Wednesday, 23 July 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 29

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 29

కిరీటం వైరించం పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే || 29 ||

మాతా! బ్రహ్మ విష్ణువు ఇంద్రులు నీకు ప్రణమిల్లుతున్నప్పుడు, నీ భవనాన్ని ప్రవేశించిన సదాశివుణ్ణి ఎదురేగి తోడుకొనిరావటానికి నువ్వు అతిశీఘ్రముగా లేచి వెళ్లేటప్పుడు నీ పరిజనులైన స్త్రీలు, 'అమ్మా! నీ ముందు బ్రహ్మదేవుడి కిరీటం ఉంది. దానికి దూరంగా నడువు; ఓ తల్లీ! ఇది కైటభాసురుణ్ణి సంహరించిన విష్ణువు కిరీటం, తొట్రుపడబోకు; అమ్మా! ఇది ఇంద్రుడి కిరీటం, జాగ్రత్తగా రమ్ము' అనే మాటలు సర్వోత్కర్షతో రాజిల్లుతున్నవి.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క పతి భక్తి గురించి   మనకు తెలియ జేస్తున్నారు. భర్తను ఎలా అనుగమించాలి అనేది అమ్మ జగన్మాత మనకు చూపిస్తున్నది. పతీవ్రతలు ఎలా భర్తను గౌరవించినారో శ్రీ కామాక్షి ఆచరించి చూపుతున్నది. ఆ మర్యాదే మర్యాద.

అనసూయ, అరుంధతులు పార్వతీదేవికి పతివ్రతా ధర్మాలను బోధించే సందర్భంలో చెప్పిన పద్యం:

పతివచనము శ్రుతివచనము
పతిపదములు పరమపదము పతియే గురుడౌ
పతినగవే పరమ సుఖము
పతినడచిన బాట నడువు పర్వత పుత్రీ!

మానవ మాత్రులే కాదు ! పార్వతీ పరమేశ్వరులకైనా ప్రణయ కలహాలు సర్వ సామాన్యం! ఎంతటి ఆది దంపతులకైనా సరసం, విరసంగా మారే అంశాలూ ఉంటాయి.

ఒక్కొక్క అవతారంలో ఆ జగజ్జనని, శ్వేత - గౌరాది వర్ణాలలో కనిపించి నప్పటికీ - అధికభాగం అవతారాలలో ఆమె 'శ్యామ' గానే ప్రభవించిందని పౌరాణికుల వాక్కు. ఆ అభిప్రాయం కలగడానికీ కారణం ఉంది. ఆట పట్టించడానికే అవునుగాక! పరమేశ్వరుడంతటి వాడే, అమ్మవారిని 'కాళీ' అనీ; 'తమసా' అనీ; 'శ్యామా' అనీ; 'కజ్జలా' అనీ పిలవడం ఎన్నోసార్లు ఆవిడ గమనించింది.

ఒకసారి రోషం కొద్ధీ, "మీకు నలుపు అయిష్టమైతే ఆ విషయం స్పష్టంగా చెప్పొచ్చు కదా! ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి పిల్చి మరీ వినోదించడం దేనికీ? భర్తకు అయిష్టమైన పనేదీ, ఏ సతీచేయదో - ఆమె పతివ్రత అనిపించు కుంటుందని నాకు తెలుసు! మీకింత అయిష్టమైన నలుపు రంగుతో నేనెందుకు ఉండాలి!? ఇప్పుడే ఈ రంగుపోగొట్టుకుని, మిలమిల మెరిసే మేలిమి బంగారు రంగు ప్రసాదించమని తపస్సు చేసి వస్తాను" అని వెళ్లబోయింది.

"ఈ మాత్రం రంగు మార్చడానికి తపస్సు వరకూ ఎందుకు శ్యామా!? అయినా సర్వదేవుళ్లూ - దేవతలూ అంతా నాకోసం తపిస్తూ వుంటే, నీతపస్సు ఎవరికి? నాకు నిజంగానే నీ రంగు మార్చుకోవాలనిపిస్తే అదెంతపని నాకు? ఏదో ఊరకే సరసానికి అన్నాను" అని నవ్వేశాడు శివుడు చిద్విలాసంగా.

