Monday, 8 October 2012

శ్రీదేవీ తత్వం - 1

శ్రీదేవీ తత్వం -1


శ్రీ గురుభ్యోనమః

ఓం చైతన్య రూపాం తామాద్యాంచ ధీమహి బుద్ధింయానః ప్రచోదయాత్.

చైతన్య రూపయై, ఆద్యయై, విద్యా స్వరూపిణియైన ఏ దేవి మా బుద్ధిని ప్రేరేపించు చున్నదో ఆ దేవిని ధ్యానించేదను. అట్టి భగవతి యగు దేవి యొక్క ఉపాసన గురించి కొందఱు భ్రాంత చిత్తులు మాయ రూపమైన భగవతి యొక్క ఉపాసన తగదు అని అందురు. మాయ మిధ్య, అసత్యము అని అందురు. అట్టి మిధ్యా స్వరూపిణి మోక్షము ఇవ్వజాలదు అని అందురు.

కానీ వారన్నట్లు మాయ అన భ్రాంతి స్వరూపిణి కాదు, మాయ యన శక్తి. సర్వ జగములను సృష్టి, స్థితి, లయములను గావించునది. అట్టి శక్తిని ఉపాసించిన వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారనియు,మోక్షమును బొందుచున్నారనియు నృసింహతాపిన్యుపనిషత్తు తెలియజెప్పుచున్నది.

మాయావా ఏషా నారసింహీ, సర్వ మిదం సృజతి, సర్వమిదం రక్షతి, తస్మాన్మాయా మేతాం శక్తిం, విద్యా ద్యఏతాం మయా శక్తిం, వేద సమృత్యుం జయతి సపాప్మానం, తరతి సోzమృతత్వంచ గచ్ఛతి, మహతీం శ్రియమశ్నుతే.

ఆ శక్తిని భజించిన వాడు మృత్యువును జయంచి పాపమును తరించి మోక్షమును బొందును. గొప్ప సంపాద ననుభవించును. మరియు ఆ మాయ వైష్ణవి, శక్తి, విశ్వ బీజమని స్మృతులు ఘోషించినవి.

త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మేతత్.

ఈ సమస్త లోకములన్నియు మాయా శక్తి చే సమ్మోహితమగుచున్నవి. ఒకరేమిటి అందరూ కూడా. ఆ మాయా శక్తికి లోను కానివాడు ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ లేరు. రావణ బ్రహ్మ కూడా ఆ మాయా శక్తి కి లోనైన వాడె. దేవతలు, మనుజులు, ఆఖరాకి త్రిమూర్తులు అందరూ ఆ మాయకి లోబడిన వారె. మాయ బ్రహ్మ రూపిణీ, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.

శక్తి అనగా క్షుద్ర శక్తి గాదు. ఈమె పరా శక్తి, ఆది శక్తి, పర బ్రహ్మ మహిషి. ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి యైన జగన్మాత.

త్రిపురోపనిషత్తు, త్రిపురతాపిన్యుపనిషత్తు, దేవ్యుపనిషత్తు, బహ్వృచోపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతీ రహస్యోపనిషత్తు, సౌభాగ్యలక్ష్ముపనిషత్తు అను ఉపనిషత్తులు అన్నీ అమ్మ గురించి, శక్తి గురించి ఎంతగానో శ్లాఘించినవి.

ఆ పరా శక్తియే హిమవంతుని కుమార్తె పార్వతియై శివుని వరించి, పరమేశ్వరుని పట్టమహిషియై జగన్మాతయైనది.

బ్రహ్మవాదులు దేవి పరమ పదమును బ్రహ్మమనియే చెప్పిరి. హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమనియు, మోక్ష ప్రదమనియు జెప్పిరి.

మరియు దేవీ భాగవతము నందు

నిర్గుణా సగుణా చేత ద్విధా ప్రోక్తా మనీశిభి:

సగుణా రాగిభి: సేవ్యా నిర్గుణాతు విరాగిభి:

సగుణ యగు దేవిని కోర్కెలు గలవారును, నిర్గుణయగు దేవిని మోక్షమును గోరువారు ఉపాసింతురని దేవీ భాగవతము నందు చెప్ప బడినది.

బ్రహ్మాండ పురాణమున లలితోపాఖ్యానమున " చితిస్తత్పదలాక్ష్యార్దా చిదేకరస రూపిణీ" అని అన్నారు. జ్ఞాన స్వరూపిణి యగు ఆ దేవి తత్పదమునకు,  లక్ష్యార్ధ యని చెప్పబడినది.

ఈ విధముగా స్మృతులు,అష్టాదశ పురాణములు, ఉప పురాణములు దేవి పర బ్రహ్మ మని దేవీ తత్వమును గురించి చెప్ప బడినవి. శక్తి బ్రహ్మము కంటే వేరుగా యుండదు, అందువలన కేవలమగు బ్రహ్మోపాసనము అసంభవమగు చున్నది.

అలాగే కేవలము మాయోపాసనము అసంభవమగు చున్నది. ఎందుకంటే అంతటా వున్నది ఆ బ్రహ్మాధిష్టాన యుతయైన మాయ యొక్క ఉనికియే అని తెలియ వలెను.

కావున అమ్మే అయ్య, అయ్యే అమ్మ అని తెలియ వలెను. వారిని రెండుగా వేరుగా చూడరాదు. ఒకరిలో ఒకరు వున్నారు. అటువంటి అర్ధనారీశ్వర తత్వమైన అమ్మను గురించి రోజూ నాలుగు మాటలు మనము రోజూ తెలుసుకొంటాము. అమ్మ యొక్క ఉపాసన, పూజ, నవరాత్రి మహిమ గురించి రేపు విన్న వించుకొంటాను.

చక్కగా ఈ నవ రాత్రులు అందరూ అమ్మ పూజ చేసుకొని అమ్మ అనుగ్రహము పొందేదరని ఆశిస్తూ,

మీ

భాస్కరానంద నాధ

3-10-2012

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.