3. స్మరణ భక్తీ
హృదయము నందు పరమాత్ముని యొక్క దివ్య నామమును, గాధలను స్మరించడము స్మరణ భక్తీ అందురు. పరమాత్ముని యొక్క అఖండ నామములను అఖండ రీతిన నిత్యము నియమము తప్పక నిరంతరముగా నామ స్మరణ చేయవలెను. నామస్మరణము వలన మనస్సుకు శాంతి, సమాధానము దొరుకును. ఆనంద సమయమున, దుఖ సమయమున, ఆపద సమయమున, ఉద్వేగ సమయమున, చింతా సమయమున, ఇంతయేల సర్వ కాల సర్వావస్థల యందు భగవన్నామ స్మరణము చేయ వలెను. నడుచుచు, మాటలాడుచు, దినుచు, ద్రావుచు, సుఖిన్చుచు, బహు విధముల భోగములను తనివి తీర అనుభవించు చున్నప్పుడు కూడా ఏమరపాటు లేకుండా శ్రీహరి నామమును స్మరించు చుండ వలెను. సంపదలతో తుల తూగుచున్నప్పుడు, ఆపదలలో మునిగి తెలుచున్నప్పుడు, కాలగతులు వ్యతిరేకించి, చిక్కులు వాటిల్లి నప్పుడు కూడా శ్రీహరి నామ స్మరణ మానరాదు. భగవన్నామ స్మరణకు ఇది సమయం, ఇది సమయం కాదు అనేది లేదు, సర్వ కాల సర్వావస్థల యందు శ్రీహరి నామ స్మరణ చేస్తూనే ఉండవలెను. వైభవము, సామర్ధ్యము, బలము, ధనము, కీర్తి గలిగిన సమయము లందు కూడా భగవన్నామ స్మరణ చేయవలెను. భగవంతుని నామమును నిరంతరము హృదయము నందు తలుచు భాగ్యవంతునికి ఆపదలు దరి చేరవు, అంత్యమున సద్గతి కలుగును. రోగ భాధలు యందు ఊరట లభించి శాంతి చేకూరును. రామ నామ మహత్వము చేతనే కాశీనగరమునకు ముక్తి క్షేత్రమను నామము కల్గినది. వాల్మీకి "మరా, మరా, మరా"... అని జపించి ముక్తి నొందినాడు. ప్రహ్లాదుడు శ్రీహరి నామము జపించి ముక్తి నొందినాడు. పాపి యగు అజామిలుడు సైతము నారాయణ స్మరణము వలననే పవిత్రుడు అయి మోక్ష గామి అయినాడు. పరమేశ్వురుని నామములు అనంతములు. వానిని నిత్యమూ నియమ బద్దముగా హృదయము నందు స్మరించు భక్తులు తరించెదరు. మహా పాపులు కూడా నామ స్మరణ చేత పరమ పవిత్రులై మోక్షము నొందిరి.
నిరంతరము శ్రీహరి నామము గావించు వాడె పుణ్యాత్ముడు. నామ స్మరణ వలన పాపములు నశించి సుకృతము పొందును. అన్ని వర్ణముల వారికినీ నామ స్మరణ యందు అధికారము కలదు. ఇదియే స్మరణ భక్తీ.
మీ
శ్రీ భాస్కరానంద నాథ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.