూర్తి విశ్వాసముతో చివరి కంటూ గురువులను వదలి పెట్టను, అమ్మను వదలి పెట్టను అని ధృడ సంకల్పముతో వుండాలి.
 
గురువులో సాక్షాత్తు ఆ పరదేవతను చూడడం, కొలవడం చేత కాక పోతే ఈ శ్రీవిద్య రాదు. మరో దృష్టితో గురువులను చూచి అవమానిస్తే ఆ తల్లి యొక్క ఆగ్రహమునకు గురి కావలసి వస్తుంది. పొరబాటున కూడా ఇలా చేయకూడదు. అలాగే గురువులు కూడా తన శిష్యులను తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూచుకోవలెను. ఒక్కోసారి గురువులు తన బిడ్డలకు చెప్పని విద్యను కూడా తన శిష్యులకు చెప్పెదరు.
 

శ్రీవిద్య చాలా కఠినమైనది, ఎన్నో జన్మల ఉపాసన బలం వుంటే గాని ఈ జన్మలో రాదు, శ్రీవిద్య తీసుకొన్న తరువాత రక రకాల పరీక్షలు వచ్చును, మాయ పలు విధములుగా వచ్చును. చాలా తెలివితో అమ్మ మీద భక్తితో, గురువుల మీద నమ్మకంతో ఎదుర్కోన వలెను. మాయకు లోబడినావా ఈ విద్య నిలబడదు. శ్రీవిద్య ఆషామాషి కాదు. చాలా జాగ్రత్తగా భక్తిగా చేసుకోవలెను. పరమోత్కృష్టమైన ఈ విద్యను చివరి వరకు కాపాడుకోవడం చాలా కష్టమైనది. ఎంతో పట్టుదల, మొండి ధైర్యం వుంటే గాని చివరి వరకు ఎక్కలేము అన్ని మెట్లు. ప్రతి మెట్టుకు పరీక్షలు వుండును, అమ్మ పెట్టె పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే మరో మంత్రము వచ్చును. మాయకు తల వోగ్గినావా, క్రింద పడి పతనమై పోతావు. ఎక్కడ పొరబాటు జరిగినా మతి బ్రంశం జరుగును. అమ్మను అమ్మలాగే చూడాలి. స్త్రీలను అమ్మ స్వరూపములుగా చూడాలి. పూజించాలి. అమ్మ మనసు గెలుచుకోన్నావా ఇక నిన్ను వదలి పెట్టదు. గజ్జెలు కట్టుకొని నీ ఇంట్లో నీ పాపయై తిరుగుతూ వుంటుంది, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వుంటుంది. ఒక్కొరికి ఒక్కోవిధముగా పరీక్షలు వుండును. నీ భక్తిని అమ్మ పరీక్షించును. నిలబడ్డావా నీ జన్మ ధన్యమై పోయినది. లేదా క్రింది మెట్టుకు జారిపోతావు. అమ్మ కాళ్ళు పట్టుకొంటే అన్నింటినీ జయించే శక్తి అమ్మే ఇస్తుంది. అమ్మ కాళ్ళు, గురువు కాళ్ళు ఒక్కటే అని నమ్ముకొని గట్టిగా పట్టుకొన్న వాడికి సాధించ లేనిది ఏమీ లేదు ఈ సృష్టిలో.

గురువులు ఎప్పుడూ ఉత్తమ శిష్యుని కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వుంటారు, ఎందుకని తను నేర్చు కొన్న విద్యను ఉత్తమ శిష్యుని చేతిలో నిస్వార్ధముగా పెట్టడానికి. ఇది జ్ఞాన గంగ అంతముగా సాగిపోవాలి. మన దాకా వచ్చిన ఈ విద్యనూ అర్హులైన వారికందరికీ పంచాలని ఆత్రుతతో ఎదురు చూస్తూ వుంటారు,

ఎవ్వరూ ముందుకు రావడం లేదే అని ఎంతో మదన పడి పోతూ వుంటారు, మామూలు విద్యలు ఎవరైనా చెబుతారు, కానీ బ్రహ్మ జ్ఞానము ఇచ్చే ఈ బ్రహ్మ విద్యను మాత్రం ఎవ్వరూ నేర్పించలేరు, ఎవరికీ ఎవరు గురువులో ముందుగానే నిర్ణయించ బడి వుంటుంది. తన శిష్యుల కోసం రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఎదురుచూస్తూ వుంటారు.

మంచి గురువులు దొరకడం చాలా దుర్లభము, దొరికినా వారికి మన మీద కరుణ కలుగడం చాలా చాలా కష్టం. ఎంతో సాధన అవసరము.

ఏ పువ్వులలో మకరందము వుంటుందో, దాని మీద మాత్రమె తుమ్మెద వాలుతుంది, గ్రోలుతుంది.

మకరందమే భక్తీ, తుమ్మెద గురువులు, భగవంతుడు.

గురువులే స్వయముగా దక్షిణామూర్తి. మీ గురువులు మీకు సామాన్యమైన వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ వారి వెనుక గురుపరంపర, గురుశక్తి, గురు తత్వం వున్నది అని మరువరాదు. ఆ గురు శక్తి మిమ్ములను కాపాడుతుంది.

జాతక చక్రములో ఒక్క గురువు చూస్తేనే అన్ని దోషములు తొలగినప్పుడు, ఇక స్వయముగా మీ గురువులు మీ ఇంటికి వచ్చి, మిమ్ములను అనుగ్రహిస్తే ఎంత మేలు జరుగుతుందో ఒక్క సారి ఆలోచించండి. గురు పాదములు పట్టుకోండి మీ జన్మ తరిస్తుంది. గురువులను మించినది ఏదీ లేదు ఈ లోకంలో.               మీ పాపములను ఒక్క గురు దేవుళ్ళు మాత్రమే తొలగించ గలరు, భగవంతుడు కూడా తోలిగించలేడు.

గురువు మంత్రమును మాత్రమే ఇవ్వగలడు, దారి చూప గలడు, కానీ ఆ దారిలో నడవవలసినది, సాధన చేయవలసినది మాత్రము శిష్యుడే. సాధన లేనిదే మంత్రము సిద్దించదు, అమ్మ అనుగ్రహించదు. 

శిష్యునకు ఉండవలసినవి ముఖ్యమైన లక్షణములు .. ఓర్పు, ఓపిక, నమ్మకము, పట్టుదల, ధృతి, త్యాగము, అచంచల మైన భక్తీ విశ్వాసములు.  

 
 
శ్రీవిద్య, శ్రీచక్రము, శ్రీమాత ఒకసారి వస్తే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఉద్దరింప బడుతాయి. మీ వంశము తరిస్తుంది. 
అటువంటి మహా గురువులందరికీ నమస్కరిస్తూ,
 
 
శ్రీమాత్రే నమః

మీ

 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.