Tuesday, 28 August 2012

ఉపాసన – పంచ దశీ మహా మంత్రము (PANCHA DASHEE)ఉపాసన – పంచ దశీ మహా మంత్రము (PANCHA DASHEE)

వర్ణమాల లోని అక్షరములు అన్నీ మంత్రములే. అన్నీ బీజాక్షరములే. ఒక్కో అక్షరానికి ఒక్కో శబ్దము. ఒక్కో శబ్దానికి ఒక్కో శక్తి. కాబట్టి శబ్దానికి, ధ్వనికి దివ్యమైన శక్తి వున్నది. ఆ శబ్దాన్ని పదే పదే మననం చేయడం మంత్రం. ఆ మంత్రాన్ని పదే పదే స్మరించడమే ఉపాసన.  భగవంతుడికి దగ్గరగా వుండటమే ఉపాసన. అంటే ప్రతి క్షణము గాలి పీల్చినప్పుడు, వదలి నప్పుడు కూడా పలుకడం. సందు లేకుండగా ధారగా పలుకడం. కన్ను మూసినా రామ, కన్ను తెరచినా రామ అని అనడం ఉపాసన.

అరణిని మధింప అగ్ని ఎట్లు జనించునో, అట్లు బీజాక్షరములతో గూడిన మంత్రమును పలుమార్లు జపించుట చేత శక్తి ఉద్బవిస్తుంది, ఆ మంత్ర దేవత సాక్షాత్కారము కలుగుతుంది. అది ఉపాసన.

శ్రీవిద్యలో మంత్ర రాజము అని చెప్పబడేది పంచదశీ మహా మంత్రము. దీనిలో ఏ దేవతా పేరు వుండదు.
కేవలం బీజాక్షరములే వుంటాయి. అలాగే శ్రీచక్రము లో ఏ దేవత పేరు గాని, మంత్రము గాని వుండదు.
కేవలము రేఖా నిర్మితమైనది. పరాశక్తికి మంత్ర రూపము పంచదశి అయితే యంత్ర రూపము శ్రీచక్రము.
పంచదశీ మహా మంత్రము మాయను పోగొట్టి పర బ్రహ్మమును ప్రకాశింప జేయును. పూర్వ కాలములో ఈ పంచదశి మహా మంత్రమును విష్ణువు, శివుడు, బ్రహ్మ, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమార స్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బల రాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు
మొదలగు వారు ఉపాసించి,  దేవీ ఉపాసకులు అయినారు. ఈ మంత్రమును దర్శించి ఈ లోకమునకు తెచ్చినవాడు మన్మధుడు. ఈ మంత్రమునకు మూల పురుషుడు ఋషి .. దక్షిణామూర్తి.
పంచదశి మహా మంత్రము మూడు భాగములుగా వుంటుంది.
మొదటది ప్రధమ ఖండము. దీనిని వాగ్భవ కూటము అని అందురు. రెండవది కామరాజ ఖండము,
మూడవది శక్తి ఖండము, ప్రతి ఖండము తరువాత ప్రాణ శక్తి అయిన హ్రీం కార బీజము వుంటుంది.
మూడు హ్రీం కారములను  వరుసగా బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అని అందురు.
మొదటి ఖండము ఋగ్వేదాత్మకము అని, రెండవ ఖండము యజుర్వేదాత్మకము అని, మూడవ దాన్ని సామ వేదాత్మకము అని అందురు.
అజ్ఞానము పోగొట్టి, బుద్ధిని వికసింప జేసి, బ్రహ్మ జ్ఞానమును కలుగ జేసే మహా మంత్రము ఇది.


భాస్కరానంద నాధ

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.