Sunday, 8 June 2014

సౌందర్యలహరి- 24 - “భాస్కర ప్రియ”

సౌందర్యలహరి- 24
శ్లో||   జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
        తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి |
        సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ
        స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః || 24||

అమ్మా,  సృష్టికర్త ఐన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు రక్షిస్తున్నాడు. రుద్రుడు విశ్వాన్ని లయింప చేస్తున్నాడు. కల్పాంతంలో మహేశ్వరుడు ఈ బ్రహ్మవిష్ణురుద్రులను తనలో లీనం చేసుకుని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు. ఇలా ఈ బ్రహాండం లయమయిపోతోంది. తిరిగి సదాశివుడు కల్పాదిలో నీ కనుబొమ్మల కదలికలను  ఆజ్ఞగా గ్రహించి యీ నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా బ్రహ్మాండ సృష్ట్యాది కార్యాలు జరిపిస్తూన్నాడు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు విశ్వ పాలకుల నిర్ణయాధికారములను, అమ్మ యొక్క సామ్రాజ్ఞిత్వాన్ని మనకు తెలియ జేస్తున్నారు.

పంచకృత్యపరాయణ.....అని లలితా సహస్ర నామంలో అమ్మ కు పేరు గలదు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అను పంచ విధములైన కృత్యములను అమ్మ నిర్వహిస్తూ వుంటుంది. అంటే బంధ మోక్షములు పరదేవతాధీనములు.
సృష్టి అనగా జగన్నిర్మాణము, అది రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని (బ్రహ్మ) ఆధీనము. అట్టి సృష్టిని మూల ప్రకృతి రూపమున చేయు చున్నది గాన ఆమెకు సృష్టికర్త్రీ అని పేరు.

గోప్త్ర్యై నమః .... గోపమనగా జగత్ సంరక్షణము . ఇది సత్వ గుణ ప్రధానము.  ఈ ఈశ్వర కృత్యమును విష్ణు రూపములో నిర్వహిస్తున్నది గాన గోప్త్రీ అని అన్నారు. రక్షణ చేయుట, పాలన చేయుట.

సంహారిణ్యై నమః ...... జగత్తును లయము చేయుట. ఇది తమో గుణ ప్రదానుడైన రుద్రుని రూపములో అమ్మ ఈ ఈశ్వర కృత్యమును జేయుచున్నది గాన సంహారిణి అని అన్నారు.

తిరోధానకర్యై నమః .....సకల సృష్టిని పరమాణువుతో సహా నాశనము చేసి బీజ రూపములో తన దగ్గర ఉంచుకోనునది గాన తిరోధానకరీ అని అన్నారు. జీవులకు తమ స్వ స్వరూపము కూడా తెలియకుండా చేయడము తిరోధానము.  శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుని రూపములో అమ్మ ఈ కృత్యమును నిర్వహిస్తున్నది.

అనుగ్రహదాయై నమః ....... బీజ రూపములో, సూక్ష్మ రూపములో వున్న సృష్టిని విస్తరించడానికి, వికసనము గావించడానికి  సదాశివ రూపములో అనుగ్రహించే కృత్యమును నిర్వహించునది గాన అనుగ్రహదా ..అయినది.

ఈ ఐదు కృత్యములను నిర్వహిస్తున్నది గాన ఆ తల్లి పంచ కృత్య పరాయణ అయినది. Flow of electrons అనేది పంచ కృత్యపరాయణత్వము. జగత్తు కదలడం పంచ కృత్యపరాయణత్వము. పంచ కృత్యపరాయణత్వము వలెనే కదలిక జరుగుచున్నది.   నిత్యమూ మన శరీరములో, ఈ సృష్టిలో జరిగేది పంచ కృత్యపరాయణత్వము. ఈ ఐదు కర్మలు ప్రతి జీవిలో, ప్రతి చోట ఈ బ్రహ్మాండము లో జరిగే పరిణామ క్రమము. ఇది recycling system.
ఐదు మంది బ్రహ్మలు, మూల అధికారులు. వారిలో మూల ప్రక్రుతియై మూల శక్తియై నడిపిస్తున్నది అమ్మ.
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు...పంచ బ్రహ్మలు, పంచ కృత్యములను నిర్వహిస్తున్నారు.  ఈ ఐదు శక్తులకు మూలము అమ్మ. అమ్మ అంటేనే కదలిక.
యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా ...నమస్తస్యై... నమస్తస్యై...   నమస్తస్యై నమో నమః.
 మూల శక్తి  (SUPREM POWER).  ఇక్కడ ఆచార్యుల వారు మనకు organization chart ఇచ్చారు.

