దశ మహా విద్యలు
మాతృ రూపములో పరబ్రహ్మను, పరబ్రహ్మ శక్తిని ఉపాసన చేసే విధానాన్నే శాక్త మతం, శాక్తేయం అని అందురు. పరబ్రహ్మను స్త్రీ రూపములో సాధన చేసే విద్యను శ్రీవిద్య అని అందురు. ఇది మోక్షమునకు తప్ప మరి ఎ ఇతర మర్గాములకు గానీ, ఐచ్చిక కోరికల తీర్చుకోవడానికి, స్వార్ధమునకు గానీ, అవైదికంగా గానీ ఉండకూడదు. ఆది శంకరాచార్యులకు పరమ గురువులు అయిన గౌడపాదాచార్యుల కాలం నాటి నుంచి ఈ శ్రీవిద్య శిష్య పరంపరంగా వస్తూ వున్నట్లు మనకు కనిపిస్తుంది. తంత్ర శాస్త్రమును మరియు శ్రీవిద్యను పరమ శివ శంకరులు పార్వతికి చెప్పగా, అక్కడ నుంచి త్రిమూర్తులకు, నారద, మన్మధ, ఇంద్ర, వ్యాస, దూర్వాసాది మునులనుంచి ఆది శంకరాచార్యుల వరకు ఈ శ్రీవిద్య ఎడతెగని తైల ధార వలే, గంగా ప్రవాహము వలే ప్రవహిస్తూ మన వరకు కూడా వచ్చి చేరినది. ఇది నిరంతరము ఇలాగే ప్రవహిస్తూ ఎందఱో ఉత్తములను మోక్ష పథము వైపుకు జ్ఞాన జ్యోతి వలే వెలుగు చూపుతూ, మార్గము చూపుతూ వున్నది. ఆ శ్రీవిద్యలోని ఒక భాగమే దశ మహావిద్యలు.
దశ మహావిద్యలలో మహా మేటి యైన, ఉపాసనకు అనుకూలమైన, సత్వర ఫలితములు నోసిగే మహా విద్య శ్యామా కాళీ.
ఋగ్వేద కాలం నుంచి ఈ ఆచారం ఉన్నట్లుగా మనకు శాస్త్రాలలో కనిపిస్తున్నది. యజ్ఞ బర్హి మీద ఆశీనులై, యజమానుని కామనలను తీర్చే శక్తి గల దేవతా శక్తులు యజ్ఞ యోగ్యములైన హవిస్సులను స్వీకరించడం రుగ్వేదంలో ప్రసక్తమైనది. ఈ దేవతలను "ఉషాసానక్తా" .. అని పిలుచుదురు.
ఉతయోషణే దివ్యే మహిన ఉషాసానక్తా
సుదుఘే వదేను: బర్హిషదా పురుహూతే
మఘోని ఆయగ్నియే సవితాయ శ్రయేతాం (ఋక్ 7/2/6)
యజుర్వేదము లో కూడా కార్య కారణ రూపమైన పరాశక్తి ఒకటి ఉన్నట్లు ఒక శృతి ఉన్నది. నామ రూపాత్మకమైన ఈ జగత్తును ఆ పరాశాక్తియే సృష్టి చేసినది అని, యజుర్వేదము ఆ శక్తిని "ఈశా" అని పేర్కొన్నది. "ఈ౦" ... అనునది శక్తి బీజం.
ఈశా వాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ .... (యజు..4/1/)
ఈశాయా + ఆవాస్యం అంటే ఈశా శక్తితోనే జగత్తంతా నిండి వున్నది అని అర్ధం అని పెద్దలు చెప్పుదురు. ఈ స్వరంలోనే దుర్గా సప్తశతి కూడా దేవి సర్వ జగద్వ్యాప్త అయి, దాన్ని భరిస్తున్నది, జగత్తు అంతా ఆమెలోని ఒక అంశం అని, ఆమె అంతటికీ ఆధి భూత, అవ్యాకృత, పరాప్రకృతి అనీ, ఆమె వ్యాకృత రూపమని, వర్ణించినది.
హేతు సమస్తా జగతాం త్రిగుణాపీ దోషై:....
న జ్ఞాయసే హరి హరాదిభి రప్యపారా .... అని
మార్కండేయ పురాణములో కూడా జీవుల ఇంద్రియాలు, అవయవాలు, అన్నింటికీ దేవి అధిష్టాత్రిగా వర్ణింపబడినది. సంపూర్ణ జగత్తులో వ్యాప్తమై వున్న శక్తిగా ఆమెను వర్ణించినారు.
ఇంద్రియాణా మధిష్టాత్రీ భూతానాం చాభిలేషుయా
భూతేషు సతతం తస్మై వ్యాప్తి దేవ్యై నమో నమః ......
అటువంటి మహాశక్తి దశావతారములలో దశ మహావిద్యలుగా వెలుగొంది భక్తుల, ఉపాసకుల కోరికేలను తీరుస్తూ వున్నది ఆ చల్లని తల్లి.
విద్య మహావిద్య అనే పదాలను శక్తికి పర్యాయ పదాలుగా ఉపయోగిస్తూ వుంటారు. విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్ధం. మార్కండేయ పురాణంలో "విద్యాసి సా భగవతీ పరమాహి మాయా"... అని చెప్పబడినది. జ్ఞాన రూప బ్రహ్మ ప్రాప్తి శబ్దము లేక వాక్కు వలన లభిస్తుంది. కాబట్టి వాగ్విజ్ఞానమే విద్య. అంటే విద్య అంటే వాక్కు అని, వాక్కు అంటే ఉమ అని అర్ధం.
రోగా నశేషానవ హంసి తుష్టా, రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్,
త్వామా శ్రితానా౦ నవిపన్న రాణా౦, త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాన్తి ....
అటువంటి మహాతల్లి పాదములకు నమస్కరించి దశ మహా విద్యల లోని శ్రీ దక్షిణ కాలిక మహా విద్యనూ నాకు తెలిసినంత వరకు, గురు దేవుళ్ళ ఆజ్ఞ మేరకు, ఆతల్లి అనుజ్ఞ మేరకు మీకు వివరించడానికి ప్రయత్నము చేస్తాను. ఈ మంత్రములను సద్గురువుల వద్ద ఉపదేశమును పొంది ఉపాసన చేయ వలసినదిగా మనవి, ప్రార్ధన.
సశేషం....
మీ
శ్రీ భాస్కరానంద నాథ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.