Tuesday, 27 May 2014

సౌందర్యలహరి- 22 - “భాస్కర ప్రియ”

సౌందర్యలహరి- 22

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంచన్కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్ || 22

తల్లీ, భవాని! నేను నీ దాసుణ్ణి, నీ కృపా కటాక్ష వీక్షణం నాపై ప్రసరింపజేయుము అని ఉపాసకుడు ప్రార్థించినంతనే, అతడికి, ముకుందబ్రహ్మేంద్రులు తమ రత్నకిరీటాలచేత నీరాజనం గావించబడే  నీ పాదపద్మాల యొక్క సాయుజ్యాన్ని కల్పిస్తున్నావు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

  భాస్కర ప్రియ  (భాస్కరానందనాథ  భావము)
చాలా అత్భుతమైన శ్లోకము. ఆచార్యులు వారు మనకు దేవతార్చనలో నిత్యం చదువుకొనేదానికి ఇచ్చిన గొప్ప శ్లోకము ఇది. ఆత్మార్పణము అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి  అనేది మనకు ఈ శ్లోకము ద్వారా నేర్పిస్తున్నారు.
భవాని త్వం.... భవానీ నీవు ....అని  అనీ అనే లోపల అమ్మ మనకు మోక్షం ఇచ్చేస్తుంది అట. అది ఎలాగో చూస్తాము.
భవానిత్వం అంటే  మోక్షత్వం.  భా అంటే ప్రకాశించునది. కాంతివంత మైనది. శుద్ధ తత్త్వం లోనే, సత్వ గుణం తోనే  ఆత్మ ప్రకాశిస్తూ వుంటుంది.   సదా ప్రకాశిస్తూ ఉండడమే మోక్షత్వం లో వుండడం. భవానిత్వం అంటే  మోక్షత్వం, మోక్షత్వం అంటే ప్రకాశించడం అని అర్ధం. కర్మలు లేకుండా వుండడటమే ప్రకాశించడము.
మోక్షం దేని నుంచి అంటే కర్మ నుంచి. కర్మ నుంచి విముక్తి పొందడమే మోక్షం. కర్మలు లేకుండా ఉండడమే  కైవల్యము.
భ అంటే భవము. అంటే సంసారము. సంసారము నుంచి విముక్తి ప్రసాదించేది గనుక భవాని.

భవస్య పత్నీ భవానీ, భవుని భార్య భవాని.  
భవతి భవతేవా సర్వమితి భవః.....అంతయూ తానైన వాడు.   అంతయూ నిండిన వాడు. భవుడు అంటే శివుడు. మహాదేవుడు.
భవము  అంటే పుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము  అని కూడా అర్ధము.  ఇతని వలన పుట్టును గనుక భవము. మన్మధుని జీవింపజేయునది భవానీ. సంసార సాగరమును దాటింప జేయునది  భవాని. శుభములను ప్రాప్తింప జేయునది భవాని.  తరింప జేయునది భవాని. మరలా పుట్టుక లేకుండా జేయునది భవాని. ముముక్షత్వం ప్రసాదించేది భవాని.
భవం మహాదేవం సంసారం కామం వా ఆనయతి, జీవయతీతి భవానీ.
భవం జీవన రూపం జలమప్యానయతి జీవయతీతి భవానీ.
రుద్రో భవో భవః కామో భవ స్సంసార సాగరః తత్ప్రాణనా దియం దేవీ భవానీ పరికీర్తితా....దేవీ భాగవతం.

పరమేశ్వరుని అష్ట మూర్తులలో జల మూర్తికి భవుఁడు అని పేరు గలదు. శివుడు లోకములను బ్రతికింప జేయువాడగుటచే భవుఁడు అని పేరు.  దేని నుండి భూతములు పుట్టు చున్నవో, దేనిలో బ్రతుకు చున్నవో, అది జల రూపము.  అట్టి పుట్టుకను జీవింప జేయునది గాన అది భవుఁడన బడుచున్నది.  భవ మనగా జీవ రూపమైన నీరు. అట్టి జల రూపుడగు భవుఁని జీవింపజేయునది కనుక భవాని అని చెప్ప బడినది. ప్రాణ శక్తికి, జీవ శక్తికి  మూలం భవాని.   బ్రతికించేది భవాని.