సా విశ్వం కురుతే కామం సా పాలయతి పాలితం. కల్పాంతే సంహారత్యేవ. త్రిరూపా విశ్వమోహినీ....దేవీ భాగవతం.
నిర్విశేష మపి బ్రహ్మ స్వస్మిన్మాయా విలాసతః
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ  సదాశివః........ ....త్రిపురా రహస్యం

ఒక సారి పరశురాముడు దత్తాత్రేయుల వారితో ...”అయ్యా తమరు చెప్పుచున్న ఆ త్రిపురాదేవి ఎవరు? ఆమె గుణములు, శక్తి ఏమిటి అని ప్రశ్నించగా .. దత్తాత్రేయుల వారు ఇలా చెప్పు చున్నారు.
రామా, ఆమెను తెలుసుకోనటకు ఎవరి శక్యము కాదు. ఆమె చిచ్ఛక్తి. ఒకసారి ఇంద్రాది దేవతలు కలహించుకొని తమలో అధికులు ఎవరో తెలుపమని విష్ణువు ను అడిగిరి. విష్ణువు శివుణ్ణి అడగ్గా, శివుడు ఆ పరమేశ్వరిని ప్రార్ధించెను. ఆమె భయంకర మైన శబ్దముతో, కోటి సూర్య సమాన కాంతులతో కనబడగా త్రిమూర్తులు ఆమెకు ప్రణమిల్లి బహు విధములుగా స్తోత్రము చేసిరి. దేవతలు అందరూ మూర్చిల్లిరి. వారిని అనుగ్రహించుట కొరకై త్రిపుర సుందరీ రూపము బొందెను. ఇంద్రుడు “ఆమె ఎవరో, ఆమె శక్తి ఏమిటో” కనుగొని రమ్మని అగ్ని మొదలగు వారిని ఆమె వద్దకు పంపెను.  తన వద్దకు వచ్చిన అగ్నిని చూచి, ఒక గడ్డి పరకను చూపి చేతనైనచో దీనిని కాల్చుము అని త్రిపుర సుందరి అనెను.
అగ్ని దానిని కొంచెము కూడా కాల్చలేక వెను తిరిగెను. వాయువు కూడా దానిని కదలింప లేక మరలి వచ్చెను. చివరకు ఇంద్రుడు తన వజ్రాయుధముతో బయలు దేరేను. తన వద్దకు వచ్చు చున్న ఇంద్రుణ్ణి చూచి అమ్మ ఒక్క చిరు నవ్వు నవ్వెను. ఇంద్రుడు స్తంభించి పోయెను. దేవతలు అందరూ గురువైన బృహస్పతిని వేడుకొనెను. సత్యమును గ్రహించిన బృహస్పతి ఆ త్రిపుర సుందరిని ప్రార్ధించగా ఆ తల్లి తిరిగి దేవతలకు పూర్వ స్థితి కల్పించి ఇట్లు అనెను.

“ మీరు గర్వమును అహంకారమును వీడండి. మీరు ఎవ్వరూ అధికారులు కారు. ఈ జగత్తు అంతయూ నా శక్తి వలననే సృష్టి స్థితి లయములను పొందు చున్నది. నేనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి జగత్కార్యము నందు నియోగించితిని. కావున మీరు అందరూ త్రిమూర్తులకు లోబడి నా శాసనము అనుసరించి భక్తితో జగత్తు యొక్క కార్యమును నిర్వహింపుడు... అని పలికి ఆ పరమేశ్వరి అంతర్ధానము పొందెను.  ........దేవీభాగవతం/త్రిపురా రహస్యం..

 స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః   .........

క్షణచలితయో.....క్షణ మాత్రమున చలించిన .... అంటే నీ కను సైగల ఆధారముగా, ఆజ్ఞగా, ఆనతి గైకొని  త్రిమూర్తులు పని చేస్తున్నారు. ఎందుకంటే అమ్మా నీవు “ఉన్మేషనిమిషోత్పన్న విపన్న భవనావళీవి.
కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం. కన్ను మూసి తెరిచే లోపల బ్రహ్మాండములు పుట్టి నశించు చున్నవి. నీ సంకల్ప మాత్రము చేతనే సృష్టి, వినాశనములు జరుగుచున్నవి. సృష్టి, స్థితి, ప్రళయములకు కారణ భూతురాలివి నీవే గదమ్మా.  సంకల్ప వికల్పములకు మూల శక్తి ఆ మహా మాయయే కారణం.

శ్లో|| గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి  శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
      సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై  తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/08-06-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/sribhaskaranandanatha/

http://vanadurga-mahavidya.blogspot.in/