Tuesday, 4 December 2012

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం

ఆదిత్య హృదయం – పరఃబ్రహ్మ హృదయం
తతో యుద్ధ పరి శ్రాన్త౦ సమరే చింత యాస్తితం .....అని వాల్మీకి పలికినాడు.
ఆదిత్య హృదయానికి వేదిక రామ రావణ యుద్ధ ఘట్టము. రావణుడు మహా శక్తి, బల, మంత్ర,సంపన్నుడు. కేవలం స్త్రీలోలత్వమనే దుర్గుణము వీటన్నిటినీ మాయలా కప్పివేసి పెడదారి పట్టించింది, మరి రాముడో? రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి మూర్తి రాముడు. ఇంతటి యోధులు యుద్ధంలో ఒకరికొకరు ఎదురుగా నిలిచి పోరు సల్పితే? . ఇక్కడ యుద్ధం ధర్మం అధర్మం మధ్య. ఈ పరిస్థితి మనకు ప్రతిరోజూ మన మనసులో, కుటుంబంలో, సమాజంలో ఎదురవుతూనే ఉంటుంది. మరి అటువంటి క్లిష్టమైన సమయంలో మనం ఏ విధంగా స్పందిస్తాము? చింత, క్రోధము లేదా పరాక్రమము మొదలైన మార్పులను మనం బాహ్యంగా ప్రదర్శిస్తాము. అదే మానవ స్పందనను రాముడు ఒక రోజు యుద్ధము ముగిసిన పిమ్మట ప్రదర్శిస్తాడు. కొంత అలసట, ప్రత్యర్ధిని ఎలా ఓడించాలన్న చింత రామునిలో చూసి అగస్త్యుడు ఈ ఆదిత్య హృదయాన్ని రామున్ని అడ్డం పెట్టుకొని ఈ మానవాళికి చెప్పినాడు. అగస్త్యుడు విద్యామండల రుషి కావున బ్రహ్మ రూపమైన ఆదిత్యని స్తోత్రమును మనకు శ్రీరాముని ద్వారా అందించినాడు. బ్రహ్మ దేవుని అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్న రావణుడి వైభవానికి అడ్డుకట్ట వెయ్యాలంటే భగవనుదనుగ్రహం రామునికి తప్పక ఉండాలి అని భావించి అగస్త్య మహర్షి ఈ మహా మంత్రాన్ని ఉపదేశి౦చినాడు.
రామ రావణ యుద్ధం చూసేందుకు దేవతలంతా వచ్చి ఆకాశంలో బారులు తీరి ఉన్నారు.భగవానుడైన అగస్త్య మహర్షి కూడా వాళ్ళతో కలసి వచ్చి విను వీధి నుంచి చూస్తూ వున్నాడు. రాముడు యుద్ధం చేసి బాగా అలసి పోయి వుండటం చూశాడు. రాముడు రావణునితో ఏ విధముగా యుద్ధం చేయాలో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ... “ ఓ రామా!యుద్ధాల్లో సమస్తమైన శత్రువుల్ని జయించేందుకు ఒక రహస్యమైన స్తోత్రము ఉన్నది.దాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ స్తోత్రాన్ని జపించు, నీవు యుద్దంలో సమస్త శత్రువుల్ని జయించ గలవు. అని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించినారు. ఆ ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడు మూడు సార్లు పఠించగా సూర్య భగవానుడు సంతోషించి రావణ వధ త్వరలో జరుగునని దీవించినాడు. దాంతో శ్రీరాముని ఉత్సాహం రెట్టింపై రావణునితో విజృంభించి యుద్ధం చేశాడు. రామ రావణ యుద్దాన్ని చూసేందుకు దేవతలు, ఋషులు ఆకాశంలో బారులు తీరి శ్రీరామ జయమును కోరుకొంటూ మంగళా శాసనములు పలికినారు.
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేనిత్యమక్షయం పరమం శివం
విషోంతరాదిత్యే హిరణ్మయః...అన్నది శృతి వాక్యం.
పుణ్య మిచ్చే మంత్రమని చెబుతూ, పరలోక ఫలాన్ని ఎత్తి చూపారు. అలాగే “జయావహం” అంటూ ఇహలోక ఫలాన్ని కూడా చూపుతూ ఈ మంత్రం అక్షయ మైనదని చాటి చెప్పారు.
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం.
ఇక్కడ భువనేశ్వరం అని అనడంలో అర్ధం పర బ్రహ్మ౦ అని మనం అర్ధం చేసుకోవాలి. దేవతలు,రాక్షసుల చే పూజింపబడుచుచూ, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ పర బ్రహ్మ౦ అయిన భువనేశ్వరుని పూజించుము. ఎందుకంటే పర బ్రహ్మమే సూర్య,అగ్ని స్వరూపములు అని శృతి చెప్పుచున్నది.
