Sunday, 7 July 2013

నవ విధ భక్తి


శ్రవణం కీర్తనం విష్ణో: స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనం. (భాగ. 7-5-29)

అని భక్తీ  తొమ్మిది విధములు.

౧. శ్రవణ భక్తీ :-

హరికధలు, పురాణములు, ప్రవచనములు  భక్తీ కధలు, భగవంతుని లీలలు వినుట శ్రవణ భక్తీ అందురు. కర్మ మార్గము, ఉపాసనా మార్గము, జ్ఞాన మార్గము, సిద్దాంత మార్గము, యోగ మార్గము, వైరాగ్య మార్గమును గూర్చి సాధకుడు వినుచుండవలెను. అనేక విధములైన వ్రతములు, తీర్ధములు, దానములు మున్నగు మహిమలు కలిగిన కధలనాలకింపవలెను. ఇవి కాక బహు విధములైన మహాత్మ్యములను, పుణ్య స్థలముల వర్ణములను, బహు విధ మంత్రములను, సాధనములను, పురశ్చరణములను వినవలెను, మహా యోగుల, జ్ఞానుల, సిద్దుల, భక్తుల యొక్క కధలను వినవలెను. వేదములను, శ్రుతులను, స్మృతులను వినవలెను. ఈశ్వరుని సగుణ చరిత్రను పరమ భక్తితో వినుచుండవలేను. సగుణ పరమాత్ముని యొక్క గుణ గణములను వినుచుండవలేను.

 

౨. కీర్తన భక్తీ:-

సగుణ పరమాత్ముని యొక్క గుణ గణములను కీర్తించుట కీర్తన భక్తీ అందురు.
పరమాత్ముని యొక్క కీర్తిని తన గొంతుతో, తన వాణితో వ్యాపింప చేయవలెను, భగవంతుని లీలలను నిరంతరము కీర్తిస్తూ ఉండవలెను. హరికధలు, పురాణములు, ప్రవచనములు మొదలగునవి రోజూ చెప్పుకొంటూ ఇతరులకు చెబుతూ భగవంతున్ని మనసారా కీర్తించవలెను.  హరి కీర్తనతో మొత్తం బ్రహ్మాండమును నింపి వేయవలెను. హరి కీర్తనామృతములో పూర్తిగా తడిసి మునకలు వేయవలెను. ప్రేమతో, భక్తీ తో పరమాత్ముని యొక్క కీర్తిని, యశమును, ప్రతాపమును, మహిమను బహు విధములగా  వర్ణించవలెను. హరి భక్తుల యొక్క కధలను నిరంతరము గానము చేయుచుండ వలెను.  
వేదములను పారాయణ చేయ వలెను, ప్రజలకు పురానములను వినిపింప వలయును. బ్రాహ్మణత్వమును ఆదరముతో రక్షింప వలెను. ఉపాసనమును, భక్తీ సాదనమును, గురు పరంపరను స్థిరముగా నుంచవలెను. నీతి, న్యాయము, ధర్మము చెడకుండా కీర్తనము చేయ వలెను. కీర్తన వలన పలుకు పవిత్రమగును, సత్ప్రవర్తన కలుగును, జనులు అందరూ సదాచారులు అగుదురు. కీర్తన వలన పరమాత్ముడు ప్రసన్నుడగును. తద్వారా చాంచల్యము తొలగి, స్థిరమైన బుద్ధి కలిగి, మనః శ్శాంతి కలుగును.
 
సశేషం .... ​
--
మీ
శ్రీ భాస్కరానంద నాథ
 

 
 
 


 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.