Monday, 8 October 2012

శ్రీదేవీ తత్వం - 2

శ్రీదేవీ తత్వం - 2

స్వగురువేనమః ! పరమ గురువేనమః !పరమేష్టి గురువేనమః !

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే,
శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. 

సత్వ, రజో,తమో గుణములైన గుణ త్రయమునకు మాయ అనబడును. అట్టి మాయ ఉపాధిగా గల భగవతి శ్రీదేవియే పరబ్రహ్మ తత్త్వము. అట్టి పర బ్రహ్మము నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గౌరీ లక్ష్మీ సరస్వతులు ఉత్పత్తి నొందిరి. శ్రీదేవియే త్రిమూర్తులకును ఈ దేవీ త్రయము నిచ్చెను. రాముడు, శ్రీకృష్ణుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు  నుంచి ముక్కోటి దేవతల వరకు సప్త ఋషులు వరకు, మహా మునులు, ఋషులు, యోగులు, సిద్దులు, బాబాలు, గురువులు, బ్రహ్మ నుంచి మన పిల్లలవరకు ఈ సృష్టిలోని సమస్త ప్రాణి కోటి ఆ మహా గర్భము నుంచి వచ్చినవే. సమస్త ప్రాణి కోటి ఆ సనాతనులైన మహా దంపతుల నుంచి ఉద్భవించినవే.

ఈ సమస్త చరా చర సృష్టికి మూలము ఆ ఆది దంపతులే కారణము. అన్ని యుగాలకు ముందు వున్న మూల దంపతులు వారే. ఆ పరబ్రహ్మం సృష్టి రచనకు మొదలిడదానికి కారణం ఆ మూల ప్రకృతియే. నా తల్లి ఆ జగన్మాతయే. మా అమ్మ ఎంత గొప్పదో చెప్పుకోవడము నా ధర్మము.  

దీనిలో అతిశయోక్తి ఏమీలేదు, అబద్దములు అస్సలు లేవు, శ్రీ దేవీ భాగవతములో చెప్పిన రహస్యములనే నే చెప్పు చుంటిని. వేదములు ఏ తల్లిని గురించి, తండ్రిని గురించి చెప్పినాయో ఆ ఆది దంపతులను గురించి చెబుతున్నాను. ఉపాసన చేసి, అంతర్ముకః ధ్యానముతో ఆ తల్లి ఇచ్చిన జ్ఞానముతో ఈ విషయములు మీకు చెప్పు చుంటిని. ఇవి అసత్యములు కావు, ఆ తల్లి పలికించిన మాటలు ఇవి.

 ఏ దేముడైన, దేవతయైన ఆ తల్లి బిడ్డలే, ఏ గురువైనా, మునియైనా, యోగియైనా ఆ తల్లి పాదములకు నమస్కరించవలసినదే. ఆ తల్లి తరువాతే ఈ సమస్త సృష్టి, బ్రహ్మాండములు, ప్రపంచములు. విష్ణు శక్తి, బ్రహ్మ శక్తి, రుద్రుని శక్తి, మహేశ్వరుని శక్తి అన్నీ ఆమె. ఆమెయే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి.

 

మీ  

భాస్కరానంద నాధ/ 8-10-2012