కాబట్టి జగద్గురువులు అమ్మను భవానీ అని పిలిచినారు ఈ స్తోత్రంలో.
భవానిత్వం అంటే  ముముక్షత్వం. అద్వైత సిద్ధాంతము. రెండు లేవు తల్లి వున్నది ఒక్కటే. ఇద్దరమూ ఒక్కటే. తత్త్వమసి. అమ్మా నీవే నేను, నేనే నీవు అని చెప్పడం. భవానిత్వం...అని అనగానే, చెప్పగానే  జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం వస్తే మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి శివ సాయుజ్యం లభించినది. నిజసాయుజ్యపదవీం... అన్నారు ఇక్కడ.
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
భవానీ ...త్వం దాసే..అమ్మా నీ దాసుడను అమ్మా, నీ కరుణ జూపవమ్మా నా పైన. అని ప్రార్ధించాలని మనసులో అనుకొన్నాడు. ఇతి స్తోతుం వాంఛన్..,
కథయతి భవాని త్వమితి యః.... ఇంకా పూర్తిగా కూడా అనలేదు. “భవాని త్వం”...అని రెండు మాటలు నోట్లో నుంచి బయటకు వచ్చినాయి అంతే ఇంతలోనే ఆ భావానికి సాధకుడి మీద ఎనలేని ప్రేమ కలిగినది.  ఆ పిచ్చి తల్లి మరోలా అర్ధం చేసుకొన్నది, భవాని త్వం.. అనే రెండు మాటలను “నీవు నేను అగుదును గాక”..అని అర్ధము తీసుకొన్నది. అలా సాధకుడు అడుగుతున్నాడు కాబోలు అని అనుకోని “తధాస్తు” అని అన్నది. ఎంత కరుణ తల్లీ నీకు భ అంటే భవాని అని అనుకొన్నావా, త అంటే త్వం అనుకొన్నావా, వెరసి భవాని త్వం అనుకోని సాయుజ్యం ఇచ్చేస్తావా? అవ్యాజ కరుణామూర్తివి అని నామము సార్ధకం చేసుకొన్నావు గదా తల్లి, ఈ బిడ్డ మీద నీకు ఎందుకు అంత జాలి. ప్రేమ.? సాయుజ్యం అంటే ఉపాసకుడు అమ్మ వారిలో లీనం కావడం సాయుజ్యం.
దాసే ... నేను దాసుడను అని అంటే ఆమె యజమానురాలు అయ్యినది. ఒక్క యజమానికి మాత్రమే విముక్తి ప్రసాదించే గుణము, అర్హత వుంటాయి. జన్మ రాహిత్యము ప్రసాదించడానికి భవాని త్వం వుండాలి. కాబట్టి గురు దేవుళ్ళు తనను దాసుడిగా పోల్చుకొని అమ్మను యజమానురాలిని చేసి, భావానిత్వం అంటగట్ట్టి, ఓ.. తల్లీ నన్ను గమనించుకో అని చాలా తెలివిగా అడిగారు. అడిగిన కోరిక చిన్నదేమీ కాదు.
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం....
అడిగి అడగక మునుపే, వెంటనే అమ్మ తన సాయుజ్యాన్ని అనుగ్రహించినది. ఆ తల్లి యొక్క అపార కారుణ్యం పెల్లుబికినది బిడ్డ పైన.
సాయుజ్యం అంటే ముక్తి . ముక్తి నాలుగు రకాలు అని పెద్దలు అంటారు.
౧. సాలోక్యము :- పరమాత్మ లోకాన్ని చేరడం సాలోక్య ముక్తి.
౨. సామీప్యము:- పరమాత్మ సన్నిధికి చేరడం సామీప్య ముక్తి.
౩. సారూప్యము:- పరమాత్మ తో సమాన రూపం పొందడం సారూప్య ముక్తి.
౪. సాయుజ్య ముక్తి:- పరమాత్మతో ఏకం కావడం సాయుజ్య ముక్తి.

ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్........
హరి బ్రహ్మేంద్ర సేవితా ...అని అమ్మను వశిన్యాది వాగ్దేవతలు కొనియాడినారు. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారు నిత్యమూ నీ పాదాలకు నమస్కరిస్తూ వుండడం వలన, వారి కిరీటాల రత్న కాంతులతో నీ పాదాలు ప్రకాశిస్తూ వున్నాయి తల్లీ.  ఆ కాంతులు ఎలా వున్నాయి అంటే అవి వారు ఇచ్చే కర్పూర నీరాజనాల్లాగ వున్నాయి.
మరొక విషయం తల్లీ, వాళ్ళు ఎప్పడూ వచ్చి నీ పాద పద్మములకు నీరాజనాలు ఇచ్చి నీ సేవకులుగానే మిగిలి పోయినారు. కానీ నేనేమో భవానీ త్వం అని నీ సాయుజ్యాన్ని పొందాను సునాయాసంగా. అంటే హరి బ్రహ్మెంద్రులకు కూడా దక్కనిది అమ్మ తన బిడ్డలకు, ఉపాసకులకు సాయుజ్య పదవిని ప్రసాదిస్తుంది అని గ్రహించాలి.

గూడార్ధము :-  అమ్మ మనసు ఏమిటో ఈ శ్లోకము ద్వారా గురువులు మనకు చెబుతున్నారు.
భవాని త్వం  ......... అనేది గొప్ప మహా వాక్య ప్రయోగము. తత్వమసి సిద్ధాంతము. ఇది ఒక్కటి అనుకొంటే చాలు సాధకుడు తరించి పోతాడు. ఎంత గొప్ప విషయమో. భవాని త్వం ... అని అనుకొంటే  చాలు తరించి పోతాడు. సాయుజ్యాన్ని ఇచ్చే అధికారము ఒక్క అమ్మ వారికి మాత్రమే కలదు. విముక్తిని ప్రసాదించే అధికారము అర్హత ఒక్క యజమానురాలికే వుంటుంది. కాబట్టి శంకరులు తనను తాను దాసుడు అని సంభోధించు కొన్నాడు. మనము అందరమూ దాసులము. ఆ తల్లి మన యజమానురాలు. యజమాను రాలికి ప్రాణ బిక్ష పెట్టె అధికారము కలదు. అందువలన మనకు విముక్తి ప్రసాదించినది. అదే భవాని త్వం. అది ఒక అధికారం. మోక్షాన్ని ప్రాసాదించే అధికారం. అమ్మా కరుణ జూపవమ్మా అని వేడుకొంటే చాలు, ఆ తల్లి మనకు ప్రాణ బిక్ష పెడుతుంది. మరలా జన్మ లేకుండా చేస్తుంది.  

శరణ్యే వరణ్యే సుకారుణ్య మూర్తే, హిరణ్యోదరాద్యై రగణ్యే సుపుణ్యే,
భవారాణ్య భీతేశ్చ మాం పాహి భద్రే, నమస్తే నమస్తే నమస్తే భవానీ ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/27-05-2014 @ శ్రీకాళహస్తి
మా వివాహ వార్షిక శుభ దిన సందర్భముగా ఆ తల్లి పాదములకు సమర్పించుకొంటున్నాను
 ఈ “భాస్కర ప్రియ” ను.
www.facebook.com/sribhaskaranandanatha/
http://vanadurga-mahavidya.blogspot.in/    


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.