భర్త అలా అన్నపట్టికీ - ఏ మూలనో చిన్న సందేహం ఉండిపోయింది అమ్మవారికి. ఎప్పటికైనా బ్రహ్మచేత వరం పొంది, తన శ్యామ వర్ణాన్ని పోగొట్టుకోదలచిందామె. అలా ఆ తల్లి తన నలుపు వర్ణాన్ని తోలిగించుకొని గౌర వర్ణముతో తన పతి సన్నిధికి చేరుకొన్నది గౌరీ మాతగా. అప్పటి నుంచి ఆమె “సిందూరారుణ విగ్రహాం” అయినది. భర్త ఆనందమే తన ఆనందం గా నడిచిన మహా పతివ్రత ఆమె.
అందుకే అన్నారు పోతనామాత్యులు ఇలా ....

మ్రింగెడు వాడు విభుండని, మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ, మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

మా అమ్మ తన మంగళ సూత్రాన్ని ఎంత నమ్మినదో కదా. ఎవరు కట్టిన మంగళ సూత్రము అది? ఆ పరమ శివుడు కట్టిన మంగళ సూత్రము. అటువంటి మహాతల్లి, సర్వ లోకములకు తల్లి. మహా పతివ్రత. అందుకే ఆమెకు గౌరీ పూజ చేయిస్తారు పెళ్లి కూతురు చేత. అమ్మా ఈమె ఎవరో కాదు మహా గౌరి, నమస్కరించు తల్లీ అని. అటువంటి జగన్మాతను నమ్ముకొంటే, పూజిస్తే ఐదవ తనమునకు ఎటువంటి అమంగళము ఉండదు.

అటువంటి మహాతల్లి శ్రీమహారాజ్ఞి అయ్యి ఒక రోజు సభలో కొలువు తీరి వున్నది. బ్రహ్మాది దేవతలు వచ్చి అమ్మకు సేవ చేయడానికి తలలు వంచి నమస్కరిస్తూ అమ్మ పాదాలకు పూజ చేస్తూ వున్నారు. ఇంతలో అక్కడకు శివుడు వచ్చాడు. భర్త వచ్చినాడు అని అమ్మ గభాలున లేచి  భర్తకు స్వాగతం చెప్పడానికి గభ గభా ఎదురు వెళ్లినది. ఆ తొట్రుపాటులో అమ్మ ఎక్కడ తట్టుకొని క్రింద పడుతుందో అని చెలికత్తెలు అమ్మను హెచ్చరిస్తూ “ అమ్మా అమ్మా జాగ్రత్త జాగ్రత్త, నెమ్మది నెమ్మది ఇక్కడ బ్రహ్మ కిరీటము వున్నది. అక్కడ విష్ణువు కిరీటము వున్నది, అదిగో ఇంద్రుడి కిరీటము కాస్త చూచి నడువు తల్లీ అని చెబుతున్నారట.
ఆహా ఏమి దర్శించినారు శంకరులు.

కిరీటం వైరించం పరిహర
వైరించం అంటే బ్రహ్మ గారి కిరీటం. విరించి అంటే బ్రహ్మ. పరిహర అంటే దూరముగా చేయుము. తొలగించు అని.
పురః కైటభ భిదః కఠోరే కోటీరే స్ఖలసి
కైటభాసురిని చంపినవాడు కైటభభిదుడు అంటే విష్ణువు. విష్ణువు కిరీటము రత్నముల చేత, వజ్రముల చేత తాపడం చేయబడి వాడిగా, గరుకుగా ఉంటుదట. అమ్మా ఎక్కడ నీ కాళ్ళు తగిలి నీకు గ్రుచ్చుకొంటాయో జాగ్రత్త. జారి పడతావేమో జాగ్రత్త. స్ఖలసి అంటే జారిపడునది.
జహి జంభారి మకుటమ్
జంభారి అంటే జంభుడు అనే రాక్షసుని చంపిన వాడు ఇంద్రుడు. జహి అంటే విడిచి పెట్టు అని అర్ధము. మకుటం కిరీటం. ఇంద్రుని కిరీటం వున్నదమ్మా అక్కడ, కాస్త తప్పించుకొని నడువు. చూచి నడువు.

ఆ తల్లి హరి బ్రహ్మేంద్ర సేవిత అందువలన దేవతలు అందరూ వచ్చి ఆమెకు తలలు వంచి నమస్కరిస్తున్నారు. ప్రణమ్రేష్వేతేషు.

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె
ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!

అటువంటి మహా తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ....
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/23-07-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/

http://vanadurga-mahavidya.blogspot.in/

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.