యాభి రాదిత్యస్తపతి రశ్మిభిః తాభి పర్జన్యో వర్షతి (శృతి)
తన కిరణములతో భూమిపై నుండే నీటిని తపింప జేస్తున్నాడో, అదే కిరణములతో మేఘముల ద్వారా వర్షింప జేసి ప్రాణులన్నీ౦టినీ రక్షిస్తున్నాడు.
తన కిరణప్రసారముల చేత లోకాలన్నింటికి వెలుగు ప్రసాదిస్తున్నాడు.
తస్య భాసా సర్వ మిదం విభాతి భాస్కరః ... అని ఉపనిషద్వాక్యం.
ముక్కోటి దేవతలు ఉన్నా జీవకోటికి ఆయనే పరమాత్మ, ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష నారాయణ స్వరూపం. ఐశ్వర్య విద్యాప్రదాత అయిన ఆ పర తత్వమే ప్రత్యక్ష నారాయణడుగా లోకాలని పోషిస్తూవున్నాడు.
ఇదే విషయాన్ని శృతి ఏమని చెప్పినదంటే
నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి,
త్వమేవ ప్రత్యక్షం రుద్రోzసి, త్వమేవ ప్రత్యక్షం ఋగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్ష మథర్వాసి, త్వమేవ సర్వం ఛందోzసి.
కార్య సాధనకు, శత్రుంజయమునకు, సర్వ రోగ నివారణకు కొన్ని యుగాలుగా పఠించబడుతున్న మహిమాన్విత స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ స్తోత్రం వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో 107 వ సర్గలో అగస్త్యుని నోట రామునికి చెప్పబడింది. రామావతారంలో ఆయన మానవునిగా జన్మ ఎత్తి, ఆ జీవితాన్ని గడుపుతూ, అందులో ఉండే బాధలను అనుభవిస్తూ, అధిగమిస్తూ, ధర్మ పరిపాలన చేస్తూ -వీటిలో భాగంగో ఎందరో మహర్షుల ద్వారా ఉపదేశములు, ఆశేర్వాదములు, సమస్యా పరిష్కరణలు పొందాడు. తానెప్పుడూ దైవ స్వరూపమని చెప్పలేదు, ఆ మహిమలు ప్రదర్శించ లేదు. అందుకనే, రామాయణంలోని ప్రతి అంశము మనకు ఒక దిశానిర్దేశము చేసే సందేశము కలిగి యుంటాయి.
ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. శ్రీ సూర్య భగవానుడు. దైవం కనిపించలేదని ఎవరైనా ఎందుకు బాధపడాలి ?
వేలాదిసంవత్సరములనుంచి వెలుగులు విరజిమ్ముతూ జీవులకు ప్రాణాధారమైన సూర్యభగవానుడు దేవుడే కదా..
శ్రీ లలితా మహాత్రిపురసుందరీ దేవి అమ్మవారు సూర్యమండలమధ్యస్థ అని పెద్దలు చెబుతున్నారు.
ద్వాదశాదిత్యులకుమిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యోనమఃఅని ప్రణామాలు చేస్తుంటాము
యేవ సూర్య జ్యోతిషా బాధసే తమో, జగచ్చ విశ్వముదియర్షి భానునా, తెనాస్మద్విశ్వామనిరామనాహుతి, మపామీవామప దుస్వప్నం సువ (ఋగ్వేదం)
ఓ సూర్య భగవానుడా నీవు నీ తేజస్సుతో ఏవిధంగా అంధకారాన్ని బంధిస్తున్నావో, ఏవిధంగా జగత్తుకు నీ దీప్తి వలన తేజస్సును ఇస్తున్నావో, అదేవిధంగా మా రోగాలను సర్వనాశనం చేసి, చెడుస్వప్నాలను మాకు దూరం చేయగలవు”. పై మంత్రం ద్వారా సూర్యకాంతి సర్వరోగనివారిణి అని మనకు తెలుస్తోంది. పన్నెండు రూపాలలో గోచరించే సూర్యుడు రకరకాల వ్యాధులను నయం చేస్తాడని ప్రతీతి. అందుకే ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ అని అన్నారు.అంటే, ఆరోగ్యం సూర్యుని యొక్క ఆధీనమని అర్థం. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, బలాన్ని ప్రసాదిస్తాడని సామవేదం చెబుతుండగా, జ్ఞానం కోసం సూర్యారాధనమని కృష్ణ యుజుర్వేదం పేర్కోంటోంది. సూర్యుడు ఆదిత్యరూపంలో వాత, పిత్త రోగాలను సూర్యరూపంలో కామెర్లరోగాన్ని, సవితృరూపంలో సర్వశస్త్రబాధలను, పూష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని కలుగజేస్తాడని చెప్పబడుతోంది.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు.
అటువంటి సూర్య భగవానునికి చేతులెత్తి నమస్కరిస్తూ
రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
మీ
భాస్కరానందనాథ
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.